ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆమోదించిన ఆధార్ కేంద్రాలను మేపుల్స్ యాప్‌లో ప్రదర్శించడానికి మ్యాప్‌మైఇండియాతో యూఐడీఏఐ ఒప్పందం

రాబోయే నెలల్లో ఈ సదుపాయం అందుబాటులోకి..

అతి దగ్గరి ఆమోదిత ఆధార్ కేంద్రాన్ని తెలుసుకోవడంతో పాటు
అక్కడ లభించే సేవల్ని సరి చూసుకోవడంలో ప్రజలకు తోడ్పాటు

నాడు పోస్టు చేయడమైనది: 02 APR 2026 1:16PM by PIB Hyderabad

మ్యాప్‌మైఇండియాతో ఒక ఒప్పందాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కుదుర్చుకుంది. దీనిలో భాగంగా అధీకృత ఆధార్ కేంద్రాలను మ్యాప్‌మై ఇండియా వారి మ్యాపుల్స్ యాప్ (Mappls App)లో ప్రదర్శించేందుకు మార్గం సుగమం అయింది. ఈ నిర్ణయం నివాసులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
ఈ నిర్ణయంతో, ప్రజలకు అధీకృత ఆధార్ కేంద్రాలను గుర్తించడం, వాటి వద్దకు చేరుకోవడంలో తోడ్పాటు లభిస్తుందని భావిస్తున్నారు. దీంతో పాటు, నివాసులకు వయోజనుల నమోదు, బాలల నమోదు, లేదా కేవలం చిరునామాతో పాటు మొబైల్ నంబరును అప్‌డేట్ చేయడం వంటి సేవల స్వభావాన్ని బట్టి ఆయా సేవల్ని అందించే ఆధార్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నదీ కనుక్కోవడంలో సాయం లభిస్తుంది.

 

image.png
 

ప్రజలకు సౌకర్యాల స్థాయిని పెంచడం, తప్పు సమాచారం పాలబడకుండా వారిని కాపాడడం ఈ సహకార పూర్వక ఒప్పందం లక్ష్యాలు. వీటితో పాటు నివాసులకు దేశవ్యాప్తంగా అత్యాధునిక ఆధార్ సేవా కేంద్రాలు (ఏఎస్‌కేస్), ఇతర ఆధార్ కేంద్రాల వద్దకు నిరాటంకంగా చేరుకొనేందుకూ వీలవుతుంది. ఈ ఒప్పందంపై సంతకాల కార్యక్రమాన్ని  2026 ఏప్రిల్ 1న పూర్తి చేశారు.
యూఐడీఏఐ సీఈఓ శ్రీ భువనేశ్ కుమార్ మాట్లాడుతూ, ‘‘యూఐడీఏఐ దేశ వాసులకు సేవ చేసే దృష్టితో పనిచేస్తోంది. ఈ రకమైన సహకారంతో పూర్తి భారత్‌లో ముందుగా సరి చూసిన ఆధార్ కేంద్రాల డిజిటల్ మ్యాపింగ్ సాధ్య పడుతుంది. ఆమోదిత ఆధార్ కేంద్రాల్ని సులభంగా వెతుక్కోవడంలో ప్రజలకు కూడా సాయం లభిస్తుంద’’న్నారు.
రాబోయే కొన్ని నెలల్లో దీనిని అమలులోకి తీసుకు వచ్చిన తరువాత.. ఇది వినియోగదారులు మేపుల్స్ యాప్ (Mappls App)లో వెదకినప్పుడు, ఆమోదిత ఆధార్ కేంద్రాల వైపునకు వెళ్లే దారిని వారు తెలుసుకోవచ్చును. యూఐడీఏఐలు అందించే ఆధార్ కేంద్రం సమాచారాన్ని మ్యాప్‌మైఇండియా  మేపుల్స్ వేదికతో కలుపుతుంది. దీంతో ఆధార్ కేంద్రాల ఖచ్చిత చిరునామా, అక్కడ లభించే సేవల వివరాలు, డిజిటల్ మ్యాపింగ్, వివిధ కేంద్రాల జాబితా వంటి వాటిని గుర్తించడం సులభమవుతుంది.
మ్యాప్‌మైఇండియా సహ వ్యవస్థాపకుడు, సీఎండీ శ్రీ రాకేశ్ వర్మ మాట్లాడుతూ, ‘‘యూఐడీఏఐకి సేవలను అందించడం, మేపుల్స్ యాప్ ద్వారా ప్రజలకు ఆధార్ కేంద్రాల వద్దకు సులువుగా చేరుకొనే అవకాశాన్ని కల్పించడం నాకు దక్కిన సౌభాగ్యమ’’న్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2248622) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Bengali , Punjabi