పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ
· విద్యుత్- రైల్వేలు- రాష్ట్రాల సమన్వయంతో పాటు బొగ్గు లభ్యతను పెంచడం ద్వారా ధరల నియంత్రణపై దృష్టి సారించిన బొగ్గు మంత్రిత్వ శాఖ
· సరఫరా గొలుసు అంతటా అందుబాటులో తగినంత బొగ్గు నిల్వలు
· 2026 మార్చి 23 నుంచి ఇప్పటివరకు విక్రయమైన దాదాపు 8.9 లక్షల '5 కేజీల ఉచిత వాణిజ్య ఎల్‌పీజీ’ సిలిండర్లు
· 2026 ఫిబ్రవరిలో ఉన్న రోజువారీ సగటు విక్రయాలు (77,000) కంటే చాలా ఎక్కువగా 07.04.2026న అమ్ముడయిన 1.1 లక్షలకు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు
· ఎరువుల కర్మాగారాలకు గ్యాస్ కేటాయింపును 09.04.2026 నుంచి గత ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతానికి పెంచాలని నిర్ణయం
· MYPNGD.in పోర్టల్ ద్వారా ఇప్పటివరకు ఎల్‌పీజీ కనెక్షన్లను స్వచ్ఛందంగా వదులుకున్న 17,100 మందికి పైగా పీఎన్‌జీ వినియోగదారులు
· డీజీ షిప్పింగ్ చొరవతో ఇప్పటివరకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న 1,754 మందికి పైగా భారతీయ నావికులు.. గత 24 గంటల్లో 63 మంది ఆగమనం
· పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం జరుగుతున్న ప్రయత్నాలను స్వాగతిస్తోన్న భారత్
· ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల తగ్గింపు, చర్చలు, దౌత్యపరమైన పరిష్కారాల ద్వారానే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని విశ్వసిస్తోన్న భారత్
నాడు పోస్టు చేయడమైనది:
08 APR 2026 6:07PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై మీడియాకు సమాచారం అందించే నిరంతర కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాలు, సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖల అధికారులు.. ఇంధన లభ్యత, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందిస్తోన్న సహాయం, కీలక రంగాలలో స్థిరత్వాన్ని కాపాడటానికి తీసుకుంటున్న చర్యలపై తాజా సమాచారాన్ని అందించారు. బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా బొగ్గు రంగానికి సంబంధించిన తాజా వివరాలను వెల్లడించింది.
బొగ్గు రంగానికి సంబంధించిన తాజా సమాచారం
దేశవ్యాప్తంగా బొగ్గు లభ్యత, నిరంతర సరఫరాను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలపై బొగ్గు మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు:
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులలో బొగ్గు రంగం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. భారతీయ రైల్వేల మద్దతుతో పాటు గనులు, థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద తగినంత బొగ్గు నిల్వలతో వినియోగదారుల అవసరాలను తీర్చడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. ఏడాది పొడవునా క్రియాశీలక విధానం, ముందస్తు ప్రణాళికతో పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులకు ముందే తగినంత నిల్వలు సిద్ధం చేసింది. ఇది దేశ ఇంధన భద్రతను నిర్ధారించడమే కాకుండా సంభావ్య అంతరాయాల నుంచి దేశాన్ని రక్షిస్తోంది.
· మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాల దృష్ట్యా బొగ్గు మంత్రిత్వ శాఖ ముందస్తు, సమన్వయ చర్యలను చేపట్టింది. బొగ్గు లభ్యతను పెంచడం ద్వారా ధరలు అందుబాటులో ఉండేలా చూడటం, నిరంతర బొగ్గు సరఫరాను నిర్ధారించడానికి, కొరతను నివారించడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయం పాటిస్తోంది.
· పేలుడు పదార్థాలు, డీజిల్ ధరల పెంపుతో సహా పెరిగిన ఇతర ఉత్పత్తి ఖర్చుల భారాన్ని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) భరించాయి. ఈ పెరిగిన భారాలను వినియోగదారులపై మోపకుండా తక్కువ ధరలకే బొగ్గును అందిస్తున్నాయి.
· ధరలు అందుబాటులో ఉండేలా, బొగ్గు లభ్యతను పెంచేలా చూడటానికి కోల్ ఇండియా లిమిటెడ్ ఈ-వేలం పరిధిలోని బొగ్గు రిజర్వ్ ధరను 20 శాతం తగ్గించింది. అలాగే ఈ-వేలం, 'స్టేట్ నామినేటెడ్ ఏజెన్సీ' విధానం ద్వారా సరఫరాను పెంచింది. ఈ రెండు మార్గాల ద్వారా చిన్న, మధ్యతరహా, ఇతర వినియోగదారులకు బొగ్గు సరఫరాను మెరుగుపరచడమే కాకుండా తక్షణ, స్వల్పకాలిక అవసరాలను తీర్చడానికి అధిక కేటాయింపులు చేసింది.
· 2026 మార్చిలో ఈ-వేలాల సంఖ్యను కోల్ ఇండియా లిమిటెడ్ పెంచింది. మొత్తం 32.53 మిలియన్ టన్నుల బొగ్గును వేలంలో ఉంచగా అందులో 13.32 మిలియన్ టన్నులు (సుమారు 40.94 శాతం) బుక్ అయ్యాయి. తగినంత సరఫరా ఉందన్న విషయాన్ని ఇది తెలియజేస్తోంది. ఏప్రిల్ 2026 కోసం 25.80 మిలియన్ టన్నుల బొగ్గుతో 30 ఈ-వేలాలను ప్రణాళిక చేసింది. ఇప్పటివరకు 3.20 మిలియన్ టన్నులను వేలంలో ఉంచగా 1.24 మిలియన్ టన్నులు (సుమారు 38.75 శాతం) బుక్ అయ్యాయి.
· అక్రమ లాభార్జన- అక్రమ నిల్వను అరికట్టాలని, బొగ్గు డిమాండ్‌ను సకాలంలో సమర్పించి న్యాయమైన పంపిణీని నిర్ధారించాలని మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 'స్టేట్ నామినేటెడ్ ఏజెన్సీల' ద్వారా జరిగే బొగ్గు సేకరణను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు. 2025-26 వార్షిక సగటు సేకరణ కేటాయింపుల్లో 14.26 శాతంగా ఉంది. మిగిలిన కేటాయింపులను 31.03.2026 తర్వాత 90 రోజుల లోపు తీసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చారు. ఈ పొడిగించిన కాలంలో ఇప్పటివరకు సేకరణ 14.75 శాతంగా ఉంది.
· రాష్ట్రాలతో సమన్వయం చేసుకున్నందున బీహార్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, త్రిపుర రాష్ట్రాలు కేటాయింపు అభ్యర్థనలను సమర్పించాయి. 2026-27 సంవత్సరానికి మొత్తం 1.502 మిలియన్ టన్నుల బొగ్గు ఈ రాష్ట్రాలకు కేటాయించారు. మిగిలిన రాష్ట్రాల నుంచి అభ్యర్థనలు అందిన వెంటనే కేటాయింపులు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
· విలువ గొలుసు అంతటా తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయి. 06.04.2026 నాటికి థర్మల్ పవర్ ప్లాంట్ల వద్ద 55.18 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి, ఇది ప్రస్తుత వినియోగం ఆధారంగా సుమారు 24 రోజులకు సరిపోతుంది. దీనికి అదనంగా కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, క్యాప్టివ్ గనులు, ఓడరేవులు, రవాణాలో ఉన్న నిల్వలతో కలిపి మొత్తం 171.90 మిలియన్ టన్నుల బొగ్గు గనుల వద్ద, రవాణాలో అందుబాటులో ఉంది.
· బొగ్గు ఉత్పత్తి ఎటువంటి లోటు లేదు. ఇది వినియోగ స్థాయికి అనుగుణంగా కొనసాగుతోంది. భారతీయ రైల్వేల నుంచి రవాణా మద్దతు తగినంతగా ఉంది. బలమైన లాజిస్టిక్స్ మద్దతు, మెరుగైన నిల్వల పరిస్థితితో దేశ ఇంధన అవసరాలను తీర్చడానికి బొగ్గు రంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది.
ఇంధన సరఫరా, లభ్యత
హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూడటానికి తీసుకుంటున్న చర్యలను పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ వివరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రజా సూచనలు, పౌర అవగాహన
· పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విషయంలో ప్రజలు భయాందోళనతో కొనుగోళ్లు చేయొద్దని.. కేవలం అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు.
· ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాలని.. డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లకుండా ఉండాలని కోరారు.
· ప్రజలు పీఎన్జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించాల్సిందిగా ప్రోత్సహించారు.
· ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపు చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ సంసిద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు మధ్య ప్రభుత్వం గృహావసరాల ఎల్పీజీ, పీఎన్జీ సరఫరాకు.. ముఖ్యంగా ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యతనిస్తోంది.
· సరఫరా, డిమాండ్ రెండు అంశాల్లోనూ ప్రభుత్వం ఇప్పటికే పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో భాగంగా చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. ఎల్‌పీజీ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పెంచడం.. కీలక రంగాలకు సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యలు చేపట్టారు.
· ఎల్‌పీజీ డిమాండ్ ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
· చిన్న, మధ్యతరహా వినియోగదారులకు పంపిణీ చేయడం కోసం రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌ను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
· గృహ, వాణిజ్య వినియోగదారుల విషయంలో కొత్త పీఎన్‌జీ కనెక్షన్‌లు పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
· నిత్యావసరాల చట్టం- 1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను పర్యవేక్షించడానికి.. అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
· 27.03.2026, 02.04.2026 నాటి లేఖల ద్వారా ఇంధనం తగినంతగా అందుబాటులో ఉందన్న భరోసాను ప్రజలకు ఇచ్చేందుకు ముందస్తు ప్రజా సమాచార మార్పిడి అవసరమని కేంద్రం ప్రభుత్వం ప్రధానంగా చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 02.04.2026న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి… 06.04.2026న సమాచార - ప్రసార, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శులతో కలిసి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రముఖంగా చెప్పారు:
o ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజా సూచనలను జారీ చేయడం.
o సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలు, అవాస్తవ సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.
o జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిరోజూ తనిఖీలను ఉద్ధృతం చేయటం, ఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ దాడులు, తనిఖీలను కొనసాగించడం.
o సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
o రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ (ఎస్‌కేఓ) కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
o పీఎన్జీ వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
o ఎల్‌పీజీ సరఫరాలో ముఖ్యంగా గృహ అవసరాల ఎల్‌పీజీ సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల లక్షిత పంపిణీ విధానాన్ని అనుసరించడం.
· అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలు, జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశాయి.
· ప్రస్తుతం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
· ఎల్‌పీజీ అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4000కి పైగా దాడులు నిర్వహించి 1000కి పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
· ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 56,000 కంటే ఎక్కువ ఎల్‌పీజీ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
· ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలు (పీఎస్‌యూ ఓఎంసీ) ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా 1770కి పైగా షోకాజ్ నోటీసులు జారీ చేయడమే కాకుండా నిబంధనలు ఉల్లంఘించిన 175 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లపై జరిమానాలు విధించాయి.. 51 డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లను సస్పెండ్ చేశాయి.
ఎల్‌పీజీ సరఫరా స్థితిగతులు
గృహావసరాల ఎల్‌పీజీ
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
· ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
· పరిశ్రమ అంతటా ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు సుమారు 95 శాతానికి పెరిగాయి.
· సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 91 శాతానికి పెంచారు.
· గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ సాధారణంగానే కొనసాగుతోంది.
· 07.04.2026న దేశవ్యాప్తంగా 53.5 లక్షలకు పైగా గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ అయ్యాయి.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు
· మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులు కూడా ఉన్నాయి.
· కేంద్ర ప్రభుత్వం 08.04.2026 నాటి లేఖ ద్వారా ఈ కింది వివరాలను వెల్లడించింది:
o ఫార్మా, ఆహార రంగం, పాలిమర్, వ్యవసాయం, ప్యాకేజింగ్, పెయింట్, యురేనియం, భార జలం, ఉక్కు, విత్తనాలు, లోహాలు, సిరామిక్, ఫౌండ్రీ, ఫోర్జింగ్, గాజు, ఏరోసోల్ మొదలైన రంగాల్లోని పారిశ్రామిక విభాగాలు కూడా 2026 మార్చికి ముందు ఉన్న తమ బల్క్ గృహేతర ఎల్‌పీజీ వినియోగ స్థాయిలో 70 శాతాన్ని పొందుతాయి. అయితే ఇది రోజుకు 0.2 టీఎంటీ అనే మొత్తం రంగాల పరిమితికి లోబడి ఉంటుంది.
o ఈ కేటాయింపు కింద బల్క్ ఎల్‌పీజీ పొందాలంటే సంబంధిత పరిశ్రమలు తప్పనిసరిగా 21.03.2026 నాటి లేఖలోని పారా (బీ) ప్రకారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. పారా (c) ప్రకారం పీఎన్‌జీ కనెక్షన్ కోసం సీజీడీ సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే పైన పేర్కొన్న పరిశ్రమలు తమ తయారీ ప్రక్రియలో ఎల్‌పీజీని ఒక ముఖ్యమైన ముడిసరుకుగా ఉపయోగిస్తున్నా లేదా సహజ వాయువుతో భర్తీ చేయలేని ప్రత్యేక అవసరాల కోసం ఉపయోగిస్తున్నా పీఎన్‌జీ కోసం దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.
· కేంద్ర ప్రభుత్వం 06.04.2026 నాటి లేఖ ద్వారా వలస కార్మికులకు పంపిణీ చేసే 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించింది. 2026 మార్చి 2-3 తేదీలలో వలస కార్మికులకు ఉన్న సగటు రోజువారీ సరఫరా ఆధారంగా ఈ పెంపు ఉంటుంది. ఇది 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితి కంటే అదనంగా ఉంటుంది. ఈ 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద అందుబాటులో ఉంటాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సహకారంతో వీటిని కేవలం తమ రాష్ట్రంలోని వలస కార్మికులకు సరఫరా చేయడానికి మాత్రమే వినియోగించాలి.
· 2026 మార్చి 23 నుంచి ఇప్పటివరకు సుమారు 8.9 లక్షల 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
· గడిచిన 5 రోజుల్లో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (పీఎస్‌యూ ఎఫ్‌టీఎల్) 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లపై సుమారు 1600 అవగాహన శిబిరాలను నిర్వహించాయి. ఈ శిబిరాల ద్వారా 14,000 కంటే ఎక్కువ 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
సహజ వాయువు సరఫరా, పీఎన్జీ విస్తరణ కార్యక్రమాలు
· · ప్రాధాన్యత రంగాలకు గ్యాస్ సరఫరాను ప్రభుత్వం కొనసాగిస్తోంది. దేశీయ గృహ అవసరాల పీఎన్జీ, సీఎన్జీ రవాణా రంగానికి 100 శాతం సరఫరాను రక్షిత ప్రాతిపదికన అందిస్తోంది.
· · అందుబాటులో ఉన్న నిల్వలు, రానున్న ఎల్ఎన్జీ కార్గో షిప్పులను దృష్టిలో ఉంచుకుని ఎరువుల కర్మాగారాలకు మొత్తం గ్యాస్ కేటాయింపులను మరో 5 శాతం పెంచుతున్నారు. దీంతో 09.04.2026 నుంచి ఈ ప్లాంట్లు తమ ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతం సరఫరాను పొందనున్నాయి.
· · ఇతర పారిశ్రామిక. వాణిజ్య రంగాలు, అలాగే సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థలకు గ్యాస్ సరఫరాను అదనంగా 10 శాతం పెంచారు. ఇది 06.04.2026 నుంచి అమల్లోకి వచ్చింది.
· · వాణిజ్య ఎల్పీజీ లభ్యతపై నెలకొన్నఆందోళనలను తొలగించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లకు పీఎన్జీ కనెక్షన్లు ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని సీజీడీ సంస్థలను ఆదేశించారు.
· · గృహ, వాణిజ్య పీఎన్జీ కనెక్షన్లను పెంచేందుకు ఐజీఎల్, ఎంజీఎల్, జీఏఐఎల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి కంపెనీలు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.
· · సీజీడీ నెట్వర్క్ విస్తరణకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను భారత ప్రభుత్వం కోరింది.
· · ఎల్పీజీ నుంచి పీఎన్ జీకి దీర్ఘకాలిక మార్పునకు సహకరించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించే వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులో 10 శాతం అదనంగా ఇవ్వనున్నట్లు 18 మార్చి 2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రకటించింది.
· · గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళం మొదలైన 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే పీఎన్జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును పొందుతున్నాయి.
· · పైప్లైన్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న చోట, నివాస పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, కమ్యూనిటీ కిచెన్లు, అంగన్వాడీ కిచెన్లు మొదలైన వాటికి 5 రోజులలోపు పీఎన్ జీ కనెక్షన్లు ఇచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని సీజీడీ సంస్థలను పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి ఆదేశించింది.
· · సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యతా పాతిపదికన పరిశీలించడానికి, మూడు నెలలపాటు తర్వతి ఆమోద విధానాన్ని అమలు చేస్తోంది.
· · నిత్యావసర వస్తువుల చట్టం 1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సదుపాయాల నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వు 2026ను భారత ప్రభుత్వం 24 మార్చి 2026 నాటి గెజిట్ ద్వారా నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్లైన్ల నిర్మాణం, విస్తరణ కోసం ఒక సరళీకృత, సమయపాలనతో కూడిన విధానాన్ని అందిస్తుంది. ఇది భూసేకరణ, అనుమతుల్లో ఎదురయ్యే జాప్యాన్ని నివారిస్తూ, నివాస ప్రాంతాలతో సహా అన్ని చోట్లా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల పీఎన్ జీ వ్యవస్థ అభివృద్ధి వేగవంతం అవ్వడమే కాకుండా.. మారుమూల ప్రాంతాలకు కూడా అనుసంధానం పెరుగుతుంది. ఇది స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, భారత ఇంధన భద్రతను, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
· · రక్షణ శాఖకు చెందిన అన్ని నివాస ప్రాంతాలు, యూనిట్ లైన్లలో పీఎన్జీ మౌలిక సదుపాయాల ఏర్పాటును వేగవంతం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ 30 జూన్ 2026 వరకు ఒక స్వల్పకాలిక విధాన సవరణను జారీ చేసింది.
· · పీఎన్జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి తీయ పీఎన్జీ కార్యక్రమం 2.0ను పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి 30 జూన్ 2026 వరకు పొడిగించింది.
· · పర్యావరణానికి మేలు చేసే, సురక్షితమైన, స్వయం సమృద్ధి కలిగిన ఇంధన వనరులను పెంచడానికి భారత ప్రభుత్వం రాష్ట్రాల కోసం ఒక నమూనా సీబీజీ విధాన ముసాయిదాను తయారు చేసింది. ఈ నమూనా విధానం రాష్ట్రాలు తమ సొంతంగా పెట్టుబడిదారులకు అనుకూలమైన పద్ధతులను రూపొందించుకోవడానికి ఇది ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. ఏ రాష్ట్రాలైతే ఈ విధానాన్ని అమలు చేస్తాయో, వాటికి అదనపు వాణిజ్య ఎల్పీజీ కోటాను కేటాయించడంలో ప్రాధాన్యత ఇస్తారు.
· · మార్చి 2026 నుంచి ఇప్పటివరకు సుమారు 3.87 లక్షల పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా మొదలైంది. వీరితోపాటు మరో 4.21 లక్షల మంది కొత్త కనెక్షన్ల కోసం పేరు నమోదు చేసుకున్నారు.
· · 17,100 కంటే ఎక్కువ మంది పీఎన్జీ వినియోగదారులు MYPNGD.in వెబ్సైట్ ద్వారా తమ పాత ఎల్పీజీ కనెక్షన్లను స్వచ్ఛందంగా వదిలేశారు.
ముడి చమురు లభ్యత/ రిఫైనరీ కార్యకలాపాలు
· · అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో పెట్రోల్, డీజిలు నిల్వలు సరిపడా ఉన్నాయి.
· · దేశీయ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.
· · భారత ప్రభుత్వం 01.04.2026 నాటి ఉత్తర్వుల ప్రకారం.. మన దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్లు తమ వద్ద ఉండే సీ3, సీ4 గ్యాస్ నిల్వలను నిర్ణీత పరిమాణంలో కొన్ని ముఖ్యమైన రంగాలకు అందించాలని అనుమతించింది. ఔషధ రంగం, ఆహార, పౌర సరఫరాల శాఖ, రసాయనాల శాఖ వంటి కీలక విభాగాలకు వీటిని కేటాయించనున్నారు. ఏ రిఫైనరీ నుంచి ఎంత పరిమాణంలో గ్యాస్ ఇవ్వాలనేది సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్టీ) నిర్ణయిస్తుంది.
· · పైన చెప్పిన శాఖలకు సంబంధించిన కంపెనీల కోసం రోజుకు 800 మెట్రిక్ టన్నుల గ్యాస్ను కేటాయించారు.
· రిటైల్ ఇంధన లభ్యత, ధరల నియంత్రణ చర్యలు
· · దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోలు బంకులు యథావిధిగా నడుస్తున్నాయి.
· · మధ్యప్రాచ్యం సంక్షోభం వల్ల ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిలు పైన ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించింది.
· · దేశీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికి డీజిలుపై లీటరుకు రూ. 21.5, విమాన ఇంధనంపై లీటరుకు రూ. 29.5 ఎగుమతి సుంకాన్ని ప్రభుత్వం విధించింది.
· · పెట్రోలు, డీజిల్ సాధారణ రిటైల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు.
· · ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని ప్రభుత్వం కోరింది. సరైన సమాచారాన్ని పత్రికా సమావేశాల ద్వారా ప్రజలకు వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
· · అన్ని రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ సాధారణ కేటాయింపులకు అదనంగా 48,000 కిలో లీటర్ల కిరోసిన్ను కేటాయించారు.
· · భారత ప్రభుత్వం 29 మార్చి 2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కిరోసిన్ రహిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా కేవలం వంట, వెలుతురు అవసరాల కోసం పీడీఎస్ కిరోసిన్ పంపిణీకి అనుమతించింది.
· · ప్రతి జిల్లాలో గరిష్టంగా రెండు ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఓఎంసీ సేవా కేంద్రాలలో (ప్రాధాన్యంగా సంస్థ స్వయంగా నిర్వహించేవి) 5,000 లీటర్ల వరకు పీడీఎస్ కిరోసిన్ను నిల్వ చేయడానికి అనుమతించింది.
· · ప్రతి జిల్లాలో ఈ ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఓఎంసీ కేంద్రాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగాలు నిర్దేశిస్తాయి.
· · ఇప్పటికే 18 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ప్రాంతాలు తమకు కిరోసిన్ అవసరం లేదని తెలియజేశాయి.
సముద్ర భద్రత, నౌకా రవాణా కార్యకలాపాలు
· · పర్షియన్ గల్ఫ్లో ప్రస్తుత సముద్ర పరిస్థితి, భారతీయ నౌకలు, సిబ్బందిని కాపాడటానికి తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
· · ఆ ప్రాంతంలోని భారతీయ సముద్ర యానికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదు.
· · నౌకా యజమానులు, ఆర్పీఎస్ఎల్ సంస్థలు, భారతీయ రాయబార కార్యాలయాలతో షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
· · డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూం 24x7 గంటల పాటు పని చేస్తోంది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 5,481 కాల్స్.. 11,726 ఈమెయిళ్లను పరిష్కరించింది. గత 24 గంటల్లోనే 139 కాల్స్, 673 ఈమెయిళ్లు అందాయి.
· · ఇప్పటి వరకు 1,754 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో డీజీ షిప్పింగ్ సహాయపడింది. ఇందులో గత 24 గంటల్లో గల్ఫ్లోని విమానాశ్రయాలు, వివిధ ప్రాంతీయ ప్రదేశాల నుండి 63 మంది ఉన్నారు.
· · దేశవ్యాప్తంగా ఓడరేవుల కార్యకలాపాలు ఎలాంటి రద్దీ లేకుండా సాధారణంగానే కొనసాగుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల సముద్ర వాణిజ్య బోర్డులు తమ పరిధిలోని కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని ధ్రువీకరించాయి.
· · నావికుల సంక్షేమాన్ని, నిరంతర నౌకాయాన కార్యకలాపాలను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సముద్ర రంగ భాగస్వాములతో సమన్వయం చేసుకుంటోంది.
యుద్ధ ప్రభావ ప్రాంతంలో భారత పౌరుల భద్రత
· · భారత రాయబార కార్యాలయాల ద్వారా అందిస్తున్న సహాయంతో సహా యుద్ధ ప్రభావ ప్రాంతాల్లోని ఇటీవలి పరిణామాలను తెలియజేశారు. అవి ఈ కింది విధంగా ఉన్నాయి.
· · గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. భారతీయ పౌరుల భద్రత, సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తోంది. భారత పౌరులకు, వారి కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి మంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూం నిరంతరం పనిచేస్తోంది. ఇది భారతీయ రాయబార కార్యాలయాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తుంది.
· · విదేశాల్లోని రాయబార కార్యాలయాలు, ప్రత్యేక కేంద్రాలూ 24 గంటలూ పనిచేస్తూ, కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇవి భారతీయ సమాజం, సంస్థలు, సంఘాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, సలహాలను క్రమం తప్పకుండా జారీ చేస్తున్నాయి. రాయబార కార్యాలయాలు స్థానిక ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. నావికులు, విద్యార్థులు, భారతీయ పౌరులకు వీసా సదుపాయం, కాన్సులర్ సేవలు, రవాణా సంబంధిత సహాయాన్ని అందజేస్తూనే ఉన్నాయి. గగనతల ఆంక్షల నేపథ్యంలో పొరుగు దేశాల ద్వారా ప్రయాణించేందుకు వీసాల జారీకి, కాన్సులర్ సేవలకు, అవసరమైన చోట రవాణా సదుపాయాలకు రాయబార కార్యలయాలు సహకరిస్తున్నాయి.
· · గగనతలం తెరిచి ఉన్న దేశాల నుంచి భారత్కు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు సుమారు 7,88,000 మంది ప్రయాణికులు ఆ ప్రాంతాల నుంచి భారత్కు చేరుకున్నారు.
· · ఇజ్రాయెల్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్లలో విమాన ప్రయాణ ఆంక్షలు, గగనతలం మూసివేత దృష్ట్యా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారత పౌరుల ప్రయాణానికి సౌకర్యం కల్పిస్తున్నారు.
· · ఇరాన్ నుంచి అర్మేనియా, అజర్బైజాన్ మీదుగా భారత్కు
· · ఇజ్రాయెల్ నుంచి ఈజిప్ట్, జోర్డాన్ మీదుగా భారత్కు
· · ఇరాక్ నుంచి జోర్డాన్, సౌదీ అరేబియా మీదుగా భారత్కు
· · కువైట్, బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియా మీదుగా భారత్కు.
· · భారత రాయబార కార్యాలయం తాజాగా ఒక సూచన జారీ చేసింది. ఇరాన్లో ఉన్న భారతీయులు రాయార కార్యాలయం సహాయంతో పైన చెప్పిన మార్గాల ద్వారా సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి వచ్చేయాలని కోరింది. ప్రస్తుతం ఇరాన్లో ఇంకా సుమారు 7,500 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.
నిన్నటి వరకు అందిన సమాచారం ప్రకారం.. అర్మేనియా, అజర్బైజాన్ సరిహద్దుల ద్వారా 1,864 మంది భారతీయులు ఇరాన్ నుంచి క్షేమంగా బయటకు వచ్చేలా రాయబార కార్యాలయం సహాయం చేసింది. వీరిలో 935 మంది భారతీయ విద్యార్థులు, 472 మంది మత్స్యకారులు ఉన్నారు.
పశ్చిమ ఆసియాలో తాజా పరిణామాలపై ప్రకటన
· · ‘‘పశ్చిమాసియాలో కుదిరిన కాల్పుల విరమణను మేం స్వాగతిస్తున్నాం. ఇది అక్కడ శాశ్వత శాంతికి దారితీస్తుందని ఆశిస్తున్నాం. యుద్ధం త్వరగా ముగియాలంటే ఉద్రిక్తతలు తగ్గడం, చర్చలు జరపడం, దౌత్యపరమైన పరిష్కారాలే సరైన మార్గాలని మేం మొదటి నుంచి చెబుతున్నాం.
· · ఈ యుద్ధం వల్ల ఇప్పటికే సామాన్య ప్రజలు ఎంతో కష్టాలు పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా, వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగించింది. ఇకపైన హర్మూజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా, స్వేచ్ఛగా సాగుతుందని మేం ఆశిస్తున్నాం.
· · భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుంది. శాంతి, స్థిరత్వానికి దారితీసే అన్ని చర్యలను మేం ఆహ్వానిస్తాం. పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఈ సానుకూల మార్పు ఉక్రెయిన్లో కూడా శాంతి ప్రయత్నాలకు ఊతమిస్తుందని ఆశిస్తున్నాం’’.
(రిలీజ్ ఐడి: 2250304)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam