జౌళి మంత్రిత్వ శాఖ
భారత్‌లో టెక్స్‌టైల్ రీసైక్లింగ్‌పై ప్రసార మాధ్యమాల్లో ఇటీవలి కథనాలకు ఖండన
నాడు పోస్టు చేయడమైనది:
14 MAY 2026 10:27AM by PIB Hyderabad
ఈ మధ్య అంతర్జాతీయ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన ఒక కథనంలో.. హర్యానాలోని పానిపట్ వంటి క్లస్టర్లలో టెక్స్‌టైల్ రీసైక్లింగ్ కార్యకలాపాలపై ప్రశ్నలను లేవనెత్తారు. ఈ రిపోర్టులు భారత్‌లో టెక్స్‌టైల్ రీసైక్లింగుకు సంబంధించిన అనుబంధ విస్తారిత వ్యవస్థ (ఇకోసిస్టమ్)లో కొన్ని విభాగాలతో ముడిపడిన పర్యావరణ పరమైన, వృత్తిపరమైన కోణాలను వెలువరించాయి. ఏ పెద్ద పారిశ్రామిక రంగంలోనైనా నియమాల అతిక్రమణకు సంబంధించిన చెదురుమదురు వ్యవహారాలు చోటుచేసుకోవచ్చు, కానీ వాటి ఆధారంగా పూర్తి భారత్‌లో వస్త్ర పరిశ్రమను ‘పర్యవరణం పట్ల బాధ్యతను పట్టించుకోని’ లేదా ‘సంస్థాగతంగా దోపిడీకి వీలు ఉన్నది’గా స్థూల ప్రాతిపదికన వర్ణించడం తప్పుదోవ పట్టించేదిగా, ఎంపిక చేసుకొని మరీ దాడి చేసిందిగానే కాక వాస్తవాలకు భిన్నంగా కూడా ఉంది. ఈ దృష్టికోణం.. దేశమంతటా అమలవుతున్న నియంత్రణ పరమైన పటిష్ఠీకరణ, సాంకేతికత ఆధునికీకరణలతో పాటు స్థిరత్వంపైన తదేక శ్రద్ధ తీసుకుంటూ అమలు చేస్తున్న కార్యక్రమాల వంటి సానుకూల మార్పుల్ని ఉపేక్షిస్తూ, సరైన ప్రాతినిధ్యాన్ని వహించేదిగా లేనేలేదు.
ముందుగా, చెప్పుకోవాల్సింది ఏమిటంటే భారత్‌లో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వస్త్ర సంగ్రహణ (టెక్స్‌టైల్ రికవరీ), పునరుపయోగ (రీసైక్లింగ్) నెట్‌వర్కు నెలకొంది. దీనికి వస్త్ర సామగ్రి పునర్వినియోగం, మరమ్మతు, రీసైక్లింగ్, రీపర్పసింగ్ కోసమే నెలకొల్పిన వేల్యూ చైన్ల ఊతం లభిస్తోంది. అనేక ఇతర దేశాల (అక్కడ వస్త్ర వ్యర్థాలను ప్రధానంగా భూమిని తవ్వి ఆ గుంటల్లో పూడ్చేస్తున్నారు) మాదిరిగా కాకుండా, భారత్‌లో వస్త్ర వ్యర్థాల్లో చాలా వరకూ సాంప్రదాయిక, సాంప్రదాయేతర వ్యవస్థల ద్వారా రికవరీకి మొగ్గు చూపుతున్నారు. దీనిని ద్వితీయ వినియోగం, ఫైబర్ రికవరీ, పారిశ్రామిక పునరుపయోగాలతో పాటు సంబంధిత అప్లికేషన్ల దిశగా మళ్లిస్తున్నారు.
భారత్‌లో సామగ్రి రికవరీ స్థాయి ఊహించిన దాని కన్నా చాలా ఎక్కువగా ఉందని వస్త్ర వ్యర్థాలకు సంబంధించిన సాక్ష్యం నిరంతరాయంగా చాటిచెబుతోంది. ‘‘భారత్‌లో వస్త్ర వ్యర్థాల వేల్యూ చైన్ మ్యాపింగ్’’కు సంబంధించి 2026 సంవత్సరంలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. భారత్‌లో ఏటా దాదాపు 7,073 కిలో టన్నుల టెక్స్‌టైల్ వ్యర్థాలు వస్తున్నాయి. వీటిలో ప్రి-కన్స్యూమర్ వ్యర్థాలతో పాటు పోస్ట్-కన్స్యూమర్ వస్త్ర వ్యర్థాలూ ఉంటున్నాయి. తయారీ ప్రక్రియల్లో భాగంగా ఉత్పన్నమయ్యే ప్రి-కన్స్యూమర్ వస్త్ర వ్యర్థ పదార్థాల రికవరీ రేటు బాగా ఎక్కువగా ఉందని, మొత్తం ప్రి-కన్స్యూమర్ వ్యర్థాల్లో 97 శాతం పునరుపయోగం అవుతోందని, ఇది స్థానిక తయారీ వ్యవస్థల్లో మొదటి నుంచే అంతర్గతంగా ఉన్నత స్థాయిలో సామగ్రి సర్క్యులారిటీని సూచిస్తోందని అధ్యయనంలో పేర్కొన్నారు.
భారత్ ప్రధానంగా పశ్చిమ దేశాల ఫాస్ట్-ఫ్యాషన్ వేస్ట్ కు ‘‘డంపింగ్ గ్రౌండ్’’గా పనిచేస్తోందని వార్తాకథనంలో తప్పుడు సంకేతాన్ని అందించారు. పైన ప్రస్తావించిన రిపోర్టులోని గణాంకాలు భారతీయ రీసైక్లింగ్ పరిశ్రమ విశేషించి దేశీయ అవసరాలతో ప్రేరణను పొంది, మనుగడను సాగిస్తోందని వెల్లడిస్తోంది. ప్రతి సంవత్సరం నిర్వహణకు నోచుకుంటున్న ఇంచుమించు 78 లక్షల టన్నుల వస్త్ర వ్యర్థాల్లో 90 శాతం కన్నా ఎక్కువగా దేశీయ ప్రి-కన్స్యూమర్, పోస్ట్-కన్స్యూమర్ వ్యర్థాల నుంచే అందుతోంది. దిగుమతి చేసుకుంటున్న పోస్ట్-కన్స్యూమర్ వ్యర్థాలు మొత్తం వ్యర్థాల్లో సుమారు 7 శాతం మాత్రమే ఉన్నాయి. వీటిని అపాయకర, ఇతర వ్యర్థాల (మేనేజ్‌మెంట్, ట్రాన్స్‌బౌండరీ మూవ్‌మెంట్) నియమావళి-2016లో భాగంగా కఠినమైన పద్ధతుల్లో నియంత్రిస్తున్నారు. ఇలా దిగుమతి చేసుకున్న వ్యర్థాల్లో ప్రధానంగా పాత దుస్తులు, చిరిగిన చింకి-పాత పీలికలు కలిసి ఉంటాయి.. వీటిని చాలావరకూ హార్మొనైజ్‌డ్ సిస్టమ్ కోడ్ ద్వారా గుర్తిస్తారు. ఈ ప్రవాహాన్ని చాలావరకూ సాంప్రదాయికంగానూ, విశేషించి పునరుపయోగ ప్రధానమైన, సరికూర్చే ప్రణాళిక (సార్టింగ్) లోకి మళ్లిస్తారు.
‘‘భారత్‌లో వస్త్ర వ్యర్థాల నుంచి విలువను రాబట్టడం: జౌళి రంగంలో చక్రీయతకు ఉద్దేశించిన మార్గ సూచీ’’ శీర్షికతో విడుదల చేసిన ఎఫ్ఐసీసీఐ నివేదికలో భారత్ వస్త్ర వ్యర్థాల అనుబంధ విస్తారిత వ్యవస్థ ప్రస్తుతం ఏటా రూ.22,000 కోట్లకు పైగా విలువైందిగా వివరించారు. దీనిలో సార్టింగ్, వేరుచేసే ప్రక్రియలతో పాటు అధిక విలువ కలిగిన పునరుపయోగ ప్రక్రియల్ని చేపట్టడం ద్వారా కూడా అదనపు విలువను రాబట్టుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి తోడు, భారత్‌లో పునరుపయోగం, మరమ్మతు ప్రక్రియలతో సాంప్రదాయికంగా తలసరి వస్త్ర వినియోగ, వ్యర్థ ఉత్పాదన స్థాయుల్ని పరిశీలిస్తే అవి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూసినప్పుడు చాలా తక్కువగా కూడా ఉన్నాయి. ఈ నిర్ధారణలు భారత్‌లో వస్త్రాల పునరుపయోగం కేవలం వ్యర్థాల నిర్వహణ కార్యకలాపంగానే పరిమితం కాకుండా జీవనోపాధి, వనరుల వినియోగ పరంగా దక్షత, రెండో స్థాయి సామగ్రి నుంచి విలువను రాబట్టుకోవడంలో కూడా విశిష్టమైన తోడ్పాటును అందిస్తోందని స్పష్టం చేస్తున్నాయి.
