గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో గ్రామీణ పథకాల రక్షణకు సన్నద్ధతను బలోపేతం చేస్తున్న గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రపంచ అనిశ్చితులతో ప్రమేయం లేకుండా నిరంతర ఉపాధి, సకాలంలో నిధుల విడుదల, గృహ నిర్మాణం, గ్రామీణ రోడ్లు, జీవనోపాధి భద్రతపై మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి
నాడు పోస్టు చేయడమైనది:
20 APR 2026 4:15PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ సరఫరా వ్యవస్థలు, వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణ ధోరణులపై పడే అవకాశం ఉన్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, దేశవ్యాప్తంగా ప్రధాన గ్రామీణ సంక్షేమ, మౌలిక సదుపాయాల కార్యక్రమాల అమలు నిరంతరాయంగా కొనసాగేలా చూడటానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సన్నద్ధత చర్యలపై సమగ్ర సమీక్షను చేపట్టింది.
గ్రామీణ జీవనోపాధి, గృహనిర్మాణం, రోడ్ల అభివృద్ధి వాటర్‌షెడ్ కార్యక్రమాలపై పరోక్ష ప్రభావాన్ని చూపే పరిణామాలను మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది. లబ్ధిదారులకు ప్రయోజనాలు నిరంతరాయంగా అందేలా చూడటం, నిధులు సకాలంలో విడుదల చేయడం, కొనసాగుతున్న పథకాలను సజావుగా అమలు చేయడం కోసం మంత్రిత్వ శాఖ ముందస్తు యంత్రాంగాలను ఏర్పాటు చేసింది.
ఉపాధి భద్రత, వేతన మద్దతు
ప్రతిపాదిత వీబీ–జీ రామ్ జీ చట్టం, 2025 అమలులోకి వచ్చే వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్జీఏ), 2005 పూర్తిస్థాయిలో అమలులో ఉంటుంది. గ్రామీణ కుటుంబాలకు వేతన ఉపాధి కల్పనలో ఎటువంటి అంతరాయం కలగదు.
డిమాండ్ ఆధారిత ఉపాధి, సకాలంలో వేతన చెల్లింపులతో సహా అన్ని చట్టబద్ధమైన హక్కులను ఎటువంటి తగ్గింపు లేకుండా పూర్తి స్థాయిలో కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రస్తుత వేతన రేట్లు యథాతథంగా అమలులో ఉంటాయి.
తగినంత నగదు లభ్యతను నిర్వహించడానికి, వేతనాల పంపిణీకి ఎటువంటి అంతరాయం కలగకుండా చూసేందుకు, ఎంజీఎన్ఆర్జీఏ కింద వేతనాల కోసం సుమారు రూ. 17,744 కోట్లను మొదటి విడతగా విడుదల చేస్తున్నారు.
ఇది అమల్లోకి వచ్చిన తర్వాత, ప్రతిపాదిత వీబీ–జీ రామ్ జీ చట్టం 125 రోజుల వేతన ఉపాధిని మెరుగైన హామీగా కల్పిస్తుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన సవరించిన వేతన రేట్లను విడిగా నోటిఫై చేస్తారు.
సరఫరా శ్రేణి సవాళ్లను ఎదుర్కోవడానికి గృహ నిర్మాణ కార్యక్రమం సిద్ధం
గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఇళ్లు అందించే లక్ష్యాన్ని సాధించేందుకు, మార్చి 2029 నాటికి 4.95 కోట్ల ఇళ్లను నిర్మించే ఉద్దేశంతో మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (పీఎంఏవై-జీ)ను అమలు చేస్తోంది.
సామగ్రి సరఫరాలో అంతరాయాలు లేదా ధరల హెచ్చుతగ్గుల వంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ముందస్తు సన్నద్ధతలో భాగంగా, మంత్రిత్వ శాఖ సకాలంలో ప్రత్యక్ష నగదు బదిలీ విడుదలకు, ఆవాస్‌సాఫ్ట్ ద్వారా నిరంతర పర్యవేక్షణకు, జియో-ట్యాగింగ్‌కు, గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి ప్రాధాన్యతనిస్తోంది.
లబ్ధిదారులకు కనీస వసతుల పూర్తి ప్యాకేజీ అందేలా చేయడానికి పని దినాలు, పారిశుధ్యం, త్రాగునీరు, ఎల్పీజీ, విద్యుత్ సౌకర్యాల ద్వారా బలమైన సమన్వయ మద్దతును ప్రభుత్వం అందిస్తోంది.
భవిష్యత్తులో మార్కెట్ అస్థిరతలను తట్టుకునేలా మెటీరియల్ బ్యాంకుల ఏర్పాటు వంటి నిర్మాణపరమైన చర్యలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
గ్రామీణ రోడ్ల కార్యక్రమానికి అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళిక
పీఎమ్జీఎస్వైకింద రాష్ట్రాలు ప్రతిపాదించిన ప్రస్తుత 'షెడ్యూల్ ఆఫ్ రేట్ల' ప్రకారం పనులకు అనుమతులు మంజూరు చేస్తున్నారు.
పీఎమ్జీఎస్వై1, 2, 3... వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల రోడ్డు అనుసంధాన ప్రాజెక్టుల కింద మంజూరైన పనులన్నీ ఇప్పటికే టెండర్ ప్రక్రియలో లేదా నిర్మాణంలో ఉన్నాయి.
ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన-4 కింద, సుమారు 12,100 కిలోమీటర్ల రహదారి పనులను మంజూరు చేశారు. ప్రస్తుతం అవి బిడ్లను ఆహ్వానించే దశలో ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో తారు వాటా తక్కువగా ఉండటం వల్ల, ప్రస్తుతానికి ప్రపంచ మార్కెట్ అస్థిరతల ప్రభావం పరిమితంగా ఉంది.
భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులను, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు,వ్యయ ధోరణులను ప్రతిబింబించేలా నవీకరించిన ధరల పట్టికను ఉపయోగించి మూల్యాంకనం చేస్తారు.
వ్యవసాయం, సహజ వనరుల సుస్థిరత బలోపేతానికి చర్యలు
నీటి సంరక్షణ, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, ఉద్యానవన, పచ్చిక బయళ్ల అభివృద్ధిని బలోపేతం చేయడానికి 50 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వాటర్ షెడ్ అభివృద్ధి - ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన (డబ్ల్యుడీసీ- పీ ఎంకేఎస్వై) 2.0ను భూ వనరుల విభాగం అమలు చేస్తోంది.
ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి, పథకాల అమలు సజావుగా సాగేలా చూడడానికి, ఈ విభాగం వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ,ఇతర భాగస్వామ్య మంత్రిత్వ శాఖలతో కలిసి సన్నిహిత సమన్వయంతో పనిచేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2253994)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13