ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2025 11:15AM by PIB Hyderabad
వేదికపై ఆసీనులైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి శ్రీ దత్తాత్రేయ హోసబాలే గారు, కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా!
సంఘ్ ప్రయాణంలోని ప్రతి మలుపులో సుదీర్ఘ కాలం పాటు కీలక పాత్ర పోషించిన మన కార్యకర్తల్లో ఒకరైన విజయ్ కుమార్ మల్హోత్రా గారిని మనం నిన్న కోల్పోయాం. నేను ఆయనకు నా గౌరవపూర్వక నివాళులర్పిస్తున్నాను.
మిత్రులారా,
ఈ రోజు మహానవమి. ఇది సిద్ధిదాత్రి అయిన అమ్మవారి పండుగ. నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. రేపు విజయదశమి మహోత్సవం. ఇది అన్యాయంపై న్యాయం... అసత్యంపై సత్యం... చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక. విజయదశమి భారతీయ సంస్కృతి ఆలోచన. నమ్మకానికి శాశ్వత నిదర్శనం. వంద సంవత్సరాల కిందట ఈ పవిత్ర సందర్భంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించటం యాదృచ్ఛికం కాదు. ఇది ఒక ప్రాచీన సంప్రదాయానికి పునరుజ్జీవనం. ఈ సంప్రదాయంలో, ప్రతి యుగంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి జాతి చైతన్యం ఎప్పటికప్పుడు కొత్త రూపాల్లో వ్యక్తమవుతుంది. ఈ యుగంలో ఆ శాశ్వత జాతీయ చైతన్యానికి సంఘ్ ఒక పవిత్ర ప్రతిరూపం.
మిత్రులారా,
సంఘ్ శత వార్షికోత్సవ ఘనమైన కార్యక్రమంలో భాగస్వాములమవడం మన తరానికి చెందిన కార్యకర్తల అదృష్టం. ఈ సందర్భంలో దేశానికి సేవ చేయాలనే సంకల్పానికి అంకితమైన అసంఖ్యాక కార్యకర్తలకు నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. సంఘ్ వ్యవస్థాపకులు, ఆదర్శమూర్తి పూజ్య డాక్టర్ హెడ్గేవార్ గారి పాదాలకు నమస్కరిస్తున్నాను.
మిత్రులారా,
సంఘ్ 100 సంవత్సరాల ఘనమైన ప్రస్థాన జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం ఈ రోజు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను, స్మారక నాణేలను విడుదల చేసింది. 100 రూపాయల నాణేనికి ఒక వైపు జాతీయ చిహ్నం, మరో వైపు సింహంతో పాటు ఆశీర్వదిస్తున్న భరతమాత గంభీరమైన చిత్రం, ఆమె ముందు భక్తితో నమస్కరిస్తున్న కార్యకర్తలు ఉన్నారు. బహుశా స్వతంత్ర భారత్ చరిత్రలో భారత కరెన్సీపై భరతమాత చిత్రం కనిపించడం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ నాణేనికి సంఘ్ నినాదం కూడా జోడించారు. అదే “రాష్ట్రాయ స్వాహా, ఇదం రాష్ట్రాయ ఇదం న మమ”! (దేశానికి అంకితం, ఈ జీవితం దేశం కోసం... నా కోసం కాదు).
మిత్రులారా,
ఈ రోజు విడుదల చేసిన ప్రత్యేక స్మారక తపాలా బిళ్ళ కు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ కవాతు ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. 1963లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలూ ఆ జాతీయ కవాతులో పాల్గొన్నారు. వారు దేశభక్తి గీతానికి అనుగుణంగా సగర్వంగా కవాతు చేశారు. ఈ బిళ్ళ ఆ చరిత్రాత్మక ఘట్టానికి స్మారకంగా నిలుస్తుంది.
మిత్రులారా,
దేశ సేవలోనూ, సమాజ సాధికారతలోనూ నిరంతరం నిమగ్నమై ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలనూ ఈ స్మారక తపాలా బిళ్ళలో చిత్రీకరించారు. ఈ స్మారక నాణేలు, తపాలా బిళ్ళల కోసం దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
మహానదులు తమ ఒడ్డున మానవ నాగరికతలను పెంపొందించిన విధంగానే సంఘ్ ఒడ్డున దాని ప్రవాహంలో లెక్కలేనన్ని జీవితాలు వికసించాయి. ఒక నది తాను ప్రవహించే భూమిని, గ్రామాలను, ప్రాంతాలను తన జలాలతో సారవంతం చేసి సుసంపన్నం చేసినట్లుగానే... సంఘ్ సైతం ఈ దేశంలోని ప్రతి భాగాన్ని, సమాజంలోని ప్రతి కోణాన్నీ స్పృశించింది. ఇది నిరంతర తపస్సుల ఫలం. ఇది జాతీయతా స్ఫూర్తి నిండిన బలమైన ప్రవాహం.
మిత్రులారా,
ఒక నది అనేక పాయలుగా విడిపోయి... ఒక్కో పాయ ఒక్కో ప్రాంతాన్ని పోషించిన విధంగానే సంఘ్ ప్రస్థానం సాగింది. జీవితంలోని ప్రతి రంగానికి అనుసంధానమైన దాని అనేక అనుబంధ సంస్థలు... విద్య, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహిళా సాధికారత, కళలు, శాస్త్రాలకు, మన శ్రామిక సోదరీ సోదరులకు మద్దతునివ్వడం వంటి రంగాల్లో తమదైన రీతిలో దేశానికి సేవ చేస్తున్నాయి. సామాజిక జీవితంలోని లెక్కలేనన్ని రంగాల్లో సంఘ్ అవిశ్రాంతంగా పనిచేస్తోంది. ఈ ప్రయాణంలోని ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే... ఒకే పాయ అనేక దిశల్లో విస్తరించినప్పటికీ అవి ఎన్నడూ ఒకదానితో ఒకటి ఘర్షణ పడలేదు. ఎన్నడూ విభజనను సృష్టించలేదు. ఎందుకంటే ప్రతి పాయ ఉద్దేశం, పలు రంగాల్లో పనిచేస్తున్న ప్రతీ సంస్థ స్ఫూర్తీ ఒక్కటే... దేశమే ముందు!
మిత్రులారా,
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించినప్పటి నుంచీ దేశ నిర్మాణమనే ఒక గొప్ప లక్ష్యాన్ని అది కలిగి ఉంది. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి అది ఎంచుకున్న మార్గం... వ్యక్తిగత శీల నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడం. అది అనుసరించిన పద్ధతి రోజువారీ క్రమశిక్షణతో కూడిన శాఖ అభ్యాసం.
మిత్రులారా,
పూజ్య డాక్టర్ హెడ్గేవార్ గారికి ఒక విషయం బాగా తెలుసు... ప్రతి పౌరుడు దేశం పట్ల తన కర్తవ్యాన్ని గుర్తించి మేల్కొన్నప్పుడే మన దేశం బలంగా ఉంటుంది. ప్రతి భారతీయుడు దేశం కోసం జీవించడం నేర్చుకున్నప్పుడే మన దేశం ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. అందుకే ఆయన నిరంతరం వ్యక్తిగత శీల నిర్మాణానికి తనను తాను అంకితం చేసుకున్నారు. ఆయన పద్ధతి విశిష్టమైనది. డాక్టర్ హెడ్గేవార్ గారు ఇలా చెప్పడం మనం తరచుగా వింటుంటాం. “పరిస్థితులను ఉన్నవి ఉన్నట్లుగా స్వీకరించి... అవి ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో అలా తీర్చిదిద్దండి.” ప్రజలను సమీకరించడంలో ఆయన అనుసరించిన విధానాన్ని అర్థం చేసుకోవాలంటే... ఒక కుమ్మరి పనిని గుర్తు చేసుకోవచ్చు. ఒక కుమ్మరి ఇటుకలను కాల్చేటప్పుడు అతను నేల మీదున్న సాధారణ మట్టితో పని ప్రారంభిస్తాడు. అతను దానిని సేకరించి, దానిని తడిపి ముద్దచేసి, దానికి ఆకారం ఇచ్చి, మంటల్లో కాలుస్తాడు. అలా చేస్తున్నప్పుడు అతనూ ఆ వేడిని భరిస్తాడు. అతను మట్టితో పాటు తనను తానూ కాల్చుకుంటాడు. ఆ తర్వాత, ఆ ఇటుకలన్నింటినీ కలిపి ఒక అద్భుతమైన కట్టడాన్ని నిర్మిస్తాడు. అదేవిధంగా, డాక్టర్ సాహెబ్ పూర్తిగా సాధారణ ప్రజలను ఎంచుకున్నారు. వారికి శిక్షణనిచ్చారు. వారికి ఒక దార్శనికతను ఇచ్చారు. వారిని తీర్చిదిద్దారు. ఆ విధంగా దేశ సేవ కోసం అంకితభావం గల స్వచ్ఛంద సేవకులను తయారు చేశారు. అందుకే అసాధారణమైన, మునుపెన్నడూ సాధించని కార్యాలను సాధించడం కోసం సామాన్య ప్రజలంతా ఇక్కడ ఏకమవుతారని సంఘ్ గురించి ఆయన చెబుతారు.
