ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని సానంద్‌లో 'కేన్స్ సెమికాన్' తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి


కేన్స్ సెమికాన్ సదుపాయం ప్రారంభం కావడం వల్ల బలోపేతం కానున్న భారతదేశ స్వావలంబన ప్రయాణం: ప్రధాని

ఒక పటిష్ఠమైన సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించడంలో ఒక కీలక అడుగు ఇది: ప్రధాని

ప్రపంచ మార్కెట్‌లో నమ్మదగిన సెమీకండక్టర్ సరఫరాదారుగా తన పాత్రను మరింత బలోపేతం చేసుకుంటున్న భారత్: ప్రధాని

2021లో 'ఇండియా సెమీకండక్టర్ మిషన్'ను ప్రారంభించిన భారత్: ప్రధాని

ఈ మిషన్ కేవలం ఒక పారిశ్రామిక విధానం మాత్రమే కాదు ఇది భారత్ ఆత్మవిశ్వాసానికి నిదర్శనం: ప్రధాని

21వ శతాబ్దపు ఈ కాలం కేవలం ఆర్థిక పోటీ కోసం మాత్రమే కాదు ఇది భవిష్యత్తు సాంకేతిక ముఖచిత్రాన్ని రూపొందించే సమయం: ప్రధాని

ఈ దశాబ్దంలో భారత్ తీసుకుంటున్న సాంకేతిక కార్యక్రమాలు రాబోయే దశాబ్దాల్లో మన నాయకత్వ బాధ్యతను మరింత బలోపేతం చేయనున్నాయి: ప్రధాని

21వ శతాబ్దపు మార్పునకు కేవలం సాక్షిగా మాత్రమే కాకుండా ఆ మార్పుకు నాయకత్వం వహించాలనే పట్టుదలతో ముందుకు సాగుతోన్న భారత్: ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 31 MAR 2026 3:31PM by PIB Hyderabad

గుజరాత్‌లోని సానంద్‌లో 'కేన్స్ టెక్నాలజీ' సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉత్పత్తి ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఫిబ్రవరి 28న సానంద్‌లోని 'మైక్రాన్' కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభోత్సవానికి తాను హాజరయ్యానని.. సరిగ్గా నెల రోజుల తర్వాత 'కేన్స్' విషయంలో మళ్లీ ఇక్కడికి వచ్చానని గుర్తు చేసిన ఆయన భారత సెమీకండక్టర్ ప్రస్థానంలోని వేగాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. "ఇది కేవలం యాదృచ్ఛికం కాదు.. భారతదేశ సెమీకండక్టర్ వ్యవస్థ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం" అని ఆయన వ్యాఖ్యానించారు. 

కేన్స్ టెక్నాలజీ యాజమాన్యం, గుజరాత్ ప్రభుత్వంతో పాటు ఈ కేంద్రంలోని కార్మికులందరికీ అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి.. ఒక భారతీయ సంస్థ సెమీకండక్టర్ చిప్ తయారీ రంగంలోకి అడుగుపెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. కేన్స్ సంస్థ ఇప్పుడు సెమీకండక్టర్ల విషయంలో ప్రపంచ సరఫరా గొలుసులో భాగమైందని పేర్కొంటూ.. "ఇది ఒక అద్భుతమైన ప్రారంభం. రాబోయే రోజుల్లో అనేక భారతీయ కంపెనీలు ప్రపంచ భాగస్వామ్యాల ద్వారా ప్రపంచానికి ఒక పటిష్ఠమైన సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థను అందిస్తాయి" అన్నారు. 

నేటి ఈ కీలక ఘట్టం 'మేక్ ఇన్ ఇండియా- మేక్ ఫర్ ద వరల్డ్' అనే మంత్రాన్ని నిజం చేస్తోందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియాకు చెందిన ఒక సంస్థకు ఈ ఉత్పత్తి కేంద్రం 'ఇంటెలిజెంట్ పవర్ మోడ్యూల్స్'ను సరఫరా చేస్తోందని.. ఇక్కడి ఉత్పత్తిలో అధిక భాగం ఇప్పటికే ఎగుమతుల కోసం బుక్ అయిందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల సానంద్, సిలికాన్ వ్యాలీ మధ్య సమర్థవంతమైన కొత్త వంతెన నిర్మాణమైందని ఆయన అభిప్రాయపడ్డారు. "సానంద్‌లో తయారైన మోడ్యూల్స్ అమెరికన్ కంపెనీలకు చేరుతాయి. అక్కడి నుంచి ప్రపంచం మొత్తానికి శక్తిని అందిస్తాయి" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

ఈ కేంద్రంలో తయారవుతున్న 'ఇంటెలిజెంట్ పవర్ మోడ్యూల్స్' వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రధాన మంత్రి ప్రధానంగా పేర్కొన్నారు. ఇవి భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థ, భారీ పరిశ్రమలను బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు. ఇటువంటి అంతర్జాతీయ భాగస్వామ్యాలే ప్రపంచానికి మెరుగైన భవిష్యత్తును అందించే పునాదులని ఆయన అభివర్ణించారు. "ఇది కేవలం ఒక ఉత్పత్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు.. ప్రపంచ మార్కెట్‌లో భారతదేశం ఒక నమ్మదగిన సెమీకండక్టర్ సరఫరాదారుగా ఎదగడమే దీని లక్ష్యం" అని ఆయన వ్యాఖ్యానించారు. 

మహమ్మారి నుంచి భౌగోళిక రాజకీయ సంఘర్షణల వరకు ఈ దశాబ్దం ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసిన శ్రీ నరేంద్ర మోదీ.. ప్రపంచ సరఫరా గొలుసులు ముఖ్యంగా చిప్‌లు, అరుదైన ఖనిజాలు, ఇంధన రంగాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయని అన్నారు. ఈ సరఫరా గొలుసులలో ఏర్పడే ఆటంకాలు మొత్తం మానవాళి పురోగతిని అడ్డుకుంటాయన్న ఆయన.. "భారత్ వంటి ప్రజాస్వామ్య దేశం ఈ దిశగా ముందడుగు వేయడం మొత్తం ప్రపంచ అభివృద్ధికి అత్యంత కీలకం” అని పేర్కొన్నారు. 

భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ కేంద్రంగా మార్చాలనే దృఢ నిశ్చయం కోవిడ్ మహమ్మారి సమయంలోనే తీసుకున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. దీని ఫలితంగానే 2021లో 'ఇండియా సెమీకండక్టర్ మిషన్' ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. సెమీకండక్టర్లలో స్వయంసమృద్ధి సాధించడం అనేది కృత్రిమ మేధ, ఎలక్ట్రిక్ వాహనాలు, స్వచ్ఛ ఇంధనం, రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్ వంటి అన్ని రంగాలలో స్వయంసమృద్ధికి దారితీస్తుందని ఆయన వివరించారు. "ఈ మిషన్ కేవలం ఒక పారిశ్రామిక విధానం మాత్రమే కాదు.. ఇది భారత్ ఆత్మవిశ్వాస ప్రకటన" అని శ్రీ నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.

ఈ మిషన్ పురోగతిని ప్రధానమంత్రి వివరించారు. ఆరు రాష్ట్రాలలో రూ. 1,60,000 కోట్లకు పైగా విలువైన 10 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని తెలిపిన ఆయన.. వీటిలో 'కేన్స్', 'మైక్రాన్' ప్రాజెక్టులు అంతర్భాగమని అన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన 'ధ్రువ్ 64' మైక్రోప్రాసెసర్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇది 5జీ మౌలిక సదుపాయాలు, వాహన రంగ ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక ఆటోమేషన్ రంగాలకు సురక్షితమైన ప్రాసెసర్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుందని పేర్కొన్నారు. "సెమీకండక్టర్ విలువ గొలుసు‌లోని ప్రతి స్థాయిలో డిజైన్, తయారీ సామర్థ్యాన్ని భారత్ తయారు చేస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

భారతదేశ సెమీకండక్టర్ ఆశయాలలో తదుపరి దశను ప్రకటిస్తూ.. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఆవిష్కరించిన 'ఇండియా-సెమీకండక్టర్ మిషన్ 2.0' గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. సెమీకండక్టర్ పరికరాలు, ముడి పదార్థాల దేశీయ ఉత్పత్తిపై దృష్టి సారించడం ద్వారా ఒక పూర్తి స్థాయి భారతీయ సెమీకండక్టర్ వ్యవస్థను తయారు చేయడమే ఈ కొత్త దశ లక్ష్యమని అన్నారు. "దేశీయ, ప్రపంచ సరఫరా గొలుసులలో పెద్ద ఎత్తున భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి వీలుగా ఒక బలమైన వ్యవస్థను సృష్టించడమే మా ప్రస్తుత ప్రయత్నం" అని ఆయన స్పష్టం చేశారు. 

భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా నైపుణ్యం కలిగిన మానవ వనరులను సిద్ధం చేయడంలో భారత్‌ చేస్తున్న కృషిని ప్రధాన మంత్రి చెప్పారు. 85,000 మందికి పైగా 'డిజైన్ నిపుణుల'కు శిక్షణ ఇవ్వాలనే లక్ష్యం అతి త్వరలోనే పూర్తి కానుందని ఆయన పేర్కొన్నారు. 'చిప్స్ టు స్టార్టప్' కార్యక్రమం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ పథకం కింద దాదాపు 400 విశ్వవిద్యాలయాలు, అంకురాలకు ఆధునిక డిజైన్ పరికరాలను అందుబాటులోకి తెచ్చామని.. దీని ఫలితంగా 55కు పైగా చిప్‌లు రూపకల్పన, తయారీ దశకు చేరుకున్నాయని తెలిపారు. "సాంకేతిక అభివృద్ధి, నైపుణ్యం కలిగిన సిబ్బంది రెండూ సమాంతరంగా సాగాలి.. భారత్ ఈ రెండూ జరిగేలా చూసుకుంటోంది" అని ఆయన ఉద్ఘాటించారు. 

పరిశ్రమల అంచనాలను ఉటంకించిన ప్రధానమంత్రి.. భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ ప్రస్తుతం సుమారు 50 బిలియన్ డాలర్లుగా ఉందని తెలిపారు. ఈ దశాబ్దం ముగిసే సమయానికి ఇది 100 బిలియన్ డాలర్లను దాటుతుందని అన్నారు. భారతదేశపు సెమీకండక్టర్ సంకల్పంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులలో కనిపిస్తున్న అపారమైన ఉత్సాహాన్ని గురించి మాట్లాడుతూ.. "మన అవసరాలకు సరిపడా గరిష్ఠ సంఖ్యలో చిప్‌లను ఇక్కడే భారతదేశంలోనే తయారు చేయడమే మా లక్ష్యం" అని అన్నారు. 

ముడి పదార్థాల విషయంలో ధృడమైన సరఫరా గొలుసును సుస్థిరం చేయడంలో భారత్ చేస్తున్న సమాంతర కృషిని ప్రధాన మంత్రి వివరించారు. ఇందులో భాగంగా 'పాక్స్ సిలికా'లో భారత్ సభ్యత్వం.. 'నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్' ప్రారంభం గురించి ఆయన ప్రస్తావించారు. ఖనిజాల పునర్వినియోగం కోసం 1,500 కోట్ల రూపాయల పథకాన్ని.. అలాగే ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి తీరప్రాంత రాష్ట్రాలను అనుసంధానిస్తూ 'అరుదైన ఖనిజాల కారిడార్‌' ఏర్పాటును ఆయన గుర్తు చేశారు. "ఈ పనులు 30-40 ఏళ్ల క్రితమే ప్రారంభమై ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు భారత్ ఈ దిశగా మిషన్ మోడ్‌‌లో పనిచేస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ దశాబ్దాన్ని భారతదేశపు 'టెకేడ్'గా అభివర్ణించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. ప్రస్తుత కాలం కేవలం ఆర్థిక పోటీ గురించి మాత్రమే కాదని భవిష్యత్తు సాంకేతిక ముఖచిత్రాన్ని రూపొందించే సమయమని పేర్కొన్నారు. ఏఐ వినియోగంలో భారత నాయకత్వం, డిజిటల్ ఇండియా- ఫిన్‌టెక్ రంగాల విజయం.. అలాగే ఇటీవల జరిగిన 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' వంటివి సాంకేతికతపై భారతీయులకు ఉన్న నమ్మకం, ఆసక్తికి నిదర్శనాలని ఆయన అన్నారు. "మన సెమీకండక్టర్ రంగం వృద్ధి చెందడం వల్ల భారత ఏఐ వ్యవస్థకు గొప్ప బలం చేకూరుతుంది" అని ఆయన ఉద్ఘాటించారు. 

21వ శతాబ్దపు మార్పుకు కేవలం సాక్షిగా మాత్రమే కాకుండా ఆ మార్పుకు నాయకత్వం వహించాలనే పట్టుదలతో భారత్ ఉన్నట్లు ప్రధానమంత్రి ప్రముఖంగా చెప్పారు. ఇన్-స్పేస్ ద్వారా అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరవడం, అణు రంగంలో చారిత్రాత్మకమైన 'శాంతి' బిల్లును తీసుకురావడం, క్వాంటం కంప్యూటింగ్‌లో మిషన్-మోడ్ పెట్టుబడులు వంటి కీలక విధానపరమైన నిర్ణయాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ చర్యలు రాబోయే దశాబ్దాల్లో సాంకేతిక, ఇంధన భద్రతకు బలమైన పునాది వేస్తాయని ఆయన పేర్కొన్నారు. "ప్రతి కీలక సాంకేతిక రంగంలో భారతదేశం అపూర్వమైన పెట్టుబడులు పెట్టటంతో పాటు సంస్కరణలను చేపడుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు ఒక గొప్ప అవకాశం" అని ఆయన స్పష్టం చేశారు.

కేన్స్ కేంద్రం నుంచి వచ్చే ఉత్పత్తులు 'ప్రపంచ కర్మాగారంగా' భారతదేశ ప్రస్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయనే ఆశాభావాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. వ్యాపార నిర్వహణ సౌలభ్యం, తయారీ సౌలభ్యం, రవాణా సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. 


(రిలీజ్ ఐడి: 2254239) సందర్శకుల సూచీ సంఖ్య : : 15