పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా పరిణామాలపై అంతర-మంత్రిత్వశాఖల తాజా సమాచారం
పీఎన్‌జీ సంస్కరణల అమలు కోసం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనపు వంటగ్యాస్ కేటాయింపు... పరిశీలనలో 3 రాష్ట్రాల దరఖాస్తులు
· ‘సీహెచ్‌టీ’ కేటాయింపుల ప్రకారం ఫార్మాస్యూటికల్స్, ఆహార-ప్రజా పంపిణీ... రసాయనాలు-పెట్రో కెమికల్స్ వంటి కీలక రంగాలకు సీ3.. సీ4 స్ట్రీమ్‌ల సరఫరాకు ప్రభుత్వం అనుమతి
· గడచిన 5 రోజుల్లో 55,000కు పైగా పీఎన్‌జీ కనెక్షన్ల గ్యాసిఫికేషన్
· మార్చి 23 నుంచి 4.3 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల విక్రయం
· పశ్చిమాసియాలో సంఘర్షణ దృష్ట్యా కీలక పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకం పూర్తి మినహాయింపు
· ప్లాస్టిక్స్.. ప్యాకేజింగ్.. జౌళి.. ఫార్మాస్యూటికల్స్.. రసాయనాలు.. ఆటోమోటివ్ విడి భాగాలు.. ఇతర తయారీ రంగాల వంటి పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్.. మధ్యస్థ సామగ్రిపై ఆధారపడిన రంగాలకు ఈ మినహాయింపుతో ప్రయోజనం
· వాణిజ్య పరిరక్షణ.. ఎగుమతిదారులకు మద్దతు దిశగా చురుకైన చర్యలు
· నిరంతరాయ వాణిజ్యం కోసం అంతర-మంత్రిత్వ శాఖల సమన్వయం సహా ఎగుమతిదారులకు సౌకర్యాల కల్పన... రవాణా మద్దతు లక్షిత సహాయక చర్యలు ప్రారంభం
· గడచిన 24 గంటల్లో ఈ ప్రాంతం నుంచి 11 మంది సహా ఇప్పటిదాకా 975 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు
· ఈ ప్రాంతంలో అనుక్షణం మారే పరిస్థితిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.. తదనుగుణంగా ప్రవాస భారతీయుల భద్రత.. రక్షణ.. సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది
· ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి సుమారు 6,24,000 మంది భారత్‌కు ప్రయాణించారు... విమానయాన రంగం పరిస్థితి కూడా మెరుగుపడుతోంది
నాడు పోస్టు చేయడమైనది:
02 APR 2026 6:19PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా దేశ పౌరులకు కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా తాజా సమాచారం తెలియజేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జాతీయ మీడియా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఇందులో పెట్రోలియం-సహజ వాయువు, ఓడరేవులు-నౌకా రవాణా-జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు తమతమ శాఖల సంబంధిత వివరాలను వెల్లడించారు. ఈ మేరకు ఇంధన లభ్యత, సముద్ర కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారత పౌరులకు చేయూత, మొత్తంగా స్థిరత్వానికి భరోసాపై చేపట్టిన చర్యల గురించి వివరించారు. నేటి సమావేశంలో ఆర్థిక, వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖల నుంచి, కేంద్రీయ కస్టమ్స్-పరోక్ష పన్నుల బోర్డు (సీబీఐసీ) నుంచి కూడా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పన్నులు-సుంకాల సంబంధిత చర్యల గురించి ‘సీబీఐసీ’ అధికారులు వివరించారు. పశ్చిమాసియాలో అంతరాయాల దృష్ట్యా వాణిజ్య పరిరక్షణతోపాటు ఎగుమతిదారులకు మద్దతుగా చేపట్టిన చర్యల గురించి వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రముఖంగా వివరించింది.
విద్యుత్ సరఫరా... ఇంధన లభ్యత
పశ్చిమాసియాలో పరిస్థితుల దృష్ట్యా, పెట్రోలియం ఉత్పత్తులు, వంటగ్యాస్ నిరంతరాయ సరఫరా దిశగా చేపట్టిన చర్యలను వివరిస్తూ- ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై అధికారులు వెల్లడించిన తాజా సమాచారం కిందివిధంగా ఉంది:
ముడిచమురు... శుద్ధి కర్మాగారాలు
· దేశంలో తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉండటంతో పాటు అన్ని శుద్ధి కర్మాగారాలు అదనపు సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీంతోపాటు పెట్రోల్, డీజిల్ నిల్వల నిర్వహణ సంతృప్తికరంగా ఉంది.
· దేశీయ వినియోగానికి కొరత రాకుండా శుద్ధి కర్మాగారాల్లో వంటగ్యాస్ ఉత్పత్తిని పెంచారు.
చిల్లర విక్రయ కేంద్రాలు
· దేశవ్యాప్తంగా అన్ని చిల్లర విక్రయ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తున్నాయి.
· మధ్యప్రాచ్య సంక్షోభం వల్ల ముడిచమురు ధర అసాధారణంగా పెరిగింది. దీంతో వినియోగదారులను ఆదుకోవడానికి, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించింది.
· దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తుల లభ్యతకు భరోసా ఇస్తూ డీజిల్‌పై లీటరుకు రూ. 21.50, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై లీటరుకు రూ.29.50 వంతున ఎగుమతి సుంకం విధించింది.
· ఇంధన లభ్యతపై వదంతుల వల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనలతో కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో చిల్లర విక్రయ కేంద్రాల వద్ద అమ్మకాలు అసాధారణంగా పెరిగి, రద్దీ ఏర్పడింది. కానీ, దేశంలోని అన్ని పెట్రోల్ పంపులలో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగుమేర అందుబాటులో ఉన్నాయి.
· పెట్రోల్, డీజిల్ సాధారణ చిల్లర ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రస్తుతం పెట్రోల్‌పై లీటరుకు రూ.24.40, డీజిల్‌పై లీటరుకు రూ.104.99 వంతున నష్టం వస్తోంది.
· ఈ వాస్తవాల నేపథ్యంలో వదంతులను నమ్మవద్దని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. అలాగే, పత్రికా సమావేశాల ద్వారా వాస్తవ సమాచారాన్ని ప్రజలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది.
సహజ వాయువు
· గృహ వినియోగ పీఎన్‌జీ, సీఎన్‌జీ రవాణాకు 100 శాతం సరఫరాతో వినియోగదారులకు ప్రాధాన్యం.
· గ్రిడ్ అనుసంధానిత పారిశ్రామిక-వాణిజ్య వినియోగదారులకు వారి సగటు వినియోగంలో 80 శాతం సరఫరా.
· పీఎన్‌జీ కనెక్షన్లలో రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీజీడీ సంస్థలకు ప్రభుత్వ సూచన.
· ప్రస్తుతం ఉత్పత్తిలోగల యూరియా ప్లాంట్లకు వారి గత 6 నెలల సగటు వినియోగంలో సుమారు 70–75 శాతం వద్ద సరఫరా స్థిరంగా ఉంది. పైప్‌లైన్ కార్యకలాపాల కొనసాగింపు దిశగా ప్రభుత్వం అదనంగా ‘ఎల్‌ఎన్‌జీ’, ‘ఆర్‌ఎల్‌ఎన్‌జీ’ కొనుగోళ్లు చేపట్టింది.
· ఎరువుల ప్లాంట్లు సహా పారిశ్రామిక వినియోగదారులకు, అదనపు అవసరాల గురించి తక్షణం తెలియజేయాలని సూచించింది.
· ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ-వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయి.
· సీజీడీ విస్తరణకు అనుమతులు-ఆమోదాలను వేగిరపరచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖలను ప్రభుత్వం కోరింది.
· వంటగ్యాస్ నుంచి ‘పీఎన్‌జీ’ వినియోగం వైపు మార్పు సంబంధిత సంస్కరణలతో ముడిపడిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ‘ఎల్‌పీజీ’ని అదనంగా 10 శాతం కేటాయించడంపై ప్రతిపాదన చేసింది. తదనుగుణంగా కేటాయింపులకు సిఫారసు చేసింది. ప్రస్తుతం, 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ అదనపు కేటాయింపు లభిస్తుండగా, మరో 3 రాష్ట్రాల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.
· పాఠశాలలు, హాస్టళ్లు, సామాజిక వంటశాలల వంటి సంస్థలకు వీలైనంత మేర 5 రోజుల్లోగా పీఎన్‌జీ కనెక్షన్ల మంజూరుకు ప్రాధాన్యమివ్వాలని ‘సీజీడీ’ సంస్థలను ‘పీఎన్‌జీఆర్‌బీ’ ఆదేశించింది.
· రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖ సీజీడీ మౌలిక సదుపాయాల కోసం 3 నెలలపాటు సత్వర ఆమోద చట్రాన్ని అమలు చేస్తోంది.
· పైప్‌లైన్ విస్తరణ క్రమబద్ధీకరణ సహా చివరి అంచె అనుసంధానం మెరుగుదలకు ప్రభుత్వం సహజ వాయువు-పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ ఉత్తర్వు-2026ను జారీచేసింది.
· రక్షణ రంగ నివాస ప్రాంతాల్లో ‘పీఎన్‌జీ’ మౌలిక సదుపాయాలను వేగిరపరచేందుకు రక్షణ మంత్రిత్వశాఖ 2026 జూన్ 30 దాకా అమలయ్యేలా ఒక స్వల్పకాలిక విధాన సవరణను జారీ చేసింది.
· పీఎన్‌జీ’ విస్తరణ వేగం కొనసాగింపు దిశగా ‘పీఎన్‌జీఆర్‌బీ’ చేపట్టిన జాతీయ ‘పీఎన్‌జీ’ కార్యక్రమం 2.0ను ప్రభుత్వం 2026 జూన్ 30 వరకూ పొడిగించింది.
· గడచిన 5 రోజుల్లో 110 భౌగోళిక ప్రాంతాలలో 55,000కు పైగా పీఎన్‌జీ కనెక్షన్ల గ్యాసిఫికేషన్ పూర్తయింది.
వంటగ్యాస్ (ఎల్‌పీజీ)
· ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల వల్ల వంటగ్యాస్ సరఫరాపై ప్రభావం పడింది.
గృహ వినియోగ ఎల్‌పీజీ సరఫరా:
· వంటగ్యాస్ పంపిణీ కేంద్రాలలో నిల్వలు లేవనే సమాచారం ఏదీ లేదు.
· పరిశ్రమల వారీగా నిన్న ఆన్‌లైన్ వంటగ్యాస్ బుకింగ్ 95 శాతానికి పెరిగింది.
· పంపిణీదారుల స్థాయిలో గ్యాస్ మళ్లింపు నివారణ కోసం చేపట్టిన సరఫరా నిర్ధారణ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ (ఫిబ్రవరి 2026 నాటి) 53 శాతం నుంచి 85 శాతానికి పెరిగింది.
· గృహ వంటగ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణ స్థాయిలో కొనసాగుతోంది.
వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా:
· సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్‌టీ) నిర్ధారించిన నిర్దిష్ట పరిమాణం, శుద్ధి వనరుల ఆధారంగా ఫార్మాస్యూటికల్స్, ఆహార-ప్రజా పంపిణీ, రసాయనాలు-పెట్రో కెమికల్స్ వంటి కీలక రంగాలకు సి3, సి4 స్ట్రీమ్‌లను కనీస పరిమాణంలో అందుబాటులో ఉంచే విధంగా దేశంలోని పెట్రోకెమికల్ ప్రాంగణాలు సహా శుద్ధి కంపెనీలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం 01.04.2026న ఒక ఉత్తర్వు జారీచేసింది.
· వాణిజ్య వంటగ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం ఇప్పటికే పాక్షిక (20 శాతం) సరఫరాను పునరుద్ధరించింది. అలాగే, పీఎన్‌జీ విస్తరణ కోసం వాణిజ్య సౌలభ్య సంస్కరణల ప్రాతిపదికన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం వాణిజ్య వంటగ్యాస్ కేటాయించాలని కేంద్రం 18.03.2026న ఒక లేఖ ద్వారా సూచించింది.
· కేంద్ర ప్రభుత్వం 21.03.2026న ఒక లేఖ ద్వారా రాష్ట్రాలకు వాణిజ్య వంటగ్యాస్ కేటాయింపులో మరో 20 శాతం సరఫరాకు అనుమతించింది. దీంతో (పీఎన్‌జీ విస్తరణ కోసం సంస్కరణల సౌలభ్యం ప్రాతిపదికన 10 శాతం సహా) మొత్తం కేటాయింపు 50 శాతానికి చేరుతుంది. ఈ అదనపు 20 శాతాన్ని రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార తయారీ, పాడి పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు నిర్వహించే రాయితీ క్యాంటీన్లు, విక్రయ కేంద్రాలు, సామాజిక వంటశాలలు, వలస కార్మికులకు 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరా వంటివాటికి ప్రాధాన్యం ప్రాతిపదికన సరఫరా చేస్తారు.
· అంతేకాకుండా 27.03.2026న జారీ చేసిన లేఖ ద్వారా వాణిజ్య ఎల్‌పీజీ కోసం అదనంగా 20 శాతం కేటాయించాలని నిర్ణయించింది (దీంతో సంస్కరణల ఆధారిత 10 శాతంతో కలిపి మొత్తం వాణిజ్య కేటాయింపు సంక్షోభానికి ముందు స్థాయిలోని 70 శాతానికి చేరుతుంది). ఈ అదనపు 20 శాతాన్ని ఉక్కు, ఆటోమొబైల్, వస్త్ర, రంగులు, రసాయనాలు, ప్లాస్టిక్స్ వంటి పరిశ్రమలకు ప్రాధాన్యం ప్రాదిపదికన సరఫరా చేస్తారు. ఇందులో తయారీ పరిశ్రమలకు లేదా సహజ వాయువుకు ప్రత్యామ్నాయం వీలుకాని ప్రత్యేక ప్రయోజనాల కోసం ఎల్‌పీజీ అవసరమయ్యే పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తారు.
2026 మార్చి 23 నుంచి 4.3 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మెజారిటీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గృహేతర ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. 2026 మార్చి 14 నుంచి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వాణిజ్య సంస్థలు మొత్తం 60,370 మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను పొందాయి.
కిరోసిన్
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపులతో పాటు అదనంగా 48,000 కిలో లీటర్ల (కేఎల్) కిరోసిన్‌ను కేటాయించారు.
ఎస్‌కేఓ-రహిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పీడీఎస్ కిరోసిన్ పంపిణీని సులభతరం చేశారు. దీనికోసం ప్రతి జిల్లాలో గరిష్ఠంగా రెండు ప్రభుత్వ రంగ చమురు సంస్థల సర్వీస్ స్టేషన్లకు 5,000 లీటర్ల చొప్పున నిల్వ చేసుకునేందుకు అనుమతినిచ్చారు.
ఇప్పటికే 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ప్రాంతాలు తమకు ఎటువంటి అవసరం లేదని తెలిపాయి
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాత్ర :
నిత్యావసర సరకుల చట్టం- 1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం అక్రమనిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలు వంటి అక్రమ చర్యలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది. నిత్యావసరాల సరఫరాను నియంత్రించడం, క్రమబద్ధీకరించడంలో ఆయా ప్రభుత్వాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చేసిన అభ్యర్థనలు:
రోజువారీ మీడియా సమావేశాలను వ్యవస్థీకృతం చేయాలి. క్రమబద్ధంగా ప్రజా సూచనలు జారీ చేయాలి. ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు, హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేయాలి.
సామాజిక మాధ్యమాల్లో వచ్చే దుష్ప్రచారాన్ని చురుకుగా పర్యవేక్షించటంతో పాటు అరికట్టాలి.
ఎన్‌ఫోర్స్‌మెంట్ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి. అలాగే క్రమం తప్పకుండా దాడులు, తనిఖీలు నిర్వహించాలి.
వాణిజ్య ఎల్‌పీజీ, కిరోసిన్ (ఎస్‌కేఓ) కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాలి.
ఆర్ఓడబ్ల్యూ/ఆర్ఓయూ అనుమతులతో సహా సీజీడీ విస్తరణను వేగవంతం చేయాలి.
పీఎన్‌జీ వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించాలి.
కేంద్ర మంత్రిత్వ శాఖతో సమన్వయం కోసం సీనియర్ నోడల్ అధికారులను నియమించాలి.
ప్రస్తుతం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు:
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 2,600కి పైగా దాడులు నిర్వహించి సుమారు 700 ఎల్‌పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
రిటైల్ విక్రయకేంద్రాలు, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ల వద్ద ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతిరోజూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇప్పటివరకు ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లకు 600కి పైగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ప్రభుత్వ చర్యలు:
గృహావసరాల ఎల్‌పీజీ, పీఎన్‌జీ సరఫరాతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి కీలక రంగాలకు ప్రభుత్వం నిరంతరం ప్రాధాన్యతనిస్తోంది.
చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం, బుకింగ్ సమయ వ్యవధిని మార్చటం, సరఫరాలో ప్రాధాన్యతా కేటాయింపులు చేయడం వంటి చర్యలు తీసుకున్నారు.
ఎల్‌పీజీ డిమాండ్‌ను తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహిస్తున్నారు.
చిన్న, మధ్యతరహా వినియోగదారులకు బొగ్గు సరఫరాను పెంచాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌ను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
ప్రజా సూచనలు:
పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రజలు ఆందోళనతో అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని సూచించారు.
ప్రజలు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, వదంతులను విశ్వసించొద్దని కోరారు.
ఎల్‌పీజీ వినియోగదారులు బుకింగ్ కోసం డిజిటల్ పద్ధతులను ఉపయోగించాలని, అనవసరంగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లొద్దని కోరారు.
ప్రజలు పీఎన్‌జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ స్టవ్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించాల్సిందిగా ప్రోత్సహిస్తున్నారు.
ప్రజలందరూ రోజువారీ జీవితంలో ఇంధనాన్ని పొదుపు చేయాలని అభ్యర్థించారు.
పన్ను, సుంకాలకు సంబంధించిన చర్యలు:
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పన్ను, సుంకాల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి సీబీఐసీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్) మీడియాకు వివరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పెట్రోకెమికల్ రంగంలోని కొన్ని వస్తువులపై సుంకాలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రపంచ సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాల దృష్ట్యా కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్స్ సుంకం మినహాయింపుకు ఆమోదం తెలిపారు. ఈ మినహాయింపు మూడు నెలల కాలానికి అనగా 30 జూన్ 2026 వరకు తాత్కాలికంగా అమలులో ఉంటుంది.
దేశీయ పరిశ్రమలకు అవసరమైన పెట్రోకెమికల్ ముడిసరుకు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూడటం, దిగువ స్థాయి రంగాలపై ఖర్చుల ఒత్తిడిని తగ్గించడం, దేశవ్యాప్తంగా సరఫరా స్థిరత్వాన్ని కాపాడటం కోసం ఈ తాత్కాలిక, లక్షిత ఉపశమన చర్య తీసుకున్నారు.
ప్లాస్టిక్స్- ప్యాకేజింగ్, వస్త్రాలు, ఔషధాలు, రసాయనాలు, వాహనాల విడిభాగాలు, ఇతర తయారీ పరిశ్రమలతో సహా పెట్రోకెమికల్ ముడిసరుకు, మధ్యంతర ఉత్పత్తులపై ఆధారపడిన అనేక రంగాలు దీనివల్ల ప్రయోజనం పొందుతాయని భావిస్తున్నారు.
దీనివల్ల అంతిమ ఉత్పత్తులను కొనుగోలు చేసే వినియోగదారులకు కూడా ఉపశమనం కలుగుతుందన్న అంచనా ఉంది.
ఈ మూడు నెలల కాలానికి సుమారు రూ. 1,800 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లవచ్చని అంచనా ఉంది. అయితే మారుతున్న పరిస్థితులను బట్టి ఈ అంకెల్లో మార్పులు ఉండొచ్చు.
సంబంధిత మంత్రిత్వ శాఖలు, పరిశ్రమల భాగస్వాములు, వాణిజ్య ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.
దిగువ స్థాయి పరిశ్రమలకు అత్యంత అవసరమైన ఉత్పత్తులను గుర్తించి.. నిర్దేశించిన కాలానికి ఆ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని సున్నాకు తగ్గించారు.
ఈ చర్య ఆయా రంగాల్లో ధరల స్థిరత్వాన్ని నిర్ధారించటం, సరఫరా గొలుసులను బలోపేతం చేయటంతో పాటు నిత్యావసరాల ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగడానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు.
వాణిజ్యం, ఎగుమతిదారులకు మద్దతుగా తీసుకున్న చర్యలు:
పశ్చిమాసియాలో ఏర్పడిన అంతరాయాలు వాణిజ్యంపై చూపుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యల గురించి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మీడియాకు వివరించింది. సరఫరా గొలుసులను కాపాడటం, ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వడం, సకాలంలో జోక్యం చేసుకోవడం ద్వారా వాణిజ్యం నిరంతరాయంగా కొనసాగేలా చూడటంపై మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాలు:
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల వల్ల భారత వాణిజ్యం, రవాణా, సరఫరా గొలుసులపై పడే ప్రభావాన్ని ఎదుర్కోవడానికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని వాణిజ్య విభాగం సకాలంలో ముందస్తుగా సమన్వయంతో కూడిన చర్యలను చేపట్టింది. భారతదేశ ఎగుమతులు, దిగుమతులు, అనుసంధానత పరంగా ఈ ప్రాంతానికి ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం వాణిజ్య కొనసాగింపును నిర్ధారించడానికి, ఎగుమతిదారులపై పని ఒత్తిడిని తగ్గించడానికి, కీలకమైన సరఫరా గొలుసులలో స్థిరత్వాన్ని కాపాడటానికి ప్రభుత్వం ఒక సమగ్ర విధానాన్ని అవలంబించింది.
భారతదేశ విదేశీ వాణిజ్యంలో గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ కారిడార్‌లో ఏర్పడే అంతరాయాలు ఎగుమతిదారుల సరుకు రవాణా, భీమా ఖర్చులు, డెలివరీ షెడ్యూల్‌లు, తాత్కాలిక మూలధనంపై ప్రభావం చూపుతాయి. అందువల్ల మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, భాగస్వాముల సమన్వయం, ఎదురవుతున్న అడ్డంకులను పరిష్కరించడానికి వాణిజ్య విభాగం ఒక సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది.
