ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

2026-27 సీజన్‌ కోసం చెరకు రైతులకు క్వింటాల్‌కు రూ.365 'న్యాయమైన, లాభదాయకమైన ధర'కు మంత్రివర్గం ఆమోదం


ఈ నిర్ణయంతో 5 కోట్ల మంది చెరకు రైతులకు... చక్కెర మిల్లులు, అనుబంధ కార్యకలాపాల్లో పనిచేస్తున్న 5 లక్షల మంది కార్మికులకూ ప్రయోజనం

నాడు పోస్టు చేయడమైనది: 05 MAY 2026 6:43PM by PIB Hyderabad

చెరకు రైతుల (గన్నా కిసాన్) ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, 2026-27 చక్కెర సీజన్‌ (అక్టోబర్ - సెప్టెంబర్) కోసం 10.25 శాతం ప్రాథమిక రికవరీ గల చెరకు పంటకు క్వింటాల్‌కు రూ. 365 'న్యాయమైన, లాభదాయకమైన ధర' (ఎఫ్ఆర్‌పీ)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 10.25 శాతం కంటే ఎక్కువ రికవరీలో వచ్చే ప్రతి 0.1 శాతం పెరుగుదలకు క్వింటాల్‌కు రూ. 3.56 చొప్పున అదనపు ప్రోత్సాహకాన్ని (ప్రీమియం) అందించాలని, రికవరీలో వచ్చే ప్రతి 0.1 శాతం తగ్గుదలకు ఎఫ్ఆర్‌పీని క్వింటాల్‌కు రూ. 3.56 చొప్పున తొలగించాలని నిర్ణయించారు.

చెరకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో, చక్కెర మిల్లుల్లో చక్కెర దిగుబడి (రికవరీ) 9.5 శాతం కంటే తక్కువగా ఉన్న సందర్భాల్లో ఎటువంటి కోత విధించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే 2026-27 చక్కెర సీజన్‌లో, అటువంటి రైతులకు క్వింటాల్‌ చెరకు కోసం రూ. 338.3 లభిస్తుంది.

2026-27 చక్కెర సీజన్‌కు సంబంధించి, చెరకు ఉత్పత్తి వ్యయం (ఏ2 + ఎఫ్ఎల్) క్వింటాలుకు రూ. 182 గా ఉంది. 10.25 శాతం రికవరీ రేటు వద్ద క్వింటాలుకు అందిస్తున్న రూ. 365 ఎఫ్ఆర్‌పీ (న్యాయమైన, లాభదాయకమైన ధర)... ఉత్పత్తి వ్యయం కంటే 100.5 శాతం అధికం. 2026-27 చక్కెర సీజన్‌కు సంబంధించిన ఎఫ్ఆర్‌పీ, ప్రస్తుత 2025-26 చక్కెర సీజన్ ఎఫ్ఆర్‌పీ కంటే 2.81 శాతం అధికం.

2026-27 చక్కెర సీజన్‌లో (అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా), రైతుల నుంచి చెరకును కొనుగోలు చేయడం కోసం చక్కెర మిల్లులు తాజాగా ఆమోదించిన ఎఫ్ఆర్‌పీ (న్యాయమైన మరియు లాభదాయకమైన ధర) చెల్లించాల్సి ఉంటుంది. చక్కెర రంగం ఒక ముఖ్యమైన వ్యవసాయాధారిత రంగం. సుమారు 5 కోట్ల మంది చెరకు రైతులు సహా, వారిపై ఆధారపడిన వారి జీవనోపాధిని, చక్కెర మిల్లుల్లో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్న సుమారు 5 లక్షల మంది కార్మికుల జీవనోపాధిని ఇది ప్రభావితం చేస్తుంది. వ్యవసాయ కూలీలు, రవాణా సహా వివిధ అనుబంధ రంగాల కార్యకలాపాల్లో ఉపాధి పొందుతున్న వారిపై ఈ రంగం ప్రభావం చూపుతుంది.

నేపథ్యం:

వ్యవసాయ సంబంధిత వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) సిఫార్సుల ఆధారంగా... రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంబంధిత వర్గాలతో సంప్రదించిన అనంతరం ఈ ఎఫ్ఆర్‌పీని నిర్ణయించారు. 

గత చక్కెర సీజన్ 2024-25లో చెల్లించాల్సిన మొత్తం చెరకు బకాయిలు రూ. 1,02,687 కోట్లుగా ఉండగా... 20.04.2026 నాటికి రైతులకు సుమారు రూ. 1,02,209 కోట్ల బకాయిలను చెల్లించారు. సుమారు 99.5 శాతం వరకు చెరకు బకాయిల చెల్లింపు పూర్తయింది. ప్రస్తుత చక్కెర సీజన్ 2025-26లో చెల్లించాల్సిన మొత్తం చెరకు బకాయిలు రూ. 1,12,740 కోట్లకు గానూ, 20.04.2026 నాటికి రైతులకు సుమారు రూ. 99,961 కోట్ల బకాయిల చెల్లింపు పూర్తి చేశారు. సుమారు 88.6 శాతం వరకు చెరకు బకాయిల చెల్లింపు పూర్తయింది.

***


(రిలీజ్ ఐడి: 2258172) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , Kannada , Assamese , English , Urdu , हिन्दी , Gujarati