ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని వడినార్ వద్ద నౌకల మరమ్మత్తు కేంద్రానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 05 MAY 2026 6:50PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన  ఈ రోజు సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ క్యాబినెట్ కమిటీ గుజరాత్‌లోని వడినార్‌లో ఆధునిక సాంకేతికతతో కూడిన నౌకల మరమ్మత్తు కేంద్రం అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ఇది దేశంలో నౌకల మరమ్మత్తు వ్యవస్థను విస్తరించడంలో కీలక ముందడుగుగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టును దీన్ దయాళ్ పోర్టు అథారిటీ (డీపీఏ), కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) రూ.1,570 కోట్ల ఉమ్మడి పెట్టుబడితో సంయుక్తంగా అమలు చేస్తాయి. 

ఈ ప్రాజెక్ట్‌ను బ్రౌన్‌ఫీల్డ్ సదుపాయంగా ప్రణాళిక చేశారు. ఇందులో 650 మీటర్ల జెట్టి, రెండు పెద్ద ఫ్లోటింగ్ డ్రై డాక్స్, వర్క్‌షాప్‌లు, సముద్ర సంబంధిత మౌలిక సదుపాయాలు ఉంటాయి. వడినార్‌కు సహజంగా ఉన్న లోతైన నీటి సౌకర్యం, ప్రధాన నౌకాయాన మార్గాలతో ఉన్న అనుసంధానం, అలాగే ముంద్రా, కాండ్లా వంటి కీలక పోర్టులకు సమీపంగా ఉండటం వల్ల, ముఖ్యంగా పెద్ద వాణిజ్య నౌకలు,  విదేశీ నౌకల మరమ్మతు కార్యకలాపాలకు ఇది అనుకూలమైన ప్రదేశంగా నిలుస్తుంది.

ఈ ప్రాజెక్ట్ నైపుణ్యాభివృద్ధికి అవకాశాలను  సృష్టిస్తుంది.  ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పిస్తుంది. అలాగే, పరిసర ప్రాంతాల్లో సముద్ర అనుబంధ సేవలు,  ఎంఎస్ఎంఈల అభివృద్ధికి దోహదం చేస్తుంది.

ప్రభావం:

వడినార్ నౌకల మరమ్మత్తు కేంద్రం భారత నౌకాయాన మౌలిక సదుపాయాల్లోని ప్రధాన లోపాన్ని నేరుగా సరిచేస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 230 మీటర్ల పైగా పొడవున్న పెద్ద నౌకలను మరమ్మత్తు చేయడానికి తగినంత సామర్థ్యం లేదు. 300 మీటర్ల వరకు పొడవున్న నౌకల మరమ్మత్తులకు ఈ కేంద్రం వీలు కల్పిస్తుంది. దీనివల్ల పెద్ద నౌకలకు చేసే ఖరీదైన మరమ్మత్తులు భారతదేశంలోనే జరుగుతాయి. ఇది విదేశీ నౌకాశ్రయాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా విదేశీ మారక  ద్రవ్యాన్ని ఆదా చేస్తుంది. 

పశ్చిమ తీరంలో నౌకల రాకపోకల సమయం తగ్గడం, మరమ్మత్తు సామర్థ్యం పెరగడం వల్ల భారతీయ ఓడరేవుల పోటీతత్వం మెరుగుపడుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా నౌకల మరమ్మత్తు, రవాణా, అనుబంధ పరిశ్రమల్లో సుమారు 290 ప్రత్యక్ష, 1,100 పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఇది సముద్రయాన పారిశ్రామిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.

ఈ ప్రాజెక్టు ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి తోడ్పడటమే కాకుండా 'మారిటైమ్ ఇండియా విజన్ 2030', 'మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047' కింద భారత సుదీర్ఘకాల నౌకాయాన లక్ష్యాలకు మద్దతునిస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2258174) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Kannada