సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాదక ద్రవ్యాల డిమాండును తగ్గించే జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఏడీపీడీఆర్)కింద పర్యవేక్షణ, సంస్థాగత సమన్వయ బలోపేతానికి నషా ముక్త్ భారత్ అభియాన్ యాప్ 2.0 ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 25 APR 2026 10:42AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించే లక్ష్యంతో సామాజిక న్యాయం, సాధికారత శాఖ 2020 ఆగస్టు 15న అత్యంత ప్రభావితమైన 272 జిల్లాల్లో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ (ఎన్ఎంబీఏ)ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం సాధించిన విజయంతో 2023 ఆగస్టు 15 నుంచి దీనిని దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించారు. సామాన్యుల్లో మత్తు పదార్థాల వాడకం పట్ల చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

 

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు సహా వివిధ స్థాయిల్లో నిర్వహించిన 8.3 లక్షలకు పైగా  కార్యక్రమాల ద్వారా సుమారు 26 కోట్ల మందికి పైగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో 9.5 కోట్లకు పైగా యువత, 6.47 కోట్ల మంది మహిళలు, 28,000 మందికి పైగా మాస్టర్ వాలంటీర్లు భాగస్వాములు కావడం విశేషం.

 

మాదకద్రవ్యాల డిమాండును తగ్గించే జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఏపీడీడీఆర్) పర్యవేక్షణ, అమలు వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ శశ్రీ వీరేంద్ర కుమార్ 2026 ఏప్రిల్ 24న చండీగఢ్‌లో జరిగిన చింతన్ శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆధునీకరించిన నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్‌ఎంబీఏ) 2.0 యాప్‌ను ప్రారంభించారు.ఈ ఆధునిక అప్లికేషన్ కేంద్ర, రాష్ట్ర, జిల్లా, సంస్థాగత స్థాయిల్లో అమలు చేసే సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడానికి, ఎప్పటికప్పుడు నివేదికలను పంపించేందుకు, పర్యవేక్షించడానికి రాష్ట్రాలు, జిల్లాలకు ఒక కేంద్రీకృత డిజిటల్ సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ కొత్త వెర్షన్ ఇప్పటికే ఉన్న సౌకర్యాలను కొనసాగిస్తూనే.. పారదర్శకతను, జవాబుదారీతనాన్ని, డేటా ఆధారిత పాలనను పెంపొందించే లక్ష్యంతో సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది.

 

ప్రస్తుతం అధికారిక వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఎన్ఎంబీఏ యాప్ రాష్ట్రాలు, జిల్లాలు, ఆధ్యాత్మిక సంస్థలు, ఇతర భాగస్వాములకు ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కింద తాము చేపట్టిన కార్యకలాపాలను అప్‌లోడ్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఒక కేంద్రీకృత డ్యాష్‌బోర్డు ద్వారా వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి తోడ్పడుతుంది. ఇది సమాచార, విద్యా, ప్రసార సమాచారాన్ని అందించడమే కాకుండా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనే ‘నషా ముక్తి మిత్ర’లకు అవసరమైన ప్రాథమిక కమ్యూనికేషన్ మద్దతును కూడా అందిస్తుంది. ఈ యాప్‌లో మాస్టర్ వాలంటీర్లను (నషా ముక్తి మిత్ర) చేర్చుకోవడం, సమన్వయం చేయడం కోసం సులభమైన వ్యవస్థ ఉంది. విద్యాసంస్థలు, ఇతర సంస్థలు తమ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రతిజ్ఞా కార్యక్రమాలను నిర్వహించడానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది. మత్తు పదార్థాల విముక్తి కోసం హెల్ప్‌లైన్, మానస్ హెల్ప్‌లైన్ వంటి ముఖ్యమైన నంబర్ల ద్వారా మానసిక ఆరోగ్య సేవలతోపాటు ప్రాథమిక సాంకేతిక సహాయాన్ని ఈ యాప్ అందిస్తుంది.

 

ఎన్ఎంబీఏ యాప్ 2.0 లోని కొత్త ఫీచర్లు

 

ఇప్పటికే ఉన్న సౌకర్యాలకు అదనంగా ఈ కొత్త వెర్షన్‌లో మరిన్ని శక్తిమంతమైన ఫీచర్లను చేర్చారు.

·                 ఇప్పుడు ఈ యాప్‌ను సామాన్య పౌరులు కూడా ఉపయోగించవచ్చు. దీని ద్వారా ఈ-ప్రతిజ్ఞ చేయడం, ఐఈసీ సమాచారాన్ని పొందడం, హెల్ప్‌లైన్ మద్దతు, వ్యసన విముక్తి కేంద్రాల వివరాలు వంటి ఫీచర్లను తెలుసుకోవచ్చు.

జీఐఏ సంస్థలకు ప్రత్యేక అవకాశం

·                 ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే సంస్థలు (జీఐఏ) కూడా ఇప్పుడు ఈ వేదికలో చేరవచ్చు. వీరు తమ కేంద్రాల్లో జరుగుతున్న కార్యకలాపాలను ఎప్పటికప్పుడు నివేదించడానికి, పర్యవేక్షించడానికి ప్రత్యేక లాగిన్ సౌకర్యం ఉంటుంది.

జీఐఏ సంస్థలకు ఇచ్చే ఆర్థిక సాయం తాజా పరిస్థితి

·                 ఈ యాప్ ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే సంస్థల నిధుల వివరాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సదరు సంస్థలకు సామాజిక న్యాయం, సాధికారత శాఖ అందుబాటులో ఉంచుతుంది. దీనివల్ల నిధుల వినియోగంలో మరింత పారదర్శకత, క్రమబద్ధమైన నిధుల పర్యవేక్షణ, జవాబుదారీతనం పెరుగుతాయి.

‘అత్యంత సమీపంలోని మత్తు విముక్తి కేంద్రం’ ఫీచర్

·                 ఇది వినియోగదారులు తమకు అత్యంత దగ్గరలో ఉన్న మత్తు విముక్తి కేంద్రాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల బాధితులను చికిత్స కోసం త్వరగా పంపడానికి, చికిత్స సేవలు సులభంగా అందుబాటులోకి రావడానికి వీలవుతుంది.

అభిప్రాయ సేకరణ.

·                 నిరంతర అభివృద్ధి కోసం ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.

మాదకద్రవ్యాల డిమాండు తగ్గింపు ప్రయత్నాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, సంస్థాగత యంత్రాంగాలను బలోపేతం చేయడానికి, డిజిటల్ వేదికలను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని ఎన్ఎంబీఏ 2.0 యాప్ ఆవిష్కరణ తెలియజేస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2255515) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Kannada