సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కొచ్చిలో మలయాళ చిత్రం అచప్పాస్ ఆల్బమ్ ప్రీమియర్ కథన వైవిధ్యంపై ఎన్ఎఫ్‌డీసీ నిబద్ధతకు నిదర్శనం
నాడు పోస్టు చేయడమైనది:
22 APR 2026 2:44PM by PIB Hyderabad
జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ తన తాజా మలయాళ చిత్రం ‘అచప్పాస్ ఆల్బమ్’ (తాతయ్య ఆల్బమ్) గ్రాండ్ ప్రీమియర్ వేడుకను 2026 ఏప్రిల్ 21న కొచ్చిలో సినీ తారల సమక్షంలో ఘనంగా నిర్వహించింది. 2026 ఏప్రిల్ 24న ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు. ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాశ్ మగ్దుమ్, జనరల్ మేనేజర్ (పీ అండ్ డీ) శ్రీ తరుణ్ తరేజాతోపాటు సినీ రంగ దిగ్గజాలు, పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘వైవిధ్యభరితమైన సినిమాలను ప్రభావవంతంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్న మా లక్ష్యానికి అచప్పాస్ ఆల్బమ్ నిదర్శనం. ఊహాజనితమైన టైమ్ ట్రావెల్ నేపథ్యాన్ని, వివిధ తరాల మధ్య సునిశితమైన భావోద్వేగాలను మేళవించిన ఈ చిత్రం.. అన్ని వయసుల ప్రేక్షకులనూ అలరిస్తుందన్న నమ్మకం మాకుంది. ఇలాంటి అర్థవంతమైన సినిమాలను ప్రోత్సహించేందుకు ఎన్ఎఫ్‌డీసీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. భవిష్యత్తులోనూ భారతీయ మూలాల నుంచి వచ్చే ఆసక్తికరమైన కథలకు ప్రోత్సాహాన్ని కొనసాగిస్తాం. తద్వారా సుసంపన్నమైన మన సాంస్కృతిక వైవిధ్యాన్ని అంతర్జాతీయ వేదికపై నిలుపుతాం. దీప్తి పిళ్లై శివన్ తన హృద్యమైన కథను వెండితెరపైకి తేవడంలో ఆమెకు మద్దతుగా నిలిచినందుకు మేం గర్విస్తున్నాం’’ అని ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాశ్ మగ్ధుం అన్నారు.
దర్శకురాలు దీప్తి పిళ్లై శివన్, రచయిత సంజీవ్ శివన్, ప్రధాన నటులు ప్రియాంకా నాయర్, అంజనా అప్పుకుట్టన్, సుధాంశు సంజీవ్ శివన్ తదితరులతో కూడిన సినిమా క్రియేటివ్ బృందం ఈ ప్రీమియర్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితోపాటు చిత్రంలోని బాలనటులు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డ్రీమ్ బిగ్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ సుజిత్ నాయర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినీ బృందంతో కలిసి ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎన్ఎఫ్‌డీసీ నిర్మించిన ఈ చిత్రం.. తిరిగి గతంలోకి వెళ్లాలన్న మానవ సహజమైన ఆసక్తి నేపథ్యంలో సాగుతుంది. 2026 ఏప్రిల్ 24న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.
ఎన్ఎఫ్‌డీసీ గురించి:
భారతీయ సినిమా అభివృద్ధికి సంబంధించి అత్యున్నత సంస్థ జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ). 1975లో దీనిని నెలకొల్పారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నేతృత్వంలో పనిచేస్తుంది. వివిధ భారతీయ భాషల చిత్రాల నిర్మాణం, ప్రచారం నుంచి దానిని భద్రపరచడం వరకు మొత్తం చలనచిత్ర నిర్మాణ వ్యవస్థకు ఇది దన్నుగా నిలుస్తుంది.
****
(రిలీజ్ ఐడి: 2254541)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7