రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

వియత్నాం, దక్షిణ కొరియాకు రక్షణ మంత్రి అధికారిక పర్యటన


సైనిక సహకారాన్నీ, పారిశ్రామిక భాగస్వామ్యాలనూ, నౌకా వాణిజ్య సహకారాన్నీ బలోపేతం చేయడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతినీ, సుస్థిరతను ప్రోత్సహించడంపై దృష్టి: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 18 MAY 2026 10:21AM by PIB Hyderabad

రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 2026 మే 18, 19 తేదీల్లో వియత్నాంలోనూ, 2026 మే 19 నుంచి 21 వరకు రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోనూ పర్యటిస్తారు. ఈ పర్యటనకు బయలుదేరే ముందు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో ఈ రెండు దేశాల్లోనూ చేపట్టే పర్యటన ద్వైపాక్షిక సంబంధాల పరిధిని మరింత విస్తరిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వ్యూహాత్మక సైనిక సహకారాన్నీ రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలనూ బలోపేతం చేసుకోవడం, నౌకా వాణిజ్య సహకారాన్ని ప్రోత్సహించడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతినీ, స్థిరత్వాన్నీ పెంపొందిచడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

వియత్నాంలో రక్షణ మంత్రి పర్యటన రెండు దేశాల మధ్య ఏర్పడిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి పదేళ్లు పూర్తయిన సందర్భాన్ని సూచిస్తుంది. ఈ భాగస్వామ్యాన్ని 2026 మే 5 నుంచి 7 వరకు భారత్‌లో వియత్నాం అధ్యక్షుడు పర్యటించిన సందర్భంలో విస్తరించిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మెరుగుపరిచారు. ఈ పర్యటనలో భాగంగా వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ జియాంగ్‌తో శ్రీ రాజనాథ్ సింగ్ ద్వైపాక్షిక చర్చలు చేపడతారు.

2022 జూన్ 8 నుంచి 10 వరకు రక్షణ మంత్రి వియత్నాంలో పర్యటించిన సమయంలో 2030 నాటికి భారత్-వియత్నాం రక్షణ భాగస్వామ్య సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశారు. ద్వైపాక్షిక రక్షణ సహకారానికి నిర్దిష్టమైన మార్గాన్ని ఈ దార్శనిక పత్రం అందిస్తుంది. ఈ ప్రాంతంలో శాంతి, సంక్షేమం విషయంలో రెండు దేశాలకు ఉమ్మడి ఆసక్తి ఉంది.

వియత్నాంలో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పర్యటించే సమయంలోనే.. 2026 మే 19న ఆ దేశ మాజీ అధ్యక్షుడు హో చి మిన్ 136వ జయంతిని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా హో చి మిన్ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి రక్షణ మంత్రి నివాళి అర్పిస్తారు. 

దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆ దేశ రక్షణ మంత్రి ఆన్ గ్యూ-బెక్‌తో శ్రీ రాజనాథ్ సింగ్ ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న రక్షణ సహకారాన్ని మంత్రులు సమీక్షిస్తారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కొత్త కార్యక్రమాలను అన్వేషిస్తారు. ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ ఆలోచనలను పంచుకుంటారు.

రక్షణ కొనుగోళ్ల కార్యక్రమ నిర్వహణ సంస్థ (డీఏపీఏ) మంత్రి లీ యాంగ్ చియోల్‌తో కూడా సమావేశమవుతారు. ఇండియా-కొరియా బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.

కొరియా యుద్ధ సమయంలో భారత్ అందించిన తోడ్పాటు చరిత్రలోని గొప్ప అధ్యాయాల్లో ఒకటి. అంతర్జాతీయ శాంతి, స్థిరత్వం పట్ల భారత్‌కున్న అంచంచలమైన నిబద్ధతకు ఇది నిదర్శనం. యుద్ధంలో గాయపడినవారికి చికిత్సను అందించాలని నిర్ణయించి సైన్యానికి చెందిన 60 పారాచ్యూట్ ఫీల్డ్ అంబులెన్స్‌ విభాగాన్ని భారత్ మోహరించింది. ఈ యూనిట్ మూడేళ్లకు పైగా అనేక మంది పౌరులకు సేవలందించింది. రెండు లక్షల కంటే ఎక్కువ మంది రోగులకు చికిత్సను అందించింది. సుమారు 2,500 శస్త్రచికిత్సలను నిర్వహించింది. భారత్ అందించిన మరో సహకారం.. తటస్థ దేశాల పునరావాస కమిషన్‌కు అధ్యక్షత వహించడం. ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసిన ఈ ప్రతిపాదన మెజారిటీతో ఆమోదం పొందింది. దీని ప్రకారం 5,230 మంది సైనికులతో కూడిన భారత్ కస్టోడియన్ దళం.. యుద్ధానంతర దశలో దాదాపు 2,000 మంది ఖైదీలను శాంతియుతంగా వారి స్వదేశాలకు పంపించింది.

అమర వీరుల గౌరవార్థం.. 2026 మే 21న దేశభక్తులు, మాజీ సైనికుల వ్యవహారాల మంత్రి క్వన్ ఓ-యూల్‌తో కలసి భారత యుద్ధ వీరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభిస్తారు.

భారత దేశం అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ విధానం’ , రిపబ్లిక్ ఆఫ్ కొరియా అనుసరిస్తున్న ‘ఇండో-పసిఫిక్ వ్యూహం’ మధ్య ఉన్న సహజమైన సంబంధం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి విలువలు.. రెండు దేశాల మధ్య సంబంధాల్లో నూతన అధ్యాయానికి నాంది పలికాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2262224) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil