రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వివిధ జోన్లలో సిగ్నళ్ల ఆధునీకరణ, కవచ్‌ అమలు కోసం రూ. 1,364.45 కోట్లను ఆమోదించిన భారతీయ రైల్వే


రైలు ప్రమాద నివారణను బలోపేతం చేసేందుకు రూ.208.81 కోట్ల కేటాయింపుతో దక్షిణ రైల్వేకు చెందిన 232 లోకోమోటివ్‌లలో కవచ్ వెర్షన్ 4.0ను ఏర్పాటు

ఉత్తర రైల్వేలో విశ్వసనీయమైన సిగ్నలింగ్ వ్యవస్థకు మద్దతుగా రూ.400.86 కోట్లతో 3,200 కిలోమీటర్లకు పైగా మార్గాల్లో ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఆధునీకరణ

ఉత్తర మధ్య రైల్వేలో కవచ్ వ్యవస్థ అమలుకు 2,196 కిలోమీటర్ల మేర 2×48 ఫైబర్ ఓఎఫ్‌సీ వ్యవస్థ ఏర్పాటు. ఇందుకు రూ. 176.76 కోట్ల కేటాయింపు

రూ. 578.02 కోట్ల వ్యయంతో అత్యధిక రద్దీ ఉన్న మార్గాల్లోని 49 స్టేషన్లలో మానవ ప్రమేయాన్ని తగ్గించేందుకు, భద్రతను పెంచేందుకు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు

నాడు పోస్టు చేయడమైనది: 06 APR 2026 5:47PM by PIB Hyderabad

భారత రైల్వే వ్యవస్థలో భద్రత, సిగ్నలింగ్, సమాచార మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి రూ. 1,364.45 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు భారత రైల్వే ఆమోదం తెలిపింది. మంజూరైన పనులలో లోకోమోటివ్‌లపై కవచ్ ఏర్పాటు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థ విస్తరణ, వివిధ రైల్వే జోన్లలో పాత ప్యానెల్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థల స్థానంలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. 

దక్షిణ రైల్వేలోని 232 లోకోమోటివ్‌లలో కవచ్ పరికరాల ఏర్పాటు

దక్షిణ రైల్వేలోని 232 లోకోమోటివ్‌లలో (రైలు ఇంజిన్లు) కవచ్ పరికరాలను ఏర్పాటు చేయడానికి రూ. 208.81 కోట్ల వ్యయంతో భారత రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ‘2024–25 పనుల కార్యక్రమం (పింక్ బుక్)లో  పీహెచ్‌-33 కింద రూ 27,693 కోట్ల మొత్తం వ్యయంతో చేర్చిన ‘‘భారతీయ రైల్వేలోని మిగిలిన మార్గాల్లో లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థతో కవచ్ ఏర్పాటు (అంబ్రెల్లా వర్క్ 2024–25)’’ ప్రాజెక్టులో భాగంగా ఉంది. 

ఈ కార్యక్రమం కింద దక్షిణ రైల్వే కోసం రూ.2,950 కోట్లు కేటాయించారు. ప్రస్తుత పనులు ఈ ఉపకేటాయింపుల్లో భాగంగానే ప్రతిపాదించారు. లోకోమోటివ్‌లపై కవచ్ వెర్షన్ 4.0 పరికరాల సంస్థాపన దీని పరిధిలోకే వస్తుంది. 

ఉత్తర రైల్వేలో 2×48 ఓఎఫ్‌సీ వ్యవస్థతో కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతం

సమాచార మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఉత్తర రైల్వేలో రూ.400.86 కోట్ల మొత్తం వ్యయంతో మూడు కీలక పనులను భారత రైల్వే మంజూరు చేసింది. ఇవి ‘‘రూ.4,871 కోట్ల వ్యయంతో పీహెచ్‌-33 కింద ఆమోదించిన భారతీయ రైల్వేలో కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతం, మరమ్మత్తు, భర్తీ (అంబ్రెల్లా పనులు 2024–25)’’ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. 

ఉత్తర రైల్వే కోసం రూ.871 కోట్ల సబ్‌-అంబ్రెల్లా నిధులు కేటాయించారు. అంబాలా డివిజన్‌లో 926.05 కిలోమీటర్ల మేర 2×48 ఫైబర్ కేబుల్స్ ఏర్పాటు చేయడానికి రూ. 115.74 కోట్లు.. ఢిల్లీ డివిజన్‌లో 1,204  కిలోమీటర్ల మేర 2×48 ఫైబర్ కేబుల్స్‌తో పాటు స్టేషన్లలో ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ గదుల ఏర్పాటు కోసం రూ. 165.49 కోట్లు.. లక్నో డివిజన్‌లో 1,074 కిలోమీటర్ల మేర 2×48 ఫైబర్ కేబుల్స్ ఏర్పాటు కోసం రూ. 119.63 కోట్లు కేటాయించారు. 

ఆధునిక సిగ్నలింగ్, కవచ్ వ్యవస్థల అమలుకు కీలకమైన కమ్యూనికేషన్ వ్యవస్థల సామర్థ్యాన్ని, విశ్వసనీయతను మెరుగుపరచడమే ఈ పనుల ప్రధాన లక్ష్యం.

 

ఉత్తర మధ్య రైల్వే పరిధిలో కవచ్ కోసం 2,196 కిలోమీటర్ల మేర ఓఎఫ్‌సీ ఏర్పాటు

ఉత్తర మధ్య రైల్వేలో కవచ్ వ్యవస్థ అమలుకు మద్దతుగా రూ.176.7699 కోట్ల వ్యయంతో 2×48 ఫైబర్ ఆప్టికల్ వ్యవస్థ ఏర్పాటుకు భారత రైల్వే ఆమోదం తెలిపింది. ఈ పనులు కూడా రైల్వే సమాచార వ్యవస్థను బలోపేతం, మరమ్మత్తు, భర్తీకి ఉద్దేశించిన ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.

ఉత్తర మధ్య రైల్వే కోసం ఈ పథకం కింద రూ. 200 కోట్ల సబ్‌-అంబ్రెల్లా నిధులు కేటాయించారు. ప్రస్తుత పనిని ఈ కేటాయింపు కింద ప్రతిపాదించారు. ఈ నిధులతో మొత్తం 2,196  కిలోమీటర్ల మేర పనులు చేపడతారు. ఇందులో ప్రయాగ్‌రాజ్ డివిజన్‌లో 1,016 కిలోమీటర్లు.. ఝాన్సీ డివిజన్‌లో 709 కిలోమీటర్లు.. ఆగ్రా డివిజన్‌లో 471 కిలోమీటర్లు ఉన్నాయి.

ఈ ప్రాజెక్టు కవచ్ వ్యవస్థ అమలుకు మద్దతు ఇవ్వడంతో పాటు, అధిక రద్దీ గల మార్గాలలో సమాచార మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది.

దక్షిణ మధ్య రైల్వేలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ పనులకు ఆమోదం

దక్షిణ మధ్య రైల్వేలో పాత ప్యానెల్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థల స్థానంలో అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి రూ. 578.02 కోట్ల వ్యయంతో కూడిన రెండు ప్రధాన పనులను భారత రైల్వే మంజూరు చేసింది. ‘‘ పీహెచ్‌-33 కింద రూ. 15,164 కోట్ల వ్యయంతో ఆమోదించిన  హెచ్‌డీఎన్‌/హెచ్‌యూఎన్‌ మార్గాల్లో(కవచ్‌, ఏబీఎస్‌, సీటీసీ అనుమతి ఉన్న చోట్ల) మిగిలి ఉన్న స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ ఏర్పాటు (అంబ్రెల్లా పనులు 2024–25)’’ ప్రాజెక్టులో భాగం.

దక్షిణ మధ్య రైల్వే కోసం రూ. 1,857 కోట్ల సబ్-అంబ్రెల్లా నిధులు కేటాయించారు. దీని కింద రెండు పనులకు ఆమోదం లభించింది. గుంతకల్ డివిజన్‌లోని హెచ్‌డీఎన్‌, హెచ్‌యూఎన్‌ మార్గాల్లోని 35 స్టేషన్లలో రూ. 426.82 కోట్ల వ్యయంతో ప్యానెల్ ఇంటర్‌లాకింగ్‌ను తొలగించి ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ ఏర్పాటుతోపాటు నాందేడ్ డివిజన్‌లో హెచ్‌డీఎన్‌, హెచ్‌యూఎన్‌ మార్గాల్లోని 14 స్టేషన్లలో రూ.151.20 కోట్ల వ్యయంతో ఇదే తరహా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు

ఈ పనుల ద్వారా సిగ్నలింగ్ వ్యవస్థలో విశ్వసనీయత పెరుగుతుంది. మానవ ప్రమేయం తగ్గడంతోపాటు అధిక రద్దీ ఉన్న మార్గాల్లో భద్రత మరింత మెరుగుపడుతుంది. 

మంజూరైన ఈ ప్రాజెక్టులన్నీ భద్రత, విశ్వసనీయత, సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా భారతీయ రైల్వేను ఆధునీకరించే విస్తృత ప్రయత్నంలో భాగం. ఈ చర్యలు కవచ్ వ్యవస్థ వ్యాప్తికి, సమాచార వ్యవస్థ బలోపేతానికి, కీలక మార్గాల్లో సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునీకరణకు ఎంతగానో తోడ్పడతాయి. తద్వారా రైల్వే కార్యకలాపాల సామర్థ్యం పెరగడమే కాకుండా, దేశవ్యాప్తంగా మరింత సురక్షితమైన ప్రయాణం సాధ్యమవుతుంది.

***


(రిలీజ్ ఐడి: 2249484) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Kannada