2026 మార్చి 2న పశ్చిమాసియా పరిస్థితుల వల్ల తలెత్తుతున్న పరిణామాలను పర్యవేక్షించడం, అవసరమైన జోక్యాలను సమన్వయం చేయడానికి వాణిజ్య విభాగం.. వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన బృందాన్ని (ఇంటర్ మినిస్ట్రీయల్ గ్రూప్) ఏర్పాటు చేసింది. ఈ బృందంలో డీపీఐఐటీ, పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ఓడరేవులు - నౌకాయాన - జలమార్గాల మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, సీబీఐసీ, ఆర్‌బీఐ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖలు సభ్యులుగా ఉన్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సరఫరా గొలుసుతో పాటు రవాణాను నిరంతరాయంగా కొనసాగడం, కీలకమైన ఎగుమతులు- దిగుమతులను పర్యవేక్షించడం, ముందస్తు ఉపశమన చర్యలను చేపట్టడం అనే మూడు ప్రధానాంశాలపై ఐఎంజీ దృష్టి సారించింది. దీనివల్ల రవాణా మార్గాలు, సరుకు రవాణా ఛార్జీల పెరుగుదల, బీమా లభ్యత, కస్టమ్స్ అనుమతులు, అంతరాయాల వల్ల ప్రభావితమైన కార్గో కదలికలకు సంబంధించిన సమస్యలపై సకాలంలో దృష్టి సారించడం సాధ్యమైంది.
ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అంతరాయాల విషయంలో సకాలంలో మద్దతునిచ్చేందుకు టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్, ఈమెయిల్ ఆధారిత ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగంతో కూడిన ప్రత్యేక 'వెస్ట్ ఆసియా క్రైసిస్ డెస్క్' అందుబాటులోకి వచ్చింది. వ్యవసాయ, ఇతర సమయంతో కూడుకున్న ఎగుమతుల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి త్వరగా పాడైపోయే కార్గో కోసం ఒక ప్రత్యేక ఉప-బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.
క్షేత్రస్థాయి అభిప్రాయాలు, మద్దతు కోసం ఆ ప్రాంతంలోని భారతీయ మిషన్లు నిరంతరం పని చేస్తున్నాయి. దీనివల్ల క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యల పరిష్కారం సులభతరం కావడంతో పాటు ఎగుమతిదారులు, భాగస్వాములతో సకాలంలో సమన్వయం సాధ్యమవుతోంది.
సీబీఐసీ సమన్వయంతో తిరిగి వచ్చే కార్గో నిర్వహణ, క్రమం తప్పకుండా కస్టమ్స్ క్లియరెన్స్ ఫెసిలిటేషన్ కమిటీ సమావేశాలను నిర్వహించడం, ప్రభావితమైన కేసుల్లో 'బ్యాక్-టు-టౌన్' తరలింపునకు మినహాయింపులు ఇవ్వడం వంటి కస్టమ్స్ సంబంధిత చర్యలను ప్రారంభించారు. ఈ చర్యలు విధానపరమైన అడ్డంకులను తగ్గించి కార్గో కదలికను సులభతరం చేయడంలో సహాయపడ్డాయి.
ఓడరేవులు - నౌకాయాన - జలమార్గాల మంత్రిత్వ శాఖ, డీజీ షిప్పింగ్ సమన్వయంతో ఓడరేవుల వద్ద కార్యకలాపాలు కొనసాగేలా చూసుకోవటం, షిప్పింగ్ ధరలలో పారదర్శకతను మెరుగుపరచడానికి, ఏకపక్ష సరుకు రవాణా పద్ధతులను నిరుత్సాహపరచడానికి చర్యలు తీసుకున్నారు. తగిన సందర్భాల్లో నిల్వ, డ్వెల్ టైమ్, కొన్ని కంటైనర్ సంబంధిత ఛార్జీలలో రాయితీలు కూడా కల్పించారు.
·కంటైనర్ల లభ్యత, అంతర్గత రవాణా, రూటింగ్ అంతరాయాల వల్ల ప్రభావితమైన ఎగుమతి కార్గో నిర్వహణకు మద్దతు ఇవ్వడానికి వాణిజ్య విభాగం రైల్వే మంత్రిత్వ శాఖ, కాన్‌కోర్, ఐసీడీ సంస్థలతో కలిసి పనిచేసింది. జాప్యం, అనిశ్చితిని తగ్గించడానికి తగిన ట్రాన్స్‌షిప్‌మెంట్ మార్గాలతో సహా ప్రత్యామ్నాయ రూటింగ్ ఎంపికలను నిరంతరం పరిశీలిస్తున్నారు… సాధ్యమైన చోటల్లా అందుబాటులోకి తీసుకొచ్చారు.
రిస్తుంది. ఈ పథకం ద్వారా ఎగుమతిదారులకు మెరుగైన ప్రమాద కవరేజీ, స్థిరమైన ప్రీమియం, ఎంఎస్‌ఎంసీ ఎగుమతిదారులకు ప్రత్యేక మద్దతు లభిస్తుంది. రిలీఫ్ కార్యక్రమం ఎగుమతుల వేగాన్ని కొనసాగిస్తూ.. పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల ఏర్పడే అంతరాయాల నుంచి చిన్న ఎగుమతిదారులు నష్టపోకుండా రక్షించడానికి, అవసరమైన సందర్భాల్లో అదనపు రవాణా ఛార్జీల కోసం ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది.
· ఎగుమతిదారులపై భారాన్ని తగ్గించడానికి వాణిజ్య విధానంలో మార్పులు చేశారు. అడ్వాన్స్ ఆథరైజేషన్లు, ఈపీసీజీ ఆథరైజేషన్లు కలిగిన ఎగుమతిదారులకు ఎగుమతి బాధ్యతలను పూర్తి చేయడానికి అదనపు సమయం కేటాయించారు. దీనివల్ల వారి నియంత్రణలో లేని రవాణా ఆలస్యాల వల్ల తలెత్తే ఇబ్బందులను నివారించవచ్చు.
· ఆర్‌ఓడీటీఈపీ రేట్లను తిరిగి 100 శాతానికి పెంచడం ద్వారా ఎగుమతిదారుల ఖర్చు తగ్గడమే కాకుండా పోటీ సామర్థ్యం మరింత మెరుగుపడి, అనిశ్చితి కాలంలో ఎగుమతి రంగాలకు విశ్వాసం కలిగించింది. ఎగుమతిదారుల పెట్టుబడి, నగదు లభ్యతను మెరుగుపరచడం కోసం ఎగుమతి బాధ్యత విడుదల ధ్రువీకరణ పత్రాలను వేగంగా జారీ చేయడానికి డీజీఎఫ్‌టీ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
· అంతరాయాల ప్రభావం ఎక్కువగా ఉన్న రత్నాలు, ఆభరణాలు, వ్యవసాయ ఎగుమతుల వంటి రంగాల కోసం ప్రత్యేక మద్దతు చర్యలు చేపట్టారు.
· ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, పరిశ్రమల సంఘాలు, సరఫరాదారులు, సంబంధిత మంత్రిత్వ శాఖలతో వాణిజ్య శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. వాణిజ్య సరళీకరణ, వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కారం, తలెత్తే ప్రమాదాలను నిరంతరం పర్యవేక్షించడంపై దృష్టి సారిస్తూ.. ఆచరణాత్మకమైన, పరిష్కార దిశగా సాగే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది.
· దేశ వాణిజ్య వ్యవస్థ పటిష్టంగా, స్పందనాత్మకమైన, పోటీతత్వంతో ఉండేలా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ సవాలుతో కూడుకున్న సమయంలో జాతీయ వాణిజ్య ప్రయోజనాలను కాపాడటానికి, ఎగుమతిదారులకు అండగా నిలవడానికి భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు, సంస్థల సమన్వయంతో వాణిజ్య శాఖ అవసరమైన అన్ని చర్యలను కొనసాగిస్తుంది.
సముద్ర భద్రత, నౌకా రవాణా కార్యకలాపాలు
· పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సముద్ర పరిస్థితిపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఆ ప్రాంతంలోని భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ కింది అంశాలను వెల్లడించింది.
· పశ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితిని ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది.
· ఆ ప్రాంతంలో ఉన్న భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రస్తుతానికి పరిస్థితి స్థిరంగా ఉంది.
· పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం 18 భారతీయ జెండా కలిగిన నౌకల్లో 485 మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారు. నౌకా యజమానులు, ఆర్‌పీఎస్‌ఎల్ సంస్థలు, భారతీయ రాయబార కార్యాలయాలతో షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
· డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూం 24x7 గంటల పాటు పని చేస్తోంది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 4,885 కాల్స్.. 9,934 ఈమెయిళ్లను పరిష్కరించింది. గత 24 గంటల్లోనే 116 కాల్స్, 335 ఈమెయిళ్లు అందాయి.
· ఇప్పటి వరకు 972 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో డీజీ షిప్పింగ్ సహాయపడింది. ఇందులో గత 24 గంటల్లో వచ్చిన 11 మంది నావికులు కూడా ఉన్నారు.
· దేశవ్యాప్తంగా ఓడరేవుల కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో ఎటువంటి రద్దీ నమోదు కాలేదు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల సముద్రయాన బోర్డులు తమ పరిధిలోని కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని ధ్రువీకరించాయి.
· నావికుల భద్రత, సంక్షేమాన్ని, నిరంతర నౌకాయాన కార్యకలాపాలను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సముద్ర రంగ భాగస్వాములతో సమన్వయం చేసుకుంటోంది.
యుద్ధ ప్రభావ ప్రాంతంలో భారత పౌరుల భద్రత
· ఆ ప్రాంతంలో ప్రస్తుత పరిణామాలు, భారతీయ రాయబార కార్యాలయాల ద్వారా అందుతున్న నిరంతర సహాయంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
· టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటి వరకు 845 మంది భారతీయ విద్యార్థులతో సహా 1200 మంది దేశ పౌరులను భూ సరిహద్దుల ద్వారా అర్మేనియా, అజర్‌బైజాన్‌లకు సురక్షితంగా చేర్చింది. వీరిలో 996 మంది అర్మేనియాలోకి, 204 మంది అజర్‌బైజాన్‌లోకి ప్రవేశించారు.
· ఇరాన్‌లోని పలువురు భారతీయ పౌరులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
· ఇరాన్ నుంచి భారతీయ పౌరులు సురక్షితంగా ప్రయాణించేందుకు సహకరించిన అర్మేనియా, అజర్‌బైజాన్ అధికారులకు మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది.
· గల్ఫ్, పశ్చిమ ఆసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. భారతీయ పౌరుల భద్రత, సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది.
· భారతీయ పౌరులకు, వారి కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి ఒక ప్రత్యేక కంట్రోల్ రూం నిరంతరం పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లతో నిరంతర సమన్వయం జరుపుతోంది.
· ఆ ప్రాంతంలోని భారతీయ రాయబార కార్యాలయాలు, పోస్టులు 24x7 హెల్ప్‌లైన్లను నిర్వహిస్తున్నాయి. భారతీయ సంఘాల అసోసియేషన్లు, సంస్థలు, కంపెనీలతో ఇవి నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.
· భారతీయ పౌరులు, విద్యార్థులు, నావికులు, అక్కడ నివసిస్తున్న భారతీయుల కోసం క్రమం తప్పకుండా సూచనలు జారీ చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వాలతో రాయబార కార్యాలయాలు సంప్రదింపులను నిర్వహిస్తున్నాయి.
· వీసా సౌలభ్యం, కాన్సులర్ సేవలు, పొరుగు దేశాల ద్వారా ప్రయాణ మద్దతు, అవసరమైన చోట రవాణా సహాయం అందిస్తూ భారతీయుల సమస్యలను రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాయి.
· గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. వారి విద్యా సంవత్సరం దెబ్బతినకుండా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
· జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి స్థానిక అధికారులు, భారతీయ పాఠశాలలు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, కేరళ బోర్డులు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో రాయబార కార్యాలయాలు సమన్వయం చేసుకుంటున్నాయి.
· ఆ ప్రాంతంలోని నౌకల్లో ఉన్న భారతీయ సిబ్బందితో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ.. స్థానిక అధికారులతో సమన్వయం, కాన్సులర్ సహాయం, కుటుంబ సభ్యులతో సంప్రదింపులు, స్వదేశానికి తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
· విమాన ప్రయాణ పరిస్థితి మెరుగుపడుతోంది. ఆ ప్రాంతం నుంచి భారత్‌కు అదనపు విమానాలు నడుస్తున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు సుమారు 6,24,000 మంది ప్రయాణికులు భారత్‌కు చేరుకున్నారు.
· యూఏఈలో పరిమిత సంఖ్యలో నాన్-షెడ్యూల్డ్ విమానాలు నడుస్తున్నాయి. భారత్‌కు సుమారు 90 విమానాలు నడిచే అవకాశం ఉంది.
· సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌కు విమానాలు నడుస్తున్నాయి.
· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో ఖతార్ ఎయిర్‌వేస్ నేడు భారత్‌కు సుమారు 8 నుంచి 10 విమానాలను నడపనుంది.
· కువైట్, బహ్రెయిన్ గగనతలాలు మూసివేసే ఉన్నాయి. జజీరా ఎయిర్‌వేస్, గల్ఫ్ ఎయిర్ సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారత్‌కు విమానాలను నడుపుతున్నాయి.
· గగనతల ఆంక్షల కారణంగా భారతీయ పౌరులను ఈ కింది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలిస్తున్నారు:
· ఇరాన్ నుంచి అర్మేనియా, అజర్‌బైజాన్ మీదుగా భారత్‌కు.
· ఇజ్రాయెల్ నుంచి ఈజిప్ట్, జోర్డాన్ మీదుగా భారత్‌కు.
· ఇరాక్ నుంచి జోర్డాన్, సౌదీ అరేబియా మీదుగా భారత్‌కు.
· కువైట్, బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియా మీదుగా భారత్‌కు.
· యూఏఈలోని ఉమ్ అల్ క్వైన్‌లో జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు గాయపడి, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అతనికి కాన్సులేట్ అవసరమైన సహాయాన్ని అందిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2248697)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8