ప్రధాన మంత్రి కార్యాలయం
భారత ఇంధన వారోత్సవం - 2026 ప్రారంభోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
27 JAN 2026 11:38AM by PIB Hyderabad
శుభాకాంక్షలు.
కేంద్ర మంత్రివర్గ సహచరులు, గోవా ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ప్రతినిధులు, సీఈవోలు, విశిష్ట అతిథులు, ప్రముఖులు, సోదరీ సోదరులారా!
ఈ సరికొత్త ఇంధన వారోత్సవం సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 125 దేశాల ప్రతినిధులు గోవాలో సమావేశమయ్యారు. ఇంధన భద్రత కలిగిన, సుస్థిర భవిష్యత్తుపై చర్చించేందుకు మీరు భారత్‌కు విచ్చేశారు. మీ అందరికీ స్వాగతం పలుకుతూ, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
అనతికాలంలోనే భారత ఇంధన వారోత్సవం చర్చలకూ, కార్యాచరణకూ అంతర్జాతీయ వేదికగా మారింది. నేడు ఇంధన రంగంలో విస్తృతమైన అవకాశాలకు భారత్ నిలయం. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్. అంటే, దేశంలో ఇంధన ఉత్పత్తులకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అంతేకాకుండా, ప్రపంచ అవసరాలను తీర్చేందుకు అద్భుతమైన అవకాశాలను కూడా భారత్ అందిస్తోంది. ప్రపంచంలో 5 అగ్రగామి పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిదారుల్లో ఒకటిగా నేడు భారత్ నిలిచింది. ప్రపంచంలో 150 దేశాలకు పైగా భారత్ ఎగుమతులు చేస్తోంది. భారతదేశపు ఈ సామర్థ్యం మీకెంతగానో ఉపయోగపడబోతోంది. అందుకే, మన భాగస్వామ్యాలను విస్తరించుకునేందుకు ఈ ఇంధన వారోత్సవం అత్యుత్తమ వేదిక. మీ అందరికీ నా శుభాకాంక్షలు.
మిత్రులారా,
నా అభిప్రాయాలను మీ ముందు ఉంచడానికి ముందు.. ఒక కీలక పరిణామాన్ని చర్చించాలనుకుంటున్నాను. నిన్ననే భారత్, ఐరోపా యూనియన్ మధ్య అతిపెద్ద ఒప్పందం కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా దీనిని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా చర్చించుకుంటున్నారు. భారత్‌లోని 140 కోట్ల ప్రజలకు, ఐరోపా దేశాల్లోని కోట్లాది మంది ప్రజలకు అపారమైన అవకాశాలను ఈ ఒప్పందం తీసుకువచ్చింది. ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య సమన్వయానికి ఇదొక అద్భుత ఉదాహరణగా నిలిచింది. ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో మూడింట ఒక వంతు ప్రాతినిధ్యం కలిగిన భారీ ఒప్పందమిది. వాణిజ్యంతోపాటు.. ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన పట్ల మనకున్న ఉమ్మడి నిబద్ధతను కూడా ఈ ఒప్పందం మరింత బలోపేతం చేస్తుంది.
మిత్రులారా,
ఈయూతో కుదిరిన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. యూకే, ఈఎఫ్టీఏ ఒప్పందాలకు కూడా తోడ్పాటునిస్తుంది. వాణిజ్యానికి, ప్రపంచ సరఫరా వ్యవస్థలకు ఇది గొప్ప బలాన్నిస్తుంది. దేశ యువతకు, దేశ ప్రజలందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు. జౌళి, రత్నాలు, ఆభరణాలు, తోలు, పాదరక్షల రంగాల్లో ఉన్న వారందరికీ నా అభినందనలు. ఈ ఒప్పందం మీకెంతో సహాయకరంగా ఉంటుంది.
మిత్రులారా,
ఈ వాణిజ్య ఒప్పందం దేశంలోని తయారీ రంగానికి బలాన్ని చేకూర్చడమే కాకుండా, సేవా రంగాలను కూడా మరింత విస్తరిస్తుంది. ప్రపంచంలోని ప్రతి వ్యాపార సంస్థకూ, ప్రతి పెట్టుబడిదారుడికీ భారత్‌పై విశ్వాసాన్ని ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మరింత బలపరుస్తుంది.
మిత్రులారా,
ప్రతి రంగంలోనూ అంతర్జాతీయ భాగస్వామ్యాల దిశగా భారత్ నేడు విస్తృతంగా కృషి చేస్తోంది. ఇంధన రంగాన్నే తీసుకుంటే.. ఈ రంగంలోని ప్రతి దశకూ సంబంధించిన వివిధ అంశాల్లో విశేషమైన పెట్టుబడి అవకాశాలున్నాయి. అన్వేషణ రంగాన్ని తీసుకుంటే.. భారత్ దీన్ని విశేషంగా విస్తరించింది. లోతైన సముద్ర గర్భంలో అన్వేషణకు సంబంధించిన సముద్రయాన్ మిషన్ గురించి మీకు తెలుసు. ఈ దశాబ్దం చివరి నాటికి చమురు, గ్యాస్ రంగంలో పెట్టుబడులను 100 బిలియన్ డాలర్లకు పెంచే దిశగా కృషి చేస్తున్నాం. అలాగే అన్వేషణ పరిధిని కూడా 10 లక్షల చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఈ ఆలోచనతోనే, ఇప్పటికే ఇక్కడ 170కి పైగా బ్లాకులను కేటాయించాం. అండమాన్ నికోబార్ బేసిన్ కూడా హైడ్రోకార్బన్‌కు మన తదుపరి ఆశాకిరణంగా మారుతోంది.
మిత్రులారా,
అన్వేషణ రంగంలో కూడా మేం అనేక సంస్కరణలు చేపట్టాం. నిషేధిత ప్రాంతాలను గణనీయంగా తగ్గించాం. భారత ఇంధన వారోత్సవ గత ఎడిషన్లలో మీరు ఇచ్చిన సూచనల ఆధారంగా.. మీరు చెప్పినదానికి అనుగుణంగా మేం కూడా మా చట్టాలు, నిబంధనల్లో మార్పులు చేశాం. అన్వేషణ రంగంలో పెట్టుబడి పెడితే, మీ కంపెనీ లాభదాయకత కచ్చితంగా పెరుగుతుంది.
మిత్రులారా,
ఇంధన రంగంలో పెట్టుబడులను అత్యంత లాభదాయకంగా మార్చే మరో ప్రత్యేకత కూడా భారత్‌కు ఉంది. దేశంలో విస్తృతమైన శుద్ధి సామర్థ్యం ఉంది. ఆ విషయంలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నాం. త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటాం. ప్రస్తుతం భారతదేశ శుద్ధి సామర్థ్యం ఏడాదికి దాదాపు 260 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. దాన్ని 300 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా తీసుకెళ్లేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది పెట్టుబడిదారులకు అత్యంత ప్రయోజనకరం.
మిత్రులారా,
భారత్‌లో ఎల్‌ఎన్‌జీకి డిమాండ్ కూడా నిరంతరం పెరుగుతోంది. మన మొత్తం ఇంధన అవసరాల్లో 15 శాతాన్ని ఎల్‌ఎన్‌జీ ద్వారా తీర్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. అందువల్ల ఎల్‌ఎన్‌జీకి సంబంధించి ప్రతీ దశలోనూ ఉన్న వివిధ రంగాల్లో విస్తృతంగా పనిచేయాల్సిన అవసరముంది. భారత్ నేడు రవాణా రంగంలోనూ పెద్ద ఎత్తున పనిచేస్తోంది. ఎల్‌ఎన్‌జీ రవాణాకు అవసరమైన నౌకలను భారత్‌లోనే తయారు చేయడానికి కృషి చేస్తున్నాం. దేశంలో నౌకానిర్మాణం కోసం 70,000 కోట్ల రూపాయలతో ఇటీవలే కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనితోపాటు దేశంలోని ఓడరేవుల్లో ఎల్‌ఎన్‌జీ కోసం టెర్మినళ్ల నిర్మాణంలో అనేక పెట్టుబడి అవకాశాలున్నాయి. రీగ్యాసిఫికేషన్కు సంబంధించిన ప్రాజెక్టుల్లోనూ పెట్టుబడి పెట్టడానికి మీకు విస్తృతమైన అవకాశాలున్నాయి.
మిత్రులారా,
దేశంలో ఎల్‌ఎన్‌జీ రవాణా కోసం చాలా పెద్ద పైప్‌లైన్ కూడా ఇప్పుడు అవసరం. కొన్నేల్లుగా మేం దీనిపై భారీగా పెట్టుబడులు పెట్టాం. అయినా ఇంకా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడి అవకాశాలున్నాయి. నేడు నగరాల్లో గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్ దేశంలోని అనేక నగరాలకు చేరింది. మేం ఇతర నగరాలను కూడా దీంతో వేగంగా అనుసంధానిస్తున్నాం. ఇది కూడా మీ పెట్టుబడికి చాలా ఆకర్షణీయమైన రంగం.
మిత్రులారా,
భారత్‌లో విస్తృతంగా జనాభా ఉంది. మన ఆర్థిక వ్యవస్థ నిరంతరం వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో పెట్రోకెమికల్ ఉత్పత్తులకు డిమాండ్ కూడా భారత్‌లో నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల మనకు చాలా పెద్ద ఎత్తున ఇంధన మౌలిక సదుపాయాలు అవసరం. ఇందులోనూ మీ పెట్టుబడి గొప్ప వృద్ధిని అందిస్తుంది. ఇవే కాకుండా.. దేశంలో అనంతర (డౌన్‌స్ట్రీమ్) కార్యకలాపాల్లోనూ మీకు అనేక పెట్టుబడి అవకాశాలున్నాయి.
మిత్రులారా,
నేడు భారత్ సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌లో దూసుకుపోతోంది. ప్రతీ రంగంలో వేగంగా సంస్కరణలు చేపడుతోంది. దేశీయ హైడ్రోకార్బన్ రంగాన్ని బలోపేతం చేసేలా మేం సంస్కరణలు చేపడుతున్నాం. అంతర్జాతీయ భాగస్వామ్యం కోసం పారదర్శకమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. ఇంధన భద్రత మాత్రమే కాకుండా.. ఇంధన స్వావలంబన దిశగా భారత్ నేడు కృషి చేస్తోంది. స్థానిక అవసరాలను తీర్చడమే కాకుండా, తక్కువ ఖర్చుతో కూడిన శుద్ధి, రవాణా మార్గాలతో ప్రపంచవ్యాప్తంగానూ ఎగుమతిలో పోటీనిచ్చే విధంగా తన ఇంధన రంగ వ్యవస్థను భారత్ అభివృద్ధి చేస్తోంది.
మిత్రులారా,
ఇంధన రంగం మన ఆకాంక్షలకు కేంద్ర బిందువుగా ఉంది. ఇందులో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవకాశాలున్నాయి. అందుకే- ‘‘భారత్ లో తయారు చేయండి, భారత్‌లో ఆవిష్కరించండి, భారత్‌తో కలిసి విస్తరించండి, భారత్‌లో పెట్టుబడి పెట్టండి’’ అని పిలుపునిస్తూ.. భారత ఇంధన వారోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు.
ధన్యవాదాలు.
***
(రిలీజ్ ఐడి: 2254447)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada