సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సృజనాత్మక రంగానికి ఉద్దేశించిన ఐఐసీటీ జాతీయ ఏఐ నైపుణ్య శిక్షణ కార్యక్రమానికి నమోదు ప్రారంభం


సృజనాత్మకత కలిగిన ప్రతిభావంతుల కోసం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఐఐసీటీ అందిస్తున్న 15,000 ఏఐ నైపుణ్య స్కాలర్‌షిప్‌లు

నాడు పోస్టు చేయడమైనది: 04 MAY 2026 4:53PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, భారతీయ సృజనాత్మక సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) భాగస్వామ్యంతో సృజనాత్మక రంగంలో జాతీయ స్థాయి కృత్రిమ మేధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. గూగుల్, యూట్యూబ్ సహకారంతో రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా మీడియా, వినోదం, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కథా రచన రంగాల్లోని 15,000 మంది ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అభ్యర్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కృత్రిమ మేధ నైపుణ్యాలను నేర్పిస్తారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కోసం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సృజనాత్మక రంగాల్లో తమ భవిష్యత్తును మెరుగుపరిచే ఏఐ నైపుణ్యాలను పొందాలని మంత్రిత్వ శాఖ కోరింది. 

ఈ కార్యక్రమాన్ని ప్రాథమిక అవగాహన, ఆచరణాత్మక నైపుణ్యాల కోసం రెండు దశల్లో రూపొందించారు:

 

మొదటి దశ: ఫౌండేషన్ (ఆన్‌లైన్)

 

పెద్ద ఎత్తున ప్రాథమిక కృత్రిమ మేధ అక్షరాస్యతను పెంపొందించడం కోసం ఈ దశను రూపొందించారు. ఇందులో భాగంగా ఎంపికైన 15,000 మందికి గూగుల్ కెరీర్ సర్టిఫికేట్లు, గూగుల్ క్లౌడ్ జెన్ ఏఐ లెర్నింగ్ పాత్‌ల కోసం స్కాలర్‌షిప్‌లు ఇస్తారు. గూగుల్ రూపొందించిన ఈ వృత్తిపరమైన శిక్షణ ద్వారా అగ్రశ్రేణి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను పొందే వీలుంటుంది. దీని ద్వారా కృత్రిమ మేధ ప్రాథమిక అంశాలు, బాధ్యతాయుతమైన విధానాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఎంపికైన అభ్యర్థులు సుమారు 33 గంటల పాటు ఆన్‌లైన్ శిక్షణ పొందుతారు. ఇందులో జెనరేటివ్ కృత్రిమ మేధ ప్రాథమిక అంశాలు, ప్రాంప్టింగ్ మెళకువలు, బాధ్యతాయుతమైన ఏఐ విధానాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారు. ఈ పాఠ్య ప్రణాళికలో భాగంగా గూగుల్ కెరీర్ సర్టిఫికేట్లు, గూగుల్ క్లౌడ్ జెనరేటివ్ ఏఐ లెర్నింగ్ పాత్‌లను అభ్యర్థులు నేర్చుకోవచ్చు. దీనివల్ల వాస్తవ పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన కీలక జ్ఞానాన్ని, నైపుణ్యాలను అభ్యాసకులు సొంతం చేసుకుంటారు.

 

రెండో దశ: ప్రత్యేకత (హైబ్రిడ్‌)

 

తొలి దశను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు, ఆచరణాత్మక నైపుణ్యాలపై దృష్టి సారించే అధునాతన శిక్షణకు ఎంపికవుతారు. హైబ్రిడ్ విధానంలో సాగే ఈ దశలో కథా రచన, సృజనాత్మక నిర్మాణం, అధునాతన కృత్రిమ మేధ పరికరాల వినియోగంపై ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం ఉంటుంది. ఐఐసీటీ, యూట్యూబ్ సంయుక్తంగా రూపొందించిన ఈ పాఠ్య ప్రణాళికలో, కంటెంట్ విస్తృతిని, వీక్షకుల భాగస్వామ్యాన్ని పెంచే మెళకువలను కూడా నేర్పిస్తారు. గూగుల్ డెవలపర్స్ కోడ్‌ల్యాబ్స్ వంటి మార్గదర్శక మాడ్యూళ్ల ద్వారా అభ్యర్థులు వివిధ రకాల సాధనాలు, వేదికలపై పట్టు సాధిస్తారు.

 

ఈ కార్యక్రమానికి ‘ఏఐ స్కిల్స్ హౌస్’ వేదిక కూడా మద్దతునిస్తుంది. ఇది జెనరేటివ్ కృత్రిమ మేధ అప్లికేషన్లు, వర్క్‌ఫ్లో ఆటోమేషన్, నిర్ణయం తీసుకునే సాధనాలతో సహా సులభంగా అందుబాటులో ఉండే క్రమబద్ధమైన అభ్యాస మార్గాలను అందిస్తుంది. సాంకేతిక నైపుణ్యాన్ని సృజనాత్మకతతో జోడించడం ద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా, డిజిటల్ రంగంలో ఆవిష్కరణలు చేయగల నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.

 

దేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ప్రధాన స్రవంతి కంటెంట్ సృష్టి, నిర్మాణ ప్రక్రియల్లో కృత్రిమ మేధను అంతర్భాగం చేసే దిశగా ఈ కార్యక్రమం ఒక కీలక ముందడుగు. మీడియా, వినోదం, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కథా రచన రంగాల్లో అపార నైపుణ్యం కలిగిన వారిని గుర్తించి, వారిని కృత్రిమ మేధ రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందించారు.

 

ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతలను స్వీకరించిన ఐఐసీటీ దేశవ్యాప్తంగా పాఠ్యప్రణాళిక రూపకల్పన, అభ్యర్థుల ఎంపిక, శిక్షణా కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షిస్తోంది. గూగుల్‌, యూట్యూబ్ సహకారంతో రూపొందించిన ఈ పాఠ్యప్రణాళికలో అధునాతన ఏఐ పరికరాలు, సృజనాత్మక కార్యప్రవాహాలు, వేదిక స్థాయి మెళకువలను పొందుపరిచారు. తద్వారా అభ్యర్థులు ప్రారంభం నుంచి ఉత్పత్తికి సిద్ధంగా ఉండే, పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా పనిచేసే నైపుణ్యాన్ని సాధిస్తారు.

 

ఐఐసీటీ సీఈఓ డాక్టర్ విశ్వాస్ దేవోస్కర్ మాట్లాడుతూ.. కంటెంట్ సృష్టి, నిర్మాణం, పంపిణీ వంటి రంగాల్లో కృత్రిమ మేధను వాస్తవ పరిస్థితుల్లో ఉపయోగించేలా సృజనాత్మక నిపుణులను సిద్ధం చేయడం ద్వారా జాతీయ అవసరాలను తీర్చేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు.

 

కార్యక్రమం గురించి  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

ఏఐ స్కిల్స్ హౌస్ కార్యక్రమం కోసం దరఖాస్తు చేసుకోవడానికి కింద ఉన్న క్యూఆర్ కోడ్ మీద క్లిక్‌ చేయండి.

***


(రిలీజ్ ఐడి: 2257935) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Malayalam