ప్రధాన మంత్రి కార్యాలయం
వియత‌్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, వియత్నాం అధ్యక్షుడితో ఉమ్మడి మీడియా సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
06 MAY 2026 2:30PM by PIB Hyderabad
గౌరవనీయులైన
ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు తో లామ్,
ఇరుదేశాల ప్రతినిధులు,
మీడియా మిత్రులకు,
నమస్కారం!
నమస్కారం!
భారత పర్యటనకు విచ్చేసిన అధ్యక్షుడు తో లామ్‌కు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నా. వియత్నాం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఆయన భారత్‌లో పర్యటించటం.. భారత్-వియత్నాం సంబంధాలకు ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.
బుద్ధగయ నుంచి ఆయన భారత్ పర్యటనను ప్రారంభించటం రెండు దేశాల మధ్య ఉమ్మడి నాగరికత, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన పర్యటన, ఇరుదేశాల మధ్య జరిగిన చర్చల ద్వారా పరస్పర సదుద్దేశాన్ని స్పష్టమైన ఫలితాలుగా మారుస్తాం.
మిత్రులారా,
భారత్-వియత్నాం భాగస్వామ్యంలో వారసత్వం, అభివృద్ధి రెండూ కీలకమే. గతేడాది భారత్ నుంచి బుద్ధుని పవిత్ర అవశేషాలను వియత్నాంకు తీసుకువెళ్లినప్పుడు అక్కడి జనాభాలో సుమారు పదిహేను శాతం మంది అంటే.. పదిహేను మిలియన్లకు పైగా ప్రజలు వాటిని దర్శించుకున్నారు. మన ఉమ్మడి వారసత్వాన్ని పరిరక్షించేందుకు, వియత్నాంలోని మై సన్, న్హాన్ టవర్స్ వద్ద ప్రాచీన చాం నాగరికత దేవాలయాల పునరుద్ధరణను మేం చేపడుతున్నాం. చాం నాగరికతకు సంబంధించిన రాతప్రతులను కూడా డిజిటలైజ్ చేసి, ఈ అమూల్యమైన వారసత్వాన్ని భవిష్యత్ తరాల కోసం భద్రపరుస్తున్నాం.
మిత్రులారా,
దశాబ్దం కిందట నేను వియత్నాంలో పర్యటించినప్పుడు ఆసియాన్ కూటమిలో భారత్‌కు మొదటి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామిగా వియత్నాం మారింది. అప్పటి నుంచి మన మధ్య సంబంధాలు వేగంగా, విస్తృతమైన పురోగతిని సాధించాయి. నాగరికత సంబంధాలతో పాటు వాణిజ్యం, సాంకేతికత, పర్యాటక రంగాల్లోనూ సహకారం మరింత బలపడింది.
ఈ బలమైన సంబంధాల ఆధారంగా నేడు మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్తున్నాం. మరింత ఉన్నత లక్ష్యాల దిశగా మన భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నాం. సంస్కృతి, అనుసంధానం, సామర్థ్య పెంపుతో పాటు భద్రత, స్థిరత్వం, సరఫరా వ్యవస్థల పటిష్ఠత వంటి రంగాల్లోనూ మన సహకారం నూతన శిఖరాలను చేరుకుంటుంది.
మిత్రులారా,
దశాబ్ద కాలంలో భారత్, వియత్నాంల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపై 16 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2030 నాటికి ఈ వాణిజ్యాన్ని 25 బిలియన్ డాలర్లకు పెంచేలా ఇవాళ మేం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఔషధ నియంత్రణ సంస్థల మధ్య ఎంఓయూ వల్ల వియత్నాంలో భారతీయ ఔషధాల లభ్యత పెరుగుతుంది. భారతదేశం నుంచి వియత్నాంకు ఎగుమతయ్యే వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక ఉత్పత్తుల ప్రక్రియ మరింత సులభతరం కానుంది. త్వరలోనే భారత్ నుంచి ద్రాక్ష, దానిమ్మ పండ్లను వియత్నాం ప్రజలు ఆస్వాదించనుండగా, ప్రతిఫలంగా మనం అక్కడి దురియన్, పొమెలో రుచులను చూడనున్నాం.
భారత్-ఆసియాన్ వాణిజ్య ఒప్పందం-"ఏఐటీఐజీఏ"ను ఈ ఏడాది చివరి నాటికి నవీకరించాలని మేం నిర్ణయించాం. ఇది భారత్, అన్ని ఆసియాన్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల్లో నూతనోత్తేజాన్ని నింపుతుంది. కీలక ఖనిజాలు, అరుదైన మూలకాలు, ఇంధన రంగాల్లో కొత్త కార్యక్రమాల ద్వారా ఇరుదేశాల ఆర్థిక భద్రతను, సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం.
మిత్రులారా,
అనుసంధానత, సామర్థ్య పెంపుదల మన భాగస్వామ్యానికి కీలకాధారం. రెండు దేశాల మధ్య విమానయాన అనుసంధానత నిరంతరం విస్తరించటం హర్షించదగిన విషయం.
ఆర్థిక అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర బ్యాంకుల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవాలని మేం నిర్ణయించుకున్నాం. భారతదేశ యూపీఐ వ్యవస్థతో వియత్నాం ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌ను త్వరలోనే అనుసంధానిస్తాం. ఇరుదేశాల్లోని రాష్ట్రాలు, నగరాల స్థాయిలోనూ సహకారాన్ని మరింత విస్తరిస్తాం.
మిత్రులారా,
భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ దార్శనికతలో వియత్నాం కీలక భాగస్వామి. ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల ఇరుదేశాలు ఒకే దృక్పథంతో ఉన్నాయి. రక్షణ, భద్రతా సహకారాన్ని బలోపేతం చేసుకుంటూనే.. చట్టపరమైన పాలన, శాంతి, స్థిరత్వం, సంక్షేమానికి మా వంతు కృషిని కొనసాగిస్తాం. వియత్నాం భాగస్వామ్యంతో ఆసియాన్ దేశాలతో భారత్ అనుబంధం మరింత విస్తరిస్తుంది.
గౌరనీయులారా,
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించి, ఉగ్రవాదంపై పోరాటంలో మాకు అండగా నిలిచిన వియత్నాంకు మేం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, ఆర్థిక సవాళ్లు నెలకొన్నప్పటికీ.. ప్రతిభ, సుపరిపాలన, ఆర్థిక సంస్కరణల ఆధారంగా భారత్, వియత్నాం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండు ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్నాయి. మన విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా వృద్ధిని వేగవంతం చేసేందుకు పరస్పరం సహకరించుకుంటాం.
ఇది బుద్ధుని బోధనల్లోని అంతరార్థాన్ని ప్రతిబింబిస్తుంది. "మీరు ఇతరుల కోసం దీపం వెలిగిస్తే, అది మీ దారిని కూడా ప్రకాశింపజేస్తుంది"
ఈ సూత్రం ఆధారంగా ఒకరి ఆశయాలకు, లక్ష్యాలకు మరొకరు మద్దతిస్తూ అభివృద్ధి చెందిన దేశాలుగా మారాలనే కలను సాకారం చేసుకుందాం.
మనం కలిసి నడుద్దాం, కలిసి ఎదుగుదాం, కలిసి విజయం సాధిద్దాం.
ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి స్వేచ్ఛానువాదం. అసలు ప్రసంగంలో హిందీలో ఇచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 2258724)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam