రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దక్షిణ కోస్తా రైల్వే జోన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించిన రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైల్వే నెట్వర్క్ ఆధునీకరణలో అగ్రగామిగా నిలుస్తూ, మొత్తం నెట్వర్క్లో 100% విద్యుదీకరణను సాధించిందని కేంద్ర మంత్రి ప్రకటించారు

నాడు పోస్టు చేయడమైనది: 28 APR 2026 2:24PM by PIB Vijayawada

28 ఏప్రిల్ 2026

విశాఖపట్నం.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల విస్తరణతో పాటు దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రైల్వే, ఐటీ మరియు సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్.. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జూన్ 1, 2026 నుంచి ఈ కొత్త జోన్ అధికారికంగా అమలులోకి వస్తుందని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే పరిపాలనను బలోపేతం చేసే దిశగా ఈ పరిణామం ఒక కీలక ముందడుగు అని పేర్కొన్నారు.

గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రైల్వే కేటాయింపులు రూ.886 కోట్లేనని గుర్తు చేసిన కేంద్ర మంత్రి.. ప్రస్తుతం కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే రికార్డు స్థాయిలో రూ.10,134 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయింపులు లభించాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అనుసంధానతను పెంపొందించడం, ముఖ్యంగా ఓడరేవులు, పర్యాటక ప్రాంతాలు, ప్రధాన నగరాలను అనుసంధానించడమే లక్ష్యంగా.. రాష్ట్రంలో సుమారు రూ.1,06,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

మౌలిక సదుపాయాల రంగంలో సాధించిన విజయాల గురించి ప్రస్తావిస్తూ.. ఆంధ్రప్రదేశ్లోని 74 రైల్వే స్టేషన్లను పునర్నిర్మించి, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇది దేశంలోనే ఒక చారిత్రాత్మక విజయమని అభివర్ణించారు.

అశ్విని వైష్ణవ్ వెల్లడించిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రైల్వే ప్రాజెక్టుల వివరాలు:

  • 832 ఫ్లైఓవర్లు మరియు అండర్పాస్ల పనులు పూర్తయ్యాయి.
  • 299 ఫ్లైఓవర్లు మరియు అండర్పాస్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి.
  • 1,759 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తయింది.
  • 3,300 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోంది.

రైల్వే నెట్వర్క్ ఆధునీకరణలో అగ్రగామిగా నిలుస్తూ, ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే నెట్వర్క్‌ 100% విద్యుదీకరణను సాధించిందని మంత్రి ప్రకటించారు.

ప్రయాణీకుల సేవలపై మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 16 వందే భారత్ రైళ్లు, 22 అమృత్ భారత్ రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇవి మెరుగైన ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తున్నాయని అన్నారు.

అలాగే.. తూర్పు కోస్తా రైల్వే కారిడార్ మొత్తాన్ని నాలుగు వరుసల నెట్వర్క్గా ఆధునీకరిస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల రవాణా సామర్థ్యం రెట్టింపు అవడంతో పాటు, దాదాపు 500 కొత్త రైళ్లను నడపడానికి వీలవుతుందని వెల్లడించారు.

తూర్పు కోస్తా కారిడార్ వెంబడి ఉన్న ఓడరేవులు, పర్యాటక కేంద్రాలు, ప్రధాన నగరాలను అనుసంధానించేందుకు కార్గో, కంటైనర్ రైలు సర్వీసులను బలోపేతం చేస్తున్నామని, తద్వారా లాజిస్టిక్స్, ఆర్థిక వృద్ధికి ఊతం లభిస్తుందని మంత్రి తెలిపారు.

భవిష్యత్తులో రాబోయే హై-స్పీడ్ కనెక్టివిటీ గురించి వివరించిన కేంద్ర మంత్రి.. దక్షిణ భారత దేశంలోని ప్రధాన కారిడార్లలో ప్రతిపాదిత హై-స్పీడ్ కనెక్టివిటీ, వాటి ప్రయాణ సమయాలను వివరించారు:

  • అమరావతి నుంచి హైదరాబాద్సుమారు 70 నిమిషాలు
  • అమరావతి నుంచి చెన్నైసుమారు 112 నిమిషాలు
  • హైదరాబాద్ నుంచి పూణేసుమారు 1 గంట 55 నిమిషాలు
  • పూణే నుంచి ముంబైసుమారు 48 నిమిషాలు
  • చెన్నై నుంచి బెంగళూరుసుమారు 73 నిమిషాలు
  • హైదరాబాద్ నుంచి బెంగళూరుసుమారు 2 గంటల 8 నిమిషాలు

ఈ నెట్వర్క్ను ఆయన "హై-స్పీడ్ డైమండ్" గా అభివర్ణించారు. ఇది దక్షిణ భారతదేశంలో రవాణ, ఆర్థిక సమగ్రతను, ప్రాంతీయ వృద్ధిని గణనీయంగా పెంపొందిస్తుందని పేర్కొన్నారు.

 కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను ప్రధాన రైల్వే, లాజిస్టిక్స్ హబ్గా మార్చేందుకు కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధిని, ప్రాంతీయ సమగ్రతను పెంపొందిస్తాయని వెల్లడించారు.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో దక్షిణాధి రాష్ట్రాలకు పూర్తి న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. సమతుల్య అభివృద్ధి, సంక్షేమాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. ఇదే సమయంలో, అభివృద్ధి అంశాలను ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని అన్నారు.

****


(రిలీజ్ ఐడి: 2256331) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Odia , Telugu , Kannada