పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
స్థిరంగా కొనసాగుతోన్న 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల విక్రయాలు
· ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 17.83 లక్షలకు పైగా సిలిండర్ల విక్రయం
· నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 81,000 కంటే ఎక్కువగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల అమ్మకం
· పీఎన్‌జీ విస్తరణ తాజా సమాచారం: మార్చి నుంచి 5.27 లక్షల కనెక్షన్లకు ప్రారంభమైన గ్యాస్ సరఫరా.. మరో 2.60 లక్షల కనెక్షన్లకు సరిపడా సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు.. వీటితో కలిపి 7.87 లక్షలకు చేరుకోనున్న మొత్తం కనెక్షన్లు.. కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్న 5.97 లక్షల మంది
· దేశవ్యాప్తంగా సాధారణంగా పనిచేస్తోన్న రిటైల్ విక్రయకేంద్రాలు
· ఆ ప్రాంతంలో ఉన్న భారతీయ నావికులంతా సురక్షితం.. భారతీయ జెండా కలిగిన నౌకలకు సంబంధించి గత 24 గంటల్లో నమోదు కాని అవాంఛనీయ సంఘటనలు
· దేశంలో రద్దీ లేకుండా సాధారణంగా కొనసాగుతున్న ఓడరేవు కార్యకలాపాలు
· గల్ఫ్, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తోన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
· భారతీయ సమాజ భద్రత, సంక్షేమంపైనే ప్రధాన దృష్టిని సారించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
· మెరుగుపడుతోన్న మొత్తం విమాన ప్రయాణ పరిస్థితి... ఫిబ్రవరి 28 నుంచి ఆ ప్రాంతం నుంచి భారత్‌కు చేరుకున్న సుమారు 12.38 లక్షల మంది ప్రయాణికులు
నాడు పోస్టు చేయడమైనది:
24 APR 2026 5:21PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం తాజా విషయాలను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు.. ఇంధన లభ్యత, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందుతున్న సహాయం, కీలక రంగాలలో స్థిరత్వాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.
ఇంధన సరఫరా, లభ్యత
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తీసుకుంటున్న చర్యలను పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ వివరించింది. ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై మంత్రిత్వ శాఖ పేర్కొన్న వివరాలు:
ప్రజా సూచనలు, పౌర అవగాహన
· పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కాబట్టి ప్రజలు వీటిని కంగారుతో కొనుగోలు చేయొద్దని సూచించారు.
· వదంతులను నమ్మొద్దు. సరైన సమాచారం కోసం అధికారిక ఖాతాలపై మాత్రమే ఆధారపడాలి.
· ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాలని, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లడం నివారించాలని కోరారు.
· పీఎన్‌జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిందిగా అందరినీ ప్రోత్సహిస్తున్నారు.
· ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.
ప్రభుత్వ సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య గృహ వినియోగ ఎల్‌పీజీ, గృహావసరాల పీఎన్‌జీ, రవాణా సీఎన్‌జీ విషయంలో సరఫరా 100 శాతం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
· వాణిజ్య ఎల్‌పీజీ విషయంలో ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు ఫార్మా, ఉక్కు, వాహనాలు, విత్తన - వ్యవసాయ రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. వలస కార్మికుల కోసం 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరా 2026 మార్చి 2, 3 తేదీల్లో ఉన్న సగటు రోజువారీ సరఫరాతో పోలిస్తే రెట్టింపు అయింది.
· ప్రభుత్వం ఇప్పటికే సరఫరా, డిమాండ్ రెండింటినీ సమన్వయం చేసేలా పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. గ్యాస్ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పొడిగించడం.. ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను నిర్ధారించడం వంటివి ఉన్నాయి.
· ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చారు.
· చిన్న, మధ్యతరహా వినియోగదారులకు పంపిణీ చేయడం కోసం రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌ను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
· గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
· నిత్యావసరాల చట్టం- 1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను పర్యవేక్షించడానికి.. అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
· పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటి నిత్యావసరాల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడం, నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాథమిక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరోసారి స్పష్టం చేసింది.
· కేంద్రం ప్రభుత్వం 27.03.2026, 02.04.2026 నాటి లేఖల ద్వారా ఇంధనం తగినంతగా అందుబాటులో ఉందన్న భరోసాను ప్రజలకు ఇచ్చేందుకు ముందస్తు ప్రజా సమాచార మార్పిడి అవసరమని ప్రధానంగా చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 02.04.2026న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి… 06.04.2026న సమాచార - ప్రసార, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శులతో కలిసి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రముఖంగా చెప్పారు:
o ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజా సూచనలను జారీ చేయడం.
o సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలు, అవాస్తవ సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.
o జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిరోజూ తనిఖీలను ఉద్ధృతం చేయటం, ఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ దాడులు, తనిఖీలను కొనసాగించడం.
o సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
o రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ (ఎస్‌కేఓ) కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
o పీఎన్‌జీ వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
o ఎల్‌పీజీ సరఫరాలో ముఖ్యంగా గృహ అవసరాల ఎల్‌పీజీ సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల లక్షిత పంపిణీ విధానాన్ని అనుసరించడం.
· అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలు, జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశాయి.
· ప్రస్తుతం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పత్రికా ప్రకటనలు కూడా జారీ చేస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
· ఎల్‌పీజీ అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 2300 కంటే ఎక్కువ దాడులు నిర్వహించారు.
· ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేశాయి. అవి నిన్నటివరకు 307 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లకు జరిమానాలు విధించటంతో పాటు 70 మంది డీలర్లను సస్పెండ్ చేశాయి.
ఎల్‌పీజీ సరఫరా
గృహావసరాల ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
· గృహ వినియోగదారులకు సంబంధించిన ఎల్‌పీజీ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది.
· ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
· నిన్న పరిశ్రమవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు 98 శాతానికి పెరిగాయి.
· సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 94 శాతానికి పెంచారు. నమోదు చేసుకున్న ఫోన్ నంబర్‌కు డీఏసీ వస్తుంది.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు
· మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులు కూడా ఉన్నాయి.
· కేంద్ర ప్రభుత్వం 06.04.2026 నాటి లేఖ ద్వారా వలస కార్మికులకు పంపిణీ చేసే 5 కిలోల ఎఫ్‌టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ) సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని ప్రతి రాష్ట్రంలోనూ రెట్టింపు చేస్తున్నట్లు తెలియజేసింది. 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితిని మించి 2026 మార్చి 2-3 తేదీల్లో వలస కార్మికులకు సరఫరా చేసిన సగటు సిలిండర్ల సంఖ్య ఆధారంగా ఈ పెంపు ఉంటుంది. ఈ 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటాయి. వీటిని చమురు మార్కెటింగ్ కంపెనీల సహకారంతో కేవలం ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది.
· 2026 ఏప్రిల్ 1 నుంచి 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు 17.83 లక్షలకు పైగా విక్రయమయ్యాయి.
· నిన్న దేశవ్యాప్తంగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు 81,000కు పైగా అమ్ముడయ్యాయి.
· ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (పీఎస్‌యూ ఓఎంసీ) 2026 ఏప్రిల్ 3 నుంచి 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లపై సుమారు 8500 అవగాహన శిబిరాలను నిర్వహించాయి. ఈ శిబిరాల ద్వారా 1,33,000 కంటే ఎక్కువ 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
· నిన్న సుమారు 250 శిబిరాల ద్వారా 5549 ఐదు కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
· వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.
· 2026 ఏప్రిల్‌లో (23.04.2026 వరకు) మొత్తం 1,47,262 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ (77.50 లక్షలకు పైగా 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్లకు సమానం) విక్రయమైంది.
సహజ వాయువు సరఫరా, పీఎన్జీ విస్తరణ చర్యలు
· గృహ వినియోగ పీఎన్జీ, రవాణా అవసరాల సీఎన్జీ వంద శాతం సరఫరాతో వినియోగదారులకు ప్రాధాన్యతనిచ్చారు.
· ఎరువుల కర్మాగారాలకు గ్యాస్ కేటాయింపును ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు తొంభై ఐదు శాతానికి పెంచారు.
· నగర గ్యాస్ పంపిణీ వ్యవస్థల ద్వారా సరఫరాలతో సహా ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను ఎనభై శాతం వరకు పెంచారు.
· నగర గ్యాస్ పంపిణీ సంస్థలు (సీజీడీ) వాటి పరిధిలోని హోటళ్ళు, రెస్టారెంట్లు, క్యాంటీన్లు వంటి వ్యాపార సంస్థలకు వంట గ్యాస్ లభ్యతపై ఉన్న ఆందోళనలను పరిష్కరించేందుకు వాటికి పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
· ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ సహా గ్యాస్ పంపిణీ సంస్థలు గృహ, వాణిజ్య పీఎన్జీ కనెక్షన్లకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.
· సీజీడీ వ్యవస్థల విస్తరణకు అవసరమైన అనుమతులను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను ఆదేశించారు.
· ఎల్పీజీ నుంచి పీఎన్జీకి దీర్ఘకాలిక మార్పు దిశగా సహకారం అందించే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పది శాతం అదనపు వంట గ్యాస్ పది శాతం అదనపు వంట గ్యాస్ కేటాయిస్తామని 18.03.2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రతిపాదించింది. పీఎన్జీకి విస్తరణ సంస్కరణలతో ముడిపడి ఉన్న అదనపు వంట గ్యాస్ వాయువు కేటాయింపును ఇరవై రెండు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పొందుతున్నాయి.
· రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 24.03.26 తేదీ లేఖ ద్వారా, నగర గ్యాస్ పంపిణీ మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన పరిష్కరించేందుకు, తక్కువ సమయ పరిమితులతో కూడిన వేగవంతమైన ఆమోద విధానాన్ని మూడు నెలల పాటు ప్రత్యేకంగా అమలులోకి తెచ్చింది.
· భారత ప్రభుత్వం 24.03.2026 తేదీ గెజిట్ ద్వారా, నిత్యావసర వస్తువుల చట్టం, 1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్ల నిర్మాణం, ఏర్పాటు, నిర్వహణ,విస్తరణతో సహా ఇతర సౌకర్యాల ద్వారా) ఉత్తర్వు, 2026 ను జారీ చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్ లైన్ల ఏర్పాటుకు, విస్తరణకు నిర్ణీత కాలపరిమితితో కూడిన సరళీకృత విధానాన్ని కల్పిస్తుంది. ఇది అనుమతులు, భూమి లభ్యత విషయంలో తలెత్తే జాప్యాన్ని పరిష్కరిస్తూ, నివాస ప్రాంతాలతో సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధిని సాధ్యం చేస్తుంది. ఇది పీఎన్జీ వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేయడం, చిట్టచివరి వినియోగదారు వరకు అనుసంధానాన్ని మెరుగుపరచడం, స్వచ్ఛమైన ఇంధనాల వైపు మళ్లే ప్రక్రియకు మద్దతునివ్వడం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసి, భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తుందని భావిస్తున్నారు.
· ఇళ్లకు పీఎన్జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్జీఆర్బీ ఆదేశించింది. అలాగే, పీఎన్జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించేందుకు నేషనల్ పీఎన్జీ డ్రైవ్ 2.0ను 30.06.2026 వరకు పొడిగించారు.
· భారత ప్రభుత్వం స్వచ్ఛమైన, మరింత సురక్షితమైన, స్వయం సమృద్ధి ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించేందుకు నమూనా రాష్ట్ర సీబీజీ విధానం ముసాయిదాను రూపొందించింది. సీబీజీ అభివృద్ధికి రాష్ట్రాలు తమ పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలు దిశగా సాగే తమ సొంత వ్యవస్థను సృష్టించుకునేలా, ఈ నమూనా విధానం సమగ్రమైన, సరళమైన మార్గదర్శక రూపంలో పనిచేస్తుంది. దీన్ని ఎంచుకునే రాష్ట్రాలకు తదుపరి విడత వాణిజ్య వంట గ్యాస్ అదనపు కేటాయింపులో ప్రాధాన్యత కల్పిస్తారు.
· నగర గ్యాస్ పంపిణీ వ్యవస్థలు, మౌలిక సదుపాయాలకు సంబంధించి ఏర్పాటు/నిర్వహణ అనుమతులను పదిహేను రోజుల్లోగా మంజూరు చేయవలసిందిగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు, కాలుష్య నియంత్రణ కమిటీలకు తగిన సూచనలు జారీ చేయాలని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 07.04.2026 తేదీ ఉత్తర్వు ద్వారా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది.
· 2026 మార్చి నుంచి సుమారు 5.27 లక్షల పైప్ లైన్ కనెక్షన్లకు గ్యాస్ సరఫరాను ప్రారంభించారు. అదనంగా 2.60 లక్షల కనెక్షన్లకు మౌలిక సదుపాయాలను సిద్ధం చేశారు. దీనితో మొత్తంగా 7.87 లక్షల కనెక్షన్లు పూర్తయ్యాయి. అంతేకాకుండా సుమారు 5.97 లక్షల మంది వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు.
· 23.04.2026 నాటికి, నలభై రెండు వేల పైగా పీఎన్జీ వినియోగదారులు మై పీఎన్జీడీ.ఇన్ వెబ్ సైట్ ద్వారా తమ ఎల్పీజీ కనెక్షన్లను రద్దు చేసుకున్నారు.
ముడి చమురు పరిస్థితి, రిఫైనరీ కార్యకలాపాలు
అన్ని రిఫైనరీలూ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. వాటి వద్ద తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయి. అలాగే పెట్రోల్, డీజిల్ నిల్వలను కూడా తగిన స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నారు.
*గృహ అవసరాల వినియోగానికి రిఫైనరీల నుంచి వంటగ్యాస్ ఉత్పత్తిని పెంచారు.
*దేశీయ మార్కెట్లో పెట్రో రసాయన ముడి పదార్థాల లభ్యత కోసం వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన సంయుక్త అధ్యయన బృందం ఏర్పాటైంది. భారత ప్రభుత్వం 2026 ఏప్రిల్ 01 నాటి ఉత్తర్వు ద్వారా 'సెంటర్ ఫర్ హై టెక్నాలజీ' (సీహెచ్టీ) నిర్ణయించిన ప్రకారం, కీలక రంగాలకు అవసరమైన కనీస పరిమాణంలో సీ3, సీ4 స్ట్రీమ్స్‌ను ఆయిల్ రిఫైనరీ కంపెనీలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లకు అందుబాటులో ఉంచేందుకు అనుమతి ఇచ్చింది.
*ఫార్మాస్యూటికల్స్ విభాగం, కెమికల్స్, పెట్రో కెమికల్స్ విభాగం (డీసీపీసీ), పరిశ్రమల, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఫార్మా, రసాయన రంగ కంపెనీల కోసం ఎల్‌పీజీ నిల్వ నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నుల ను కేటాయించారు.
*2026 ఏప్రిల్ 9 నుంచి ముంబై, కొచ్చి, మథుర చమురు శుద్ధి కర్మాగారాలు రసాయన, ఔషధ పరిశ్రమలకు 6400 మెట్రిక్ టన్నులకు పైగా ప్రొపైలీన్‌ను విక్రయించాయి.
రిటైల్ ఇంధనం లభ్యత, ధరలు
దేశవ్యాప్తంగా రిటైల్ విక్రయ కేంద్రాలు (పెట్రోల్ బంకులు) యథావిధిగా పనిచేస్తున్నాయి.
*పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. అయినప్పటికీ, వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది.
*భారత ప్రభుత్వం 11.04.2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిల్ ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.55.50కి, ఏటీఎఫ్ పై రూ.42కి పెంచింది. దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తుల లభ్యతను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
*పెట్రోల్, డీజిల్ సాధారణ రిటైల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ రంగ చమురు సంస్థల విక్రయ కేంద్రాల వద్ద ఎలాంటి ధరల పెంపూ లేదు.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
*రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపులతో పాటు అదనంగా 48,000 లీటర్ల కిరోసిన్ అందించారు.
*18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్కేఓ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి, కాగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ఎటువంటి అవసరం లేదని తెలిపాయి.
సముద్ర భద్రత, షిప్పింగ్ కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్‌లో ప్రస్తుత సముద్ర స్థితిగతులు, అలాగే భారతీయ నౌకలు, సిబ్బందిని రక్షించడానికి తీసుకుంటున్న చర్యల గురించి రేవులు, నౌకాయాన, జల రవాణా మంత్రిత్వ శాఖ వివరించింది.
· ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతీయ దౌత్య కార్యాలయాలు, సముద్రయాన భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ నావికుల సంక్షేమం, అంతరాయం లేని సముద్రయాన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
· ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా గల నౌకలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదు.
· నౌకాయాన డైరెక్టరేట్ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పని చేస్తోంది. ఈ కంట్రోల్ రూమ్ ప్రారంభమైనప్పటి నుంచి 7,553 ఫోన్ కాల్స్, 16,033 పైగా ఈ మెయిల్స్ స్వీకరించింది. గత 24 గంటల్లో 150 కాల్స్, 394 ఈ మెయిల్స్ అందాయి.
· డిజి షిప్పింగ్ ఇప్పటివరకు 2,729 పైగా భారతీయ సముద్ర యానికులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావడానికి సహకరించింది, వీరిలో గత 24 గంటల్లో గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 49మంది కూడా ఉన్నారు.
· భారతదేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఎక్కడా రద్దీ ఉన్నట్లు సమాచారం లేదు.
భారత పౌరుల భద్రత
గల్ఫ్, పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో మారుతున్న పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. అక్కడి భారతీయ సమాజం భద్రత, క్షేమం కోసం కింద పేర్కొన్న ప్రత్యేక చర్యలు చేపట్టింది.
· విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గల్ఫ్, పశ్చిమ ఆసియా ప్రాంతంలోని పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తోంది.భారతీయ సమాజ భద్రత,సంక్షేమం కోసం తన ప్రయత్నాలను కేంద్రీకరిస్తోంది.
· సమాచార మార్పిడి, మద్దతు కోసం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగిస్తోంది.
· భారతీయ పౌరులు, వారి కుటుంబ సభ్యుల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ నిరంతరం పని చేస్తోంది.
· ఆ ప్రాంతంలోని భారత రాయబార, దౌత్య కార్యాలయాలు నిరంతర హెల్ప్ లైన్లను నిర్వహిస్తూ, పౌరులకు సహాయం అందిస్తున్నాయి.
· దౌత్య కార్యాలయాలు స్థానిక ప్రభుత్వాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ, భద్రతా మార్గదర్శకాలు, ప్రయాణ తాజా సమాచారం, కాన్సులర్ సేవలు, సంక్షేమ చర్యలను వివరిస్తూ క్రమం తప్పకుండా సూచనలను జారీ చేస్తున్నాయి.
· మన దౌత్య కార్యాలయాలు భారతీయ సమాజ సంఘాలు, వృత్తిపరమైన సమూహాలు, భారతీయ కంపెనీల ఆందోళనలను పరిష్కరించేందుకు వారితో చురుకుగా సంప్రదింపులు జరుపుతున్నాయి.
· భారతీయ నావికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.దౌత్య కార్యాలయాలు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవడం, కాన్సులర్ మద్దతును అందించడం, అవసరమైన చోట తిరిగి భారత్‌కు చేరుకోవడానికి వీలు కల్పించడం వంటి సహాయక చర్యలను చేపడుతున్నాయి.
· మొత్తం విమాన ప్రయాణ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి, ఈ ప్రాంతం నుంచి భారత్‌కు అదనపు విమానాలు నడుస్తున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి సుమారు 12,38,000 మంది ప్రయాణికులు ఈ ప్రాంతం నుంచి భారత్‌కు ప్రయాణించారు.
· యూఏఈలో, విమానయాన సంస్థలు నిర్వహణ,భద్రతా పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిమితంగా వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి. యూఏఈ నుంచి భారత్‌కు సుమారు 110 విమానాలు నడిచే అవకాశం ఉంది.
· సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
· ఖతార్ గగనతలాన్ని పాక్షికంగా తెరవటంతో, ఖతార్ ఎయిర్‌వేస్ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు విమానాలను నడుపుతోంది.
· కువైట్ గగనతలం తెరిచి ఉంది. విమానయాన సంస్థలు త్వరలోనే పరిమితంగా కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాయని ఆశిస్తున్నారు. సౌదీ అరేబియాలోని దమ్మామ్ నుంచి నాన్-షెడ్యూల్డ్ విమానాలు నడుస్తున్నాయి.
· బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది, గల్ఫ్ ఎయిర్ భారత్ కు విమానాలను నడుపుతోంది.
· ఇరాక్ గగనతలం పరిమిత విమాన కార్యకలాపాలతో తెరిచి ఉంది.వీటిని భారతదేశానికి ప్రయాణించడానికి ఉపయోగించుకోవచ్చు.
· ఇరాన్ గగనతలం సరకు రవాణా, చార్టర్డ్ విమానాల కోసం పాక్షికంగా తెరిచి ఉంది. ఇరాన్‌కు ప్రయాణించవద్దని భారతీయ పౌరులను కోరుతూ, అక్కడ ఉన్నవారు భూ సరిహద్దుల గుండా బయటకు రావాలని సూచిస్తూ రాయబార కార్యాలయం తన సలహాను మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటివరకు, 1,096 మంది విద్యార్థులు, 657 మంది మత్స్యకారులతో సహా మొత్తం 2,432 మంది భారతీయ పౌరులు ఆర్మేనియా, అజర్‌బైజాన్ మీదుగా బయటకు వెళ్లేందుకు వీలు కల్పించారు.
· ఇజ్రాయెల్ గగనతలం తెరిచి ఉంది, భారతదేశానికి తదుపరి ప్రయాణం కోసం పరిమిత విమాన కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి.
***
(రిలీజ్ ఐడి: 2255509)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Marathi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Bengali
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Odia
,
Malayalam