మంత్రిమండలి
7280 కోట్ల వ్యయంతో సింటెర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ (ఆర్‌ఈపీఎం) తయారీ పథకానికి క్యాబినెట్ ఆమోదం
రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ (ఆర్ఈపీఎం) వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన మొదటి కార్యక్రమం
స్వాలంబనను పెంచడం, భారత్‌ను ప్రపంచ ఆర్‌ఈపీఎం మార్కెట్‌లో కీలకమైన దేశంగా మార్చటమే దీని లక్ష్యం
6,000 ఎంటీపీఏ సింటెర్డ్ ఆర్‌ఈపీఎంను దేశీయంగా తయారు చేయడాన్ని ప్రోత్సహించనున్న పథకం
వాహన, రక్షణ, విమానయాన రంగాల కోసం సరఫరా వ్యవస్థను బలోపేతం చేయనున్న పథకం
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, భారత్‌కు ఉన్న నికర జీరో 2070 నిబద్ధతకు మద్దతునివ్వనున్న పథకం
నాడు పోస్టు చేయడమైనది:
26 NOV 2025 4:03PM by PIB Hyderabad
రూ. 7,280 కోట్ల ఆర్థిక వ్యయంతో 'సింటెర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ (ఆర్ఈపీఎం) తయారీని ప్రోత్సహించే పథకానికి' ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మొదటి పథకం ఇది. భారత్‌లో 6,000 ఎంపీపీఏ (మెట్రిక్ టన్నులు సంవత్సరానికి) ఇంటిగ్రేటెడ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ (ఆర్ఈపీఎం) తయారు చేయాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా స్వాలంబన పెంపొందించుతూ భారత్‌ను అంతర్జాతీయ ఆర్ఈపీఎం మార్కెట్‌లో కీలక స్థానంలో నిలపాలని భావిస్తోంది.
ఆర్ఈపీఎంలు అత్యంత బలమైన శాశ్వత అయస్కాంతాలలో ఒకటి. ఇవి ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్, విమానాయానం, రక్షణ వంటి పరిశ్రమలకు చాలా ముఖ్యమైనవి. ఈ పథకం ఇంటిగ్రేటెడ్ ఆర్ఈపీఎంల తయారీ కేంద్రాల ఏర్పాటుకు మద్దతునిస్తుంది. ఇందులో భూమిలో లభించే అరుదైన ఆక్సైడ్‌లను లోహాలుగా మార్చటం, లోహాలను మిశ్రమ లోహాలుగా మార్చడం, మిశ్రమ లోహాలను తుది ఆర్ఈపీఎంలుగా మార్చటం ఉంటాయి.
ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, పారిశ్రామిక అనువర్తనాలు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో వేగంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా భారత్ ఆర్‌ఈపీఎం వినియోగం 2025 నుంచి 2030 నాటికి రెట్టింపు అవుతుందన్న అంచనా ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్‌ఈపీఎంల డిమాండ్‌ను దిగుమతులే తీర్చుతున్నాయి. ఈ పథకంతో మొదటి ఇంటిగ్రేటెడ్ ఆర్ఈపీఎం తయారీ కేంద్రం భారత్‌లో ఏర్పాటుకానుంది. ఇది ఉద్యోగాలను సృష్టించటమే కాకుండా స్వాలంబనను బలోపేతం చేస్తుంది. 2070 నాటికి నికర జీరో సాధించాలనే భారతదేశ నిబద్ధతను ఇది ముందుకు తీసుకెళ్తుంది.
ఈ పథకాన్ని మొత్తం రూ. 7280 కోట్లతో చేపట్టనున్నారు. 5 సంవత్సరాల పాటు అమ్మకాల ఆధారిత ప్రోత్సాహకాల కోసం రూ. 6450 కోట్లు వ్యయం కానుంది. 6,000 ఎంటీపీఏ సామర్థ్యం ఉన్న ఆర్ఈపీఎం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రూ. 750 కోట్లను మూలధన రాయితీ కింద అందించనున్నారు.
ఈ పథకంలో లక్షంగా నిర్దేశించుకున్న మొత్తం సామర్థ్యాన్ని అంతర్జాతీయ వేలం ప్రక్రియ ద్వారా ఐదు సంస్థలకు కేటాయించాలని నిర్ణయించారు. ప్రతి సంస్థకు 1200 ఎంటీపీఓ వరకు కేటాయిస్తారు.
ఈ పథకం మొత్తం వ్యవధి అవార్డు తేదీ నుంచి 7 సంవత్సరాలు. ఇంటిగ్రేటెడ్ ఆర్ఈపీఎం తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు 2 సంవత్సరాల కాలం (గెస్టేషన్ పీరియడ్), ఆర్‌ఈపీఎం అమ్మకాలపై ప్రోత్సాహకాలు అందుకునేందుకు 5 సంవత్సరాలు ఉంటాయి.
ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ పథకం దేశీయ ఆర్‌ఈపీఎం వ్యవస్థను బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయ మార్కెట్‌లలో పోటీతత్వాన్ని పెంచే ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది. ఆర్ఈపీఎం ఉత్పత్తిలో స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా ఈ పథకం.. దేశీయ పరిశ్రమల కోసం ఆర్‌ఈపీఎం సరఫరా వ్యవస్థను భద్రపరచడమే కాకుండా దేశానికి ఉన్న నికర జీరో- 2070 నిబద్ధతకు కూడా మద్దతు ఇస్తుంది. ఇది 2047 నాటికి వికసిత్ భారత్‌గా మారాలన్న లక్ష్యానికి అనుగుణంగా సాంకేతికలో స్వయం సమృద్ధి, ప్రపంచవ్యాప్త పోటీతత్వం, సుస్థిర పారిశ్రామిక వ్యవస్థను తయారు చేయటంలో ప్రభుత్వానికి ఉన్న చెక్కుచెదరని నిబద్ధతను తెలియజేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2254295)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam