MIFF banner

డాక్యుమెంటరీ, షార్ట్ ఫిక్షన్, యానిమేషన్ చిత్రాల కోసం జూన్ 15 నుంచి 21 వరకు 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం


ముంబయిలోని ఎన్ఎఫ్‌డీసీ కాంప్లెక్స్‌ వేదికగా నిర్వహణ

19వ ఎమ్ఐఎఫ్ఎఫ్ కోసం ప్రారంభమైన చలనచిత్రాల సమర్పణలు

ఈ నెల 12 వరకు పోటీ ఎంట్రీలకు గడువు

ఎమ్ఐఎఫ్ఎఫ్‌తో పాటు... జూన్ 16 నుంచి 18 వరకు వేవ్స్ డాక్ బజార్ రెండో ఎడిషన్

డాక్యుమెంటరీ, షార్ట్ ఫిక్షన్, యానిమేషన్ చిత్రాల కోసం ఉద్దేశించిన 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎమ్ఐఎఫ్ఎఫ్)-2026ను ముంబయిలోని ఎన్ఎఫ్‌డీసీ కాంప్లెక్స్ వేదికగా జూన్ 15 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు.

ఈ ఉత్సవం... భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంటరీ చిత్రాల రూపకర్తలు, సినీరంగ నిపుణులు, సినీ అభిమానులు, రచయితలు, విద్యావేత్తలు, విమర్శకులు, పాత్రికేయులు, విద్యార్థులు, ఔత్సాహికులంతా ఈ ఉత్సాహభరితమైన సినీ వేడుకల్లో పాలుపంచుకోవాలని ఆహ్వానిస్తోంది.

ప్రస్తుతం, పోటీ విభాగంలో ప్రదర్శన కోసం చిత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించే ప్రక్రియ కొనసాగుతోంది. చిత్రాలను సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 12, 2026. నిర్మాతలు, పంపిణీదారులు, హక్కుదారులు, వారు అధికారికంగా నియమించిన ప్రతినిధులు... నిబంధనలను పూర్తిగా చదివిన తర్వాత తమ చిత్రాలను '‘ఫిల్మ్ ఫ్రీవే' వేదిక (https://filmfreeway.com/MumbaiInternationalFilmFestival-MIFF) ద్వారా మాత్రమే సమర్పించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఆఫ్‌లైన్ పద్ధతిలో సమర్పించే ఎంట్రీలను స్వీకరించరని వారు తెలియజేస్తున్నారు.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ) నిర్వహించే ఎమ్ఐఎఫ్ఎఫ్‌... నాన్-ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అత్యంత ఆకర్షణీయమైన పురస్కార ప్యాకేజీలను అందిస్తోంది. ఇందులో మొత్తం నగదు బహుమతుల విలువ రూ. 55 లక్షల వరకు ఉంటుంది. ఉత్తమ డాక్యుమెంటరీకి ప్రతిష్ఠాత్మక గోల్డెన్ కాంచ్ పురస్కారం సహా రూ. 10 లక్షల నగదు బహుమతి లభిస్తుంది. ఈ ఫెస్టివల్... నెట్‌వర్కింగ్, సహ-నిర్మాణ అవకాశాల కోసం ఒక విలువైన వేదికనూ అందిస్తుంది.

జూన్ 16 నుంచి 18 వరకు జరగనున్న 'వేవ్స్ డాక్ బజార్' రెండో ఎడిషన్ ఎమ్ఐఎఫ్ఎఫ్-2026లో ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ డాక్ బజార్‌లో సహ-నిర్మాణ మార్కెట్, వ్యూయింగ్ రూమ్, ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్' ల్యాబ్ వంటి పలు విభాగాలు ఉంటాయి. నాన్-ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ చిత్రాల ప్రపంచ స్థాయి కొనుగోలుదారులు, విక్రేతల మధ్య అనుసంధానాన్ని పెంపొందించడం... డాక్యుమెంటరీ చిత్రాల రూపకల్పన, నిర్మాణం, పంపిణీ రంగాల్లో సహకారాన్ని, ఆవిష్కరణలను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. వేవ్స్ డాక్ బజార్‌లో పాల్గొనడానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే ఎమ్ఐఎఫ్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. ఆసక్తి ఉన్నవారు https://miff.in/en/waves-doc-bazaar/about-waves-doc-bazaar ను గమనిస్తూ ఉండవచ్చు.

1990లో ఏర్పాటు చేసిన ఎమ్ఐఎఫ్ఎఫ్... దక్షిణాసియాలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద నాన్-ఫీచర్ ఫిల్మ్ ఫెస్టివల్. దీనిని ప్రతి రెండు సంవత్సరాలకోసారి నిర్వహిస్తారు. సంవత్సరాలుగా... ఈ ఫెస్టివల్ డాక్యుమెంటరీ, షార్ట్ ఫిక్షన్, యానిమేషన్ చిత్రాల నిర్మాణంలో శ్రేష్ఠతను ప్రదర్శించడం ద్వారా గణనీయమైన ఖ్యాతిని సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రరూపకర్తలంతా ఇందులో పాల్గొనేలా ఈ కార్యక్రమం ఆకర్షిస్తోంది.

30కి పైగా దేశాల నుంచి 350కి పైగా చిత్రాలతో జరిగిన 18వ ఎమ్ఐఎఫ్ఎఫ్ ఉత్సవానికి అద్భుతమైన స్పందన లభించింది. ఈ ఉత్సవంలో అంతర్జాతీయ, జాతీయస్థాయి పోటీ విభాగాలు, పురస్కారం గెలుచుకున్న చిత్రాల ప్రదర్శనలు, పునరుద్ధరించిన అలనాటి చిత్రాలు, ప్రత్యేకంగా రూపొందించిన నేపథ్య విభాగాలూ ఉన్నాయి.

మరింత సమాచారం, తాజా వివరాల కోసం, miff.india@nfdcindia.comను సంప్రదించండి లేదా www.miff.inను సందర్శించండి.

 

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2251115   |   Visitor Counter: 54