మిత్రులారా,
వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించిన ఈ సుందరమైన ప్రక్రియ నేటికీ సంఘ్ శాఖల్లో కనిపిస్తుంది. సంఘ్ శాఖ ప్రాంగణం ఒక పవిత్రమైన స్ఫూర్తి క్షేత్రం. అక్కడి నుంచే ఒక స్వచ్ఛంద కార్యకర్త ప్రయాణం ‘నేను' నుంచి 'మనం' వైపు సాగుతుంది. ఈ శాఖలు వ్యక్తిత్వ నిర్మాణానికి యజ్ఞశాలలు. ఈ శాఖల్లోనే వ్యక్తి శారీరక, మానసిక, సామాజిక వికాసం జరుగుతుంది. కార్యకర్తల మనస్సుల్లో దేశ సేవ స్ఫూర్తి, ధైర్యం రోజురోజుకూ పెరుగుతాయి. వారికి త్యాగం, అంకితభావం సహజమవుతాయి. వ్యక్తిగత కీర్తి కోసం పోటీపడే భావన నశిస్తుంది. వారు సామూహిక నిర్ణయాలు తీసుకునే, సామూహికంగా పనిచేసే సంస్కృతిని అలవర్చుకుంటారు.
మిత్రులారా,
జాతి నిర్మాణమనే గొప్ప లక్ష్యం... వ్యక్తిత్వ నిర్మాణమనే స్పష్టమైన మార్గం... శాఖలో అనుసరించే సరళమైన, చైతన్యవంతమైన విధానం - ఇవే సంఘ్ వందేళ్ల సుదీర్ఘ ప్రయాణానికి పునాదులుగా నిలిచాయి. ఈ స్తంభాలపై దృఢంగా నిలబడిన సంఘ్ లక్షలాది మంది కార్యకర్తలను తీర్చిదిద్దింది. వీరు అంకితభావంతో, సేవతో, జాతీయ ప్రగతి సాధనతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తూ... వివిధ రంగాల్లో దేశానికి తమ అత్యుత్తమ సేవలను అందిస్తున్నారు!
మిత్రులారా,
సంఘ్ ఆవిర్భావం నుంచీ దాని ప్రాధాన్యం ఎల్లప్పుడూ దేశానికే. అందుకే దేశం ఒక పెద్ద సవాలును ఎదుర్కొన్న సందర్భాల్లో సంఘ్ పోరాటంలో పూర్తిగా నిమగ్నమై, దానిని నేరుగా ఎదుర్కొంది. మనం స్వాతంత్య్రోద్యమ కాలాన్ని తిరిగి చూస్తే... పూజ్య డాక్టర్ హెడ్గేవార్ గారు, సంఘ్‌కు చెందిన అనేకమంది కార్యకర్తలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం మనకు కనిపిస్తుంది. డాక్టర్ సాహిబ్ పలుమార్లు జైలుకూ వెళ్లారు. సంఘ్ ఎందరో స్వాతంత్య్ర సమరయోధులకు భుజం భుజం కలిపి మద్దతును, రక్షణను అందించింది. 1942లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా చిమూర్‌లో జరిగిన తిరుగుబాటు సమయంలో అనేకమంది సంఘ్ కార్యకర్తలు బ్రిటీష్ వారి తీవ్రమైన అఘాయిత్యాలను భరించారు. స్వాతంత్య్రానంతరం హైదరాబాద్‌లో నిజాం అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, గోవా స్వాతంత్య్రోద్యమం, దాద్రా నగర్ హవేలీల విముక్తి వంటి అనేక విషయాల్లో సంఘ్ లెక్కలేనన్ని త్యాగాలు చేసింది. కానీ వీటన్నిటిలోనూ దాని స్ఫూర్తి ఒక్కటే: ‘దేశమే ప్రథమం’. లక్ష్యం ఒక్కటే: ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’.
మిత్రులారా,
దేశ సేవ మార్గంలో సంఘ్ ఎప్పుడూ దాడులను, కుట్రలను ఎదుర్కోలేదని కాదు. స్వాతంత్య్రానంతరం సంఘ్‌ను అణచివేయడానికి ఎలా ప్రయత్నాలు జరిగాయో మనం చూశాం. సంఘ్‌ను ఆపడానికి లెక్కలేనన్ని కుట్రలు పన్నారు. పూజ్య గురూజీ (ఎం.ఎస్. గోల్వాల్కర్)పై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంలో గురూజీ అత్యంత నిరాడంబరతతో మాట్లాడారు. ఆ మాటలు చరిత్రలో గొప్ప స్ఫూర్తిగా నిలిచాయి. గురూజీ ఇలా అన్నారు... “కొన్నిసార్లు మన నాలుక మన దంతాల కింద నలిగిపోతుంది. అందుకని మనం మన దంతాలను విరగొట్టుకోం. ఎందుకంటే దంతాలు మనవే... నాలుకా మనదే.” జైలులో అలాంటి చిత్రహింసలను భరించిన తర్వాత, ఎన్నో అఘాయిత్యాలకు గురైన తర్వాత కూడా గురూజీ హృదయంలో కోపం గానీ, దురభిప్రాయం గానీ లేవు. ఆయనది మహర్షి వంటి వ్యక్తిత్వం. ఆయన ఆలోచనా స్పష్టత ప్రతి సంఘ్ కార్యకర్త జీవితానికి మార్గదర్శక కాంతిగా నిలిచింది. అది సమాజం పట్ల ఐక్యత, ఆప్యాయతలనే విలువలను బలపరిచింది. అందుకే సంఘ్ నిషేధాలను, కుట్రలను, తప్పుడు కేసులను ఎదుర్కొన్నప్పటికీ... దాని కార్యకర్తలు తమ హృదయాల్లో ఎన్నడూ ప్రతికూల ఆలోచనలను రానివ్వలేదు. ఎందుకంటే సంఘ్ వేరు... సమాజం వేరు... కాదని వారికి తెలుసు. సమాజం మనందరితో ఏర్పడింది. అందులోని మంచి మనది. అలాగే అందులోని అంతగా మంచిది కానిదీ మనదే.
మిత్రులారా,
సంఘ్‌లో విద్వేషాలు ఎన్నడూ నాటుకోకపోవడానికి రెండో కారణం... ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగ సంస్థల పట్ల ప్రతి కార్యకర్తకు ఉన్న అచంచలమైన విశ్వాసం. దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఇదే విశ్వాసం ప్రతి కార్యకర్తకు బలాన్నిచ్చింది. వారికి పోరాడే సామర్థ్యాన్ని ఇచ్చింది. సమాజంలో ఏకత్వం, రాజ్యాంగ సంస్థలపై విశ్వాసం అనే ఈ రెండు విలువలే ప్రతి సంక్షోభంలోనూ సంఘ్ కార్యకర్తలను సమచిత్తంగా ఉంచాయి. వారిని సమాజం పట్ల సున్నితంగా ఉండేలా చేశాయి. అందుకే సమాజం నుంచి లెక్కలేనన్ని దెబ్బలు తిన్నప్పటికీ... సంఘ్ ఈ రోజు ఒక మహావృక్షంలా దృఢంగా నిలబడింది. నిరంతరం దేశ, సమాజ సేవలో నిమగ్నమై ఉంది. ఇప్పుడే ఇక్కడున్న మన కార్యకర్తల్లో ఒకరు ఎంతో అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. సున్నా నుంచి శతాబ్ధం వరకు చేరుకున్నాం... భారత్ సదా విజయం సాధించాలనే స్ఫూర్తిని హృదయంలో నింపుకున్నాం... మాతృభూమిని పూజిస్తూ మనం సాధన చేస్తున్నాం. దానిలోని పాఠం ఏమిటంటే... మనం మన దేశాన్ని దేవతగా భావించాం. సేవలో వెలిగే దీపాలుగా మన శరీరాలను మార్చుకోవడం నేర్చుకున్నాం. నిజంగా అది అద్భుతం.
మిత్రులారా,
మొట్టమొదటి నుంచి దేశభక్తికి, సేవకు సంఘ్ పర్యాయపదంగా నిలిచింది. దేశ విభజన విషాదం లక్షలాది కుటుంబాలను నిరాశ్రయులను చేసినప్పుడూ సంఘ్ కార్యకర్తలు శరణార్థులకు సేవ చేశారు. తమ పరిమిత వనరులతోనే సంఘ్ కార్యకర్తలు ముందుండి పోరాడారు. అవి కేవలం సహాయక చర్యలు మాత్రమే కాదు... దేశపు ఆత్మకు బలాన్నిచ్చే ప్రయత్నం.
మిత్రులారా,
1956లో గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న అంజర్‌ను ఒక వినాశకరమైన భూకంపం తాకింది. ఎక్కడ చూసినా నాశనమైన దృశ్యాలతో విధ్వంసం అపారంగా ఉంది. ఆ సమయంలోనూ సంఘ్ కార్యకర్తలు సహాయక కార్యకలాపాల్లో, బాధితుల రక్షణ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ తరుణంలోనూ అక్కడ పనులు చూసుకుంటున్న గుజరాత్ సీనియర్ ప్రచారక్ వకీల్ సాహెబ్‌కు పూజ్య గురూజీ ఒక లేఖ రాశారు. ఆయన ఇలా రాశారు: “నిస్వార్థంగా ఇతరుల బాధను తగ్గించడానికి తాను బాధను భరించడమే ఉదాత్త హృదయానికి చిహ్నం.”
మిత్రులారా,
ఇతరుల బాధలను తొలగించడానికి ఆ బాధను తామే భరించడం ప్రతి కార్యకర్త కోసం నిజమైన గుర్తింపు. 1962 నాటి యుద్ధ రోజులను గుర్తు చేసుకోండి. సంఘ్ కార్యకర్తలు సైన్యానికి మద్దతుగా నిలవడానికి, వారి మనోధైర్యాన్ని పెంచడానికి, సరిహద్దుల్లోని గ్రామాలకు సహాయం అందించడానికి రేయింబవళ్లూ పనిచేశారు. 1971లో తూర్పు పాకిస్తాన్ నుంచి లక్షలాది మంది శరణార్థులు భారత్‌లోకి వచ్చినప్పుడు వారికి ఆశ్రయం లేదు... వనరులూ లేవు. ఆ కష్టకాలంలో సంఘ్ కార్యకర్తలు వారికోసం ఆహారాన్ని సేకరించారు. వారికి ఆశ్రయం కల్పించారు. ఆరోగ్య సంరక్షణ సేవలూ అందించారు. వారి కన్నీళ్లను తుడిచారు. వారి బాధలో పాలుపంచుకున్నారు.
మిత్రులారా,
1984లో సిక్కులపై జరిగిన మారణకాండ సమయంలోనూ అనేక సిక్కు కుటుంబాలు సంఘ్ కార్యకర్తల ఇళ్లలో ఆశ్రయం పొందాయని మనకు బాగా తెలుసు. ఇది సంఘ్ కార్యకర్తల సహజ ప్రవృత్తి.
మిత్రులారా,
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పీ.జీ. అబ్దుల్ కలాం ఒకసారి చిత్రకూట్‌ను సందర్శించారు. అక్కడ నానాజీ దేశ్‌ముఖ్ జీ తన ఆశ్రమంలో చేస్తున్న పనిని ఆయన చూశారు. అక్కడి సేవా కార్యక్రమాలను గమనించిన డాక్టర్ కలాం ఆశ్చర్యపోయారు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జీ నాగ్‌పూర్‌ను సందర్శించినప్పుడు సంఘ్ క్రమశిక్షణ, నిరాడంబరతకు ఎంతగానో ప్రభావితులయ్యారు.
మిత్రులారా,
పంజాబ్ వరదల్లో... హిమాచల్, ఉత్తరాఖండ్ విపత్తుల్లో... కేరళలోని వయనాడ్ విషాదంలో సహాయం చేయడానికి సంఘ్ కార్యకర్తలు ఎల్లప్పుడూ అందరికంటే ముందుగా చేరుకుంటారని ఈ రోజూ మీరు చూడవచ్చు. కోవిడ్ కాలంలోనూ సంఘ్ ధైర్యాన్ని, సేవా స్ఫూర్తిని యావత్ ప్రపంచం ప్రత్యక్షంగా చూసింది.
మిత్రులారా,
ఈ 100 ఏళ్ల ప్రస్థానంలో సంఘ్ చేసిన గొప్ప పనుల్లో ఒకటి... సమాజంలోని వివిధ వర్గాల్లో ఆత్మ చైతన్యాన్ని, ఆత్మగౌరవాన్ని మేల్కొల్పడం. ఇందుకోసం దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలు, చేరుకోవడానికి అత్యంత కష్టతరమైన ప్రాంతాల్లోనూ సంఘ్ పనిచేసింది. మన దేశంలో దాదాపు కోటి మంది గిరిజన సోదరీ సోదరులు ఉన్నారు. సంఘ్ వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంది. చాలా కాలం పాటు ప్రభుత్వాలు వారికి ప్రాధాన్యమివ్వలేదు. సంఘ్ మాత్రం వారి సంస్కృతికి, వారి పండుగలకు, వారి వేడుకలకు, వారి భాషకు, వారి సంప్రదాయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. సేవా భారతి, విద్యా భారతి, ఏకల్ విద్యాలయాలు, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం వంటి సంస్థలు గిరిజన సమాజ సాధికారతకు మూలస్తంభాలుగా నిలిచాయి. ఈ రోజు మన గిరిజన సోదరీ సోదరుల్లో ఉద్భవించిన ఆత్మవిశ్వాసం వారి జీవితాలను మారుస్తోంది.
మిత్రులారా,
దశాబ్దాలుగా సంఘ్ గిరిజన సంప్రదాయాలను, ఆచారాలు, విలువలను పరిరక్షించడానికి, కొనసాగించడానికి అంకితభావంతో పనిచేస్తోంది. ఈ విషయంలో అది తన కర్తవ్యాన్ని నెరవేర్చింది. భారత సాంస్కృతిక గుర్తింపును కాపాడటంలో దాని అంకితభావం ప్రధాన పాత్ర పోషించింది. మన గిరిజన సోదరీ సోదరుల జీవితాలను సులభతరం చేయడానికి దేశంలోని ప్రతి మూలలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న అసంఖ్యాక సంఘ్ కార్యకర్తలనూ నేను అభినందింస్తున్నాను.
మిత్రులారా,
శతాబ్దాలుగా సమాజంలో పాతుకుపోయిన రుగ్మతలు... అంటే ఆధిక్యతా నిస్పృహలు, దురాచారాలు, అంటరానితనం వంటివి హిందూ సమాజానికి ఒక పెద్ద సవాలుగా ఉన్నాయి. ఇది ఒక తీవ్రమైన సమస్య. దీనిపై సంఘ్ నిరంతరం పనిచేస్తోంది. మహాత్మా గాంధీ ఒకసారి వార్ధాలోని సంఘ్ శిబిరాన్ని సందర్శించారు. ఆయన సంఘ్‌లో చూసిన సమానత్వం, ప్రేమ, సామరస్యం, సమచిత్తత, ఆప్యాయత వంటి వాటిని బహిరంగంగా ప్రశంసించారు. చూడండి... డాక్టర్ సాహెబ్ నుంచి నేటి వరకు సంఘ్‌లోని ప్రతి మహనీయుడు... ప్రతి సర్సంఘచాలక్... వివక్షకు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. పరమ పూజ్య గురూజీ నిరంతరం “‘న హిందూ పతితో భవేత్’” అనే భావనను ప్రోత్సహించారు. అంటే ప్రతి హిందువు ఒకే కుటుంబం అని. ఏ హిందువునూ ఎన్నడూ కించపరచలేరు, తక్కువ చేయలేరు. పూజ్య బాలా సాహెబ్ దేవరస్ జీ చెప్పిన మాటలు మనందరికీ గుర్తున్నాయి. అంటరానితనం పాపం కాకపోతే ఈ ప్రపంచంలో పాపమే లేదు! అని ఆయన వ్యాఖ్యానించారు. సర్సంఘచాలక్‌గా సేవ చేస్తున్నప్పుడు పూజ్య రాజూ భయ్యా జీ, పూజ్య సుదర్శన్ జీ ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లారు. ప్రస్తుత సర్సంఘచాలక్ గౌరవ మోహన్ భగవత్ జీ సమాజంలో సామరస్యం కోసం ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించి... ఈ సందేశాన్ని ప్రతి గ్రామంలోనూ వ్యాప్తి చేశారు. "ఒక బావి, ఒక దేవాలయం, ఒక శ్మశానవాటిక అనే ఆయన సందేశంతో సంఘ్ దేశంలోని ప్రతి మూలకూ చేరుకుంది. వివక్ష వద్దు... విభేదాలు వద్దు... కలహాలూ వద్దు... ఇదే సామరస్యానికి ఆధారం. ఇదే సమ్మిళిత సమాజానికి ప్రతిజ్ఞ. సంఘ్ దీనికి నిరంతరం కొత్త బలాన్ని, శక్తిని అందిస్తోంది."
మిత్రులారా,
వంద సంవత్సరాల కిందట సంఘ్ ఆవిర్భవించినప్పుడు... ఆనాటి అవసరాలు, పోరాటాలు భిన్నంగా ఉండేవి. మనం శతాబ్దాల రాజకీయ బానిసత్వం నుంచి విముక్తి పొందాలి. మన సాంస్కృతిక విలువలను కాపాడుకోవాలి. అయితే ఈ వంద సంవత్సరాల తరువాత దేశం అభివృద్ధి దిశగా పురోగమిస్తున్నప్పుడు, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దేశంతో పాటు దానిలోని అసంఖ్యాక పేదలు పేదరికాన్ని అధిగమించి ఎదుగుతున్నప్పుడు, మన యువతకు కొత్త రంగాల్లో నూతన అవకాశాలు లభిస్తున్నప్పుడు, ప్రపంచ దౌత్యం నుంచి వాతావరణ విధానాల వరకు ప్రపంచంలో తన గళాన్ని భారత్ స్పష్టంగా వినిపిస్తున్నప్పుడు... నేటి సవాళ్లు భిన్నంగా ఉన్నాయి. పోరాటాలూ భిన్నంగానే ఉన్నాయి.
ఇతర దేశాలపై ఆర్థికంగా ఆధారపడటం, మన ఐక్యతను విచ్ఛిన్నం చేసే కుట్రలు, మన జనాభా స్వరూపాన్ని మార్చే కుతంత్రాల వంటి ఈ సవాళ్లను ప్రధానమంత్రిగా మన ప్రభుత్వం ద్వారా వేగంగా పరిష్కరిస్తున్నందుకు నేను చాలా సంతృప్తిగా ఉన్నానని సవినయంగా తెలియజేస్తున్నాను. ఒక స్వచ్ఛంద కార్యకర్తగా... రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ సవాళ్లను గుర్తించడమే కాకుండా, వాటిని ఎదుర్కోవడానికి ఒక పక్కా కార్యాచరణ ప్రణాళికనూ సిద్ధం చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. గౌరవ దత్తాత్రేయ గారు ప్రస్తావించిన విషయాలను నాదైన శైలిలో మరోసారి చెప్పాలనుకుంటున్నాను.
మిత్రులారా,
సంఘ్ సూచించే ఐదు మార్పులు ఆత్మజ్ఞానం, సామాజిక సామరస్యం, కుటుంబ చైతన్యం, పౌరుల విధులు, పర్యావరణం అనే ఈ తీర్మానాలు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ప్రతి కార్యకర్తకూ గొప్ప స్ఫూర్తినిస్తాయి.
మిత్రులారా,
ఆత్మసాక్షాత్కారం అంటే... ఆత్మజ్ఞానం పొందడం, బానిసత్వపు మనస్తత్వం నుంచి విముక్తి పొందడం. మన వారసత్వం పట్ల, మన సొంత భాష పట్ల గర్వపడటం. స్వదేశాభిమానంతో, స్వయం సమృద్ధిగా ఉండటం. నా దేశవాసులారా... ఇది అర్థం చేసుకోండి. స్వయం సమృద్ధి సాధించడం ఒక ఐచ్ఛికం కాదు. అది ఒక ఆవశ్యకత. మనం మన స్వదేశీ మంత్రాన్ని ఒక సామాజిక నిబద్ధతగా మార్చాలి. 'వోకల్ ఫర్ లోకల్' ఉద్యమం విజయవంతం కావాలంటే... నూతన శక్తిని అందించే 'వోకల్ ఫర్ లోకల్' మన నిరంతర నినాదంగా, ప్రయత్నంగా ఉండాలి.
మిత్రులారా,
సంఘ్ ఎల్లప్పుడూ సామాజిక సామరస్యానికే ప్రాధాన్యమిచ్చింది. సామాజిక సామరస్యం అంటే అణగారిన వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక న్యాయాన్ని నెలకొల్పడం. దేశ ఐక్యతను పెంపొందించడం. దేశం ఈ రోజు మన ఐక్యత, సంస్కృతి, భద్రతపై నేరుగా దాడి చేస్తున్న సంక్షోభాలను ఎదుర్కొంటోంది. వేర్పాటువాద ఆలోచనలు, ప్రాంతీయవాదం, కొన్నిసార్లు కుల వివాదాలు, కొన్నిసార్లు భాషా వివాదాలు, కొన్నిసార్లు బాహ్య శక్తుల ప్రేరేపిత విభజన ధోరణులు... ఇలాంటి లెక్కలేనన్ని సవాళ్లు మన ముందు ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వమే భారత ఆత్మ. ఈ సూత్రం విచ్ఛిన్నమైతే... భారత్ బలం కూడా బలహీనపడుతుంది. అందుకే మనం నిరంతరం ఈ సూత్రం ప్రకారం జీవిస్తూ దానిని బలోపేతం చేయాలి.
మిత్రులారా,
ఈ రోజు జనాభా స్వరూపాన్ని మార్చే కుట్రల వల్ల, చొరబాటుదారుల వల్ల సామాజిక సామరస్యం ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటోంది. ఇది మన అంతర్గత భద్రతకు, భవిష్యత్ శాంతికీ సంబంధించిన ప్రశ్న. అందుకే నేను ఎర్రకోట నుంచి డెమోగ్రఫీ మిషన్‌ను ప్రకటించాను. మనం ఈ సవాలు పట్ల అప్రమత్తంగా ఉంటూ, దానిని ధైర్యంగా ఎదుర్కోవాలి.
