ప్రధాన మంత్రి కార్యాలయం
జీ20 శిఖరాగ్ర సమావేశం సెషన్-1లో ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
22 NOV 2025 4:36PM by PIB Hyderabad
గౌరవనీయులారా,
నమస్కారం!
ముందుగా... జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని అద్భుతంగా నిర్వహించిన, జీ20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించిన అధ్యక్షులు రామఫోసాకు నా అభినందనలు తెలియజేస్తున్నాను.
దక్షిణాఫ్రికా అధ్యక్షతన... నైపుణ్యం కలిగిన వలసలు, పర్యాటకం, ఆహార భద్రత, ఏఐ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, మహిళా సాధికారత వంటి కీలక రంగాల్లో ప్రశంసనీయమైన పురోగతి సాధించాం.
న్యూఢిల్లీ జీ20 శిఖరాగ్ర సమావేశంలో చేపట్టిన చరిత్రాత్మక కార్యక్రమాలను ఇక్కడా కొనసాగిస్తున్నారు.
మిత్రులారా,
గత కొన్ని దశాబ్దాలుగా గ్లోబల్ ఫైనాన్స్, గ్లోబల్ ఎకనమిక్ వృద్ధికి జీ20 దిశానిర్దేశం చేసింది. అయితే, ప్రపంచం ఇప్పటివరకు పనిచేసిన వృద్ధి పారామితులు జనాభాలో ఎక్కువ భాగాన్ని వనరులకు దూరంగా ఉంచాయి. అవి ప్రకృతిని అతిగా దోపిడీ చేయడానికీ దోహదం చేశాయి. ఈ పరిణామాల కారణంగా అత్యంత బాధిత దేశాల్లో ఆఫ్రికా ఒకటి. ఈ రోజు ఆఫ్రికా మొదటిసారిగా జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్నందున... ఆ అభివృద్ధి పారామితులను పునఃపరిశీలించడం మనకు అత్యవసరం.
భారత నాగరికత విలువల్లో ఒక మార్గం ఉంది... అది సమగ్ర మానవతావాద మార్గం. ఈ విధానం వ్యక్తి, సమాజం, ప్రకృతిని సమగ్రంగా చూడమని మనకు పిలుపునిస్తుంది. అప్పుడే మనం పురోగతి, ప్రకృతి మధ్య నిజమైన సామరస్యాన్నీ సాధించగలం.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా తమ సాంప్రదాయిక, పర్యావరణ సమతుల్య జీవన విధానాలను కాపాడుకున్న అనేక సమాజాలు ఉన్నాయి. ఈ సంప్రదాయాలు స్థిరత్వాన్ని కలిగి ఉండటమే కాకుండా... లోతైన సాంస్కృతిక జ్ఞానం, సామాజిక ఐక్యత, ప్రకృతి పట్ల లోతైన గౌరవాన్నీ ప్రతిబింబిస్తాయి.
జీ20 విధాన ప్రణాళిక కింద గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీని ఏర్పాటు చేయాలని భారత్ ప్రతిపాదిస్తోంది. భారత్ సొంత ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ కార్యక్రమం దానికి పునాదిగా ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచస్థాయి వేదిక మానవాళి సమష్టి జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించడంలో సహాయపడుతుంది.
మిత్రులారా,
ఆఫ్రికా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం, దాని యువ ప్రతిభను శక్తిమంతం చేయడం పట్ల యావత్ ప్రపంచం ఆసక్తి చూపుతోంది. అందువల్ల జీ20–ఆఫ్రికా నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాన్ని భారత్ ప్రతిపాదిస్తుంది. ఈ కార్యక్రమం వివిధ రంగాల్లో 'శిక్షకులకు శిక్షణనివ్వడం' నమూనా ఆధారంగా పనిచేయగలదు. జీ20 భాగస్వాములంతా ఈ ప్రయత్నానికి ఆర్థిక సహాయం, మద్దతునివ్వాలి.
రాబోయే దశాబ్దంలో ఆఫ్రికాలో ఒక మిలియన్ సర్టిఫైడ్ శిక్షకులను సిద్ధం చేయడం మా సమష్టి లక్ష్యం. ఈ శిక్షకులు లక్షలాది మంది యువకులను నైపుణ్యాలతో సన్నద్ధం చేయడంలో సహాయపడతారు. ఈ కార్యక్రమం అనేక రెట్లు శక్తిమంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది స్థానిక సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. ఆఫ్రికా దీర్ఘకాలిక అభివృద్ధికి ఇది గణనీయంగా దోహదపడుతుంది.
మిత్రులారా,
ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలను పరిష్కరించడం మన సమష్టి బాధ్యత. అందువల్ల, భారత్ జీ20 గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది. ఈ బృందంలో జీ20 దేశాల నుంచి శిక్షణ పొందిన వైద్య నిపుణులు ఉంటారు. ప్రపంచంలో ఏదైనా ఆరోగ్య సంక్షోభం, ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టడానికి వారు సిద్ధంగా ఉంటారు.
మిత్రులారా,
మరో కీలకమైన సమస్య మాదకద్రవ్యాల అక్రమ రవాణా. ముఖ్యంగా ఫెంటానిల్ వంటి అత్యంత ప్రాణాంతక పదార్థాల వేగవంతమైన వ్యాప్తి. ఇది ప్రజారోగ్యం, సామాజిక స్థిరత్వం, ప్రపంచ భద్రతకు పెను సవాలుగా మారింది. ఇది ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే ముఖ్యమైన మార్గంగానూ పనిచేస్తుంది.
ఈ ప్రపంచ ముప్పును సమర్థంగా పరిష్కరించడానికి మాదకద్రవ్య-ఉగ్రవాద అనుబంధాన్ని ఎదుర్కోవడానికి జీ20 కార్యక్రమాన్ని భారత్ ప్రతిపాదిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక, పాలన, భద్రత రంగాలకు సంబంధించిన వివిధ సాధనాలను మనం ఒకచోట చేర్చుకోవచ్చు. అప్పుడే మాదకద్రవ్య-ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థను సమర్థంగా బలహీనపరచవచ్చు.
మిత్రులారా,
భారత్-ఆఫ్రికా సంఘీభావం ఎల్లప్పుడూ బలంగానే ఉంది. న్యూఢిల్లీ శిఖరాగ్ర సమావేశంలో... ఆఫ్రికన్ యూనియన్ ఈ సమూహంలో శాశ్వత సభ్యత్వం పొందడం ఒక ముఖ్యమైన సందర్భం. ఈ భాగస్వామ్య స్ఫూర్తిని మించి విస్తరించడం ఇప్పుడు జీ20కి చాలా అవసరం. గ్లోబల్ సౌత్ గళాన్ని అన్ని ప్రపంచ సంస్థల్లో వినిపించేలా, మరింత బలోపేతం చేసేలా చూసుకోవడానికి మనమంతా కలిసి పనిచేయాలి.
***
(రిలీజ్ ఐడి: 2254310)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
हिन्दी
,
Gujarati
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam