మంత్రిమండలి
దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో వైద్య విద్య విస్తరణకు ఆమోదం తెలిపిన కేబినెట్
నాడు పోస్టు చేయడమైనది:
24 SEP 2025 3:27PM by PIB Hyderabad
రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు, స్వతంత్ర పీజీ సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం, అప్‌గ్రేడ్ చేయడం.. 5,000 పీజీ సీట్లు పెంచడం.. ఒక్కో సీటుపై పెంచిన రూ. 1.50 కోట్ల ఖర్చు పరిమితితో కొత్తగా 5,023 ఎంబీబీఎస్ సీట్లు పెంచడం.. ప్రభుత్వ వైద్య కళాశాలల అప్‌గ్రేడ్ కోసం సీఎస్ఎస్‌ను విస్తరించడం లక్ష్యంగా కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్) మూడో దశకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ వైద్య సామర్థ్యం పెరుగుతుంది.. అదనపు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను అందుబాటులో ఉంచడం ద్వారా ఆయా విభాగాల్లో నిపుణులైన వైద్యుల సంఖ్య పెరుగుతుంది.. ప్రభుత్వ వైద్య సంస్థల్లో కొత్త స్పెషాలిటీలను ప్రవేశపెట్టేందుకు వీలుంటుంది.. దేశంలోని మొత్తం వైద్యుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది.
2025-26 నుంచి 2028-29 వరకు ఈ రెండు పథకాల మొత్తం ఆర్థిక ప్రభావం రూ.15,034.50 కోట్లు. ఈ మొత్తంలో కేంద్ర వాటా రూ.10,303.20 కోట్లు, రాష్ట్ర వాటా రూ.4731.30 కోట్లు.
ప్రయోజనాలు:
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, సంస్థల్లో వైద్య విద్య సీట్లను పెంచే పథకాలు దేశంలో వైద్యులు, నిపుణుల సంఖ్యను పెంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా వైద్య సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను ఇవి మెరుగుపరుస్తాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల విస్తరణతో కీలక విభాగాల్లో నిపుణుల సంఖ్యను పెంచడం ద్వారా ప్రభుత్వ సంస్థల్లో ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని తృతీయశ్రేణి ఆరోగ్య సంరక్షణను తక్కువ ఖర్చుతో విస్తరించేందుకు వీలుంటుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ వనరులను అన్ని ప్రాంతాలకు సమానంగా పంపిణీ చేసేందుకు ఈ పథకాలు ఉపకరిస్తాయి. దీర్ఘకాలంలో అవి ప్రస్తుత, రాబోయే ఆరోగ్య అవసరాలను తీర్చడం కోసం దేశ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేస్తాయి.
ఉపాధి కల్పన సహా ప్రభావం:
పథకాల నుంచి ఆశిస్తున్న ప్రధాన ఫలితం:
i. దేశంలో వైద్య విద్యను అభ్యసించడం కోసం విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించడం.
ii. ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా వైద్య విద్య, శిక్షణ నాణ్యతను మెరుగుపరచడం.
iii. తగినంత మంది వైద్యులు, వైద్య నిపుణులు అందుబాటులో ఉండడం దేశాన్ని సరసమైన ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా నిలుపుతుంది.. తద్వారా విదేశీ మారకద్రవ్య నిల్వలనూ పెంచుతుంది.
iv. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సేవల లభ్యతకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది.
v. వైద్యులు, అధ్యాపకులు, పారామెడికల్ సిబ్బంది, పరిశోధకులు, నిర్వాహకులు, సహాయక సేవలకు సంబంధించి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.
vi. ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. మొత్తం సామాజిక-ఆర్థికాభివృద్ధికి మద్దతునిస్తుంది.
vii. రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు సమానంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది.
వ్యూహం అమలు – లక్ష్యాలు:
2028-2029 నాటికి ప్రభుత్వ సంస్థల్లో 5000 పీజీ సీట్లు, 5023 యూజీ సీట్లను పెంచడం ఈ పథకాల లక్ష్యం. ఈ పథకాల అమలు కోసం ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంవోహెచ్-ఎఫ్‌డబ్ల్యూ) వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేస్తుంది.
నేపథ్యం:
140 కోట్ల మంది జనాభా కోసం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (యూహెచ్‌సీ) సాధించడం.. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన, సరైన రవాణా సదుపాయాలు లేని ప్రాంతాలకు సకాలంలో, ఉన్నతస్థాయి వైద్య సేవలు అందించడం.. బలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడంపై ఆధారపడి ఉంటుంది. బలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ.. తగిన సంఖ్యలో వైద్య నిపుణులు, సిబ్బంది అందుబాటులో ఉండడంపై ఆధారపడి ఉంటుంది.
ఇటీవల దేశంలో వైద్య విద్య, సిబ్బంది మౌలిక సదుపాయాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి. ఇది వైద్యసేవలను అందుబాటులో ఉంచడం, నాణ్యతను మెరుగుపరచడం పట్ల ప్రభుత్వ స్థిరమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం ఉన్న 808 వైద్య కళాశాలలు, మొత్తం 1,23,700 ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతో మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. గత దశాబ్దంలో 69,352 ఎంబీబీఎస్ సీట్లను కొత్తగా జోడించడంతో ఈ సీట్లలో 127 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో జోడించిన 43,041 పీజీ సీట్లతో 143 శాతం వృద్ధి నమోదైంది. వైద్య సీట్ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ డిమాండ్, సేవల లభ్యత, ప్రజల స్తోమతకు అనుగుణంగా సామర్థ్యాలను మరింత పెంచాల్సిన అవసరం ఉంది.
ప్రధానమంత్రి స్వస్త్య సురక్షా యోజన (పీఎమ్ఎస్ఎస్‌వై) కింద ఆమోదించిన 22 కొత్త ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సంస్థలు తృతీయశ్రేణి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడమే కాకుండా, అత్యాధునిక బోధన-అభ్యసన సౌకర్యాలతో... అత్యున్నత ప్రమాణాలు గల వైద్య నిపుణులను రూపొందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
అర్హత కలిగిన బోధనా సిబ్బందిని విస్తరించడం కోసం.. అధ్యాపకుల అర్హత, నియామకాల్లో మరింత సమగ్రమైన, సామర్థ్య ఆధారితమైన విధానాన్ని అవలంబించడం కోసం కొత్త వైద్య విద్యా సంస్థల (అధ్యాపకుల అర్హతలు) నిబంధనలు-2025 జారీ చేశారు. పెరుగుతున్న బోధనా సిబ్బంది అవసరాలను తీర్చడం.. విద్యాపరమైన, వృత్తిపరమైన ప్రమాణాలను నెలకొల్పడం లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టారు.
ఆరోగ్య రంగంలో అర్హత గల సిబ్బంది లభ్యతను పెంచడానికి ఎంవోహెచ్-ఎఫ్‌డబ్ల్యూ ఈ పథకాలను అమలు చేస్తోంది. మరింత మంది వైద్య నిపుణులను తయారు చేసే సామర్థ్యాన్ని సృష్టిస్తూ, ఆరోగ్య రంగంలో మానవ వనరులను బలోపేతం చేయడం, దేశ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఈ పథకాల విస్తరణ స్పష్టం చేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2254267)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam