రక్షణ మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా సంక్షోభంపై రక్షణ మంత్రి అధ్యక్షతన 5వ ఐజీఓఎం సమావేశం: దేశంలో ఇంధన కొరత లేదు.. సిద్ధంగా 60 రోజుల ముడి చమురు- గ్యాస్, 45 రోజుల ఎల్‌పీజీ నిల్వలు
దీర్ఘకాలిక సామర్థ్య పెంపుదలే లక్ష్యంగా ప్రస్తుత పొదుపు చర్యలు
సరఫరా వ్యవస్థలకు విఘాతం కలగకుండా అన్ని రకాల పటిష్ఠ చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం..
ప్రజలు భయాందోళనలు చెందవద్దని విన్నపం
ఇంధన సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడటం, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, సముద్ర వాణిజ్య మార్గాల భద్రతను నిర్ధారించడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం
వ్యూహాత్మక సంక్షోభ అంచనా, ముందస్తు హెచ్చరికల విశ్లేషణ, భవిష్యత్తు పరిణామాల ప్రణాళిక, ప్రభుత్వ యంత్రాంగం అంతా సమన్వయంతో సకాలంలో సిద్ధంగా ఉండటంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న ఐజీఓఎం
నాడు పోస్టు చేయడమైనది:
11 MAY 2026 4:06PM by PIB Hyderabad
2026 మే 11న ఢిల్లీలోని కర్తవ్య భవన్-2లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన పశ్చిమాసిమా సంక్షోభంపై 5వ ఐజీఓఎం (ఇన్ఫార్మల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) సమావేశం జరిగింది. ఇందులో ఘర్షణకు సంబంధించిన తాజా పరిణామాలను సమీక్షించారు. దాని ప్రభావం ప్రజలపై కనిష్ఠంగా ఉండేలా చూడటానికి భారతదేశ సంసిద్ధతను బలోపేతం చేసే మార్గాలపై ఇందులో చర్చించారు. రసాయనాలు- ఎరువుల శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా.. పెట్రోలియం- సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి.. రైల్వే, సమాచార- ప్రసార, ఎలక్ట్రానిక్స్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు.. పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు.. ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్.. శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
దేశం సురక్షితంగా ఉందని, ఇతర దేశాలు దేశీయ వినియోగాన్ని గణనీయంగా తగ్గించేందుకు అత్యవసర చర్యలు తీసుకుంటున్నప్పటికీ భారత్‌లో పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో ఎటువంటి కొరత లేదని ఐజీఓఎంకు సమాచారం అందించారు. భారత్‌లో 60 రోజుల ముడి చమురు, 60 రోజుల సహజ వాయువు, 45 రోజుల ఎల్‌పీజీ నిల్వలు (రోలింగ్ స్టాక్) ఉన్నాయి. 703 బిలియన్ డాలర్ల నిల్వలతో విదేశీ మారకద్రవ్యం విషయంలో సౌకర్యవంతమైన స్థాయిలో దేశం ఉంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు శుద్ధి దేశంగా, పెట్రోలియం ఉత్పత్తుల నాలుగో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న భారత్.. 150 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తూనే దేశీయ డిమాండ్‌ను పూర్తిగా తీరుస్తోంది. అయితే అంతర్జాతీయ ముడిచమురు ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల దేశం భారీ మూల్యాన్ని చెల్లిస్తోంది. ఇంధన పొదుపు ఈ భారాన్ని తగ్గించగలదు. అంతర్జాతీయ ఘర్షణల వల్ల ఏర్పడిన ప్రపంచ ఆర్థిక అంతరాయాలు, సరఫరా వ్యవస్థ సవాళ్లు, పెరుగుతున్న ధరలను ఎదుర్కోవడంలో దేశానికి సహాయపడటానికి సామూహిక భాగస్వామ్యం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి.. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో విచక్షణ, వృథా వినియోగించటాన్ని తగ్గించడాన్ని ప్రధానంగా తెలియజేసింది. తద్వారా దేశంపై ప్రస్తుతం, భవిష్యత్తులో ఉండే ఆర్థిక భారం తగ్గుతుంది.
ప్రపంచవ్యాప్త అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ఘర్షణ ప్రారంభమై 70 రోజులు దాటినా పెట్రోలియం ధరలు స్థిరంగా ఉన్న అతికొద్ది దేశాలలో భారత్ ఒకటి. అనేక దేశాల్లో ధరలు 30 నుంచి 70 శాతం వరకు పెరిగాయి. అయితే అంతర్జాతీయంగా ఆకాశాన్నంటుతున్న ధరల భారం భారతీయులపై పడకుండా ఉంచేందుకు భారత చమురు విక్రయ సంస్థలు రోజుకు దాదాపు రూ. 1,000 కోట్ల నష్టాలను భరిస్తున్నాయి. 2026 మొదటి త్రైమాసికంలో ఈ నష్టాలు (అండర్-రికవరీలు) దాదాపు రూ. 2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎవరూ పెట్రోల్ బంకులకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు.
ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు సమృద్ధిగా ఉన్నాయని, ఒకవేళ ఈ సంక్షోభం గనుక సుదీర్ఘకాలం కొనసాగితే భవిష్యత్తు అవసరాల కోసం దీర్ఘకాలిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే ప్రస్తుత పొదుపు చర్యల ఉద్దేశమని మంత్రులు తెలియజేశారు. సరఫరా నిర్వహణ బాగుందని, ప్రజలు భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని, ఇంధనం- ఇతర ఉత్పత్తులను అధికంగా కొనుగోలు చేయాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
ప్రధాన మంత్రి విజ్ఞప్తిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి అధికారులను ఆదేశించారు. మెట్రో- ప్రజా రవాణాను ఉపయోగించడం, కార్ పూలింగ్ ద్వారా పెట్రోల్- డీజిల్ వినియోగాన్ని తగ్గించటం, అనవసరమైన విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండటం, దేశీయ పర్యాటకం- భారతదేశంలోనే వేడుకలను చేసుకోవటం ద్వారా విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడటం, ఒక సంవత్సరం పాటు అనవసరమైన బంగారు కొనుగోళ్లను నివారించటం చేయాలని 2026 మే 11న ప్రధాన మంత్రి ప్రజలకు సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని 50 శాతం తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వైపు మళ్లాలని తద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని.. వ్యవసాయంలో డీజిల్ పంపులకు బదులుగా సౌరశక్తితో నడిచే నీటి పంపులను విస్తృతంగా వినియోగించాలని ఆయన రైతులను కోరారు. "ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి, బాధ్యతాయుతమైన వినియోగ ప్రవర్తనను వ్యవస్థీకృతం చేయడానికి అవసరమైన చర్యలను మంత్రిత్వ శాఖలు- రాష్ట్రాలు సమన్వయ పద్ధతిలో గుర్తించాలి" అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
సమావేశం అనంతరం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన ఒక పోస్ట్‌లో అన్ని నిత్యావసర వస్తువుల సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. కొరత లేదా సరఫరా గొలుసులో అంతరాయాలను నివారించడానికి అన్ని పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన ఆయన.. ప్రజలు ఆందోళన చెందొద్దని, ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని కోరారు.
ప్రస్తుత తరుణంలో ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడటం, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, సముద్ర వాణిజ్య మార్గాల భద్రతను నిర్ధారించడంపైనే భారత్ ప్రధానంగా దృష్టి సారించాలని రక్షణ మంత్రి ప్రముఖంగా చెప్పారు. అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని భాగస్వామ్య పక్షాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
భారత్ ఇంధన వనరులను వైవిధ్యం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి.. పునరుత్పాదక ఆధారిత ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వేగంగా విస్తరించటం, మరింత నమ్మకమైన- వైవిధ్యభరితమైన ఇంధన సరఫరాలను గుర్తించటం, ఇంధన సామర్థ్య సాంకేతికతలలో పెట్టుబడులను పెంచాల్సిన అత్యవసర అవసరాన్ని ప్రధానంగా పేర్కొన్నారు. భవిష్యత్ ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకొని సరఫరా వ్యవస్థ అంతరాయాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక నిల్వల విషయంలో పునఃసమీక్ష చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పశ్చిమాసియా పరిస్థితిని కేవలం ఒక మనకు సంబంధంలేని సంఘటనగా చూడకూడదన్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్.. నేటి పరస్పర అనుసంధానిత ప్రపంచంలో ఏ రకమైన అంతర్జాతీయ సంక్షోభమైనా ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో అన్ని దేశాలపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. వ్యూహాత్మక సంక్షోభ ముందస్తు అంచనా, ముందస్తు హెచ్చరికల విశ్లేషణ, వివిధ పరిస్థితుల ప్రణాళిక, సమయానుకూలమైన ప్రభుత్వ సమగ్ర సంసిద్ధతపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా చెప్పారు.
ఎంఎస్ఎంఈలతో సహా పరిశ్రమలకు మద్దతుగా ఇటీవల ప్రత్యేకంగా చేపట్టిన విధానపరమైన చర్యల గురించి ఐజీఓఎంకు అధికారులు సమాచారం అందించారు. ఎంఎస్ఎంఈలతో సహా పరిశ్రమలకు ద్రవ్య లభ్యత విషయంలో మద్దతును అందించడానికి కేంద్ర మంత్రివర్గం 2026 మే 05న ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం- 5.0ను (ఈసీఎల్‌జీఎస్ 5.0) ఆమోదించింది. దీని ద్వారా మొత్తం రూ. 2,55,000 కోట్ల అదనపు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంఎస్ఎంఈలకు 100 శాతం, ‘ఎంఎస్ఎంఈ’యేతర సంస్థలతో పాటు విమానయాన రంగానికి 90 శాతం క్రెడిట్ గ్యారెంటీని అందించాలన్నది ఈ పథకానికి ఉన్న ప్రధాన ఉద్దేశం.
అంతేకాకుండా ప్రభుత్వ సేకరణ కాంట్రాక్టులలో 'అనివార్య కారణాలు (ఫోర్స్-మెజ్యూర్)' వంటి వాటికి సంబంధించి పరిశ్రమల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉపశమన చర్యలను చేపట్టింది. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభాన్ని 'అనివార్య కారణాల' కింద యుద్ధంగా పరిగణించాలని వ్యయ విభాగం ఒక సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసింది. దీనివల్ల పనుల పూర్తికి సంబంధించిన గడువులను 2026 ఫిబ్రవరి 28 నుంచి 2-4 నెలల వరకు పొడిగించే అవకాశం కలుగుతుంది.
ఎరువుల లభ్యత పటిష్ఠంగా ఉందని, ఈ విషయంలో అవసరానికి మించి సరఫరా కొనసాగుతోందని ఐజీఓఎంకు సమాచారం అందించారు. దేశంలోని ఎరువుల మొత్తం నిల్వలు (లక్ష టన్నులలో) ఈ కింది విధంగా ఉన్నాయి:
|
ఎరువు
|
11.05.2026 నాటి నిల్వలు
|
11.05.2025 నాటి నిల్వలు
|
|
యూరియా
|
76.65
|
75.48
|
|
డీఏపీ
|
22.52
|
14.87
|
|
ఎన్‌పీకేలు
|
60.42
|
48.32
|
|
ఎస్‌ఎస్‌పీ
|
26.99
|
26.92
|
|
ఎంఓపీ
|
13.07
|
12.99
|
|
మొత్తం
|
199.65
|
178.58
|
2026 ఖరీఫ్ విషయంలో 390.54 ఎల్ఎంటీల ఎరువులు అవసరమవుతాయని డీఏ-ఎఫ్‌డబ్ల్యూ అంచనా వేసింది. ఇవాల్టి వరకు దాదాపు 199.65 ఎల్ఎంటీ (51 శాతం కంటే ఎక్కువ) నిల్వలు ఉన్నాయి. ఇది సాధారణ స్థాయి అయిన 33 శాతం కంటే చాలా ఎక్కువ. ఇది ప్రభుత్వ మెరుగైన ప్రణాళిక, ముందస్తు నిల్వలు, సమర్థవంతమైన రవాణా నిర్వహణను తెలియజేస్తోంది.
సంక్షోభం తర్వాత ఎరువుల దేశీయ ఉత్పత్తి, దిగుమతి (లక్షల టన్నుల్లో):
|
ఎరువు
|
సంక్షోభం తర్వాత దేశీయ ఉత్పత్తి (01.03.2026 నుంచి 10.05.26 వరకు)
|
దేశీయ ఉత్పత్తి (01.03.2025 నుంచి 10.05.25 వరకు)
|
|
యూరియా
|
46.28
|
54.98
|
|
డీఏపీ
|
6.2
|
5.56
|
|
ఎన్‌పీకేలు
|
15.57
|
22.03
|
|
ఎస్‌ఎస్‌పీ
|
8.73
|
9.44
|
|
మొత్తం
|
76.78
|
92.01
|
ఎరువుల విక్రయాలు (లక్షల టన్నులలో):
|
ఎరువు
|
విక్రయం
01.03.26 నుంచి 10.05.26 వరకు
|
విక్రయం
01.03.25 నుంచి 10.05.25 వరకు
|
|
యూరియా
|
38.94
|
34.6
|
|
డీఏపీ
|
9.4
|
6.17
|
|
ఎన్‌పీకేలు
|
14.25
|
11.71
|
|
ఎస్‌ఎస్‌పీ
|
5.52
|
4.28
|
|
ఎంఓపీ
|
3.08
|
2.89
|
|
మొత్తం
|
71.19
|
59.65
|
***
(రిలీజ్ ఐడి: 2260162)
సందర్శకుల సూచీ సంఖ్య : : 36