సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అత్యాధునిక సాంకేతికతలు, డిజిటల్ పరివర్తనలో సహకార బలోపేతానికి సీ-డాక్‌తో ఎంఓయూ కుదుర్చుకున్న బీఈసీఐఎల్

ఏఐ, 5జీ, సైబర్ సెక్యూరిటీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులు, సాంకేతిక పరిష్కారాలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించటమే లక్ష్యం

నాడు పోస్టు చేయడమైనది: 18 APR 2026 1:00PM by PIB Hyderabad

అత్యాధునిక సాంకేతికతలు, డిజిటల్ పరివర్తనలో సహకార బలోపేతానికి సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డాక్)తో బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది.

 

కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), సైబర్ సెక్యూరిటీ, 5జీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో ఉమ్మడి ప్రాజెక్టుల అమలు, సంప్రదింపులు, సాంకేతిక మద్దతు, పరిష్కారాల అభివృద్ధిపై ఈ సహకారం దృష్టి సారిస్తుంది. వివిధ రంగాల్లో సమగ్ర పరిష్కారాలను అభివృద్ధి చేయటంతో పాటు, సాంకేతిక బదిలీ, వినూత్న ఉత్పత్తుల వాణిజ్యీకరణను ఈ భాగస్వామ్యం సులభతరం చేస్తుంది. సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయటానికి అవసరమైన శిక్షణ, సిబ్బందిలో నైపుణ్య పెంపుదల, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యతనిస్తుంది.

 

సీనియర్ అధికారుల సమక్షంలో బీఈసీఐఎల్ డైరెక్టర్ (ఓ అండ్ ఎం) (రిటైర్డ్) కెప్టెన్ (ఇన్) సౌరవ్ చౌహాన్, సీ-డాక్ రిజిస్ట్రార్ శ్రీ నిరంజన్ వైష్ణవ్ ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు.

 

బీఈసీఐఎల్ సీఎండీ, కమోడోర్ డీకే మురళి (రిటైర్డ్) ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీ-డాక్ తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం అధునాతన సాంకేతికతలు, డిజిటల్ పరివర్తన రంగాల్లో బీఈసీఐఎల్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. రెండు సంస్థల సామర్థ్యాలను పరస్పరం వినియోగించుకోవటం ద్వారా ఈ భాగస్వామ్యం ప్రభావవంతమైన పరిష్కారాలను అందించటమే కాక, భారతదేశ డిజిటల్ వృద్ధికి కూడా దోహదపడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

ఆవిష్కరణలను ప్రోత్సహించటానికి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందుబాటులోకి తీసుకురావటానికి, భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా పటిష్టమైన, భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉండే డిజిటల్ వ్యవస్థ నిర్మాణానికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని భావిస్తున్నారు.

 

బీఈసీఐఎల్ గురించి

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మినీ రత్న కేటగిరీ-I ప్రభుత్వ రంగ సంస్థే బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్). 1995లో ఏర్పాటైన ఈ సంస్థ.. ప్రసార, సమాచార సాంకేతికత, టెలికమ్యూనికేషన్స్ రంగాల్లో కన్సల్టెన్సీ సేవలను, సమగ్ర పరిష్కారాలను అందిస్తుంది. బీఈసీఐఎల్ కార్యకలాపాలను ఇ-గవర్నెన్స్, స్మార్ట్ సిటీలు, ఆరోగ్య సంరక్షణ, మానవ వనరుల సేవలు వంటి రంగాలకు కూడా విస్తరించింది. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు రెండింటికీ సేవలను అందిస్తోంది.

 

సీ-డీఏసీ గురించి

 

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డాక్).. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) పరిధిలోని పరిశోధన, అభివృద్ధి సంస్థ. అధునాతన కంప్యూటింగ్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత, సాఫ్ట్‌వేర్ సాంకేతికతలు వంటి రంగాల్లో ఇది పనిచేస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తులు, సామర్థ్య పెంపుదల కార్యక్రమాలను అభివృద్ధి చేయటం ద్వారా సీ-డాక్ జాతీయ కార్యక్రమాలకు సహకరిస్తుంది.

****

 


(రిలీజ్ ఐడి: 2253273) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Kannada , Malayalam