ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని సోమనాథ ఆలయ పునరుద్ధరణకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సోమనాథ అమృత మహోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
· “అకుంఠిత విశ్వాసం.. దైవత్వాల వెలుగు దివ్వె మాత్రమేగాక భారతీయ పవిత్రాత్మకు శాశ్వత ప్రతీక ఈ ఆలయం”
· “సరిగ్గా 75 ఏళ్ల కిందట ఇదే రోజున ఆలయ పునరుద్ధరణ ఓ అసాధారణ ఘట్టం.. దేశం 1947లో స్వేచ్ఛా వాయువులు పీల్చగా నాటి స్వతంత్ర స్ఫూర్తిని చాటుతూ 1951లో సోమనాథ ప్రతిష్ఠాపన పూర్తియింది”
· “నేటి ఈ అమృత మహోత్సవం రాబోయే వెయ్యేళ్లపాటు దేశానికి మార్గదర్శనం చేస్తుంది”
· “ఈ ఆలయ వైభవ నాశనానికి యత్నించిన దోపిడీదారులు దీన్నొక భౌతిక కట్టడంగా మాత్రమే పరిగణించి దాడులు కొనసాగించినా... పదేపదే ధ్వంసం చేసినా... పలుమార్లు పునర్నిర్మితమవుతూ మరింత సమున్నతంగా నిలిచింది”
· “ప్రతిష్ఠాత్మక సోమనాథ ఆలయ పునర్నిర్మాణం ద్వారా దేశం కూడా శతాబ్దాల నాటి కళంకాన్ని తుడిచిపెట్టింది”
· “ఏ దేశమైనా మూలాలతో సంధానితమైతేనే కాలగమనంలో తన బలాన్ని చాటగలదనడానికి సోమనాథ్ ఒక సగర్వ నిదర్శనం”
నాడు పోస్టు చేయడమైనది:
11 MAY 2026 3:52PM by PIB Hyderabad
గుజరాత్‌లోని సోమనాథ ఆలయ పునరుద్ధరణానంతర ప్రతిష్ఠాపనోత్సవానికి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఇవాళ నిర్వహించిన అమృత మహోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సభనుద్దేశించి ప్రసంగిస్తూ- ఈ వేడుక లాంఛనప్రాయ ఉత్సవం కాదని, ఇది భారతీయ శాశ్వత చైతన్యానికి, నాగరికతా పునరుత్థానానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. ఈ చారిత్రక సందర్భంలో వేద మంత్రాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సముద్రపు అలల ఘోష ముప్పేటగా పవిత్ర ప్రదేశ పునరుద్ధరణ సందర్భానికి మరింత శోభను జోడిస్తే, భక్తిపురస్సర జాతీయ ప్రతిష్ఠ సగర్వంగా తలెత్తుకు నిలిచింది.
దైవ సంకల్పం నుంచి ఉద్భవించిన ఈ సృష్టి తిరిగి అందులోనే లీనమమయ్య తీరును ప్రధానమంత్రి వివరిస్తూ- “యతో జాయతే పాల్యతే యేన విశ్వం, తమిశం భజే లీయతే యత్ర విశ్వం” అని శివస్తోత్రంలోని ప్రాచీన శ్లోకాన్ని ఆయన ఉటంకించారు. “అదే తరహాలో ఈ రోజున మనం ఆ మహదేవుని ఆవాస పునర్నిర్మాణోత్సవం నిర్వహించుకుంటున్నాం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. వ్యక్తిగతంగా తన భక్తిప్రపత్తులను చాటుకుంటూ సోమనాథ స్వామి భక్తుడిగా తాను లెక్కలేనన్ని సార్లు శివదర్శనం చేసుకున్నానని గుర్తుకు తెచ్చుకున్నారు. “ఆ ఆదిదేవునికి నేనెన్నో సార్లు శిరసాభివందనం చేశాను. కానీ, నేనివాళ ఇక్కడికి బయలుదేరాక ఈ ప్రయాణం ఆసాంతం అలౌకిక ఆనందానుభూతినిచ్చింది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
సోమనాథ స్వాభిమాన్ వేడుకల సందర్భంగా కొన్ని నెలల కిందటి తన పర్యటనను గుర్తు తెచ్చుకుంటూ- నేడు ఉత్సవానికి కూడా హాజరు కాగలగడం తనకెంతో ప్రత్యేకమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “మొదటి విధ్వంసం ఘట్టానికి 1000 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా సోమనాథ ఆలయం పూర్వవైభవాన్ని కొనసాగించడం మనకెంతో గర్వకారణం. ఇక నేటి ఆధునిక రూపంలో స్వామి ప్రాణ ప్రతిష్ఠాపనకు 75 ఏళ్లు పూర్తయిన తరుణంలో ఈ వెయ్యేళ్ల సుదీర్ఘ అమృత ప్రస్థాన ఆనందానుభూతి మనకు సొంతమైంది” అని శ్రీ మోదీ తన భక్తిభావనను చాటుకున్నారు.
స్వాతంత్ర్యానంతరం 1951 నాటి ప్రతిష్ఠాపన చారిత్రక ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ- అదొక సాధారణ ఘట్టమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “భారత్ 1947లో స్వేచ్ఛా వాయువులు పీల్చగా, 1951లో సోమనాథ ప్రాణప్రతిష్ఠ ఈ దేశ స్వాతంత్ర్య చైతన్యాన్ని చాటుకుంది” అని వివరించారు.
స్వాతంత్ర్యం సిద్ధించిన నాలుగేళ్లకు ఆలయ పునర్నిర్మాణంలోని విశిష్టతను ప్రస్తావిస్తూ- దేశంలోని 500 సంస్థానాలను రాజకీయంగా ఏకీకృతం చేయాలన్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దృఢదీక్షకు, సోమనాథ ఆలయ పునర్నిర్మాణంపై ఆయన సంకల్పానికీ మధ్యగల సారూప్యాన్ని ప్రధానమంత్రి అద్భుతంగా ఉదాహరించారు. ఈ మేరకు “దేశం దాస్య శృంఖలాల నుంచి విముక్తం కావడం, సోమనాథ ఆలయ పునరుద్ధరణ ఏకకాలంలో ప్రపంచానికి ఒక వాస్తవాన్ని చాటిచెప్పాయి. అదేమిటంటే- భారత్ స్వతంత్ర దేశం మాత్రమే కాదు... అది తన ప్రాచీన వైభవాన్ని కూడా తిరిగి సంతరించుకుంటోంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ ఘట్టానికగల బహుముఖ ప్రాశస్త్యాన్ని ప్రస్తావిస్తూ- తానిప్పుడు 75 ఏళ్ల గతంలోకి తొంగిచూడటంతో సరిపుచ్చడం లేదని ప్రధానమంత్రి అన్నారు. “వినాశనంలో సృష్టి సంకల్పాన్ని సోమనాథ ఆలయం రుజువు చేయడం నేనిప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను” అని వ్యాఖ్యానించారు. ఈ పవిత్ర ప్రాంగణంలో అసత్యంపై సత్యం సాధించిన శాశ్వత విజయం తన మనోనేత్రానికి గోచరిస్తున్నదని వర్ణించారు.
విశ్వ సంక్షేమ ప్రబోధం చేసిన వేల ఏళ్ల ఆధ్యాత్మిక చైతన్యానికి తానివాళ ఒక సాక్షిగా నిలుస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు. సోమనాత పునరుత్థానంలో భారత అనశ్వర వేదసారంపై మూర్తీభవించిన తన దృక్పథాన్ని ఆయన వివరించారు. “శతాబ్దాల పాటు ప్రయత్నించినా ఈ వైభవ నాశనం ఆ ముష్కర మూకలు దుష్కరమైంది. అటువంటి అపరాజిత భారత నిత్యశాశ్వత స్వరూప సాక్షాత్కారాన్ని నేనిక్కడ చూస్తున్నాను” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
ఈ వేడుకల రూపంలో భవిష్యత్ దృక్పథాన్ని ప్రకటిస్తూ- సోమనాథ అమృత మహోత్సవం ఒక సంస్మరణ వేడుకకు మించినదని ఆయన పేర్కొన్నారు. “ఇది గతాన్ని స్ఫురణకు తెచ్చుకునే వేడుక కాదు... రాబోయే వెయ్యేళ్లపాటు దేశానికి మార్గనిర్దేశం చేయగల స్ఫూర్తి కూడా” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ మహత్తర సందర్భంలో దేశ ప్రజలకు... ముఖ్యంగా కోట్లాది సోమనాథుని భక్తులకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.
దేశ చరిత్రలో 1998 మే 11 నాటి మరో కీలక ఘట్టం- పోఖ్రాన్ అణు పరీక్షల వార్షికోత్సవంతోనూ సోమనాథ అమృత మహోత్సవం ముడిపడి ఉందని ఆయన గుర్తుచేశారు. మన దేశం ఆనాడు 3 అణు పరీక్షల ద్వారా భారత శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని వివరించారు. ముఖ్యంగా 1998 మే 13నాటి ప్రయోగాత్మక పరీక్షలు మన అకుంఠిత రాజకీయ సంకల్పాన్ని శక్తిమంతంగా ప్రదర్శించాయని ప్రముఖంగా ప్రస్తావించారు. “ఆ సమయంలో యావత్ ప్రపంచం భారత్‌పై ఒత్తిడి తెచ్చింది. కానీ, అటల్ జీ నాయకత్వంలో నాటి ప్రభుత్వం తమకు దేశమే ప్రధానమని స్పష్టం చేస్తూ, ప్రపంచంలో ఏ శక్తికీ భారత్ తలవంచబోదని లేదా ఒత్తిడికి గురికాబోదని నిరూపించింది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
పోఖ్రాన్ అణు పరీక్షకు ‘ఆపరేషన్ శక్తి’గా నామకణం చేశారంటూ.. లోతైన సాంస్కృతిక ప్రాధాన్యమే అందుకు కారణమని ప్రధానమంత్రి వివరించారు. ఈ మేరకు “శివునితోపాటు శక్తిని పూజించడం మన సంప్రదాయం” అని ఆయన వ్యాఖ్యానించారు. హిందూ ప్రతిమా శాస్త్రాన్ని ఉదాహరిస్తూ- అర్ధనారీశ్వర్వుడు శివశక్తుల అవిభాజ్య తత్త్వాన్ని ప్రదర్శిస్తాడని వివరించారు. ఇక భారత అంతరిక్ష ప్రయోగం చంద్రయాన్ విజయవంతంగా చంద్రునిపై దిగిన ప్రదేశానికి కూడా ఈ తత్త్వం ప్రకారమే ‘శివశక్తి’గా నామకరణం చేశామని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ పద వ్యుత్పత్తి సంబంధాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఈ ప్రాచీన జ్ఞాన, ఆధునిక విజ్ఞాన విజయ సంగమంపై ఆయన ఆనందం వెలిబుచ్చారు. “చంద్రుని (సోమ) పేరిట ఇక్కడి జ్యోతిర్లింగానికి ‘సోమనాథుడు’గా పేరు పెట్టడం ఎంతో ఆనందదాయకం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
శివశక్తులను కలిసి పూజించే సంప్రదాయం నేడు భారత శాస్త్రవిజ్ఞాన ప్రగతికి స్ఫూర్తినిస్తున్న తీరును ప్రధానమంత్రి వివరించారు. “శివశక్తుల ఆరాధన దేశ శాస్త్రవిజ్ఞాన పురోగమనానికీ స్ఫూర్తిగా నిలవాలనే సంకల్పం నెరవేరడాన్ని మనమివాళ చూస్తున్నాం” అని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ శక్తి’ వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
వెయ్యేళ్ల కిందటి ఆలయ విధ్వంసం-పునరుద్ధరణ గాథను వివరిస్తూ- ఈ చరిత్రకు ప్రాణం పోసిన దేశ ప్రజల అకుంఠిత స్ఫూర్తిని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఘజనీ మహమూద్, అలావుద్దీన్ ఖిల్జీ వంటి దురాక్రమణదారులు వరుస దాడులతో విధ్వంసానికి పాల్పడినా, ఈ ఆలయ పునర్వైభవాన్ని అడ్డుకోలేకపోయారని పేర్కొన్నారు. ఈ మేరకు భోజరాజు, భీమ్‌దేవుడు-I, కుమారపాల, మహీపాల-I, రావు ఖంగర్ వంటి అంకితభావం గల పాలకులు ఈ ఆలయాన్ని ప్రతిసారి పునర్నిర్మిస్తూ భారత ఆధ్యాత్మిక ప్రతిష్ఠను చాటిచెప్పారని తెలిపారు. “ధ్వంసం చేసిన వారికి కనిపించింది కేవలం రాళ్లు, సున్నం మాత్రమే... కానీ, మన నాగరికత మేధ, ఆధ్యాత్మిక శక్తి వారికెన్నడూ అవగతం కాలేదు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
దేశ సాంస్కృతిక పునరుద్ధరణను ప్రస్తావిస్తూ- ఈ ప్రాంత పవిత్ర వారసత్వాన్ని పరిరక్షించిన లకూలీశ, సోమశర్మ వంటి మహనీయుల కృషిని ప్రధానమంత్రి కొనియాడారు. నాటి ఆధ్యాత్మిక సంప్రదాయాలను నిలబెట్టిన భావ బృహస్పతి, పశుపతాచార్యులు సహా అనేక మంది పండితుల పాండితీ ప్రకర్షను, కృషిని ఆయన ప్రశంసించారు. ఈ ప్రాంత చైతన్యాన్ని పరిరక్షించిన విశాల్‌దేవ్, త్రిపురాంతక వంటి మేధావులను ప్రధాని మోదీ కీర్తించారు. అలాగే, సోమనాధుని సేవకు తమనుతాము అంకితం చేసుకున్న వీర్ హమీర్జీ గోహిల్, వీర్ వేగ్దాజీ భిల్, పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ జీ, బరోడా గైక్వాడ్‌లు, జామ్ సాహెబ్ మహారాజా దిగ్విజయ్ సింగ్ వంటి అనేకమంది మహనీయుల పేర్లను ఆయన ఏకరవు పెట్టారు. సోమనాథ ఆలయ పునరుద్ధరణలో ఆధునిక రూపశిల్పులైన సర్దార్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కె.ఎం.మున్షీ వంటి సకల మహనీయులకు ఆయన ప్రత్యేకంగా శిరసాభివందనం చేశారు. సమకాలీన బాధ్యత దిశగా వారి వారసత్వం నుంచి తాను స్ఫూర్తి పొందుతున్నాని చెప్పారు. “వారి స్మరణ మనకు ఎనలేని స్ఫూర్తినిస్తుంది.. తద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించడమేగాక ఈ బాధ్యతను భావితరాలకు అప్పగించాలి” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
విస్తృత భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని స్మరించుకుంటూ- వేల ఏళ్లుగా మన సాంస్కృతిక ప్రదేశాలు దేశానికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అయినప్పటికీ, స్వాతంత్ర్యానంతరం ఒక బాధాకర వైరుధ్యం పొడసూపిందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పోలికలను ప్రస్తావిస్తూ- దండయాత్రల వల్ల వారసత్వ సంపద నాశనమైనపుడు ప్రపంచంలోని ఇతర దేశాలు అనంతర కాలంలో దాని పునరుద్ధరణ దిశగా ఐక్యమయ్యాయని గుర్తుచేశారు. ఈ లక్ష్యం దిశగా స్వతంత్ర భారత తొలినాళ్ల నాయకుల అపార కృషిని ప్రధానమంత్రి ప్రశంసిస్తూనే- వారిలో కొందరికి వ్యతిరేకత ఎదురుకావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. “అయినప్పటికీ, సర్దార్ సాహిబ్ దృఢ సంకల్పంతో శతాబ్దాల నాటి అవమానాన్ని దేశం తుడిచిపెట్టగలిగింది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
సమకాలీన సమస్యలపై ఆందోళన ప్రకటిస్తూ- విచ్ఛిన్న శక్తులు నేటికీ చురుగ్గా ఉన్నాయని ప్రధానమంత్రి అప్రమత్తం చేశారు. జాతీయ ప్రాధాన్యంగల సాంస్కృతిక కార్యాచరణపై వ్యతిరేకతకు సంబంధించి ఇటీవలి పరిణామాలను ఆయన ఉదాహరించారు. ఇలాంటి విచ్ఛిన్నవాద ధోరణులపై జాగరూకత వహించాలని పిలుపునిచ్చారు. జాతీయ పురోగమనంలోని రెండు కోణాలనూ గౌరవించే సమతుల దార్శనికతను ఆయన వివరించారు. ఆ మేరకు “అభివృద్ధి, వారసత్వం రెండింటి సమ్మేళనంతో మనం ముందంజ వేయాలి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఆర్థిక రూపాంతరీకరణలో ఆలయ ధర్మకర్తల మండలి పాత్రను ప్రస్తావిస్తూ- సోమనాథ ఆలయం ఏకకాలంలో ఒక ఆధ్యాత్మిక కూడలిగా.. వందలాది కుటుంబాలకు అనేకానేక రూపాల్లో జీవనోపాధి కల్పించేదిగా, ఆర్థిక చోదక శక్తిగా, సమీకృత ప్రగతికి మార్గదర్శిగా నిలిచిన తీరును ప్రధానమంత్రి శ్లాఘించారు. “ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటార... వారి పర్యటన ఈ ప్రాంత సౌభాగ్యానికి బాటలు వేస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
భారత పుణ్యక్షేత్రాల నెట్‌వర్క్‌పై తన దృక్కోణాన్ని వివరిస్తూ- ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా చేపట్టిన పరిణామాత్మక అభివృద్ధిని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ మేరకు కేదార్‌నాథ్ పునర్నిర్మాణం, కాశీ విశ్వనాథ్ క్షేత్రం సుందరీకరణ, ఉజ్జయినిలోని మహాకాల్ మహాలోక్, చార్‌ధామ్ హైవే ప్రాజెక్ట్, గోవింద్‌ఘాట్ నుంచి హేమకుండ్ సాహిబ్ దాకా రోప్‌వే ప్రాజెక్ట్, కర్తార్‌పూర్ కారిడార్, బౌద్ధ సర్క్యూట్ వంటి వాటిని ఈ సందర్భంగా ఉదాహరించారు. “ఈ పురోగమనం మొత్తం కేవలం 10-12 ఏళ్ల వ్యవధిలో సాకారమైంది. సాంస్కృతిక ప్రదేశాలు ప్రగతికి అవరోధాలు కావని, వాస్తవానికి దేశ ఆధ్యాత్మిక-సామాజిక వ్యవస్థకు అవి కూడళ్లు మాత్రమేగాక ఆర్థిక ప్రగతికి మూలాలని, నిజమైన అభివృద్ధికి ముఖ ద్వారాలని ఈ పరిణామం రుజువు చేస్తోంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఈ కృషికి తాత్త్విక పునాదిని ప్రస్తావిస్తూ- ఉపనిషత్తులలోని ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ (అంతా బ్రహ్మమే) అనే మాటలను ప్రధానమంత్రి ఉటంకించారు. నదులు, అడవులు, పర్వతాలు... యావత్ ప్రకృతినీ ఇది పవిత్ర స్వరూపంగా ఇది పరిగణిస్తుందని ఆయన వివరించారు. “ప్రపంచం ప్రకృతితో సామరస్యం నెరపేందుకు సిద్ధమైన నేపథ్యంలో మనమీ ప్రాచీన జ్ఞానాన్ని గుర్తించి, పంచుకోవాలి. సామరస్యపూర్వక అభివృద్ధికి ఆదర్శంగా మన పవిత్ర క్షేత్రాలను యావత్ ప్రపంచం ముందు నిలుపుదాం” అని శ్రీ మోదీ పిలుపునిచ్చారు.
జాతీయ సామర్థ్యం ఇనుమడించడంలో సాంస్కృతిక వారసత్వం కొనసాగింపు పాత్రను విశదీకరిస్తూ- చరిత్ర, విశ్వాసం, విలువలతో నవతరం పునస్సంధానమైతే దేశ అంతర్గత శక్తి అపారం కాగలదని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. “నేటి భారత్ ఆత్మవిశ్వాసానికి ఎంతగానో దోహదం చేసింది ఈ సాంస్కృతిక కొనసాగింపే”నని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ మేరకు భావితరాలకు పిలుపునిస్తూ- 75 ఏళ్ల కిందటి సోమనాథ ప్రతిష్ఠాపన ఒక పరిణామాత్మక ప్రస్థానానికి నాంది పలికిందని ప్రధానమంత్రి ప్రజలకు గుర్తుచేశారు. “ఈ ప్రస్థానం నేడు మరింత విస్తృతమై మన ముందు నిలిచింది... సంప్రదాయాలకు కట్టుబడుతూనే వాటిని సమున్నత శిఖరాలకు చేర్చాలి. ఇదే సమకాలీన కర్తవ్యం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2260161)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam