జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తెలంగాణలోని వరంగల్‌లో ‘పీఎం మిత్ర పార్కు’ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

పారిశ్రామిక.. జౌళిరంగ వృద్ధి ప్రస్థానంలో ఇదొక చారిత్రక ఘట్టం

నాడు పోస్టు చేయడమైనది: 10 MAY 2026 5:20PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణలోని వరంగల్‌లో ‘పీఎం మిత్ర పార్కు’ను ప్రారంభించారు. దేశ పారిశ్రామిక, జౌళి రంగం వృద్ధి ప్రస్థానంలో ఇదొక చారిత్రక ఘట్టం కాగా, ఇప్పటికే కార్యకలాపాలకు శ్రీకారం చుట్టిన ఈ తొలి పార్కును రూ.1695.54 కోట్లతో నిర్మించారు. “ఫామ్‌ టు ఫైబర్.. టు ఫ్యాక్టరీ.. టు ఫ్యాషన్‌.. టు ఫారిన్‌” పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఫైవ్‌ ఎఫ్’ (5F) దృక్కోణానికి అనుగుణంగా ఇది ఏర్పాటైంది.

 

ప్రతిపాదిత నాగ్‌పూర్-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ఎన్‌హెచ్‌-163జి)కి సమీపాన, వ్యూహాత్మకంగా ఎన్‌హెచ్‌-163కు దగ్గరగా ఈ పార్కు రూపుదిద్దుకుంది. దీంతో ప్రధాన రైల్వే నెట్‌వర్కులు, ఓడరేవులతో దీనికి అద్భుత బహుళ రవాణా అనుసంధానం ఏర్పడుతుంది. తద్వారా అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు నిరంతర రవాణా సదుపాయం కల్పిస్తుంది. విస్తృత అంతర్గత రహదారి నెట్‌వర్క్, ప్రత్యేక విద్యుత్‌ సబ్‌స్టేషన్, నిరంతరాయ నీటి సరఫరా సహా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ప్రపంచ స్థాయి పారిశ్రామికావరణ వ్యవస్థగా ఈ పార్కు రూపొందింది. ఇందులో శూన్య ద్రవ వ్యర్థ సాంకేతికతతో నిర్మించిన సార్వత్రిక ద్రవ వ్యర్థాల శుద్ధి ప్లాంటు (సీఈటీపీ) ఉన్నందువల్ల సుస్థిర ప్రగతికీ ఇది భరోసా ఇస్తుంది.

 

ఈ పార్కుకు వివిధ మార్గాల ద్వారా ₹6,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయన్న అంచనాల నడుమ ఇప్పటికే 62 శాతం భూమి కేటాయింపు పూర్తి కాగా, పనులు వేగంగా పురోగమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ జౌళి రంగ వృద్ధి ప్రస్థానంలో ఈ పార్కు కీలక చోదకశక్తిగా నిలుస్తుంది. మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంతో, జౌళి రంగ విలువ వ్యవస్థ అంతటా భారీ స్థాయిలో అవకాశాలను సృష్టికి ఈ పార్కు సిద్ధమైంది. ఆ మేరకు 24,400కు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయనే అంచనాల నడుమ ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగ సృష్టి సాగింది.

దేశంలో జౌళి రంగ మౌలిక సదుపాయాల కోసం జాతీయావరణ వ్యవస్థకు చేయూత లక్ష్యంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 7 ‘పీఎం మిత్ర పార్కు’ల ఏర్పాటుకు కేంద్ర జౌళి పరిశ్రమ మంత్రిత్వశాఖ 2023 మార్చిలో ఆమోదం తెలిపింది.

 

ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని వరంగల్‌ నగరంలోగల కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (కేఎంటీపీ)ను ఎంపిక చేసి. 2022 మార్చి నెలలో ఆమోదం కోసం ప్రతిపాదన పంపింది. తదనుగుణంగా మౌలిక సదుపాయాల విస్తరణ, పరిశ్రమల స్థాపనకు సౌకర్యాల కల్పనపై హామీతో ‘ప్రధానమంత్రి మిత్ర’ పథకం కింద బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరీలో దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీంతో ‘కేఎంటీపీ’లో ఏర్పాటు చేసే పరిశ్రమల కోసం రూ.200 కోట్ల అభివృద్ధి మూలధన మద్దతు సహా రూ.300 కోట్ల స్పర్థాత్మక ప్రోత్సాహక మద్దతుకు అర్హత సాధించింది.

 

ఈ పార్కు స్వరూపంపై రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)కు కేంద్రం సమ్మతి తెలిపింది. ఇక్కడి ‘సీఈటీపీ’ని జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీగా ఉన్నతీకరించడం, ప్రాసెసింగ్ యూనిట్ల కోసం ఉమ్మడి బాయిలర్ సౌకర్యం, కార్మిక వసతి గృహాల విస్తరణ, 10 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు నిర్మాణం సహా విస్తృత సార్వత్రిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.1695.54 కోట్లు కాగా, పార్కులో పరిశ్రమల స్థాపను ఉద్దేశించిన 548 ఎకరాలకుగాను ‘పీఎం మిత్రా పార్కు’ ప్రకటన తర్వాత 310 ఎకరాలను ఇప్పటిదాకా పరిశ్రమలకు కేటాయించారు.

ఈ పార్కులో ఏర్పాటయ్యే పరిశ్రమలతోపాటు జౌళి రంగానికి (అంతర్జాతీయ జౌళి మెగా పార్కులతో దీటుగా) ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు లభిస్తాయి. అంతేకాకుండా పీఎం మిత్ర పథకం కింద ‘కాంపిటిటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్’ (సీఐఎస్) కూడా అందుతుంది. ఇక్కడి తయారీ యూనిట్లకు ప్రోత్సాహక మద్దతుకు అర్హత లభిస్తుంది. ఇందుకోసం ప్రతి పార్కుకు రూ.300 కోట్ల నిధిని ప్రభుత్వం కేటాయిస్తుంది కాబట్టి, ఈ పార్కులు పెట్టుబడిదారులను మరింతగా ఆకర్షస్తాయి.

 

దేశవ్యాప్తంగా ఏర్పాటయ్యే ‘పీఎం మిత్ర పార్కు’లలోని యూనిట్లన్నిటికీ కేంద్ర ప్రభుత్వ ఇతర పథకాలతో అనుసంధానం ద్వారా వివిధ ప్రయోజనాలు పొందే అర్హత కూడా లభిస్తుంది. ముఖ్యంగా... జౌళి రంగానికి ‘పీఎల్ఐ’ పథకం ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించడంపై జౌళి మంత్రిత్వ శాఖ ఎక్కువగా దృష్టి సారించింది. వరంగల్‌ నగరంలోని పీఎం మిత్ర పార్కులోగల ‘ఎవర్‌టాప్‌ టెక్స్‌టైల్ అండ్ అపారెల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ యూనిట్ కూడా ‘పీఎల్ఐ’ పథకంతో లబ్ధి పొందడం ఇందుకు ఒక ఉదాహరణ. ఈ కంపెనీ రూ.1051 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో, సుమారు రూ.1990 కోట్ల వార్షిక వ్యాపార పరిమాణంతో దాదాపు 12,800 మందికి ఉపాధి కల్పించనుంది.

 

ఆర్థిక లోటు భర్తీ నిధి (వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌-వీజీఎఫ్) రూపంలో కేంద్ర ప్రభుత్వం ‘పీఎం మిత్ర పార్క్’ పథకానికి నిధులు సమకూరుస్తుంది. అంతేకాకుండా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మెరుగుపరుస్తూ, ఆధునిక ఉమ్మడి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, జాతీయ జౌళి రంగ వ్యూహంలో భాగం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన జౌళి పార్కు ఏర్పాటు కార్యక్రమాన్ని ఇవన్నీ గణనీయంగా బలోపేతం చేస్తాయి. పీఎం మిత్ర పార్కుగా మారడం ద్వారా ‘కేఎంటీపీ’ ఇప్పుడు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ ప్రాధాన్యం పొంది, అంతర్జాతీయ స్థాయిని అందుకోగల సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది.

***


(రిలీజ్ ఐడి: 2259544) సందర్శకుల సూచీ సంఖ్య : : 40
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Kannada