సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

57వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవ సంచాలకునిగా శ్రీ అశుతోష్ గోవారికర్ నియామకం

నాడు పోస్టు చేయడమైనది: 01 MAY 2026 1:05PM by PIB Hyderabad

గోవాలో జరగనున్న 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) సంచాలకునిగా ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ అశుతోష్ గోవారికర్‌ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నియమించింది.

శ్రీ గోవారికర్ భారతీయ సినిమాకు విశిష్టమైన సేవలందించిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత. ఐఎఫ్ఎఫ్ఐతో ఆయనకు దశాబ్దాల అనుబంధం ఉంది. ఇది చలనచిత్ర కళల పరిణామం, అంతర్జాతీయ సినిమా సంస్కృతితో ఆయనకున్న ప్రగాఢ అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ నియామకం పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, శ్రీ గోవారికర్ ఇలా అన్నారు... “గోవాలో జరిగే ప్రతిష్టాత్మక 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవానికి ఫెస్టివల్ డైరెక్టర్‌గా సేవ చేయడం నాకు అపారమైన గౌరవాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఉత్సవ పరిణామక్రమాన్ని చూస్తుండడం నా అదృష్టం. 1984లో తొలిసారి ఈ ఉత్సవాలకు హాజరైనప్పటి నుంచి, 2024లో అంతర్జాతీయ సినిమాకు జ్యూరీ అధ్యక్షుడిగా పనిచేసే వరకు దీనితో నా అనుబంధం కొనసాగుతూ వస్తోంది”.

“1952 నుంచి దశాబ్దాలుగా ఎంతోమంది ఉత్సవ కమిటీ సభ్యులు రూపొందించిన, అభివృద్ధి చేసిన, విస్తరించిన ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఈ నూతన బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతోనూ, గోవా ప్రభుత్వంతోనూ కలిసి సమన్వయంతో పనిచేయడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ఆయన జోడించారు.

1952లో స్థాపించిన అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం... ఆసియాలోని ప్రముఖ చలనచిత్రోత్సవాల్లో ఒకటిగా నిలుస్తూ, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తూ, ప్రపంచ సినిమాలోని ప్రతిభను ప్రదర్శించే ప్రధాన వేదికగా పనిచేస్తోంది.

ఐఎఫ్ఎఫ్ఐ గురించి

1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తుంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్... భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... గోవా రాష్ట్ర ప్రభుత్వం... గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ప్రపంచ సినిమాకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ అలనాటి అపురూప చిత్రాలు, సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రాలు, లెజెండరీ మాస్ట్రోలు, నిర్భయంగా రూపొందించిన తొలి సినిమాలు ఒకే చోట కలిసి ఈ వేడుకలకు హాజరైన ప్రేక్షకులను అలరిస్తాయి. 

ఐఎఫ్ఎఫ్ఐకి దాని విభిన్న కళల సమ్మేళనమే గొప్ప శక్తినిస్తుంది. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, ఘన నివాళులతోపాటు... ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలకు అపార అవకాశాలను అందించే శక్తిమంతమైన వేవ్స్ ఫిల్మ్ బజార్ వంటి కార్యక్రమాలు ఐఎఫ్ఎఫ్ఐని మరింత అద్భుత వేదికగా మారుస్తున్నాయి. నవంబర్ 2026లో అందమైన గోవా తీరప్రాంతంలో ప్రదర్శితమయ్యే 57వ ఎడిషన్.... భాషలు, రూపాలు, సాంకేతికతలు, సరికొత్త కథన సంప్రదాయాలకు సంబంధించిన వైవిధ్యభరితమైన విస్తృత శ్రేణిని ఒకచోట చేర్చనుంది. 

 

(రిలీజ్ ఐడి: 2257280) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , Kannada , Malayalam , Bengali , Odia , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati