రక్షణ మంత్రిత్వ శాఖ
ఉగ్రవాద దాడుల విషయంలో దౌత్య ప్రకటనలకే పరిమితమయ్యే ధోరణి పోయింది...
పీఎం మోదీ ప్రభుత్వ అంకితభావానికి గుర్తు… ఆపరేషన్ సిందూర్: రక్షణ మంత్రి
‘‘త్రివిధ దళాల సైనిక పరాక్రమాన్ని ప్రదర్శించిన ఆపరేషన్ సిందూర్: సొంత విధానానికి అనుగుణంగానే ఈ ఆపరేషన్ నిర్వహించాం, నిలిపివేశాం’’
‘‘వికృత ఆలోచనా ధోరణి నుంచే ఉగ్రవాదం పుడుతుంది: మతపరమైన రంగును పులమడం లేదా హింసాత్మక భావజాలంతో ముడిపెట్టడం ద్వారా దీన్ని సమర్థించే ప్రయత్నాలు జరుగుతాయి’’
‘‘ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే.. కార్యాచరణ, సైద్ధాంతిక, రాజకీయ కోణాల్లోనూ పోరాడాలి’’
‘‘ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగంలో భారత్ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంటే, పాకిస్థాన్ ఐటీ (ఇంటర్నేషనల్ టెర్రరిజం)కు పేరు గాంచింది’’
‘‘ఏఐ అత్యుత్తమ వినియోగానికి సుదర్శన్ వైమానిక రక్షణ వ్యవస్థ ప్రధాన ఉదాహరణగా నిలుస్తుంది: ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భారతదేశం మరింత సురక్షితంగా, బలంగా మారుతుంది’’
నాడు పోస్టు చేయడమైనది:
30 APR 2026 12:35PM by PIB Hyderabad
‘‘ఉగ్రవాదులు దాడి చేస్తే దౌత్యపరమైన ప్రకటనలు జారీ చేసే పాత ఆలోచనా ధోరణితో భారతదేశం లేదనే స్పష్టమైన సందేశాన్ని ఆపరేషన్ సిందూర్ ప్రపంచానికి తెలియజేసింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆలోచనలు, మాటలకు మాత్రమే పరిమితం కాకుండా నిర్ణయాత్మక చర్యల ద్వారా తన అచంచలమైన నిబద్ధతను ప్రదర్శించింది’’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 2026 ఏప్రిల్ 30న న్యూఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాద చర్యలను సహించబోమనే ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టం చేశారు. బెదిరింపులకు అడ్డుకొనేందుకు ప్రభుత్వం కనబరిచిన దృఢ వైఖరిని సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ ప్రదర్శిస్తాయన్నారు.
‘‘వికృతమైన ఆలోచనలు, మనస్తత్వం నుంచి ఉగ్రవాదం పుడుతుంది. ఇది మానవత్వంపై మాయని మచ్చ. తీవ్రవాదంపై పోరాటం జాతీయ భద్రతకు సంబంధించినది మాత్రమే కాదు. ప్రాథమికంగా మానవత్వపు మూల విలువలను కాపాడే యుద్ధం. మానవ విలువలకు పూర్తి విరుద్ధంగా నిలిచే అనాగరిక భావజాలానికి వ్యతిరేకంగా చేసే పోరాటం. ఈ భారతీయ దృక్పథాన్ని దేశవిదేశాల్లోనూ స్పష్టం చేశాం’’ అని శ్రీ రాజనాథ్ సింగ్ అన్నారు.
ఉగ్రవాదం మనుగడలో ఉన్నంత కాలం.. అది సామాజిక శాంతికి, అభివృద్ధికి, సంక్షేమానికి సవాలు విసురుతూనే ఉంటుందని రక్షణ మంత్రి అన్నారు. ‘‘ఉగ్రవాదానికి మతం రంగు పులమడం లేదా నక్సలిజం లాంటి హింసాత్మక భావజాలంతో ముడిపెట్టడం ద్వారా సమర్థించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. ఓ రకంగా, ఉగ్రవాదులు తమ లక్ష్యం దిశగా నెమ్మదిగా ముందుకు సాగడానికి ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. దేశ వ్యతిరేకమైన ఉగ్రవాదానికి కార్యాచరణ, సైద్ధాంతిక, రాజకీయం వంటి బహుముఖ కోణాలున్నాయి. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే.. ఈ మార్గాల్లోనూ మనం దాన్ని ఎదుర్కోవాలి’’ అని అన్నారు.
ఉగ్రవాదానికి పాకిస్థాన్ నిరంతరాయంగా అందిస్తున్న మద్దతు గురించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ‘‘భారత్, పాకిస్థాన్ రెండింటికీ ఒకే సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో అంతర్జాతీయ గుర్తింపును భారత్ సొంతం చేసుకుంది. పాకిస్థాన్‌ను మాత్రం ఐటీ అంటే ఇంటర్నేషనల్ టెర్రరిజంకు కేంద్రంగా పరిగణిస్తున్నారు.
భారత రక్షణ బలగాల సమైక్యతకు, సమన్వయానికి గొప్ప ఉదాహరణగా ఆపరేషన్ సిందూర్‌ను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వర్ణించారు. భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం ఒకే ప్రణాళికతో ఐక్యంగా పనిచేయడం ద్వారా.. భారతదేశ సైనిక శక్తి ఇకపై విడివిడిగా పని చేయబోదనీ, దానికి బదులుగా ఉమ్మడి, సమీకృత, ప్రపంచ శక్తిగా ఆవిర్భవించిందని తెలియజేశారు.
తన సొంత విధానం ప్రకారమే నచ్చిన సమయంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ చేపట్టిందని, ఆ విధానానికి అనుగుణంగానే దానిని నిలిపివేసిందని రక్షణ మంత్రి తెలియజేశారు. ‘‘మనపై దాడి చేసిన వారిని మాత్రమే ఈ ఆపరేషన్ సమయంలో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకున్నాం. మన సామర్థ్యం తగ్గిపోవడం వల్ల లేదా క్షీణించడం వల్ల ఈ ఆపరేషన్‌ను నిలిపి వేయలేదు. పూర్తిగా మన స్వీయ నిర్ణయాధికారంతోనే నిలిపివేశాం. ఈ యుద్ధాన్ని కొనసాగించేందుకు మనం సర్వసన్నద్ధులమై ఉన్నాం. ఆకస్మిక సంక్షోభ సమయాల్లో మన సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడానికి అవసరమైన సామర్థ్యం, సహజసిద్ధమైన బలం మన దగ్గర ఉన్నాయి’’ అని వెల్లడించారు.
భారత సైనిక-పారిశ్రామిక రంగం సాధారణ సమయాల్లోనే కాకుండా.. యుద్ధ సమయాల్లోనూ వేగవంతమైన సరఫరా, రవాణా అవసరాలను కూడా తీర్చేందుకు సైతం సర్వసన్నద్ధంగా ఉంటుందని నిరూపించుకుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆ సమయంలో అణుదాడుల బుకాయింపులు లేదా బెదిరింపులకు ఏమాత్రం వెరవకుండా తన లక్ష్యాలను భారత్ పూర్తి చేసిందని స్పష్టం చేశారు. ‘‘ఇది ‘కొత్త ప్రపంచ క్రమం’. నూతన ప్రపంచ శకంలో ‘నవ భారతం’ ఇది. ఉగ్రవాదానికి, దానికి మద్దతు తెలిపేవారికి మధ్య ఏమాత్రం వ్యత్యాసాన్ని చూపని భారతదేశమిది. మారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో పరివర్తనను సాధ్యం చేసిన ఎలాంటి సందిగ్ధం లేని ప్రధానమంత్రి విధానమిది’’ అని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ భారత సైనిక శక్తికి నిలువుటద్దమని రక్షణ మంత్రి అభివర్ణించారు. కేవలం 72 గంటల్లోనే ఈ ఆపరేషన్‌ను ముగించినప్పటికీ.. దాని వెనుక విస్తృతమైన, సుదీర్ఘమైన సన్నద్ధత ఉందని తెలిపారు. వనరులను వేగంగా సమీకరించగలిగే శక్తి, దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాల విశ్వసనీయత.. అన్నీ ఇప్పుడు భారతీయ సైనిక యుద్ధ వ్యూహంలో ముఖ్యమైన భాగాలుగా మారాయని చెప్పారు.
ఆపరేషన్ సింధూర్ ఫలితంగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు, రక్షణ ఉత్పత్తుల విశ్వసనీయత పట్ల ప్రపంచ దృష్టిలో మార్పు వచ్చిందని, సానుకూల ధోరణి కనిపిస్తోందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘‘భారత్ నుంచి ఆయుధాలు, రక్షణ సామగ్రిని కొనుగోలు చేసేందుకు అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. గణాంకాలన్నీ అదే చెబుతున్నాయి. ఆర్థిక సంవత్సరం 2025-26లో రక్షణ ఎగుమతులు రూ. 38,424 కోట్లకు చేరుకున్నాయి. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 62.66 శాతం వృద్ధి కనిపించింది. ఈ ప్రమాణాలను అధిగమించేలా మా ప్రయత్నాలను ముందుకు తీసుకెళుతున్నాం’’ అని తెలిపారు.
ఇటీవలే జర్మనీలో తాను చేపట్టిన పర్యటన గురించి ప్రస్తావిస్తూ.. ఐరోపా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలు భారత ప్రైవేటు రంగంలోని రక్షణ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలతో కలసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయనీ, ఇది భారత్‌పై పెరుగుతున్న విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. సైనిక పరాక్రమంతో మాత్రమే కాకుండా.. దాడులను నిరోధించే సైనిక సామర్థ్యంతో కూడా ప్రపంచంలో భారత్ స్థానం బలోపేతమవుతోందని తెలిపారు.
ఇటీవలి కాలంలో సైనిక విధానంలో వస్తున్న వేగవంతమైన మార్పుల గురించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. సైబర్ డొమైన్, స్పేస్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రధానాంశాలుగా మారాయన్నారు. ఈ మార్పులకు కేంద్ర బిందువుగా కృత్రిమ మేధ (ఏఐ) ఉందని చెప్పారు. ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ లాంటి అత్యాధునిక క్షిపణుల నుంచి వివిధ పర్యవేక్షణా వ్యవస్థల వరకు ఏఐను సమర్థంగా వినియోగించాం. ఇది మన కచ్చితత్వాన్ని, దాడుల సామర్థ్యాన్ని పెంచింది. ప్రధాన కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తరచూ ప్రజలకు చేరుతున్నప్పటికీ, ముప్పు ఎదురు కాకముందే దాన్ని నిర్వీర్యం చేయడంలో అనేక చిన్నపాటి కార్యకలాపాలు, విధానాలు చురుగ్గా పని చేశాయి. ఇలాంటి సందర్భాల్లో ఏఐను విస్తృతంగా వినియోగించాం’’ అని రక్షణ మంత్రి వివరించారు.
ఏఐ వినియోగంలో ఆచరణాత్మకత గురించి రక్షణ మంత్రి వివరించారు. ఉగ్రవాదులను గురించడంలోనూ, వారి విషయంలో నిర్ణయాత్మకంగా స్పందించడంలోనూ కీలకంగా వ్యవహరించిందన్నారు. ‘‘ఏఐ అంటే ‘ఆగ్మెంటెడ్ ఇన్ఫాంట్రీ’ అని కూడా. ఇది మన బలగాల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతోంది. ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా.. మన సైన్యాన్ని సాంకేతిక ఆధారితంగా, సమీకృత పోరాట యంత్రంగా మార్చే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నాం. దీనికోసం ‘రుద్ర’ బ్రిగేడ్లు, ‘భైరవ్’ బెటాలియన్లు, ‘శక్తిబన్’ ఆర్టిలరీ రెజిమెంట్లు అనే చురుకైన, స్వయం సమృద్ధమైన పోరాట విభాగాలను ఏర్పాటు చేశాం. అలాగే ‘దివ్యాస్త్ర’ బ్యాటరీలు ఆధునికమైన హైబ్రిడ్ ముప్పులకు తక్షణమే స్పందించే నిర్ణయాత్మక సామర్థ్యాన్ని పెంపొందించాయి.
పని సంస్కృతిని మార్చడానికి, సైనికుల సంక్షేమాన్ని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే శక్తిమంతమైన సాధనంగా ఏఐ ఆవిర్భవించిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రక్షణ రంగంలో పింఛనుదారులు, మాజీ ఉద్యోగుల కోసం స్పర్శ్ పోర్టల్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు. ఏఐ ఆధారిత ఛాట్‌బాట్లతో పింఛను సంబధిత ప్రక్రియలు సులభతరమయ్యాయని వెల్లడించారు. ఫిర్యాదుల పరిష్కారం నుంచి మెడికల్ రికార్డుల పర్యవేక్షణ వరకు అన్నింటి నిర్వహణ ఏఐ ఆధారంగా జరుగుతోందన్నారు. అదే విధంగా విద్య, ఆరోగ్య సేవల విషయంలో సైనికుల కుటుంబాలు వెనకబడిపోకుండా చూసేందుకు ఏఐ ఆధారిత సాధనాలను ఉపయోగిస్తున్నామని తెలియజేశారు.
నూతన ప్రపంచ క్రమంలో భారత వ్యూహాత్మక సన్నద్ధతలో విడదీయలేని భాగంగా ఏఐ మారిందని రక్షణ మంత్రి అన్నారు. ప్రభుత్వం దీనిని సైనికపరమైన కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేయకుండా దేశంలో నైపుణ్యాభివృధ్ధి, పరిశోధనల కోసం సమగ్ర వ్యూహాన్ని రూపొందించిందని తెలియజేశారు. ‘‘ఇండియా ఏఐ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా కంప్యూటింగ్ మౌలిక వసతులను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మేం చురుగ్గా పనిచేస్తున్నాం. తద్వారా చిన్న పట్టణాలకు చెందిన యువత సైతం ఏఐకు తమ వంతు సహకారం అందించేలా కృషి చేస్తున్నాం. 10,000 జీపీయూ కంటే ఎక్కువ సామర్థ్యం, ఫ్యూచర్ స్కిల్స్ లాంటి కార్యక్రమాలు ఈ సాంకేతిక విప్లవ యుగంలో భారత్ వెనకబడిపోకూడదనే మా సంకల్పానికి నిదర్శనం. ఇటీవలే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు – 2026ను విజయవంతంగా నిర్వహించాం. ఈ కార్యక్రమంలో 20 దేశాల అధినేతలతో పాటుగా, 89 దేశాలు, సంస్థలు పాల్గొన్నాయి. వీరంతా మన ఏఐ మ్యానిఫెస్టోను ఆమోదించారు. అంతర్జాతీయ ఏఐ ప్రమాణాలను రూపొందించడంలో భారత్ ప్రధాన పాత్రను పోషిస్తోంది. కొన్ని దేశాలకు మాత్రమే ఏఐ ప్రయోజనాలు పరిమితం కాకుండా.. గ్లోబల్ సౌత్‌కి కూడా అందేలా ‘ఏఐ ఫర్ ఆల్’ అనే మంత్రంతో ముందుకు సాగుతున్నాం’’ అని ఆయన వివరించారు.
డీప్‌ఫేక్‌లు, సైబర్ యుద్ధాలు, స్వతంత్ర ఆయుధ వ్యవస్థలు కొత్తవైన, ప్రమాదకరమైన సవాళ్లు విసురుతున్నప్పటికీ ఏఐను అదే దృష్టితో చూడకూడదని శ్రీ రాజ్‌నాధ్ సింగ్ అన్నారు. ‘‘రాబోయే రోజుల్లో ఈ సవాళ్లు మరింత తీవ్రం కానున్నాయి. కాబట్టి వాటిని మన దృష్టిలో ఉంచుకోవాలి. మన రక్షణ కోసం మనం రూపొందించుకున్న ఏఐపై నియంత్రణ కోల్పోతే.. అది ప్రమాదకరమైన ఆయుధంగా మారుతుంది. కాబట్టి మనల్ని నాశనం చేసేది కాకుండా.. నడిపించే శక్తిగా మార్చేందుకే మనం ప్రయత్నించాలి. సంఘటిత ప్రయత్నాలు, అంతర్జాతీయ సహకారం ద్వారా ఏఐ శక్తిని మనం సమర్థంగా వినియోగించుకోగలం’’ అని చెప్పారు.
యుద్ధ క్షేత్రంలో నిఘా, స్వతంత్ర వ్యవస్థల నుంచి మెరుగైన రవాణా, కమాండ్ నిర్ణయాలకు మద్దతు అందించే వరకు వివిధ విభాగాల్లో ఏఐ పోషించే పాత్ర గురించి క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నారని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ‘‘అత్యుత్తమ రీతిలో ఏఐ వినియోగానికి సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. కొత్తగా ఎదురవుతున్న ఏఐ ఆధారిత సవాళ్లకు ప్రతిస్పందించే తమ సామర్థ్యాలను పెంపొందించుకొనేందుకు మన రక్షణ దళాలు ఏఐ, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా సైన్స్‌లను ఉపయోగించి ప్రణాళికను రూపొందించాయి. ఈ వ్యూహం భవిష్యత్తులో వారిని మరింత చురుగ్గా స్పందించేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి ఆధునికమైన, నూతన సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా మన దేశం మరింత సురక్షితంగా, బలంగా, మరింత సుసంపన్నంగా మారుతుంది’’ అని వివరించారు.
రక్షణ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, రక్షణ పరిశోధన అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్, సమీకృత రక్షణ సిబ్బంది అధిపతి ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2257187)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12