ఆయుష్
ఆయుష్ బహుభాషా డిజిటల్ సేవలను వృద్ధి చేయడానికి డిజిటల్ ఇండియా భాషిణి విభాగంతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయుష్ శాఖ
ఆయుష్ డిజిటల్ వేదికలతో పాటు సేవల్లో ఏఐ ఆధారిత బహుభాషా లభ్యతకు మార్గాన్ని సుగమం చేయడమే ఈ ఒప్పందం లక్ష్యం
ఆయుష్ సేవల్ని 22 షెడ్యూల్డు భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురావడంలో తోడ్పడనున్న భాషిణి సాంకేతికతలు
నాడు పోస్టు చేయడమైనది:
14 MAY 2026 5:53PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖకీ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (డీఐబీడీ)కీ మధ్య ఒక అవగాహన ఒప్పందం (ఎమ్ఓయూ)పై ఈ రోజు సంతకాలయ్యాయి. ఆయుష్ కి సంబంధించిన సమాచారాన్ని అనేక భారతీయ భాషల్లోకి వేగంగా అందించడంతో పాటు అనువాదానికి మార్గాన్ని సుగమం చేసే లక్ష్యంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
‘‘భాషిణి రాజ్యం- భాషిణి సహయోగి కార్యక్రమం’’ పేరిట చేపట్టే ఈ కార్యక్రమంలో భాగంగా, ఆయుష్ మంత్రిత్వ శాఖ డిజిటల్ వేదికలు, సేవలతో భారత్ జాతీయ భాషా డిజిటల్ సేవల వేదిక ‘భాషిణి’ (BHASHINI) ను ఏకీకరించాలన్నదే ఈ భాగస్వామ్య ధ్యేయం.

ఆయుష్ శాఖ ‘ఆయుష్ గ్రిడ్ కార్యక్రమం’ సాయంతో ఆరోగ్యసంరక్షణ, సామర్థ్యాల్ని పెంపొందించే కార్యక్రమాలు, పరిశోధన, ఔషధ పరిపాలన, ఇతర సంబంధిత రంగాలలో కృషి చేస్తోంది. ఆయుష్ గ్రిడ్‌లో భాగంగా అభివృద్ధి చేసిన అనేక పోర్టళ్లు, అప్లికేషన్లు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత పరిష్కారాలను భారత రాజ్యాంగ ఎనిమిదో షెడ్యూలులో గుర్తింపు లభించిన మొత్తం 22 షెడ్యూల్డు భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. ఈ పనిని పూర్తి చేస్తే, వీటి విస్తృత లభ్యతతో పాటు ఉపయోగానికి కూడా వీలు కలుగుతుంది.
ఈ ఒప్పందంలో భాగంగా డిజిటల్ ఇండియా భాషిణి సాంకేతికతలను ఆయుష్ గ్రిడ్ పోర్టళ్లు, అప్లికేషన్లు, ఏఐ టూల్స్ సహా ఆయుష్ డిజిటల్ సొల్యూషన్స్‌తో అనుసంధానించనున్నారు. ఫలితంగా బహు భాషల్లో లభ్యతను బలోపేతం చేయడం సాధ్యమవుతుంది. డిజిటల్ వ్యాప్తిని దేశమంతటా విస్తరించవచ్చు. దీనికి తోడు, ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, యోగ, ప్రాకృతిక వైద్యం (నేచరోపతి), సోవా-రిగ్పాలతో పాటు హోమియోపతీకి సంబంధించిన ఆరోగ్యసంరక్షణ, వెల్‌నెస్ కమ్యూనికేషన్‌ను దృష్టిలో పెట్టుకొని డొమైన్-స్పెసిఫిక్ బహుభాషా టెర్మినాలజీ వ్యవస్థల్ని అభివృద్ధిపరచడం, ఆయుష్ భాషా డేటాసెట్లను పటిష్ఠపరచడంతో పాటు ఆయా సందర్భాలకు సరిపోయే ఏఐ మోడళ్లను తీర్చిదిద్దడానికి కూడా ప్రత్యేక ప్రయత్నాలను చేపడతారు.
ఎమ్ఓయూపై ఆయుష్ శాఖ డైరెక్టరు డాక్టర్ సుబోధ్ కుమార్, డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ అమితాభ్ నాగ్‌లు అధికారిక హోదాల్లో సంతకాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆయుష్ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కొటేచాతో పాటు ఆయుష్ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ కవితా జైన్‌ల సమక్షంలో నిర్వహించారు.

ఆయుష్ సమాచారం భారతీయ భాషలన్నిటిలో సులభంగా అందుబాటులో ఉండేటట్లు చూడటానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆయుష్ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కొటేచా స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఇలా అన్నారు..‘‘ఆయుష్ వైద్య వ్యవస్థల్లో అపారమైన నాగరికతాసంబంధిత జ్ఞానంతో పాటు సాంస్కృతిక గాఢత ఇమిడివుంది. ఈ జ్ఞానాన్ని ప్రతి భారతీయ భాషలోనూ సులభంగా అందుబాటులో ఉండేటట్లు, సమ్మిళిత ఆరోగ్యసంరక్షణ సేవల అందజేత సాధ్యపడేటట్లు, జనబాహుళ్యంలో చైతన్యం వెల్లివిరిసేటట్లు చూడటం ఎంతో అవసరం. ఆయుష్ అనుబంధ విస్తారిత వ్యవస్థలో బహుళభాషా సామర్థ్యాల్ని బలపరచడం, విశిష్ట రంగానికి సంబంధించి బలిష్ఠమైన పరిభాషను అభివృద్ధిపరచడం, భవిష్యత్తు అవసరాలను తీర్చగలిగే ఏఐ ఆధారిత వ్యవస్థల్ని తీర్చిదిద్దడం... భాషిణితో ఒప్పందం ఏర్పరుచుకోవడంలో ఉద్దేశాలు. వీటితో భాషాపరమైన పరిమితుల్ని అధిగమించి, పౌరులకు నిరంతరాయ సహాయాన్ని అందించడానికి మార్గం సుగమం అవుతుంది.’’
ఆయుష్ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ కవితా జైన్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ఆరోగ్యసంరక్షణ సేవల లభ్యతను మెరుగుపరచడంలో బహుభాషా ఏఐ సాంకేతికతల పరివర్తన పూర్వక సామర్థ్యాన్ని వివరించారు. ఆమె ‘‘డిజిటల్ సాంకేతికతల ప్రయోజనాలను సద్వినియోగపరుచుకుంటూ లభ్యతలోనూ, సేవల అందజేతలోనూ సంస్కరణలను తీసుకురావడంపై ఆయుష్ శాఖ నిరంతర దృష్టిని కేంద్రీకరిస్తోంది. భాషిణి ద్వారా అందుబాటులోకి వచ్చిన బహుభాషా ఏఐ సొల్యూషన్లు.. ప్రత్యేకించి మందుల చీటీల్ని సిద్ధం చేయడంలో కీలక పాత్రను పోషించే డాక్టరు-రోగి సంభాషణ వ్యవస్థలతో పాటు క్షేత్రస్థాయిలో ఆరోగ్యసంరక్షణ సేవల లభ్యతను పటిష్ఠపరచడంలో సాంకేతికత ప్రధానమైన సామర్థ్యాలకు కూడా అద్దం పడతాయి. ఈ సహకారం మరింత సమ్మిళితమైన, పౌరుల ప్రయోజాలకు పెద్దపీటను వేసే డిజిటల్ ఆరోగ్యసంరక్షణ సేవల అనుబంధ విస్తారిత వ్యవస్థల దిశగా వేసిన ఒక కీలక అడుగు అని చెప్పవచ్చు’’ అని కూడా అన్నారు.
డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ అమితాభ్ నాగ్ మాట్లాడుతూ, ‘‘డిజిటల్ సార్వజనిక సేవలను అందరి చెంతకు చేర్చాలంటే అందుకు భాషా-సమ్మిళిత ఏఐ వ్యవస్థలు చాలా కీలకం. ఆయుష్ శాఖతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుని బహుభాషా, స్వర ఆధారిత ఆరోగ్య సంరక్షక అనుబంధ వ్యవస్థల్ని ఏర్పరచాలన్నదే మా లక్ష్యం. ఆ వ్యవస్థలు పౌరులకు వారు మొగ్గు చూపే భాషలలో సహాయపడతాయి. అంతేకాదు, భారత్‌లో విస్తృత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ దార్శనికతనూ బలోపేతం చేస్తాయి’’ అని తెలిపారు.

ఆయుష్ గ్రిడ్ ఓఎస్‌డీ శ్రీ నమన్ గోయల్ మాట్లాడుతూ, యోగ పోర్టల్‌తో పాటు ఆయుష్ గ్రిడ్‌కు చెందిన మాస్టర్ పోర్టల్ ‘ఎమ్ఏఐఎస్‌పీ’ (MAISP).. భాషిణి ప్లగ్‌ఇన్ ఏకీకరణను ఇప్పటికే పూర్తి చేసిందన్నారు. దీనికి దేశవ్యాప్త వినియోగదారుల దగ్గరి నుంచి వారి స్థానిక భాషల్లో ప్రోత్సాహకర ఫీడ్‌బ్యాక్ లభించినట్లు ఆయన వెల్లడించారు. ఎమ్ఓయూపై సంతకాలైన తరువాత, ఆయుష్ గ్రిడ్ ఇకోసిస్టమ్‌లో భాగంగా ఇక మీదట రాబోయే అన్ని పోర్టళ్లూ భాషిణితో జతపడతాయని, ఫలితంగా భాష తాలూకు ఇబ్బందులను అధిగమించి ఆయుష్ సేవలను దేశం నలుమూలలా అన్ని ప్రాంతాల వారి చెంతకు చేర్చవచ్చని శ్రీ గోయల్ వివరించారు.
ఆయుష్ డిజిటల్ వేదికల్లో భాషిణి అనువాద ఏపీఐ, వాక్కు-స్వర సాంకేతికతల ఏకీకరణకు మార్గాన్ని ఈ కార్యక్రమం సుగమం చేస్తుంది. దీనితో దేశంలో వేర్వేరు భాషా సీమలలో సౌలభ్యం, పౌరుల భాగస్వామ్యం మెరుగుపడనుంది. చర్చల్లో.. ఆరోగ్యసంరక్షణ రంగానికి చెందిన పారిభాషిక పదకోశం రూపకల్పన, రాబోయే కాలంలో బహుభాషా ఏఐ నమూనాను అభివృద్ధిపరిచేందుకు ఉద్దేశించిన ప్రమాణీకృత ఆయుష్ పరిభాషల కోసం భారత డిజిటల్ భండారం (రిపాజిటరి), ‘నమస్తే’ (NAMASTE) పోర్టల్‌ల ప్రయోజనాలను వినియోగించుకొనేందుకు ఉన్న అవకాశాల్ని కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా, డిజిటల్ సేవల్ని మరింత మందికి అందుబాటులోకి తీసుకువెళ్లడానికి ఉద్దేశించిన అనేక పౌర ప్రధాన సేవల్ని గురించి డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ సోదాహరణంగా వివరించింది. కీలక డెమాన్‌స్ట్రేషన్లలో .. బహుభాషా స్పీచ్ ఇంటర్‌ఫేసులను ఉపయోగించి ఏఐ ఆధారిత డాక్టర్-పేషెంట్ ప్రిస్క్రిప్షన్ జనరేషన్ సిస్టమ్ ప్రక్రియ, ‘శ్రుత్‌లేఖ్’ మాధ్యమం ద్వారా సమావేశం కొనసాగుతుండగానే వివరాలను అప్పటికప్పుడు అక్షరబద్ధం (రియల్-టైం మీటింగ్ ట్రాన్స్‌క్రిప్షన్), సమావేశ నిర్ణయాల లేఖనం (మీటింగ్ మినట్స్ జనరేషన్), శ్రామిక వర్గానికి ఉపాధి కల్పనలో సాయపడేందుకు ఉద్దేశించిన స్వర-ఆధారిత సీవీ తయారీ సేవలతో పాటు, భారత ప్రాచీన చేతిరాత పుస్తకాలను డిజిటలీకరించి, సంరక్షించడంపై దృష్టి పెట్టిన భాషా సాంకేతిక ఉపకరణాలు వంటివి.. చోటుచేసుకున్నాయి.

దేశవ్యాప్తంగా సమ్మిళిత, సులభతర, పౌర ప్రయోజనాలకు ప్రాధాన్యాన్నిచ్చే ఆయుష్ ఇకోసిస్టమ్‌ను రూపొందించడానికి తాజాగా వృద్ధిలోకి వస్తున్న డిజిటల్ సాంకేతికతలు అందిస్తున్న ప్రయోజనాల్ని అందిపుచ్చుకొనే విషయంలో ఆయుష్ శాఖ కనబరుస్తున్న నిరంతర నిబద్ధతకు ఈ సహకారం అద్దం పడుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2261331)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15