ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సిక్కిం రాష్ట్ర 50వ ఆవిర్భావ వేడుకల ముగింపు సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 28 APR 2026 1:51PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

   సిక్కిం గవర్నర్ శ్రీ ఓం మాథుర్, ప్రజలెన్నుకున్న, ఉత్సాహవంతుడైన యువకుడు, నా ప్రియ మిత్రుడైన ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, పార్లమెంటులో నా సహసభ్యులు శ్రీ దోర్జీ షెరింగ్ లెప్చా, డాక్టర్‌ ఇంద్ర హాంగ్ సుబ్బా, శ్రీ దిల్లీ రామ్ థాపా, రాష్ట్రంలోని నా ప్రియ సోదరీసోదరులారా!

సిక్కిం ఆవిర్భావ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ‘తాషి దిలె!’ శుభాకాంక్షలు.. అభినందనలు. అందరికీ నమస్తే... ఖమ్రి మో! (శుభోదయం)

మిత్రులారా!

నేను నిన్న మధ్యాహ్నం గాంగ్‌టక్ చేరుకున్నాను... ఇక్కడికొచ్చే ముందు బెంగాల్ శాసనసభ ఎన్నికల వల్ల కాస్త హడావుడిలో ఉన్నాను. దాన్నుంచి బయటపడి, ఇక్కడికి చేరుకోగానే ఓ కొత్త అనుభూతి, నవ్యానందంలో మునిగిపోయాను. అంతటా పరచుకున్న పండుగ వాతావరణం, ఎటుచూసినా కోలాహలం చూశాక హృదయం సంతోషంతో ఉప్పొంగింది. రాత్రి వర్షం.. తెల్లవారేసరికి ఉషోదయ శీతల పవనాలు, ఈ నులివెచ్చని సూర్యరశ్మి- నిజంగా... సిక్కిం సప్తవర్ణ శోభితం, నాకెంతో ప్రత్యేకం.

మిత్రులారా!

సిక్కిం.. తూర్పు భారత స్వర్గసీమ! ఆర్కిడ్ల విరి తోట... సాటిలేని ఈ అందం.. పచ్చదనపు ప్రశాంతత, ఆధ్యాత్మిక అనుభూతి- అన్నీ కలగలసిన ఈ అనుభవం ఎంతో అదృష్టం చేసుకుంటేనే లభిస్తాయి. ఇవాళ నేనిక్కడి ఆర్కిడ్ల శోభను తిలకించేందుకు వెళ్లాను... నాకున్న సమయం చాలా తక్కువే అయినప్పటికీ, అందులో అధికశాతం పుష్పవైభవ సందర్శనలోనే గడిపాను. దేశవ్యాప్తంగాగల పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులందరికీ ఈ సందర్భంగా నాదొక మనవి: మీరు జీవితంలో ఒక్కసారైనా  సిక్కిం ఆర్కిడ్ల సొబగును తిలకించి పులకించనిదే మీరెక్కడా... ఏమీ చూడనట్లే! అయితే, ఈ ఏడాది పర్యాటకులు సిక్కిం పర్యాటక రంగంలో అన్ని గణాంకాలనూ తిరగరాసేలా చేస్తారని నేను నమ్మకంగా చెప్పగలను. ఆర్కిడ్ పుష్పజాతులలో ప్రకృతిలోని వేనవేల వర్ణాలను, వాటి సందర్శన మాత్రాన లభించే ఆనందోద్వేగాన్ని వర్ణించేందుకు మాటలు చాలడంలేదు... నా మనసంతా వాటి సోయగంతో నిండిపోయింది.

మిత్రులారా!

సిక్కిం అర్ధ శతాబ్దపు ప్రస్థానం (స్వర్ణోత్సవం) నేపథ్యంలో మొదలైన వేడుకలు ఈ రోజున ముగుస్తున్నాయి. ఇదొక చారిత్రక సందర్భం.. అందునా ఇంతటి దివ్య-భవ్య పరిసరాల నడుమ ఈ వైభవం స్థాయి ఎన్నో రెట్లు ఇనుమడిస్తుంది. ఈ పాల్జోర్ స్టేడియం నేడు అద్భుత దివ్యత్వంతో నిండిపోయింది. ఇక్కడ నిర్వహించిన అద్భుత సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల ప్రదర్శనలు, ప్రజానీకం ప్రదర్శించిన ఉత్సాహం, పర్వతాలు-లోయల్లో సుందర ప్రకృతి దృశ్యాలు... వగైరాల సమ్మేళనంతో ఆకాశం-ప్రకృతి-సంస్కృతి సజీవమై ముప్పేటగా ముడిపడినట్లు అనిపించింది. నిజం... ఈ జ్ఞాపకాలు నా హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈ నృత్య ప్రదర్శనలో కళాకారుల నైపుణ్యానికి, దానికి దర్శకత్వం వహించిన వారికి, గాయకులకు... అందరికీ అభినందనలు. నేటి ఈ కార్యక్రమాలన్నీ టీవీ, మీడియా, దూరదర్శన్ చానెళ్లు దేశవ్యాప్తంగా పునరావృతం చేయాలని కోరుతున్నాను. దేశంలో రాజకీయ ప్రయోజనాల కోసం భాషా విభజన, ప్రాంతీయవాదం, వివక్ష సృష్టికి కుతంత్రాలు సాగుతున్న నేపథ్యంలో ‘ఒకే భారత్‌-శ్రేష్ఠ భారత్’ దార్శనికతను సిక్కిం ఇవాళ ఘనంగా చాటిచెప్పింది. ఈ చిన్న కార్యక్రమంలోనే వారు యావద్భారతాన్ని సజీవ చిత్రంగా మార్చి కళ్లకు కట్టేలా చూపారు. భారతీయత వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఇక్కడ ఏర్పాటు అమరికను నేను ఎంతో ఎత్తునుంచి చూస్తున్నాను. యావద్భారత దేశం, భిన్న ప్రాంతాల ప్రజలు తమతమ రాష్ట్రాల వస్త్రధారణలో కూర్చోవడం కనువిందు చేసింది. అదిగో... ఆ వైపు గుజరాత్‌ అమరికలో ప్రజలు తమ సంప్రదాయ దుస్తులలో కూర్చుని ఉన్నారు. మీరు దేశవాసులందరి హృదయాలనూ గెలుచుకున్నారంటే అతిశయోక్తి కాబోదు. మీరివాళ మోదీ హృదయాన్ని మాత్రమే కాదు... యావత్ భారత ప్రజానీకం మనసులను చూరగొన్నారు. మాతృభూమిపై ఆరాధన ఇదే... దేశభక్తి అంటే ఇదే... నవతరంలో ఆ భావన ఇలాగే ఉద్భవిస్తుంది... ఇందుకుగాను మీకందరికీ అనేకానేక అభినందనలు.

మిత్రులారా!

సిక్కింలో నేటి పర్యటన నాకెంతో ఆనందాన్నిస్తోంది.. ఎందుకంటే- ప్రతికూల వాతావరణం కారణంగా ఇంతకుముందు ఇక్కడికి రాలేకపోయాను. దీంతో బాగ్డోగ్రా నుంచి ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా మీతో సంభాషించాల్సి వచ్చింది. మిమ్మల్ని ప్రత్యక్షంగా కలవలేకపోయానన్న కించిత్‌ బాధ నా మదిలో తిష్ట వేసుకుంది. ప్రేమ్ సింగ్ జీ నన్ను కలిసినప్పుడల్లా మీరెంత కష్టపడినా రాలేకపోయానే అనే ఆవేదన నా కళ్లలో కనిపించేది. అయితే, ఈ వేడుకల సమాప్తితో ఇలాంటి ఒక సందర్భం కోసం నా నిరీక్షణ కూడా నేడు ముగిసింది.

మిత్రులారా!

సిక్కిం ప్రజలతో మమేకం కావడం నాకెప్పుడూ ఎంతో ప్రశాంతతనిస్తుంది. మీలోని సౌమ్యం, సౌహార్ద దృక్కులు, నిరాడంబరత్వం, మీ వదనాల్లో మెరిసే చిరునవ్వు- ఒక్కటనేమిటి... అన్నీ అద్భుతమే.   నేనిక్కడికి వచ్చేముందే ఈ రాష్ట్రంలోని ఎందరో ప్రతిభావంతులను కలిశాను. ఇక్కడి మేధావులు, పద్మ పురస్కార గ్రహీతలు, కళాకారులు, ఫుట్‌బాల్ క్రీడాకారులు- అందరితో వివిధ అంశాలపై చర్చించాను.

మిత్రులారా!

నిన్నటి సాయంత్రం రోడ్ షో నాకెన్నటికీ మరపురానిది. అందరి చేతుల్లో మన ప్రియమైన త్రివర్ణ పతాకం... నిర్విరామంగా మారుమోగిన ‘భారత్ మాతా కీ జై’ నినాదం, ‘వందేమాతరం’ ఆలాపన, వాతావరణం మొత్తం ‘ఒకే భారత్-శ్రేష్ఠ భారత్’ చిత్రాలతో నిండిపోయింది. గంజు లామా గేట్ నుంచి లోక్ భవన్ దాకా సిక్కిం సోదరీసోదరులు కురిపించిన ప్రేమాభిమానాలు, అన్ని జాతుల ప్రజలనూ వారివారి వస్త్రధారణ, సంగీతం, సంప్రదాయాలతో స్వాగతించిన తీరు- ఎల్లెడలా అద్భుత ఉత్సవ సంరంభం అలముకుంది. ప్రకృతి ఒడిలో వికసించే భిన్నవర్ణాల పుష్ప శోభను ఈ దృశ్యం మరపించింది. నా తల్లులు, అక్కచెల్లెళ్లు, పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆశీర్వదించారు. ఇక దారి పొడవునా నేను చూసిన ఓ అద్భుతం.. సిక్కిం రోడ్ల పరిశుభ్రత. మీకందరికీ నా శిరసాభివందనం! ఎక్కడా ఇంత మురికి కనిపించలేదు... స్వచ్ఛమైన శీతల పవనం, రహదారులపై శుభ్రత... సిక్కిం వాసులరాలా!  మీరు నిజంగా ప్రకృతి మాత సంరక్షకులు, బ్రాండ్ అంబాసిడర్లు. దేశ ప్రజలందరికీ మరోసారి నా విన్నపం... సిక్కిం రాష్ట్రాన్ని సందర్శించండి. ఇక్కడ ప్రజలు తమ రాష్ట్రాన్ని ఎంత పరిశుభ్రంగా, చక్కగా ఉంచుకుంటున్నారో చూడండని కోరుతున్నాను.

సోదరీసోదరులారా!

నిన్నటి రోడ్ షో సహా ప్రస్తుత కార్యక్రమంపైనా మీతోపాటు కళాకారులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను. ఎంతో కీలకమైన ఈ 50 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా వేడుకలు నిర్వహించుకుంటున్న సిక్కిం ప్రజలతోపాటు దేశవాసులకూ నా హృదయపూర్వక అభినందనలు. మీ ప్రేమ, ఆప్యాయత, ఆశీర్వాదాల రుణం తీర్చడంలో ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడవనని మీకిదే నా హామీ.

మిత్రులారా!

సిక్కిం ప్రస్థానం మానవ విలువల సమాహారం. ఇది ప్రగతిని, వారసత్వాన్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయాణం. ఈ రాష్ట్రంలోని ఎన్నో తరాలు ఈ పయనానికి సారథ్యం వహించాయి. అలా గడచిన 50 ఏళ్లుగా సిక్కింను వృద్ధి పథంలో నిలుపుతూ, ఇక్కడిదాకా చేర్చిన ప్రతి ఒక్కరికీ ఇవాళ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ సగౌరవంగా నమస్కరిస్తున్నాను. ఏ సమయంలో, ఎవరెవరు, ఏమి చేయాలో అది చేస్తూ తమ కష్టఫలాన్ని సిక్కింకే బహూకరించారు. ఇకపై ఆ బాధ్యత మనదే... ఈ దిశఘా నా మిత్రుడు ప్రేమ్ సింగ్ నాయకత్వంలోని ప్రభుత్వం సిక్కిం వారసత్వ పరిరక్షణతోపాటు ప్రగతిని పరుగులు పెట్టించేందుకు నిజాయితీతో కృషి చేస్తోంది. మా విషయానికొస్తే- ఈశాన్య ప్రాంతమైన సిక్కిం ఈ దేశంలో కీలక భాగం మాత్రమే కాదు.. అది భారత ‘అష్టలక్ష్ముల’లో ఒకటి. అందుకే మేం ‘యాక్ట్ ఈస్ట్’ విధానంతో పనిచేస్తూ, ఈశాన్య ప్రాంతం కోసం ‘యాక్ట్ ఫాస్ట్’ సంకల్పం పూనాం. ఇందులో భాగంగా ఈ రోజున కూడా వేల కోట్ల రూపాయల విలువైన 30కిపైగా ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశాం. వీటిలో రోడ్లు, విద్యుత్తు, పర్యాటకం, ఆరోగ్యం, విద్య వంటి అన్ని రంగాల ప్రాజెక్టులూ ఉన్నాయి. ఉత్తర సిక్కింలో 2023 తర్వాత తలెత్తిన సవాళ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటూ సంధానం దెబ్బతిన్న చోట తిరిగి బలోపేతం చేయడంపై దృష్టి సారించడం ముదావహం. వీటన్నింటి నేపథ్యంలో సిక్కిం ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా!

పర్యాటక ఆర్థిక వ్యవస్థే మన సిక్కిం అపార బలం... దేశ వైశాల్యంలో ఈ రాష్ట్ర విస్తీర్ణం ఒక శాతం కన్నా తక్కువే. కానీ, జాతీయంగా వృక్ష జాతుల వైవిధ్యంలో 25 శాతానికి పైగా మన సిక్కింలోనే కనిపిస్తుంది. ఇక్కడ సుమారు 500 రకాల పక్షులు, దాదాపు 700 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. అందమైన అటవీ ప్రాంతంలో అద్భుతమైన కాంచన్‌జంగా ఓ ప్రత్యేక ఆకర్షణ.. ఇలా ఇక్కడ చూడాల్సిన విశేషాలెన్నో ఉన్నాయి కాబట్టే, సిక్కింను పదేపదే సందర్శించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

మిత్రులారా!

సిక్కిం ప్రజల్లో అధిక శాతం పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడి ఉన్నారు. అయితే, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు బాగుంటేనే పర్యాటకం వృద్ధి చెందుతుంది. అందుకే, సిక్కిం అనుసంధానం, మౌలిక సదుపాయాలపై మేం అత్యంత శ్రద్ధ చూపుతున్నాం. ఇటీవలి ఏళ్లలో ఇక్కడ వందలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మితమయ్యాయి. ప్రతి గ్రామానికీ రోడ్ల నిర్మాణం వేగంగా చేపడుతున్నారు. మునుపెన్నడూ ఊహించని ఆధునిక మౌలిక సదుపాయాలు ఇవాళ సాకారం అవుతున్నాయి. బాగ్డోగ్రా నుంచి గాంగ్‌టక్ వరకూ ఎక్స్‌ ప్రెస్‌వే నిర్మాణం, సేవోక్-రాంగ్‌పో రైలు మార్గం ప్రాజెక్టులు సిక్కింను యావద్దేశంతో సంధానించే ఉపకరణాలుగా మారుతున్నాయి. కొత్త జాతీయ రహదారులు కూడా రాష్ట్రంలో నిర్మితమవుతున్నాయి. గాంగ్‌టక్ వంటి నగరాలకు భవిష్యత్తులో రింగ్ రోడ్ల వంటి ప్రాజెక్టులు అవసరమవుతాయి. ఈ దిశగానూ ప్రణాళికలు రూపొందుతున్నాయి.

సోదరీసోదరులారా!

బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న తరహాలో అనేక పనులు గతంలోనూ చేసి ఉండవచ్చు. కానీ,  కాంగ్రెస్ ప్రభుత్వాలు సిక్కిం అభివృద్ధిని సదా వెనక్కు నెట్టాయి. సేవోక్-రాంగ్‌పో రైలు మార్గాన్నే ఉదాహరణగా తీసుకోండి... దీనికి 2008–09లో ఆమోదం లభించినా, కాగితాలకే పరిమితమైంది తప్ప క్షేత్రస్థాయిలో పనులేవీ సాగింది లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక మూలనపడిన ఫైళ్లలోని ఈ ప్రాజెక్టు దుమ్ముదులిపి అభివృద్ధిని పట్టాలు ఎక్కించడంతో మళ్ళీ వేగం పుంజుకుని, తొలిసారి రైలు సిక్కిం చేరనుంది.

మిత్రులారా!

సిక్కింలో పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా మనం కొత్త ఆలోచనలూ చేయాలి. ఆ దిశగానే మనం ఇప్పుడు కృషి చేస్తున్నాం. భలేదుంగ, యెన్-యెంగ్, పెల్లింగ్‌లలో రోప్‌వేల నిర్మాణం ఇందుకొక ఉదాహరణ. భలేదుంగలో స్కైవాక్ కూడా నిర్మితమవుతోంది. ఇప్పుడు సింగ్‌షోర్ బ్రిడ్జిపై గ్లాస్ డెక్ స్కైవాక్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాం. నాథులా, నమ్లి వంటి ప్రదేశాల్లో సరిహద్దు అనుభవం  మెరుగుపరిచే పనులు కూడా కొనసాగుతున్నాయి.

మిత్రులారా!

మా ప్రభుత్వం చేస్తున్న కృషితో మీకు జీవన సౌలభ్యం కలుగుతుంది. సిక్కిం రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్య మరింత పెరిగి, మీ ఆదాయమూ ఇనుమడిస్తుంది. దేశవ్యాప్తంగాగల పర్యాటకులను నేనెప్పుడూ కోరేదేమిటంటే- మీరు సాహస లేదా పర్యావరణ యాత్ర కోసం ప్రయాణం తలపెడితే మీరెక్కడికి వెళ్లినా మీ ప్రయాణ బడ్జెట్‌లో 5 శాతం స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు తప్పక వినియోగించండి. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిచ్చే ప్రయత్నం ఇక్కడినుంచే మొదలవుతుంది. ఆ మేరకు ఎక్కడికెళ్లినా అక్కడి ఆహారం రుచి చూడండి.. స్థానిక వస్తువులను కొని, జ్ఞాపికలుగా తీసుకెళ్లండి. తద్వారా ఇక్కడి ప్రజలు, సుదూర పర్వత ప్రాంతాల్లో నివసించే చిన్న సమూహాలు, స్వయం సహాయ సంఘాల సభ్యులైన అక్కచెల్లెళ్లు తయారు చేసే అద్భుత వస్తుసామగ్రికి దేశవ్యాప్త కొనుగోలుదారులు లభిస్తారు. దీంతో ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.

మిత్రులారా!

సిక్కింలో పర్యావరణ-ఆరోగ్య పర్యాటకానికీ ఎన్నో అవకాశాలున్నాయి. దీన్ని కూడా మేం  ప్రోత్సహిస్తున్నాం. పర్యాటకం నుంచి స్థానిక ప్రజలకు గరిష్ఠ ఆదాయం లభించేలా 1,000 ‘హోమ్‌స్టే’లను కూడా నిర్మిస్తున్నాం. సాహస పర్యాటకానికి తగిన మౌలిక సదుపాయాల కల్పనకూ మద్దతిస్తున్నాం.

మిత్రులారా!

క్రీడా రంగంలోనూ సిక్కిం రాష్ట్రానికి అపరిమిత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి యువత అనేక ప్రధాన వేదికలపై తమ క్రీడా సామర్థ్యాన్ని, ప్రతిభను నిరూపించుకున్నారు. ఫుట్‌బాల్, బాక్సింగ్, ఆర్చరీ వంటి క్రీడలలో వీరు తమ రాష్ట్రానికి, దేశానికి కీర్తిప్రతిష్టలు ఆర్జించి పెట్టారు.

మిత్రులారా!

ఇలాంటి ప్రతిభావంతులన ప్రోత్సహించడానికే మేం ‘ఖేలో ఇండియా’, ‘ఫిట్ ఇండియా’ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. సిక్కింలో రాష్ట్ర క్రీడా అకాడమీని కూడా పునరుద్ధరించాం.. సిక్కిం ప్రీమియర్ లీగ్ వంటి క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. తద్వారా మరింత మంది క్రీడాకారులకు పాల్గొనే అవకాశం లభించి, వారి ప్రతిభకు పదును పెరుగుతుంది.

మిత్రులారా!

శ్రీ జస్లాల్ ప్రధాన్ పేరిట అత్యాధునిక బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది. సమీకృత క్రీడా-సాంస్కృతిక గ్రామం వంటి ప్రాజెక్టులు కూడా పురోగమిస్తున్నాయి. దీనివల్ల సిక్కిం యువతకు మెరుగైన సౌకర్యాలు లభించడమే కాకుండా వారు క్రీడలలో మరింత రాణించగలరు.

మిత్రులారా!

సిక్కింలో ఈ రోజు ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో ఆరోగ్య రంగానికి సంబంధి అనేక పెద్ద పనులు కూడా ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు సిక్కిం సహా ఈశాన్య ప్రాంతంపై ఉదాసీనత చూపాయి. ఇక్కడ ఆరోగ్య సేవలు చాలా పరిమిత స్థాయిలో మాత్రమే లభించేవి. ఈ కారణంగా పర్యాటకులు కూడా ఇక్కడికి రావాలంటే వెనుకాడేవారు కానీ, ఇప్పుడీ సమస్య సమసిపోతోంది... సిక్కింలో నేడు సుమారు 200 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు పనిచేస్తున్నాయి. అలాగే, 4 జిల్లా ఆసుపత్రులు సహా ఒక తృతీయ స్థాయి చికిత్సలందించే ఆస్పత్రి, శ్రేయో కేంద్రాలు  అందుబాటులో ఉన్నాయి. వేలాదిగా  ప్రజలు ఆయుష్ సౌకర్యాలతో ప్రయోజనం పొందుతున్నారు. డ్రెజాంగ్ నంగ్యాల్ ‘సోవా రిగ్పా’ ఆస్పత్రి ప్రారంభోత్సవం తర్వాత, సిక్కింలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మరింత ఉత్తేజం కలుగుతుంది.

సోదరీసోదరులారా!

ఆరోగ్య మౌలిక సదుపాయాలతో పాటు ప్రజలకు చౌకగా చికిత్స సదుపాయం కూడా అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. లోగడ మేం పేదలకు ఉచిత చికిత్స కోసం ఆయుష్మాన్ కార్డులు జారీచేయగా, ఇప్పుడీ సదుపాయాన్నీ 70 ఏళ్లు.. అంతకు మించిన వృద్ధులందరికీ విస్తరించాం. దీంతోపాటు జనౌషధి కేంద్రాల్లో మందులు కూడా చాలా చౌకగా లభిస్తున్నాయి. ఈ కృషి ఫలితంగా రాష్ట్ర ప్రజలకు జీవన సౌలభ్యం కలగడంతోపాటు చికిత్స కోసం మీ ఖర్చు పెట్టాల్సిన డబ్బు ఆదా అవుతోంది.

మిత్రులారా!

ఆర్థిక పురోగమనం, వనరులపై నేడు ప్రపంచ దృక్పథం వేగంగా మారుతోంది. ప్రపంచం ఇవాళ సుస్థిర జీవనశైలి గురించి చర్చించుకుంటోంది. అలాగే కాలుష్య రహిత ఇంధనంపై దృష్టి సారిస్తోంది. సేంద్రియ ఆహారానికి ప్రాధాన్యం లభిస్తోంది. ఈ నేపథ్యంలో మన ఈశాన్య ప్రాంతం, సిక్కిం రాష్ట్రాలు ఈ భవిష్యత్ వృద్ధికి భారీ కూడళ్లు కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా యావద్దేశానికీ సిక్కిం దిశానిర్దేశం చేస్తోంది. పదేళ్ల కిందటే... అంటే- 2016లోనే సిక్కిం సేంద్రియ ఉత్పత్తుల రాష్ట్రంగా ప్రకటించుకుంది. మన డెమాజాంగ్ ఇప్పుడు వరి ఉత్పత్తికి మాత్రమే ప్రసిద్ధం కాదు... ఇప్పుడది సేంద్రియ వరి సాగులో ప్రపంచ గుర్తింపు తెచ్చుకుంది. పెద్ద యాలకులు, అల్లం, పసుపు, అవకాడో, కివి వంటి ఎన్నో ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్తున్నాయి. సిక్కింలో వందలాది జాతుల ఔషధ మొక్కలు కూడా లభ్యమవుతాయి. ఇవి కూడా స్థానికుల ఆదాయాన్ని పెంచే సాధనాలుగా మారుతున్నాయి.

మిత్రులారా!

సిక్కింలో అనుసరిస్తున్న సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానం దేశం మొత్తానికీ స్ఫూర్తిదాయకం. ఈ రాష్ట్ర జీవనశైలి..  సంకల్పం.. నేడు దేశ దార్శనికతలో అంతర్భాగమయ్యాయి. సిక్కింలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా సేంద్రియ ప్రాసెసింగ్ ప్లాంట్లను కూడా ప్రారంభించారు. దీనివల్ల రైతులకు మార్కెట్‌తో ప్రత్యక్ష అనుసంధానం కాగల అవకాశం లభిస్తుంది.

మిత్రులారా!

ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో స్వయం సహాయ సంఘాలు, మహిళలు కూడా అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ స్వయం సహాయ సంఘాల ఉత్పత్తులు భారీ మార్కెట్లకూ చేరడంలో డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. ‘స్వయం సిక్కిం’ వంటి వేదికలు ఈ మహిళలకు సాధికారత కల్పిస్తున్నాయి.

మిత్రులారా!

కాలుష్య రహిత ఇంధన రంగంలో సిక్కిం రాష్ట్రానికి విస్తృత సామర్థ్యముంది. రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఈ సామర్థ్యాన్ని మనం మరింతగా వాడుకోవాలి. పర్యావరణ పరిరక్షణ సిక్కిం ప్రజల నైజమనే వాస్తవం నాకు తెలుసు. దేశం ‘అమ్మ పేరిట ఓ మొక్క‘ కార్యక్రమాన్ని ప్రారంభించినపుడు సిక్కిం ప్రజలు కర్తవ్య భావనతో దాన్ని ముందుకు నడిపించారు. ఇదే తరహాలో రాష్ట్ర ముఖ్యమంత్రి “మేరో రుఖ్ మేరో సంతతి” (నాకు బిడ్డ పుడితే ఓ మొక్క) కార్యక్రమంతో ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. దీనికింద, ఏ ఇంట్లో బిడ్డ పుట్టినా 108 మొక్కలు నాటుతారు. ఈ కార్యక్రమం యావత్ ప్రపంచానికీ స్ఫూర్తినిస్తుందని నేను భావిస్తున్నాను. మన పర్యావరణ సంబంధిత కృషిని మరింత అంకితభావంతో కొనసాగించాలి. ఇది మన వారసత్వం... దీన్ని మన భావితరాల కోసం కాపాడాలి.

మిత్రులారా!

సిక్కిం మరింత వేగంగా ముందంజ వేయాలి... వికసిత భారత్‌ కలలను సాకారం చేయాలి. ఇందుకోసం మనమంతా సమష్టిగా కృషి చేయాలి. సిక్కింను సమున్నత శిఖరాలకు చేర్చాలి. ఈ సంకల్పంతో మరోసారి మీకందరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు. మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ 50 ఏళ్ల ప్రస్థానం తర్వాత, ఈ రోజున మనం రెండు గమ్యాలను అధిగమించాలి. సిక్కిం ప్రగతి ప్రస్థానం 100 ఏళ్లకు చేరుకున్నపుడు మనమేం చేయాలి? సిక్కిం ప్రస్థానం 75 ఏళ్లకు చేరేనాటికి మనమేం చేయగలం? చివరగా దేశం స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే రోజున... అంటే- 2047 నాటికి వికసిత భారత్‌ స్వప్న సాకారం కోసం మనం ఈ క్షణం నుంచే సన్నాహాలు మొదలుపెట్టి, దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలి. ఈ ఆలోచనతో మీకందరికీ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు... అనేకానేక ధన్యవాదాలు. ఇప్పుడు నాతో గళం కలిపి దిక్కులు మారుమోగేలా నినదించండి:

భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!

వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం!

వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం!

వందే మాతరం!

 

***


(రిలీజ్ ఐడి: 2256418) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Manipuri , Gujarati