మిత్రులారా,
కుటుంబ ప్రబోధన నేటి అవసరం. ఇది శతాబ్దాలుగా సమాజశాస్త్ర పండితులు ఉపయోగిస్తున్న పదం. వేల సంవత్సరాలుగా భారత జీవశక్తికి గల కారణాల్లో కుటుంబ వ్యవస్థ ఒకటని వారు అంటారు. భారతీయ సామాజిక వ్యవస్థలో అత్యంత బలమైన ఏకైక విభాగం ఏదైనా ఉందంటే... అది భారతీయ సమాజంలో వర్ధిల్లుతున్న దృఢమైన కుటుంబ వ్యవస్థే. కుటుంబ ప్రబోధన అంటే భారతీయ నాగరికతకు పునాది అయిన భారతీయ సంస్కృతి నుంచి ప్రేరణ పొంది, మన మూలాలతో అనుసంధానమైన కుటుంబ సంస్కృతిని పెంపొందించడం. కుటుంబ విలువలు, పెద్దల పట్ల గౌరవం, మహిళల పట్ల గౌరవం, యువతలో విలువలను పెంపొందించడం, తమ కుటుంబం పట్ల బాధ్యతలను నెరవేర్చడం, వారిని అర్థం చేసుకోవడం, ఈ దిశగా కుటుంబాల్లో, సమాజంలో చైతన్యం పెంపొందించడం చాలా అవసరం.
మిత్రులారా,
వివిధ కాలాల్లో ప్రతి దేశ ప్రగతిలోనూ పౌరుల విధులు కీలక పాత్ర పోషించాయి. పౌరుల విధులు అంటే కర్తవ్య భావన. ప్రతి పౌరునిలో బాధ్యతా భావం ఉండాలి. పరిశుభ్రతను ప్రోత్సహించడం, దేశ సంపదను గౌరవించడం, నియమ నిబంధనలను గౌరవించడం వంటివి మనం పాటించాల్సిన నియమాలు. వీటితోనే మనం ముందుకు సాగాలి. పౌరులు తమ విధులను నెరవేర్చాలన్నదే మన రాజ్యాంగ స్ఫూర్తి. మనం రాజ్యాంగంలోని ఈ స్ఫూర్తిని నిరంతరం బలోపేతం చేయాలి.
మిత్రులారా,
ప్రస్తుత, భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించడం చాలా ముఖ్యం. ఇది యావత్ మానవాళి భవిష్యత్తుకు సంబంధించిన విషయం. మనం ఆర్థిక వ్యవస్థతో పాటు పర్యావరణాన్నీ పరిరక్షించాలి. నీటి సంరక్షణ, హరిత ఇంధనం, పరిశుద్ధ ఇంధనం వంటి ఈ ప్రచారాలన్నీ ఈ దిశలోనే ఉన్నాయి.
మిత్రులారా,
సంఘ్ చేయబోయే ఈ ఐదు మార్పులు దేశ బలాన్ని పెంచే సాధనాలు. ఇవి దేశం వివిధ సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మించడానికి పునాదిగా నిలుస్తాయి.
మిత్రులారా,
2047 నాటి భారత్... జ్ఞానం, విజ్ఞానం, సేవ, సామరస్యంలతో రూపుదిద్దుకున్న ఒక వైభవోపేతమైన దేశంగా అవతరించాలి. ఇది సంఘ్ దార్శనికత. ఇది మన కార్యకర్తలందరి ఆచరణ. ఇది మన సంకల్పం.
మిత్రులారా,
దేశంపై అచంచలమైన విశ్వాసంతో సంఘ్ ఏర్పడిందని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. దేశ సేవ చేయాలనే ప్రగాఢమైన భావనతోనే సంఘ్ నడుస్తోంది. త్యాగం, తపస్సు అనే అగ్నిలో సంఘ్ రాటుదేలింది. సంస్కృతి, భక్తిల సంగమంతో సంఘ్ వికసించింది. జాతీయవాదమే జీవితానికి పరమ ధర్మమని నమ్ముతూ సంఘ్ దృఢంగా నిలబడింది. మాతృభూమికి సేవ చేయాలనే మహత్తర స్వప్నంతో సంఘ్ ముడిపడి ఉంది.
మిత్రులారా,
సంస్కృతి మూలాలు లోతుగా, బలంగా ఉండాలన్నది సంఘ్ ఆదర్శం. సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించడం కోసమే సంఘ్ కృషి చేస్తుంది. ప్రతి హృదయంలో ప్రజాసేవ జ్యోతిని వెలిగించడమే సంఘ్ ధ్యేయం. భారత సమాజం సాంఘిక న్యాయానికి ప్రతీకగా నిలవాలన్నదే సంఘ్ దార్శనికత. ప్రపంచ వేదికపై భారత వాణిని మరింత ప్రభావవంతంగా వినిపించాలన్నది సంఘ్ లక్ష్యం. భారత్ భవిష్యత్తును సురక్షితంగా, ఉజ్వలంగా తీర్చిదిద్దడానికి సంఘ్ నిశ్చయంతో ఉంది. ఈ చరిత్రాత్మక సందర్భంలో మీ అందరికీ నేను మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. రేపు పవిత్రమైన విజయదశమి పండుగ. మనందరి జీవితాల్లో విజయదశమికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. చాలా ధన్యవాదాలు!
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.
***
(రిలీజ్ ఐడి: 2254719)
సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam