ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

"చట్టపరమైన సహాయం అందించే విధానాల బలోపేతం" అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


కమ్యూనిటీ మీడియేషన్ ట్రైనింగ్ మాడ్యూల్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి

న్యాయం అందరికీ అందుబాటులోకి ఉండడం... సకాలంలో న్యాయం అందడం... సామాజిక-ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికీ న్యాయం చేరడం సామాజిక న్యాయానికి నిజమైన పునాది

న్యాయ సౌలభ్యాన్ని నిర్ధరించినప్పుడే వ్యాపార సౌలభ్యం, జీవన సౌలభ్యం సాధ్యం

ఇటీవలి సంవత్సరాల్లో న్యాయ సౌలభ్యాన్ని మెరుగుపరిచే అనేక చర్యలు తీసుకున్నాం... ఇకముందూ ఈ దిశలో ప్రయత్నాలను వేగవంతం చేస్తాం

మధ్యవర్తిత్వం ఎల్లప్పుడూ మన నాగరికతలో అంతర్భాగంగా ఉంది

కొత్త మధ్యవర్తిత్వ చట్టం ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళుతుంది... దీనికి ఆధునిక రూపాన్నిస్తుంది...

సమ్మిళితత్వం, సాధికారతకు శక్తిమంతమైన మాధ్యమంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత

న్యాయం అందించడంలో ఇ-కోర్టుల ప్రాజెక్ట్ ఈ పరివర్తనకు ఒక అద్భుత ఉదాహరణ

ప్రజలు చట్టాన్ని వారి సొంత భాషలో అర్థం చేసుకున్నప్పుడు.. అది మెరుగైన సమ్మతికి దారితీస్తుంది, వ్యాజ్యాలనూ తగ్గిస్తుంది

తీర్పులు, చట్టపరమైన పత్రాలనూ స్థానిక భాషల్లో అందుబాటులో ఉంచడమూ అంతే అవసరం: ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 NOV 2025 6:36PM by PIB Hyderabad

 భారత సుప్రీంకోర్టులో "చట్టపరమైన సహాయం అందించే విధానాల బలోపేతం" అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ మోదీ... ఈ ముఖ్యమైన సదస్సుకు హాజరైన వారిలో తానూ ఉండటం నిజంగా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. న్యాయ సహాయం అందించే విధానాలను బలోపేతం చేయడం, న్యాయ సేవల దినోత్సవంతో ముడిపడి ఉన్న ఈ కార్యక్రమం భారత న్యాయ వ్యవస్థకు కొత్త బలాన్ని అందిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. 20వ జాతీయ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హాజరైన ప్రముఖులు, న్యాయ వ్యవస్థ సభ్యులు, న్యాయ సేవలందించే అథారిటీల ప్రతినిధులనూ ఆయన అభినందించారు.

"అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు, సకాలంలో అందినప్పుడు, సామాజిక-ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికీ సమానంగా న్యాయం జరిగినప్పుడు... అది సామాజిక న్యాయానికి నిజమైన పునాది అవుతుంది" అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. న్యాయ సౌలభ్యాన్ని నిర్ధరించడంలో న్యాయ సహాయం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. జాతీయ స్థాయి నుంచి తాలూకా స్థాయి వరకు న్యాయ సేవల అధికారులు న్యాయవ్యవస్థకు, సాధారణ పౌరులకు మధ్య వారధిగా పనిచేస్తారని ఆయన పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లు, వ్యాజ్యాలకు ముందు పరిష్కారాల ద్వారా లక్షలాది వివాదాలు వేగంగా, సామరస్యంగా, తక్కువ ఖర్చుతో పరిష్కారమవడం పట్ల శ్రీ మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ ద్వారా కేవలం మూడు సంవత్సరాల్లోనే దాదాపు 8 లక్షల క్రిమినల్ కేసులు పరిష్కారమయ్యాయని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా పేదలు, అణగారిన వర్గాలు, వెనకబడినవారు, నిరుపేద వర్గాలకు న్యాయాన్ని సులభతరం చేశాయని ఆయన వ్యాఖ్యానించారు.

గత 11 సంవత్సరాలుగా ప్రభుత్వం వ్యాపార సౌలభ్యాన్ని, జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంపై నిరంతరం దృష్టి సారించిందని చెబుతూ... వ్యాపారాల సులభ నిర్వహణకు వీలుగా 40,000లకు పైగా అనవసర నిబంధనలను తొలగించామని శ్రీ మోదీ గుర్తు చేశారు. జన్ విశ్వాస్ చట్టం ద్వారా 3,400లకు పైగా చట్టపరమైన నిబంధనలను నేరరహితం చేశామనీ, వాడుకలో లేని 1,500లకు పైగా చట్టాలను రద్దు చేశామన్నారు. దీర్ఘకాలంగా ఉన్న చట్టాల స్థానంలో ఇప్పుడు భారతీయ న్యాయ సంహితను అందుబాటులోకి తెచ్చామని ఆయన వ్యాఖ్యానించారు.

"న్యాయ సౌలభ్యాన్ని నిర్ధరించినప్పుడే వ్యాపార నిర్వహణ సౌలభ్యం, జీవన సౌలభ్యం నిజంగా సాధ్యమవుతాయి. ఇటీవలి సంవత్సరాల్లో న్యాయ సౌలభ్యాన్ని పెంపొందించే అనేక చర్యలు చేపట్టాం. ఇకముందూ ఈ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేస్తాం" అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

ఈ సంవత్సరం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని ప్రధానమంత్రి గుర్తుచేసుకుంటూ... గత మూడు దశాబ్దాలుగా దేశంలోని అణగారిన వర్గాల పౌరులతో న్యాయ వ్యవస్థను అనుసంధానించేందుకు నల్సా కృషి చేసిందని పేర్కొన్నారు. న్యాయ సేవలందించే అథారిటీలను సంప్రదించే వారికి తరచుగా వనరులు, ప్రాతినిధ్యం, కొన్నిసార్లు ఆశ కూడా ఉండదన్నారు. అలాంటి వారికి ఆశను, సహాయాన్ని అందించడం నల్సా పేరులో పొందుపరచిన "సేవ" అనే పదానికి నిజమైన అర్థమని ఆయన తెలిపారు. నల్సాలోని ప్రతి సభ్యుడు మరింత సహనం, వృత్తి నైపుణ్యంతో ఈ సేవలను కొనసాగిస్తారని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

నల్సా కమ్యూనిటీ మీడియేషన్ ట్రైనింగ్ మాడ్యూల్ ప్రారంభించినట్లు ప్రకటించిన శ్రీ మోదీ... చర్చలు, ఏకాభిప్రాయం ద్వారా వివాదాలను పరిష్కరించే పురాతన భారతీయ సంప్రదాయాన్ని ఇది పునరుజ్జీవింపజేస్తుందన్నారు. గ్రామ పంచాయతీల నుంచి గ్రామ పెద్దల వరకు మధ్యవర్తిత్వ విధానం ఎల్లప్పుడూ భారతీయ నాగరికతలో భాగంగానే ఉందని శ్రీ మోదీ తెలిపారు. కొత్త మధ్యవర్తిత్వ చట్టం ఈ సంప్రదాయాన్ని ఆధునిక రూపంలో ముందుకు తీసుకెళ్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వివాదాలను పరిష్కరించడంలో, సామరస్యాన్ని పరిరక్షించడంలో, వ్యాజ్యాలను తగ్గించడంలో సహాయపడే కమ్యూనిటీ మధ్యవర్తిత్వానికి వనరులను సిద్ధం చేయడంలో ఈ శిక్షణ మాడ్యూల్ సహాయపడుతుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

సాంకేతికతను విప్లవాత్మకమైన శక్తిగా అభివర్ణించిన శ్రీ మోదీ... ప్రజాహితమైన దృష్టిని కలిగి ఉన్నప్పుడు అది ప్రజాస్వామీకరణకు శక్తిమంతమైన సాధనంగా మారుతుందన్నారు. యూపీఐ డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చిందని, చిన్న విక్రేతలు కూడా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగం కావడానికి వీలు కల్పించిందని ఆయన తెలిపారు. లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్‌తో గ్రామాలు అనుసంధానమయ్యాయనీ, కొన్ని వారాల కిందటే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు లక్ష మొబైల్ టవర్లు ఒకేసారి ప్రారంభమయ్యాయని ఆయన పేర్కొన్నారు. సాంకేతికత ఇప్పుడు సమ్మిళితత్వం, సాధికారతకు ఒక మాధ్యమంగా పనిచేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయ ప్రక్రియలను సాంకేతికత ఎలా ఆధునీకరించగలదు... నాగరీకరించగలదనే దానికి ఒక అద్భుత ఉదాహరణగా ఇ-కోర్టులు ప్రాజెక్టును ప్రధానమంత్రి ఉటంకించారు. ఇ-ఫైలింగ్ నుంచి ఎలక్ట్రానిక్ సమన్ల సేవల వరకు... వర్చువల్ విచారణల నుంచి వీడియో అనుసంధానం వరకు... సాంకేతికత ప్రతిదానినీ సరళీకృతం చేసిందనీ, న్యాయం పొందడాన్ని మరింత సులభతరం చేసిందని ఆయన తెలిపారు. ఇ-కోర్టులు ప్రాజెక్ట్ మూడో దశ బడ్జెట్‌ను రూ. 7,000 కోట్లకు పెంచినట్లు ఆయన తెలియజేశారు. ఇది ఈ కార్యక్రమం పట్ల ప్రభుత్వ బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి వివరించారు.

చట్టపరమైన అవగాహన ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ... పేద వ్యక్తి తన హక్కుల గురించి తెలుసుకునే వరకు, చట్టాన్ని అర్థం చేసుకునే వరకు, వ్యవస్థ సంక్లిష్టత పట్ల భయాన్ని అధిగమించే వరకు న్యాయం పొందడం సాధ్యపడదని ప్రధానమంత్రి అన్నారు. వెనకబడిన వర్గాలు, మహిళలు, వృద్ధుల్లో చట్టపరమైన అవగాహనను పెంపొందించడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు ఆయన ధ్రువీకరించారు. ఈ దిశలో చట్టపరమైన సంస్థలు, న్యాయవ్యవస్థ చేసే నిరంతర ప్రయత్నాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. యువత, ముఖ్యంగా న్యాయ విద్యార్థులు ఈ విషయంలో పరివర్తనాత్మక పాత్ర పోషించగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పేదలు, గ్రామీణ వర్గాలకు వారి చట్టపరమైన హక్కులు, ప్రక్రియలను వివరించడానికి న్యాయ విద్యార్థులను ప్రోత్సహిస్తే... వారు సమాజ తత్వాన్ని గురించి ప్రత్యక్ష అవగాహన పొందుతారని శ్రీ మోదీ సూచించారు. స్వయం సహాయక బృందాలు, సహకార సంస్థలు, పంచాయతీ రాజ్ సంస్థలు, ఇతర బలమైన కింది స్థాయి సంస్థలతో పనిచేయడం ద్వారా చట్టపరమైన జ్ఞానాన్ని ప్రతి ఇంటికీ చేర్చవచ్చని ప్రధానమంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా తాను తరచుగా చెప్పే మరో ముఖ్యమైన అంశాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు... న్యాయాన్ని నేర్చుకునే వ్యక్తికి దానిని అర్థమయ్యే భాషలో అందించాలనీ, చట్టాలను రూపొందించే సమయంలో ఈ సూత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు తమ సొంత భాషలో చట్టాన్ని అర్థం చేసుకున్నప్పుడే అది మెరుగైన సమ్మతికి దారితీస్తుంది, వ్యాజ్యాలనూ తగ్గిస్తుందని తెలిపారు. తీర్పులు, చట్టపరమైన పత్రాలను స్థానిక భాషల్లో అందుబాటులో ఉంచాల్సిన అవసరాన్నీ ఆయన స్పష్టం చేశారు. 80,000 లకి పైగా తీర్పులను 18 భారతీయ భాషల్లోకి అనువదించడానికి సుప్రీంకోర్టు తీసుకున్న చొరవను శ్రీ మోదీ ప్రశంసించారు. హైకోర్టులు, జిల్లా కోర్టుల్లోనూ ఈ ప్రయత్నం కొనసాగుతుందని ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

దేశం తనను తాను అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించినప్పుడు భారత న్యాయ పంపిణీ వ్యవస్థ భవిష్యత్తును ఊహించుకోవాలని న్యాయ వృత్తి, న్యాయ సేవలు, న్యాయ పంపిణీ వ్యవస్థలోని భాగస్వాములందరినీ కోరుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఆ దిశగా సమష్టిగా ముందుకు సాగాల్సిన అవసరాన్నీ ఆయన స్పష్టం చేశారు. నల్సాను, మొత్తం న్యాయ సమాజం, న్యాయ పంపిణీతో సంబంధం ఉన్న వారందరినీ ఈ సందర్భంగా ప్రధానమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ బీ.ఆర్. గవాయ్, కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

"చట్టపరమైన సహాయం అందించే విధానాల బలోపేతం" అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును నల్సా నిర్వహిస్తోంది. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్, ప్యానెల్ లాయర్లు, పారా-లీగల్ వాలంటీర్లు, శాశ్వత లోక్ అదాలత్‌లు, న్యాయ సేవల సంస్థల ఆర్థిక నిర్వహణ విభాగాల వంటి న్యాయ సేవల ప్రణాళికల కీలక అంశాలను ఈ సదస్సులో చర్చిస్తారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2254315) సందర్శకుల సూచీ సంఖ్య : : 4