భారత ఎన్నికల సంఘం
ఐఈవీపీ 2026: భారత ప్రజాస్వామ్య పండుగను వీక్షించిన ప్రపంచ ప్రతినిధులు
విస్తృతి నుంచి అత్యధిక భాగస్వామ్యం వరకు: అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
నాడు పోస్టు చేయడమైనది:
26 APR 2026 5:32PM by PIB Hyderabad
-
భారత ఎన్నికల సంఘం అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం 2026లో భాగంగా, తమిళనాడు అసెంబ్లీ, పశ్చిమ బెంగాల్ శాసనసభ (మొదటి దశ) ఎన్నికలు యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. 16 దేశాల నుంచి వచ్చిన 32 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, అంతర్జాతీయ ఐడియా సంస్థ ప్రతినిధులు భారత ఎన్నికల ప్రక్రియల విస్తృతిని, కచ్చితత్వాన్ని, చైతన్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.
-
ఈ అనుభవాన్ని "నిజమైన ప్రజాస్వామ్య పండుగ"గా వర్ణిస్తూ, అత్యధిక సంఖ్యలో ఓటు వేసిన వారి భాగస్వామ్యం, నిశితమైన ప్రణాళిక, భారత ఎన్నికల సంఘం సజావుగా ఎన్నికలు నిర్వహించిన తీరును ప్రతినిధులు ప్రశంసించారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరంలోని పోలింగ్ కేంద్రం పరిశీలన అనంతరం.."ఎన్నికల నిర్వహణ అనుభవాన్ని, ప్రక్రియలను, విజ్ఞానాన్ని భారత్ మొత్తం ప్రపంచానికి అందిస్తోంది. ప్రజాస్వామ్యం అంటే ఇదే. ఓటరు వద్దకు ఓటును తీసుకురావడం" అని మారిషస్ ఉన్నత ప్రతినిధి శ్రీమతి షీలాబాయి బప్పూ అన్నారు.
-
అంతర్జాతీయ ప్రతినిధులు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో రెండు రోజుల పర్యటన (ఏప్రిల్ 22-23) ను పంపిణీ కేంద్రాల సందర్శనతో మొదలుపెట్టారు. అక్కడ వారు ప్రణాళికాబద్ధమైన రవాణా వ్యవస్థ, నిర్ణీత ప్రామాణిక నిర్వహణ పద్ధతుల ద్వారా ఎన్నికల సామాగ్రితో పోలింగ్ బృందాలు క్రమబద్ధంగా తరలి వెళ్లడం గమనించారు. “ఈరోజు మొదట నేను ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద ఉన్నాను. అక్కడ ఉన్న సందడి చూసి ఆశ్చర్యపోయాను. పోలింగ్ అధికారులు నియంత్రణ విభాగం, ఓట్ల విభాగం, ఓటరు ధృవీకరణ యంత్రం అనే మూడు భాగాల ఓటింగ్ యంత్రాలను స్వీకరించారు. అది అద్భుతమైన అనుభవం.. ఎంతో పారదర్శకంగా, క్రమ పద్ధతిలో ఉంది" అని పశ్చిమ బెంగాల్ సిలిగురిలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఫిలిప్పీన్స్ ప్రతినిధి మెలిస్సా ఆన్ ఎం. టెలన్ అన్నారు.
-
తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారిని, పశ్చిమ బెంగాల్ సిలిగురిలోని డార్జిలింగ్ జిల్లా సీనియర్ ఎన్నికల అధికారులను కూడా ప్రతినిధులు కలిసి మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ, ప్రశాంతంగా, సజావుగా సాగేలా చేసిన భద్రతా ఏర్పాట్ల గురించి వారు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లను ప్రతినిధులు ప్రశంసించారు. వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం కల్పించిన ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని అద్భుతమైన నిర్ణయంగా కొనియాడారు.
-
ప్రతినిధులు పోలింగ్ కేంద్రాలలో 100 శాతం వెబ్ కాస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన మీడియా/ వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్ లను కూడా సందర్శించారు. వీటిని పారదర్శకతకు కీలకమైన చర్యగా అభివర్ణించారు.
-
పోలింగ్ రోజు ఉదయం ప్రతినిధులు మాక్ పోల్స్ ను వీక్షించారు. ఆ తర్వాత, వారు చెన్నై (తమిళనాడు), సిలిగురి, కుర్సెయోంగ్ (పశ్చిమ బెంగాల్) లోని వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి వాస్తవ ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా తిలకించారు.
-
పోలింగ్ కేంద్రాలలోని సమ్మిళిత, భాగస్వామ్య, సులభతర సౌకర్యాలైన ర్యాంపులు, చక్రాల కుర్చీలు, స్వచ్ఛంద సేవకులు, శిశు సంరక్షణ కేంద్రాలు, అలాగే మహిళలు, దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఎన్నికల కేంద్రాలను చూసి అభినందించారు.
"మేము పోలింగ్ కేంద్రాలను పరిశీలించాం. వాటి నిర్వహణ చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది" అని పశ్చిమ బెంగాల్ సిలిగురిలోని ఎన్నికల కేంద్రం వద్ద నేపాల్ ప్రతినిధి యజ్ఞ ప్రసాద్ భట్టరాయ్ పేర్కొన్నారు.
-
తమిళనాడులో కల్పించిన కనీస సౌకర్యాలను, చెన్నైలో ప్రణాళికాబద్ధంగా, రంగులతో గుర్తించిన ఎన్నికల కేంద్రాలను ప్రతినిధులు ప్రశంసించారు.
"ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారి ఓటర్లకు కల్పిస్తున్న కనీస సౌకర్యాలు. మరీ ముఖ్యంగా సహాయ కేంద్రం, రంగుల గుర్తింపు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి” అని చెన్నై ఎన్నికల కేంద్రం వద్ద భూటాన్ ప్రతినిధి శ్రీ షెరింగ్ సామ్డ్రుప్ పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్లో, పోలింగ్ కేంద్రాల వద్ద ఆరోగ్య పరీక్షల సౌకర్యాలను వారు అభినందించారు. ఓటర్ల సౌకర్యం, మెరుగైన ఓటు వేసే అనుభవం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన సంచార పోలింగ్ కేంద్రాల కొత్త కార్యక్రమాలను వారు మెచ్చుకున్నారు.
“పోలింగ్ కేంద్రంలోకి అనుమతించని మొబైల్ ఫోన్లను భద్రపరచడానికి బయట చేసిన ఏర్పాట్లు నాకు ఆశ్చర్యం కలిగించాయి. నాకు బాగా నచ్చిన మరో విషయం వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి స్థలాలు. ఇది చాలా ప్రశంసనీయం" అని సిలిగురిలోని పోలింగ్ కేంద్రం వద్ద కెన్యా ప్రతినిధి రూత్ ఖతీవి కులుండు అన్నారు.
సక్రమంగా ఎన్నికల నిర్వహణ, భారీ ఓటింగ్ సందర్శక బృందాల ప్రశంసలు పొందాయి. ఎన్నికల నిర్వహణ విస్తృతి, వైభవాన్ని వీక్షించే అవకాశం కల్పించినందుకు వారు ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. పారదర్శకత, సమ్మిళితత్వం, సామర్ధ్యం పట్ల ఎన్నికల సంఘం నిబద్ధతను వారు ప్రశంసించారు.
-
అంతకుముందు, ఏప్రిల్ 8-9 తేదీలలో 22 దేశాల నుంచి 38 మంది ప్రతినిధులు అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలను సందర్శించారు. ఐఈవీపీ 2026లో భాగంగా మొత్తం 38 దేశాల నుంచి 70 మంది ప్రతినిధులు, అంతర్జాతీయ ఐడియా సంస్థ, ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను సందర్శించారు. భారత ఎన్నికల ప్రక్రియ నుంచి ప్రపంచం నేర్చుకోవడానికి చూస్తుండగా, భారత్ అసమానమైన విస్తృతిలో, రికార్డు స్థాయి ఓటర్ల భాగస్వామ్యంతో ఎన్నికలను నిర్వహించడంలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఇది నిజంగా ప్రజాస్వామ్య పండుగ.
-
అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం (ఐఈవీపీ) భారత ఎన్నికల సంఘం ప్రతిపాదించిన కార్యక్రమం. ఎన్నికల నిర్వహణ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలతో సహకారం, అనుబంధం పెంపొందించడం దీని ఉద్దేశ్యం. భారత ఎన్నికల వ్యవస్థ, సంస్థాగత యంత్రాంగం, కార్యకలాపాల నిర్మాణంపై ఈ కార్యక్రమం సమగ్ర అవగాహనను అందిస్తుంది. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ పద్ధతులు, నూతన ఆవిష్కరణలను ప్రతినిధులకు ఇది పరిచయం చేస్తుంది.
గమనిక: అనుబంధం – ఐఈవీపీ 2026 కింద అంతర్జాతీయ ప్రతినిధుల అభిప్రాయాల కోసం యూట్యూబ్ లింకులు.
**********
అనుబంధం
***
(రిలీజ్ ఐడి: 2255749)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9