హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డీలిమిటేషన్ బిల్లు-2026... రాజ్యాంగ (131వ) సవరణ బిల్లు-2026... కేంద్రపాలిత ప్రాంత చట్టాల (సవరణ) బిల్లు-2026లపై లోక్‌సభలో చర్చకు కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా సమాధానం


· షా బానో కేసు.. ట్రిపుల్‌ తలాక్ రద్దు.. చట్టసభలలో మహిళా రిజర్వేషన్- వంటి ప్రతి అంశంలోనూ ప్రధాన ప్రతిపక్షం సదా మహిళల హక్కులను వ్యతిరేకిస్తోంది

· ఎమర్జెన్సీ విధించిన పూర్వ ప్రధాని 1976లో తన అధికారం కాపాడుకోవడానికి నియోజకవర్గాల పునర్విభజనను ఆపేస్తే... నేడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న అదే పార్టీ ఈ ప్రక్రియను అడ్డుకుంటోంది

· మూడు దశాబ్దాలుగా ఆమోదం లభించని మహిళా రిజర్వేషన్ బిల్లును మోదీ ప్రభుత్వం దాన్ని అక్షరాలా అదే స్ఫూర్తితో ముందుకు తెస్తే ప్రతిపక్షం అడ్డుపడింది

· ఈ నేపథ్యంలో 2029 లోక్‌సభ ఎన్నికలలోనే కాకుండా ప్రతి స్థాయిలో.. ప్రతి ఎన్నికలో.. ప్రతిచోటా “మహిళల ఆగ్రహాన్ని” ప్రతిపక్షం ఎదుర్కొనక తప్పదు

· ఎంతటి వ్యతిరేకత ఎదురైనా మహిళా సాధికారత.. చట్టసభల్లో వారి ప్రాతినిధ్యానికి భరోసా ఇవ్వడంలో మా కృషి ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది

నాడు పోస్టు చేయడమైనది: 17 APR 2026 10:18PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు-2026, రాజ్యాంగ (131వ) సవరణ బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంత చట్టాల (సవరణ) బిల్లు-2026లపై సాగిన చర్చకు కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఇవాళ సమాధానమిచ్చారు.

ఈ చర్చలో సభలోని 56 మంది మహిళా ఎంపీలు సహా మొత్తం 130 మంది సభ్యులు పాల్గొన్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అయితే, ప్రతిపక్ష కూటమి మహిళా రిజర్వేషన్ బిల్లును స్పష్టంగా వ్యతిరేకించిందని, ఇది దాని అమలు విధానంపైన కాకుండా కేవలం మహిళలకు రిజర్వేషన్‌కు మాత్రమే సంబంధించినదని చెప్పారు. అయినప్పటికీ, మన ప్రజాస్వామ్య పునాదిగా రాజ్యాంగ పరిషత్ నిర్దేశించిన “ఒక వ్యక్తి-ఒక ఓటు-ఒక విలువ” సూత్రాన్ని ఆచరించడమే తమ లక్ష్యమన్నారు.

నియోజకవర్గ హద్దుల పునర్విభజనకు (డీలిమిటేషన్‌) రాజ్యాంగం ఎప్పటికప్పుడు వీలు కల్పిస్తుందని మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రక్రియతోనే షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి సీట్ల సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. దీన్ని వ్యతిరేకించడమంటే ఎస్సీ, ఎస్టీలకు సీట్ల పెంపును అడ్డుకుంటున్నట్టేనని వ్యాఖ్యానించారు. సమతుల, సమ్మిళిత, ఆచరణాత్మకమైన ప్రజాస్వామ్య వ్యవస్థ రూపకల్పనపై రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతను శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు నిర్వర్తిస్తన్నదని తెలిపారు. సమాఖ్య సమతౌల్య పరిరక్షణ, జనాభా నిష్పత్తితో లోక్‌సభలో ప్రాతినిధ్యం కల్పన, రాష్ట్రాల అధికారాల్లో సమతౌల్య సాధన కూడా డీలిమిటేషన్‌ ప్రక్రియతో ముడిపడి ఉంటాయని శ్రీ అమిత్‌ షా అన్నారు. తాజా భౌగోళిక స్థితిగతులు, పాలనపరమైన మార్పులు, పట్టణీకరణ, రహదారులు-రైల్వేలతో మెరుగైన అనుసంధానం, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి పలు అంశాలు పునర్విభజన ప్రక్రియలో అంతర్భాగంగా ఉంటాయన్నారు. రాజ్యాంగ నిబంధనలు 81, 82, 170 ద్వారా వీటన్నిటినీ అమలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ దిశగానే శ్రీ నరేంద్ర మోదీ  నాయకత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగ సవరణను ప్రతిపాదించిందని తీసుకువచ్చిందని పేర్కొన్నారు. తదనుగుణంగా మహిళా సాధికారతకు ప్రోత్సాహం, సమాన ప్రాతినిధ్య కల్పన, సమతుల సమాఖ్యకు రూపకల్పన వంటి బాధ్యతలను నెరవేర్చడమే ఈ బిల్లుల ప్రధానోద్దేశమని వివరించారు.

జనగణన-2026 అనంతరం చేపట్టే డీలిమిటేషన్‌ ప్రక్రియలో మహిళా రిజర్వేషన్ కల్పనను ‘నారీ శక్తి వందన్ చట్టం’ నిర్దేశిస్తున్నదని కేంద్ర హోం మంత్రి గుర్తు చేశారు. నేటి ప్రతిపక్షం 1971లో అధికారంలో ఉన్నపుడు ఈ ప్రక్రియను పాతికేళ్లపాటు నిలిపివేసిందని, అందుకే ఈ అంశాన్ని ప్రస్తావించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఆనాటినుంచీ సీట్ల సంఖ్య స్తంభించిపోవడంతో ప్రస్తుతం 127 నియోజవర్గాల్లో 20 లక్షల మందికిపైగా ఓటర్లున్నారని తెలిపారు. దీనివల్ల “ఒక వ్యక్తి-ఒక ఓటు-ఒక విలువ” సూత్రం ఉల్లంఘనకు గురవుతోందని చెప్పారు.

వాస్తవానికి 1972లో నాటి ప్రధానమంత్రి తొలుత డీలిమిటేషన్ బిల్లు ద్వారా లోక్‌సభలో సీట్ల సంఖ్యను 525 నుంచి 545కు పెంచి, ఆ తర్వాత స్తంభింపజేశారని శ్రీ అమిత్ షా అన్నారు. అటుపైన 1976లో ఎమర్జెన్సీ విధించినపుడు అధికారాన్ని కాపాడుకోవడం కోసం డీలిమిటేషన్‌ను నిలిపివేస్తూ 42వ రాజ్యాంగ సవరణ తెచ్చారని గుర్తుచేశారు. ఆనాడు దేశ ప్రజలకు నియోజకవర్గ పునర్విభజన ప్రయోజనం దక్కకుండా చేసిన నేటి ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు కూడా అదే వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు. అనంతరం 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 దాకా సీట్ల సంఖ్యను స్తంభింపజేసినట్లు తెలిపారు. ఈ విధంగా 1976 నుంచి 2026 దాకా- 50 ఏళ్లపాటు దేశ ప్రజలకు జనాభా నిష్పత్తిలో ప్రాతినిధ్యం దక్కకుండా పోయిందన్నారు. అయితే, ఇప్పుడు పునర్విభజన చేపట్టినా, ప్రతి నియోజకవర్గంలో డీలిమిటేషన్ కమిషన్ నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ 2029కి ముందు పూర్తికాదని ఆయన పేర్కొన్నారు.

దేశ జనాభా 1976లో 54.79 కోట్లు కాగా, నేడు 140 కోట్లకు చేరిందని కేంద్ర హోం మంత్రి-సహకార శాఖల మంత్రి తెలిపారు. సభలో సభ్యుల సంఖ్య పెరిగే కొద్దీ, పనిదినాల సంఖ్యను కూడా పెంచడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. జనాభా నిష్పత్తిలో సీట్ల నిర్ణయం వాటి సంఖ్యకు భంగం వాటిల్లకుండా ప్రతి రాష్ట్రంలోనూ సీట్ల సంఖ్యను 50 శాతం వంతున ప్రభుత్వం పెంచుతుందని పేర్కొన్నారు. జనగణనను సకాలంలో నిర్వహించకపోవడంపై కొందరు సభ్యులు ప్రశ్నించారని గుర్తుచేశారు. వాస్తవానికి 2021లో జనగణన చేపట్టాల్సి ఉండగా, ఈ శతాబ్దపు అతిపెద్ద మహమ్మారి కోవిడ్-19 వల్ల అది సాధ్యం కాలేదని శ్రీ అమిత్‌ షా వివరించారు. మహమ్మారి తగ్గుముఖం పట్టినా దాని దుష్ప్రభావం నుంచి దేశం కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని తెలిపారు. అటుపైన 2024లో జనగణన ప్రక్రియ చేపట్టినపుడు కొన్ని పార్టీలు కులగణనను కూడా చేర్చాలని న్యాయమైన డిమాండ్‌ను లేవనెత్తాయని గుర్తుచేశారు. దీంతో సంబంధిత వర్గాలన్నింటితో చర్చించి, కులగణనను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుత జనగణనలో కులాలవారీ గణన కూడా అంతర్భాగంగా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉండగా నిర్వహించిన గత జనగణనలో కులాలవారీ లేదా మతం ప్రస్తావన ఎన్నడూ లేదన్నారు. అయితే, 2026 జనగణనలో కులగణనతో చేర్చాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించారని తెలిపారు.

ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పటి నుంచీ ప్రతిపక్షాలు ప్రజల్లో వదంతులు ప్రచారం చేయడం ప్రారంభించాయని శ్రీ అమిత్ షా ఆరో్పించారు. కులగణనను ఆలస్యం చేయడానికి ప్రభుత్వం ఈ రాజ్యాంగ సవరణ తెచ్చిందన్నది ఈ వదంతులలో మొదటిదని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అన్నది మరో అపోహగా పేర్కొంటూ, ఉత్తరాది రాష్ట్రాలకు ఈ సభపై ఎంత హక్కు ఉందో, దక్షిణాదికీ అంతే హక్కు ఉందని పునరుద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్‌లకు ఈ సభపై ఎంత హక్కు ఉందో, లక్షద్వీప్‌కూ అంతే హక్కు ఉంటుందన్నారు. కానీ, ప్రతిపక్షాలు ఉత్తర-దక్షిణ భారత ప్రాంతాలనే వాదన తెచ్చి దేశాన్ని నిలువునా చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. అటువంటి విభజనలకు అతీతంగా వ్యవహరించాలని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వారే ఇప్పుడు ఉత్తర-దక్షిణ విభజన సృష్టికి యత్నిస్తున్నారని, దాన్ని ఎంతమాత్రం అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులో ప్రమాణం చేసే ప్రతి సభ్యుడు దేశ ఐక్యత, సమగ్రతను కాపాడతామని, యావద్దేశ సంక్షేమం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారని వివరించారు. తమ నియోజకవర్గం, రాష్ట్రం, మతం లేదా కులం పేరుతో ఏ ఒక్క సభ్యుడూ ప్రమాణం చేయరని తెలిపారు. లేనిపోని వదంతులతో దేశంలో విభజన తెచ్చేవారు ఎవరైనా వారికి అధికారం దక్కడం అసాధ్యమని కేంద్ర హోం మంత్రి అన్నారు.

డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు, రాజ్యాంగ సంస్కరణలతో దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం పరంగా నష్టపోతాయన్న ప్రచారం అవాస్తవమని కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇప్పుడు మొత్తం 129 లోక్‌సభ సీట్లు ఉండగా, మొత్తం 543లో ఇవి 23.76 శాతంగా ఉన్నాయని తెలిపారు. ఈ సీట్లను 50 శాతం పెంచి, ఐదు రాష్ట్రాలకు కేటాయిస్తే, అవి 129 నుంచి 195కు పెరుగుతాయని పేర్కొన్నారు. డీలిమిటేషన్ తర్వాత మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య 816కు పెరిగినా, దక్షిణాది రాష్ట్రాల సీట్ల వాటా స్వల్పంగా పెరిగి 23.87 శాతానికి చేరుతుందన్నారు.

మరోవైపు ముస్లిం మహిళలకూ ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలనే మరో వదంతిని కొందరు సభ్యులు వ్యాప్తి చేశారని కేంద్ర హోం మంత్రి అన్నారు. కానీ, భారత రాజ్యాంగంతోపాటు ప్రభుత్వం, తమ పార్టీ విధానం సుస్పష్టంగా ఉన్నాయని, మతం ప్రాతిపదికన రిజర్వేషన్‌ను రాజ్యాంగం అనుమతించబోదని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్ జన్మతః లభిస్తుంది తప్ప మరే ఇతర మార్గంలోనూ దాన్ని పొందలేమన్నారు. మతం పేరిట రిజర్వేషన్ ఇచ్చేందుకు రాజ్యాంగంలోని ఏ నిబంధనా నిర్దేశించదని గుర్తుచేశారు. ప్రతిపక్ష కూటమి నాయకులు తమ బుజ్జగింపు రాజకీయాల కోసమే ఒకవైపు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, మరోవైపు ముస్లిం రిజర్వేషన్ల కోసం డిమాండ్లు లేవనెత్తుతున్నారని ఆయన అన్నారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్ ఎప్పటికీ అసాధ్యమేనని స్పష్టం చేశారు.

మన దేశంలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)కు అతిపెద్ద వ్యతిరేక పార్టీ ఏదైనా ఉందంటే అది ప్రధాన ప్రతిపక్షమేనని శ్రీ అమిత్ షా అన్నారు. అందుకే, 1957లో ఓబీసీలకు రిజర్వేషన్లపై కాకా కాలేల్కర్ కమిషన్ సిఫారసు చేసినా, అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ నివేదికను తొక్కిపెట్టిందని ఆరోపించారు. అదేవిధంగా మండల్ కమిషన్ నివేదిక ఇచ్చినపుడు కూడా దాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. అటుపైన 1990లో వి.పి.సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తే, అప్పటి ప్రతిపక్ష పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు ఆ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ తన జీవితంలోనే అత్యంత సుదీర్ఘ ప్రసంగం చేశారని గుర్తుచేశారు. ఇక నేటి ప్రతిపక్షం 1951, 1971లలో కుల ప్రాతిపదికన జనాభా లెక్కలను వ్యతిరేకించిందని ఆయన చెప్పారు.

ఎన్నికలలో గెలుపు మాత్రమే ప్రతిపక్షానికి అత్యంత ప్రధానం కాగా, తమ ప్రభుత్వానికి మాత్రం ప్రజలే ప్రథమమని శ్రీ అమిత్ షా అభివర్ణించారు. దేశ ప్రజలకు ప్రాతినిధ్యం, భాగస్వామ్యం కల్పించడం అత్యంత ప్రాధాన్యంగల అంశమని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం అమలు చేయాలంటే జవాబుదారీతనం, పారదర్శకత, సమాన అవకాశాలు, న్యాయ పరిరక్షణ అత్యావశ్యకాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షం నాలుక చివరినుంచి ఆందోళన ప్రకటించడంలోని వాస్తవం ప్రజలకు బాగా తెలుసునని, దేశంలోని మహిళల హక్కులను ఇవాళ ప్రతిపక్ష పార్టీ నిలువునా హరించిందనే వాస్తవాన్ని ప్రజానీకం కూడా తెలుసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.

పూర్వ ప్రధానమంత్రి శ్రీ పి.వి.నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వం 72వ, 73వ రాజ్యాంగ సవరణల ద్వారా 1992లోనే పంచాయతీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం ప్రశంసనీయమన్నారు. అటుపైన 1996లో శ్రీ హెచ్.డి.దేవెగౌడ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 1996 సెప్టెంబరులో 81వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడితే కొన్ని పార్టీలు వ్యతిరేకించాయని గుర్తుచేశారు. దీంతో ఆ బిల్లుపై పరిశీలన కోసం గీతా ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేయగా, అది నివేదికను సమర్పించేలోగా 11వ లోక్‌సభ రద్దవడంతో బిల్లుకు కాలం చెల్లిందని తెలిపారు. మరోసారి 1998లో 84వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొస్తే అవే పార్టీలు దాన్ని కూడా వ్యతిరేకించాయని గుర్తుచేశారు. సభలో బిల్లును ప్రవేశపెట్టే పరిస్థితులు లేకపోగా, 12వ లోక్‌సభ కూడా రద్దవడంతో దానికీ కాలం చెల్లిందని అన్నారు. అనంతరం 1999-2003 మధ్య 85వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టినా అదే పార్టీల నుంచి మళ్లీ వ్యతిరేకత రావడంతో అది వీగిపోయిందని శ్రీ అమిత్‌ షా తెలిపారు.

తదనంతరం 2008 నుంచి 2014 మధ్య ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం  108వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా అది ఆమోదం పొందినప్పటికీ, లోక్‌సభకు మాత్రం చేరలేదని గుర్తుచేశారు. అయితే, ఆనాడు తమ పార్టీ దాన్ని వ్యతిరేకించలేదని, ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలు కూడా వ్యతిరేకించాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార కూటమిలోని ఇతర పార్టీలు ఆ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నాయన్నది దీన్నిబట్టి స్పష్టమవుతోంది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024లో ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా 2023లో ఎలాంటి జంకూ లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును తెచ్చారని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. అప్పట్లో ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు వేసినా దాన్ని నిరోధించే అవకాశం ప్రతిపక్షాలకు లేకుండాపోయిందని తెలిపారు. ఆ మేరకు కొత్త పార్లమెంట్ సౌధం ప్రారంభోత్సవం చేసిన నాడే, నారీ శక్తి వందన చట్టం ఏకగ్రీవంగా ఆమోదం పొందిన తొలి బిల్లుగా చరిత్రకెక్కిందని వివరించారు. అనంతరం దీనికి రాజ్యసభలోనూ ఆమోదం లభించిందని తెలిపారు. అయితే, దీని అమలును ఇప్పుడు ప్రతిపక్షాలు మరోసారి వ్యతిరేకించాయని, దేశంలోని మహిళలు ఎన్నటికీ దీన్ని క్షమించజాలరని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మేరకు ఏ ఎన్నికల్లోనైనా ప్రతిపక్ష పార్టీలు మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కొనక తప్పదని ఆయన స్పష్టం చేశారు.

అసలు ఇప్పుడు మార్పు చేయాల్సిన అవసరమేమిటని కొందరు అడుగుతున్నారని కేంద్ర హోం మంత్రి అన్నారు. తొలి లోక్‌సభలో 22 మంది, 6వ లోక్‌సభలో 19 మంది, 8వ లోక్‌సభలో 44 మంది, 14వ లోక్‌సభలో 51 మంది, 17వ లోక్‌సభలో రికార్డు స్థాయిలో 78 మంది, 18వ లోక్‌సభకు 75 మంది మహిళలు ఎన్నికయ్యారని పేర్కొంటూ, దేశ రాజకీయాల్లో భాగస్వామ్యంపై మహిళల్లో పెరుగుతున్న ఉత్సాహాన్ని ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు.

మహిళా రిజర్వేషన్లను సాకారం చేయడంలో “మహిళల సారథ్యంలో ప్రగతి” సూత్రం స్ఫూర్తిని  ప్రభుత్వం అక్షరాలా పాటించిందని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తొలి మంత్రిమండలిలో 10 మంది మహిళలు ఉండేవారని ఆయన గుర్తుచేశారు. వీరిలో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి, శ్రీమతి ఉమా భారతి మధ్యప్రదేశ్‌కు, శ్రీమతి వసుంధర రాజే రాజస్థాన్‌కు (తొలిసారి) ముఖ్యమంత్రులయ్యారని గుర్తుచేశారు. ఇక ఆనందీబెన్ పటేల్ గుజరాత్‌ తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారని, గత 70 ఏళ్లలో ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రాలకు ఎన్నడూ మహిళా ముఖ్యమంత్రిని ఇవ్వలేదని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం శ్రీమతి ద్రౌపది ముర్మును దేశానికి తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిని చేసిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు దశాబ్దాలుగా తిరస్కరణకు గురైన బిల్లును ప్రభుత్వం ఇప్పుడు ముందుకు తెస్తే, గతంలో అడ్డుకున్న పార్టీయే ఈసారి కూడా నిరోధించడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పంచాయతీలలో ఇప్పటిదాకా సుమారు 14 లక్షల మంది మహిళలు ప్రతినిధులుగా పనిచేశారని హోం మంత్రి అన్నారు. ఈ పరిణామాల మధ్య ఎంతటి వ్యతిరేకత ఎదురైనా మహిళా సాధికారత కోసం, చట్టసభలలో వారి భాగస్వామ్యానికి భరోసా ఇచ్చేందుకు తాము కృషి చేస్తూనే ఉంటామని ఆయన ప్రకటించారు.

ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ఇదే ప్రతిపక్షం ఆర్టికల్ 370 రద్దు సమయంలోనూ దాన్ని వ్యతిరేకించినట్లు కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. అలాగే, రామ మందిర  నిర్మాణాన్ని, పౌరసత్వ సవరణ చట్టాన్ని, ముమ్మారు తలాక్ రద్దును కూడా వారు వ్యతిరేకించారని గుర్తు చేశారు. అంతేకాకుండా వస్తుసేవల పన్ను (జీస్‌టీ) ప్రవేశపెట్టడాన్ని కూడా వ్యతిరేకించారని,  ఆయుష్మాన్ భారత్ పథకం వద్దన్నారని, కొత్త పార్లమెంట్ భవన నిర్మాణాన్నీ వ్యతిరేకించారని చెప్పారు. కేంద్రంలో తొలిసారి మత్స్య, సహకార మంత్రిత్వ శాఖల ఏర్పాటును, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవి ఏర్పాటును వ్యతిరేకించారని చెప్పారు. నక్సలిజం నిర్మూలన ప్రయత్నాలు సహా ఉగ్రవాదంపై కఠిన చర్యలను, ఉగ్ర శిబిరాలపై ఆకస్మిక, వైమానికి దాడులను వ్యతిరేకించారని పేర్కొన్నారు. తాజాగా ఇటీవల ఆపరేషన్ సిందూర్‌ వ్యతిరేకించిన వీరు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏది చేసినా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. వాస్తవానికి దేశంలోని మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్‌ కల్పన వ్యతిరేకించదగిన అంశం కాకపోయినా, చివరకు ఈ ప్రతిపక్షం దాన్నీ వ్యతిరేకిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీన్ని తెస్తున్నారు కాబట్టే, ప్రతిపక్షం దీన్ని అడ్డుకుంటున్నదని కేంద్ర హోం మంత్రి అన్నారు. మహిళా రిజర్వేషన్ అమలుతో ప్రధానమంత్రిపై వారిలో అభిమానం ఇనుమడిస్తుందనే భయంతోనే ఇలా చేస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే మహిళా ఓటర్లు ఆయనకు ఎక్కువగా మద్దతు పలుకుతున్నారని ప్రతిపక్షం భావిస్తున్నది కాబట్టే, ఈ రిజర్వేషన్‌ బిల్లుకు మోకాలు అడ్డు పెడుతున్నదని ఆయన ఆరో్పించారు. వాస్తవానికి మహిళలకు చట్టసభల్లో 33 శాతం  రిజర్వేషన్‌పై 2023 ఎన్నికలలో అన్ని పార్టీలూ హామీ ఇచ్చినా, ప్రతిపక్షం నేడు వెనకడుగు వేస్తోందని ఆయన అన్నారు. ఇలా చేయడం ఇది తొలిసారి కాదని, షా బానో కేసు.. ట్రిపుల్ తలాక్ వంటి అంశాలపై ప్రతిపక్షం వెనక్కి తగ్గిందని కొన్ని సందర్భాలను ఆయన ఉటంకించారు. అదే తరహాలో మహిళా రిజర్వేషన్ ప్రతిపాదించిన ప్రతిసారీ ప్రతిపక్షం వెనకడుగు వేస్తున్నదని వ్యాఖ్యానించారు.

సభలో ఈ బిల్లుపై ఓటింగ్‌ సందర్భంగా సభ్యులందరూ అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేయాలని తమ నాయకుడు కోరారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. కానీ, ఇక్కడ “ఆత్మ” అన్నదే కనిపించనపుడు “అంతరాత్మ” ఎక్కడి నుంచి వస్తుందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇదంతా విచక్షణ రహిత రాజకీయాలను ప్రతిబింబిస్తున్నదని వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ ప్రతిపక్ష నాయకులు దేశంలో ఎక్కడికెళ్లినా మహిళల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని శ్రీ అమిత్‌ షా హెచ్చరించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2253235) సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Marathi , हिन्दी , Bengali , Gujarati , Kannada