రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం గల సాంకేతికతతో కూడిన అధునాతన అగ్ని క్షిపణి గగనతల పరీక్షను విజయవంతంగా నిర్వహించిన భారత్

प्रविष्टि तिथि: 09 MAY 2026 4:48PM by PIB Hyderabad

బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం గల (ఎంఐఆర్‌వీ) సాంకేతికతతో కూడిన అధునాతన అగ్ని క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి మే 8, 2026న ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ క్షిపణిని వివిధ వార్‌హెడ్‌లతో పరీక్షించగా, అవి హిందూ మహాసముద్ర ప్రాంతంలోని పలు భౌగోళిక ప్రాంతాల్లోని వేర్వేరు లక్ష్యాలను ఖచ్చితత్వంతో చేరుకున్నాయి.

 

క్షిపణి ప్రయోగ పర్యవేక్షణకు భూఉపరితలంపైనున్న కేంద్రాలతో పాటు సముద్రంలోని నౌకల ద్వారా టెలిమెట్రీ, ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. క్షిపణి నింగిలోకి ఎగసిన సమయం నుంచి బహుళ లక్ష్యాలను చేరేవరకు ప్రయాణించిన మార్గాన్ని ఈ వ్యవస్థలు పర్యవేక్షించాయి. ఈ ప్రయోగం నిర్దేశించుకున్న లక్ష్యాలను విజయవంతంగా చేరుకున్నట్లు ధ్రువీకరించాయి.

 

ఈ విజయవంతమైన పరీక్షతో ఒకే క్షిపణి వ్యవస్థ ద్వారా వ్యూహాత్మకంగా బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని భారత్ మరోసారి నిరూపించుకుంది. దేశవ్యాప్తంగా వివిధ పరిశ్రమల సహకారంతో డీఆర్‌డీఓ ప్రయోగశాలలో ఈ క్షిపణిని అభివృద్ధి చేశారు. డీఆర్‌డీఓ సీనియర్ శాస్త్రవేత్తలు, భారత సైనికాధికారులు ఈ ప్రయోగాన్ని స్వయంగా వీక్షించారు.

 

విజయవంతమైన ఈ ప్రయోగం పట్ల డీఆర్‌డీఓ, భారత సైన్యం, పరిశ్రమ వర్గాలను రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు. పెరుగుతున్న భద్రతా సవాళ్ల దృష్ట్యా ఈ క్షిపణి ప్రయోగం దేశ రక్షణ సన్నద్ధతకు తిరుగులేని బలాన్ని చేకూరుస్తుందన్నారు.

 

 ***


(रिलीज़ आईडी: 2259424) आगंतुक पटल : 85
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Malayalam