మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ముంబైలో సార్వత్రిక పార్శీ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన
నాడు పోస్టు చేయడమైనది:
04 APR 2026 1:39PM by PIB Hyderabad
బాంబే పార్శీ పంచాయతీ సహకారంతో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముంబైలో నిర్వహించిన సార్వత్రిక పార్శీ నమోదు కార్యక్రమం ప్రత్యేక సహాయక శిబిరానికి నేడు అద్భుత స్పందన లభించింది. ఈ శిబిరం సందర్భంగా జియో పార్శీ వేదికలో సుమారు 300 కొత్త రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. సమాజంలోని ప్రజలకు చేరువ కావడానికి, వారిని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం కీలకంగా నిలిచింది.
జియో పార్శీ అనేది పార్శీ సమాజంలో తగ్గుతున్న జనాభాను అరికట్టే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ పథకం.
2013-14లో ప్రారంభించిన ఈ పథకం శాస్త్రీయ మద్దతు, క్రమబద్ధమైన చర్యల ద్వారా పార్శీ జనాభాను స్థిరీకరించడానికి, పెంచడానికి కృషి చేస్తుంది.
ఈ పథకం ద్వారా అందే ప్రయోజనాలు
· సంతానోత్పత్తి చికిత్స, గర్భధారణ సంబంధిత సంరక్షణ కోసం వైద్య సాయం.
· పిల్లల సంరక్షణ, ఆధారపడిన వృద్ధుల సంరక్షణ కోసం ఆర్థిక సహాయంతో సహా సామాజిక ఆరోగ్య మద్దతు
· కౌన్సిలింగ్, అవగాహన శిబిరాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాల వంటి ప్రచార కార్యక్రమాలు
ఈ సమావేశాన్ని ఉద్దేశించి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ శ్యామ ప్రసాద్ రాయ్ మాట్లాడుతూ.. పార్శీ సామాజిక వర్గ సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. అర్హులైన లబ్ధిదారులు ముందుకు వచ్చి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ పథకం అమలును మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటికే నమోదైన సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ శిబిరం విజయవంతం కావడంతో ఈ పథకంపై పెరుగుతున్న అవగాహన, నమ్మకానికి నిదర్శనం. పార్శీ సమాజ గొప్ప సాంస్కృతిక, జనాభా వారసత్వాన్ని కాపాడాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఇది మరింత బలపరుస్తుంది.
****
(రిలీజ్ ఐడి: 2248949)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19