భారత ఎన్నికల సంఘం
అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం-2026ను ప్రారంభించిన ఈసీఐ
ఎన్నికలను ప్రజాస్వామ్య ఉత్సవాలుగా కమిషన్ పరిగణిస్తోంది: సీఈసీ జ్ఞానేష్ కుమార్
నాడు పోస్టు చేయడమైనది:
07 APR 2026 7:54PM by PIB Hyderabad
-
అస్సాం, కేరళ, పుదుచ్చేరి శాసనసభలకు సాధారణ ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం ఈ రోజు న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం (ఐఈవీపీ)-2026ను ప్రారంభించింది.
-
భారత అంతర్జాతీయ ప్రజాస్వామ్యం, ఎన్నికల నిర్వహణ సంస్థ (ఐఐఐడీఈఎం)లో ఎన్నికల కమిషనర్లు డాక్టర్ ఎస్ ఎస్ సంధు, డాక్టర్ వివేక్ జోషితో కలసి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) శ్రీ జ్ఞానేష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
-
భారత్‌లో జరిగే ఎన్నికలను ప్రజాస్వామ్య ఉత్సవాలుగా ఎన్నికల సంఘం పరిగణిస్తోందని, ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని ప్రారంభోపన్యాసంలో సీఈసీ శ్రీ జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్రాలను సందర్శించాలని, అక్కడి విషయాలను తెలుసుకోవాలనీ, భారతీయ వైవిధ్యాన్ని చూడాలనీ సూచించారు.
-
ఈ కార్యక్రమ ప్రతినిధులు మొదటి దశలో 2026 ఏప్రిల్ 8, 9 తేదీల్లో అస్సాం, కేరళ, పుదుచ్చేరిలను సందర్శిస్తారు. రెండో దశలో 2026 ఏప్రిల్ 20 నుంచి పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటిస్తారు.
-
23 దేశాలకు చెందిన 43 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమం మొదటి దశలో పాల్గొంటారు. ఢిల్లీలోని అయిదు విదేశాలకు చెందిన అధికార ప్రతినిధులు కూడా ఉన్నారు.
-
ఐఐఐడీఈఎంలో ఈవీఎంల గురించి ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఓటింగ్ ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి ఈవీఎంలతో నిర్వహించిన మాక్ పోలింగ్‌లో వారు పాల్గొన్నారు.
-
భారత్‌లో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగమైన సాంకేతిక విధానాలపై, పరిపాలనపరమైన రక్షణ చర్యలపై ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. నిపుణులతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
-
అస్సాం, కేరళ, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలకు 2026, ఏప్రిల్ 8న చేరుకుంటారు. జిల్లా స్థాయి కంట్రోలు రూములు, మీడియా పర్యవేక్షణ కేంద్రాలతో సహా రవాణా, పంపిణీ కేంద్రాలు, ఇతర సౌకర్యాలను పరిశీలిస్తారు. 2026 ఏప్రిల్ 9న నిర్వహించే పోలింగ్ ప్రక్రియను కూడా వీక్షిస్తారు.
-
ఇతర దేశాల ఎన్నికల సంఘాలు (ఈఎంబీలు), అంతర్జాతీయ సంస్థలతో ప్రపంచ సహకారానికి, భాగస్వామానికి ఈసీఐ ప్రారంభించిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమమే ఐఈవీపీ.
-
విదేశీ ఈఎంబీల ప్రతినిధులకు ఎన్నికల నిర్వహణలో ఉత్తమ పద్ధతులను, ఆవిష్కరణలను పరిచయం చేస్తూనే భారత ఎన్నికల విధానం, సంస్థాగత వ్యవస్థలు, కార్యనిర్వాహక విధానం గురించి సమగ్రంగా వివరిస్తుంది.
-
అంతర్జాతీయ సమాజానికి భారత ఎన్నికల వ్యవస్థ సామర్థ్యాలను ఐఈవీపీ ప్రదర్శిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణలో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను పంచుకుంటుంది.
***
(రిలీజ్ ఐడి: 2249935)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16