ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి


దేశవ్యాప్త సామాజిక రాజకీయ చైతన్యంలో జేపీ పాత్రను గుర్తు చేసుకున్న ప్రధానమంత్రి

అత్యవసర పరిస్థితి కాలంలో లోక్‌నాయక్ జేపీ రాసిన ‘జైలు డైరీ’ నుంచి అరుదైన పేజీలను పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 11 OCT 2025 9:29AM by PIB Hyderabad

లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ప్రజాస్వామ్యం - సామాజిక న్యాయం కోసం దేశంలోనే నిర్భయంగా గళాన్ని వినిపించిన... అవిశ్రాంత పోరాటం చేసినవారిలో ఒకరైన యోధుడిగా జయప్రకాశ్ నారాయణ్‌ను ప్రధానమంత్రి అభివర్ణించారు.

సామాన్య ప్రజలకు సాధికారత కల్పించేందుకు, రాజ్యాంగ విలువలను బలోపేతం చేసేందుకు లోక్‌నాయక్ జేపీ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి అన్నారు. సంపూర్ణ క్రాంతి కోసం ఆయనిచ్చిన సుస్పష్టమైన పిలుపు సమానత్వం, నైతికత, సుపరిపాలనతో కూడిన దేశం కోసం సామాజిక ఉద్యమాన్ని రగిలించింది.

ఆయనిచ్చిన శాశ్వత సామాజిక వారసత్వం అనేక ప్రజా ఉద్యమాలకు.. ముఖ్యంగా బీహార్, గుజరాత్‌లలో వచ్చిన ఉద్యమాలకు దారితీసిందని అన్నారు. ఇది దేశవ్యాప్తంగా సామాజిక రాజకీయ చైత్యానాన్ని రగలించిందని ప్రధాని అన్నారు. అత్యవసర పరిస్థితిని విధించి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేందుకు ప్రయత్నించిన అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదిపివేసిందని అన్నారు. 

అత్యవసర పరిస్థితి కాలంలో లోక్‌నాయక్ జేపీ రాసిన "జైలు డైరీ" పుస్తకంలోని కొన్ని అరుదైన పేజీలను ప్రధాని పంచుకున్నారు. నిర్బంధంలో ఏకాంతంగా ఉన్న ఆయన ఆగ్రహావేశాలను, ప్రజాస్వామ్యంపై ఆయనకున్న అవిచ్ఛిన్న విశ్వాసాన్ని ఈ పుస్తకం తెలియజేస్తోందని మోదీ అన్నారు. "భారత ప్రజాస్వామ్యమనే శవపేటికకు దిగే ప్రతి మేకు నా హృదయంలోకి దిగిన మేకు లాంటిది" అన్న లోక్‌నాయక్ జయప్రకాశ్ మాటలను ఆయన ఉటంకించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

"ప్రజాస్వామ్యం- సామాజిక న్యాయం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడు.. భారతదేశంలో అత్యంత నిర్భయమైన గళాన్ని వినిపించిన వారిలో ఒకరైన లోక్‌నాయక్ జేపీకి ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను."

"సామాన్య ప్రజలకు సాధికారత కల్పించేందుకు, రాజ్యాంగ విలువలను బలోపేతం చేయడానికి లోక్‌నాయక్ జేపీ జీవితాన్ని అంకితం చేశారు. సంపూర్ణ క్రాంతి కోసం ఆయన ఇచ్చిన సుస్పష్టమైన పిలుపు.. సమానత్వం, నిజాయితీ, సుపరిపాలనతో కూడిన దేశాన్ని తయారుచేయాలనే ఒక సామాజిక ఉద్యమాన్ని రగిలించింది. ఆయన అనేక ప్రజా ఉద్యమాలకు.. ముఖ్యంగా బీహార్, గుజరాత్‌లలో వచ్చిన ఉద్యమాలను ప్రేరణనిచ్చారు. ఇవి దేశవ్యాప్తంగా సామాజిక రాజకీయ చైతన్యానికి దారితీశాయి. అత్యవసర పరిస్థితిని విధించి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేందుకు ప్రయత్నించిన కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదిపివేశాయి”.

“లోక్‌నాయక్ జేపీ జయంతి సందర్భంగా ఆర్కైవ్‌ల నుంచి అరుదైన విషయాలు..  

అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన రాసిన జైలు డైరీ పుస్తకం నుంచి పేజీలు ఇవి.

అత్యవసర పరిస్థితి కాలంలో లోక్‌నాయక్ జేపీ చాలా రోజులు నిర్బంధంలో ఏకాంతంగా ఉన్నారు. ‘జైలు డైరీ’ పుస్తకం ఆయన వేదనను, ప్రజాస్వామ్యంపై అవిచ్ఛిన్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది. 

‘భారత ప్రజాస్వామ్యం అనే శవపేటికకు దిగిన ప్రతి మేకు నా హృదయంలోకి దిగిన మేకు లాంటిది’ అని ఆయన రాశారు.”

 

***


(रिलीज़ आईडी: 2254283) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam