రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దక్షిణ కోస్తా రైల్వేపై త్వరలో గెజిట్ నోటిఫికేషన్‌…. ఆంధ్రప్రదేశ్‌ రైల్వే వ్యవస్థ భారీగా విస్తరణ: రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్


రైల్వే నెట్‌వర్క్ విద్యుదీకరణ 100 శాతం సాధించిన ఆంధ్రప్రదేశ్

రైల్వే ఆధునికీకరణలో అగ్రగామి ప్రాంతాల సరసన ఏపీ: రైల్వేమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 28 APR 2026 2:24PM by PIB Hyderabad

 విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం జరిగిన సభను ఉద్దేశించి కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటి, సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దక్షిణ కోస్తా రైల్వే జోన్  ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని, జూన్ 1, 2026ను అమలు తేదీగా నిర్ణయిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ నిర్ణయం ఒక కీలకమైన అడుగు అని ఆయన పేర్కొన్నారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన రూ.886 కోట్ల రైల్వే బడ్జెట్ తో పోలిస్తే, ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు రికార్డు స్థాయిలో రూ. 10,134 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయింపులు లభించాయని ఆయన పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సుమారు రూ. 1,06,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, ఇవి ఓడరేవులు, పర్యాటక ప్రాంతాలు, ప్రధాన నగరాలకు అనుసంధానంతో సహా రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో 74 రైల్వే స్టేషన్లను పూర్తిగా పునరాభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇది దేశంలోనే ఒక చారిత్రాత్మక విజయమని ఆయన అభివర్ణించారు.

ఆంధ్రప్రదేశ్ లో రైల్వే అభివృద్ధి పై మంత్రి మరిన్ని వివరాలు అందిస్తూ: 

  • 832 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం పూర్తయింది.

  • 299 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మాణంలో ఉన్నాయి.

  • 1,759 కి.మీ. రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తయింది.

  • 3,300 కి.మీ. ట్రాక్ నిర్మాణంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ తన రైల్వే నెట్‌వర్క్‌లో 100% విద్యుదీకరణను సాధించి, రైల్వే ఆధునీకరణలో అగ్రగామి ప్రాంతాల సరసన నిలిచిందని మంత్రి ప్రకటించారు.

ప్రయాణికుల సేవల విషయానికొస్తే, ప్రస్తుతం రాష్ట్రంలో 16 వందే భారత్ రైళ్లు, 22 అమృత్ భారత్ రైలు సేవలు అందుబాటులో ఉన్నాయని, ఇవి ప్రయాణ సామర్థ్యాన్ని, సౌకర్యాన్ని మెరుగుపరుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

అంతేకాకుండా, తూర్పు తీర రైల్వే కారిడార్ మొత్తాన్ని నాలుగు లైన్ల నెట్‌వర్క్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నామని, దీనివల్ల సామర్థ్యం రెట్టింపు అవ్వడమే కాకుండా, మరో 500 కొత్త రైళ్లను నడపడానికి వీలు కలుగుతుందని ఆయన చెప్పారు.

తూర్పు తీర కారిడార్ వెంబడి ఉన్న ఓడరేవులు, పర్యాటక కేంద్రాలు, ప్రధాన నగరాలను అనుసంధానించడానికి కార్గో, కంటైనర్ రైలు సేవలను బలోపేతం చేస్తున్నామని, రవాణా, ఆర్థిక వృద్ధికి ఇవి దోహదపడతాయని మంత్రి చెప్పారు.

భవిష్యత్తులో హై-స్పీడ్ కనెక్టివిటీ గురించి ప్రస్తావిస్తూ, ప్రధాన దక్షిణ కారిడార్లలో ప్రతిపాదించిన హై-స్పీడ్ కనెక్టివిటీ, ప్రయాణ సమయాల గురించి ఆయన వివరించారు:

  • అమరావతి నుంచి హైదరాబాద్ - సుమారు 70 నిమిషాలు

  • అమరావతి నుంచి చెన్నై -  సుమారు 112 నిమిషాలు

  • హైదరాబాద్ నుంచి పూణె -  సుమారు 1 గంట 55 నిమిషాలు

  • పూణే నుంచి  ముంబయి -  సుమారు 48 నిమిషాలు

  • చెన్నై నుంచి బెంగళూరు -  సుమారు 73 నిమిషాలు

  • హైదరాబాద్ నుంచి  బెంగళూరు -  సుమారు 2 గంటల 8 నిమిషాలు

ఈ నెట్‌వర్క్‌ను ఆయన "హై-స్పీడ్ డైమండ్" గా అభివర్ణించారు. ఇది దక్షిణ భారతదేశం అంతటా రవాణా సౌకర్యాలను, ఆర్థిక సమగ్రతను, ప్రాంతీయ వృద్ధిని గణనీయంగా మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రధాన రైల్వే, రవాణా కేంద్రంగా మార్చడం పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తాయని, ఆర్థిక వృద్ధిని, ప్రాంతీయ సమగ్రతను పెంపొందిస్తాయని మంత్రి పేర్కొన్నారు. 

సమతుల్య అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల వృద్ధి, ప్రజా సంక్షేమం పరంగా దక్షిణ రాష్ట్రాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి అంశాలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.  

***


(రిలీజ్ ఐడి: 2256415) సందర్శకుల సూచీ సంఖ్య : : 121
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Telugu_Vw , Kannada