పర్యావరణానికి టెక్స్‌టైల్ రీసైక్లింగ్ హానికారకం అని చెబుతున్న వర్ణనలకు భిన్నంగా, ఐఐటీ ఢిల్లీ పరిశోధకులు నిర్వహించిన ‘లైఫ్ సైకిల్ అసెస్‌మెంట్.. ఎల్‌సీఏ’ అధ్యయనం భారత పునరుపయోగ కార్యకలాపాలతో సమకూరే ప్రధాన పర్యావరణ లాభాలను వివరించింది. ఈ అధ్యయనం కోసం పానిపట్ క్లస్టర్ నుంచి కూడా క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని సేకరించారు. టెక్స్‌టైల్ రీసైక్లింగ్ ప్రక్రియ.. గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలు, ఆమ్ల వర్షం అవకాశాలు, శిలాజ జనిత ఇంధన క్షయం వంటి కీలక పర్యావరణ సంబంధిత దుష్ప్రభావాలను 30 నుంచి 40 శాతం వరకు తగ్గించేస్తుందని మరో సమకాలిక సమీక్ష ‘జర్నల్ ఆఫ్ క్లీనర్ ప్రొడక్షన్ - 2025’ లో ప్రచురించిన ఒక పరిశోధన పత్రం (దీని రూపకల్పనకూ పానిపట్ రీసైక్లింగ్ క్లస్టర్ నుంచి డేటాను తీసుకున్నారు) కూడా తేల్చి చెప్పింది.
భారత్‌లో టెక్స్‌టైల్ రీసైక్లింగ్ కొన్ని ఎంపిక చేసిన యూనిట్లకే పరిమితం కాలేదని, ఈ ప్రక్రియను పానిపట్, తిరుప్పూర్, లూధియానా, సూరత్ తదితర వస్త్ర కేంద్రాలలో కూడా ప్రత్యేక పారిశ్రామిక అనుబంధ విస్తారిత వ్యవస్థల్లోనూ అనుసరిస్తున్నారన్నదీ ప్రాసంగికమే. మీడియా కథనాల్లో తరచు ప్రస్తావిస్తున్న పానిపట్ ప్రపంచ స్థాయిలో ప్రముఖ టెక్స్‌టైల్ రీసైక్లింగ్ కూడళ్లలో ఒకటిగా ఎదిగింది. పానిపట్‌లో ఉన్ని, మిశ్రిత వస్త్రాల వ్యర్థాల ప్రాసెసింగ్ చెప్పుకోదగిన పరిమాణంలో కొనసాగుతోంది. దీంతో జీవనోపాధి కార్యకలాపాలకూ, ఆర్థిక కార్యకలాపాలకు పానిపట్ ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు అవుతోంది.
అదే సమయంలో, మీడియా కథనాల్లో ప్రస్తావనకు వచ్చిన కొన్ని అంశాలు గమనించదగ్గవి. దీనికి కారణం వినియోగదారు సంస్థల ఉపయోగానంతర వస్త్ర వ్యర్థాల సేకరణ, మిశ్రిత సింథటిక్ టెక్స్‌టైల్ వ్యర్థాల నిర్వహణ, చీలికలు వాలికలైన ముడి సామగ్రిని పోగుచేయడం, చిన్న సంప్రదాయేతర యూనిట్ల నడుమ పర్యావరణ నియమాల పాలన, వేల్యూ చైన్‌లోని కొన్ని భాగాల్లో శ్రామికుల భద్రత వంటి సవాళ్లు ఇప్పటికీ కొనసాగుతుండడమే. ఏమైనా, ఈ ఆందోళనలను ఒక ప్రగతిశీల రంగం దృష్టికోణంలో నుంచి పరిశీలించాల్సివుంది. ఈ రంగం నిరంతరం మరింత సంప్రదాయీకరణ దిశగా, నియంత్రణపరంగా కఠినతర నియమాలను పాలించే దిశగా, స్వచ్ఛ ఉత్పాదక సాంకేతికతలను స్వీకరించే దిశగా పురోగమిస్తోంది. ఈ రంగం ప్రస్తుతం మిశ్రిత వస్త్రాల వ్యర్థాల రీసైక్లింగుకు సంబంధించిన సాంకేతిక పరిమితులను అధిగమించడంతో పాటు, ఉన్నత స్థాయికి చెందిన పర్యావరణ ప్రమాణాలకు కట్టుబడి ఉండే మార్గంలోనూ వేగంగా సాగిపోతోంది.
టెక్స్‌టైల్ రీసైక్లింగ్ రంగం పర్యావరణ నియమాల పాలన, పారిశ్రామిక కార్యకలాపాల నిర్వహణ, శ్రామికుల సంక్షేమాన్ని నియంత్రిస్తున్న ఒక సువ్యవస్థిత చట్టపరమైన, నియంత్రణ పూర్వక ప్రణాళిక (ఫ్రేంవర్క్) పరిధిలో పనిచేస్తోందని గమనించడమూ ఈ సందర్భంగా ముఖ్యమైందే. టెక్స్‌టైల్ రీసైక్లింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం-1974తో పాటు గాలి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం-1981ల నియంత్రణ పరిధిలో పనిచేస్తున్నాయి. ఈ కారణంగా ఈ యూనిట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ల వద్ద నుంచి తప్పనిసరిగా కార్యకలాపాలకు నిర్వహణ సంబంధమైన అంగీకారాన్ని పొందాలి. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు నియమాలను అతిక్రమించే యూనిట్లకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ సంబంధిత చర్యల్ని చేపడుతున్నాయి. తత్ఫలితంగా భారత నియంత్రణ సంస్థలు పూర్తి స్థాయిలో క్రియాశీలంగానూ, అప్రమత్తంగానూ, నియమాలను అమలు చేయడంలో పక్కాగానూ పనిచేస్తున్నాయన్న వాస్తవానికి నికార్సయిన నిదర్శనంగా నిలుస్తున్నాయి.
దీనికి అదనంగా, భారత్‌లో వృత్తిపరమైన భద్రత, పని పరిస్థితులు, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం వంటి అంశాలు దేశంలో నిరంతరం మార్పుచేర్పులకు లోనవుతున్న కార్మిక చట్ట స్వరూపం పరిధిలోకి వస్తూనే ఉన్నాయి. వీటిలో.. ‘వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల నియమావళి-2020’ (ఓఎస్‌హెచ్ కోడ్), చెప్పుకోదగ్గదిగా ఉంది. ఈ నియమావళి పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్య ప్రమాణాలు, సంక్షేమ చర్యలతో పాటు వివిధ సంస్థల్లో పని పరిస్థితులకు సంబంధించిన ముఖ్య నిబంధనలను ఒక చోటుకు చేర్చింది. అలాగే, ‘సామాజిక భద్రత నియమావళి-2020’ శ్రామికులకు సామాజిక భద్రత పరిధిని దృఢతరంగా మార్చేందుకు తోడ్పడుతోంది. ఇక వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, శ్రామికుల సంరక్షణ.. వీటితో ముడిపడిన అంశాలను ‘వేతన నియమావళి-2019’, ‘పారిశ్రామిక సంబంధాల నియమావళి-2020’ల సాయంతో ప్రభావవంతంగా పరిష్కరిస్తున్నారు. ఏవైనా ఉల్లంఘనలు చోటు చేసుకున్న పక్షంలో, సమర్థ అధికారులు చట్ట ప్రణాళికను అనుసరించి తగిన నియంత్రణ సంబంధిత పరిశీలన, తనిఖీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను తీసుకుంటున్నారు.
భారత టెక్స్‌టైల్ రీసైక్లింగ్ పరిశ్రమ స్థూల చిత్రణలో.. తరుచు పర్యావరణం పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న, శ్రామికుల భద్రతకు ప్రాధాన్యాన్ని ఇస్తున్న పద్ధతులను తూచా తప్పక పాటిస్తున్న సంఘటిత, ఎగుమతి ప్రధాన రీసైక్లింగ్ సంస్థలు నమోదు చేస్తున్న విశిష్ట ప్రగతిని చూసీచూడనట్లు వ్యవహరించడం కూడా సర్వసాధారణమైపోతోంది. ప్రస్తుతం భారత్‌లో టెక్స్‌టైల్ రీసైక్లింగ్ అనుబంధ విస్తారిత వ్యవస్థ తన సాంప్రదాయిక యంత్రాధారిత రీసైక్లింగ్ విధుల నుంచి శరవేగంగా ముందుకు పోతూ, అత్యాధునిక రసాయనిక రీసైక్లింగ్ సాంకేతికతల వైపునకు పయనిస్తోంది. ఈ క్రమంలో మాలిక్యులార్ స్థాయిలో ఫైబర్ల పునఃప్రాప్తి ద్వారా వస్త్రం నుంచి వస్త్రాల చక్రీయతని (టెక్స్‌టైల్-టు- టెక్స్‌టైల్ సర్కులారిటీ) సుసాధ్యం చేస్తోంది. పునరుపయోగ సాంకేతికతలు, దుమ్మూ-ధూళీ వేరు చేసే వ్యవస్థలు, జీరో-లిక్విడ్ డిశ్చార్జి (జడ్ఎల్‌డీ) వ్యర్థ జలాల శుద్ధి, పునరుత్పాదక ఇంధన ఏకీకరణ ప్రక్రియల్లో దేశంలోని అనేక వస్త్ర ఉత్పత్తి యూనిట్లు పెట్టుబడులను పెట్టాయి. ప్రత్యేకించి తిరుప్పూర్ టెక్స్‌టైల్ క్లస్టర్ తన అద్దకం (డైయింగ్), ప్రాసెసింగ్ యూనిట్లలో జేఎల్‌డీ వ్యవస్థలను దాదాపుగా సార్వజనిక స్థాయిలో అమలులోకి తీసుకువచ్చినందుకు ప్రపంచ స్థాయిలో గుర్తింపునకు నోచుకుంది. ఇది పెద్ద ఎత్తున ఉన్నత పర్యావరణ ప్రమాణాలను పరిరక్షించే భారత్ సామర్థ్యానికి శ్రేష్ఠమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఇదే విధంగా తమిళనాడు, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాల్లో జౌళి యూనిట్లు ‘లో-లిక్కర్ డైయింగ్ టెక్నాలజీ’, ఆధునిక జల పునరుపయోగ వ్యవస్థలు, డిజిటలీకరించిన ప్రాసెస్ పర్యవేక్షక యంత్రాంగాలతో పాటు తక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకుంటూనే పని చేయగలిగే ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలను నెలకొల్పి మన్నికైన, వనరులను పొదుపుగా వాడుకొనే తయారీ పద్ధతుల్ని పాటించడంలో ఒక కొత్త ఉదాహరణను అందిస్తున్నాయి. ఈ యూనిట్లను పర్యావరణానికి హితకరంగానే కాక, కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ నడుపుతున్నారు.
భారత సాంకేతిక టెక్స్‌టైల్ రీసైక్లింగ్ సామర్థ్యాలు ఒక్క సాంప్రదాయిక దుస్తులు, దేశవాళీ వస్త్రాల వరకే గిరి గీసుకొని కూర్చోలేదు. ఇది జాతీయ ప్రాధాన్యం కలిగిన ఒక ముఖ్య వ్యూహాత్మక రంగంలో ఉన్నత విలువలతో కూడిన సాంకేతిక వస్త్ర వ్యర్థాల పునరుపయోగ విధానానికి కూడా సంకేతంగా నిలుస్తోంది. దీనిలో డిఫెన్స్-గ్రేడ్ ఫైబర్, ఆటోమోటివ్ టెక్స్‌టైల్స్, ఏరోస్పేస్ కాంపోజిట్ల వంటి సంక్లిష్ట వ్యర్థాలూ కలసి ఉన్నాయి. వీటిని వాటికి సంబంధించిన సాంకేతిక జటిలత్వం కారణంగా ప్రపంచ స్థాయిలో తరచు మండించి వేయడమో లేదా నేలలో పెద్ద పెద్ద గోతులు తవ్వి మరీ ఆ గోతుల్లో పారేసి పూడ్చేయడమో చే స్తున్నారు. రక్షణ, సురక్షా ప్రధాన టెక్స్‌టైల్స్ రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ తన స్థానాన్ని పటిష్ఠపరుచుకుంది. జాతీయ సాంకేతిక జౌళి మిషన్ (ఎన్‌టీటీఎమ్)లో భాగంగా ఐఐటీ - ఢిల్లీ ఆధ్వర్యంలో పానిపట్‌లో ఏర్పాటు చేసిన ‘అటల్ సెంటర్ ఆఫ్ టెక్స్‌టైల్ రీసైక్లింగ్ అండ్ సస్టెయినబులిటీ’ (ఏసీటీఆర్ఎస్), ఉన్నతమైన పనితీరు కలిగిన అరామిడ్ ఫైబర్ వ్యర్థాల పునరుపయోగానికి ఒక విశిష్ట ప్రక్రియను రూపొందించి, దీనిని విజయవంతంగా పరిశ్రమకు బదలాయించింది. ఈ ప్రత్యేక సామగ్రిని బులెట్‌ప్రూఫ్ చిన్న కోటులూ, సంరక్షక గియర్సూ, హెల్మెట్లూ, సాయుధ శకట విడిభాగాల నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. దీనికి తోడు, ఎన్‌టీటీఎమ్.. కాంపోజిట్ జియోసింథటిక్స్, స్పెషాలిటీ ఫైబర్లు, స్ట్రక్చరల్ మెటీరియల్స్‌తో ముడిపడిన పరిశోధన ప్రాజెక్టుల కోసం ఒక ప్రత్యేక పోర్ట్‌ఫోలియోకు కూడా ఆమోదాన్ని తెలిపింది. దీనిని ఆటోమోటివ్ లైటింగ్, ఆటల్లో ఉపయోగించే భద్రతా ఉపకరణాలు, ఏరోస్పేస్ స్ట్రక్చర్లలో నేరుగా ఉపయోగిస్తున్నారు. ఇది భారత్‌లో ఒక సువ్యవస్థిత, అధిక విలువ కలిగిన సాంకేతిక వస్త్ర పునరుపయోగ అనుబంధ విస్తారిత వ్యవస్థకు పునాదిని వేసింది.
పైన ప్రస్తావించిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొంటే, ప్రసార మాధ్యమాల కథనాలు కొన్ని ప్రాంతాల్లో నిర్వహణ సంబంధిత నిర్దిష్ట ఆందోళనల దిశగా సంకేతాలను అందిస్తూ ఉండవచ్చు.. కానీ, ఇలాంటి సందర్భాలు పూర్తి భారత్‌లో టెక్స్‌టైల్ రీసైక్లింగ్ సంబంధిత అనుబంధ విస్తారిత వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించవు. భారత టెక్స్‌టైల్ రీసైక్లింగ్ రంగ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయి. వాటిలో విస్తృత పరిమాణం, ప్రతిష్ఠిత పునఃప్రాప్తి ప్రక్రియలతో పాటు, కీలక చక్రీయ స్వభావం కూడా భాగంగా ఉంది. ఇవి జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా మెరుగైన పర్యావరణ సంబంధిత పనితీరుతో పాటు స్థిరత్వం దిశగా వేగంగా పయనిస్తున్నాయి.
స్థిరమైన వృద్ధి, వనరుల పరంగా సామర్థ్యం, చక్రీయ ఆర్థిక వ్యవస్థ.. ఈ విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయిలో పోటీ పడగలిగే, పర్యావరణం పట్ల బాధ్యతను కలిగివున్న, సామాజికంగా సమ్మిళితమైన జౌళి రంగానికి మద్దతు ను అందించడానికి జౌళి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2261027)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11