వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీఎస్‌ఐఆర్‌ స్వదేశీ బయో-బిటుమెన్‌ సాంకేతికత బదిలీ.. వ్యవసాయ వ్యర్థాలతో సుస్థిర రహదారుల నిర్మాణం


సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్ రోడ్ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్, సీఎస్‌ఐఆర్‌-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సంయుక్త రూపకల్పన

విలువైన మౌలిక సదుపాయాల రంగంలో వ్యవసాయ వ్యర్థాలను వినియోగించటం వల్ల రైతులకు అదనపు ఆదాయం..

పంట వ్యర్థాల దహనం తగ్గే అవకాశం: శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్

నాడు పోస్టు చేయడమైనది: 30 MAR 2026 3:54PM by PIB Hyderabad

సుస్థిర, పునర్వినియోగ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్‌) ఇవాళ న్యూఢిల్లీలో కీలక సాంకేతికత బదిలీ కార్యక్రమాన్ని నిర్వహించింది. "లిగ్నోసెల్యూలోసిస్ బయోమాస్ నుంచి బయో-బిటుమెన్ - వ్యవసాయ వ్యర్థాలతో రహదారుల నిర్మాణం" వినూత్న సాంకేతికతను పరిశ్రమల స్థాయిలో విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర శాస్త్ర, సాంకేతికత, భూవిజ్ఞాన శాస్త్ర శాఖ సహాయమంత్రి (స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్, సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్ జనరల్, డీఎస్‌ఐఆర్‌ కార్యదర్శి డాక్టర్ ఎన్. కలైసెల్వి హాజరయ్యారు. వీరితో పాటు వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, సీఎస్‌ఐఆర్‌ సంస్థల ప్రతినిధులు, పరిశ్రమల భాగస్వాములు, విధానకర్తలు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. బయో-బిటుమెన్ సాంకేతికత అభివృద్ధి "చరిత్రాత్మక, పరివర్తనాత్మక ముందడుగు" అని అభివర్ణించారు. మౌలిక సదుపాయాల కల్పన, నూతన ఆవిష్కరణలతో వ్యవసాయ రంగాన్ని ఇది అనుసంధానిస్తుందని తెలిపారు. భారతదేశ వాతావరణ నిబద్ధత, కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలు, ఆత్మనిర్భర్ భారత్, నేషనల్ బయో-ఎనర్జీ మిషన్, పునర్వినియోగ ఆర్థిక విధానం వంటి ప్రతిష్ఠాత్మక పథకాలతో బయో-బిటుమెన్ వాడకం బలంగా అనుసంధానమై ఉందని శ్రీ శివరాజ్ సింగ్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల వంటి విలువైన రంగాల్లో వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించటం వల్ల రైతులకు అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయని, వ్యవసాయ వ్యర్థాల దహనం, పర్యావరణ కాలుష్యం తగ్గుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమం స్వయం సమృద్ధ, స్వచ్ఛ ఇంధన పరివర్తన, 'వ్యర్థాల నుంచి సంపద' సూత్రం పట్ల భారత్‌కున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. వ్యవసాయం, శాస్త్ర, సాంకేతికత, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పలు రంగాల సమర్థవంతమైన కలయికకు ఈ సాంకేతికత నిదర్శనమని, దీనికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల బలమైన మద్దతుందని చెప్పారు. బయో-బిటుమెన్ సాంకేతికత మన్నికలోనూ, సాధారణ బిటుమెన్‌తో కలిసిపోయే గుణంలోనూ అద్భుతమైన పనితీరును కనబరచినట్లు తెలిపారు. ఇది కర్బన ఉద్గారాలను తగ్గించటమే కాక, జాతీయ రహదారుల నిర్మాణంలో భారీ స్థాయిలో వినియోగానికి అనువైనదని వెల్లడించారు.

పెట్రో ఆధారిత పదార్థాల నుంచి జీవ ఆధారిత పదార్థాల వైపు సమూల మార్పును ఈ పరిణామం సూచిస్తుందని డాక్టర్ ఎన్. కలైసెల్వి పేర్కొన్నారు. దేశాభివృద్ధికి ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతలను అందుబాటులోకి తెచ్చేందుకు సీఎస్‌ఐఆర్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌టీహెచ్‌) ఉన్నతాధికారులు, సీఎస్‌ఐఆర్‌ యాజమాన్యం, శాస్త్రవేత్తలు, పరిశ్రమల భాగస్వాములు, రైతులు, విధాన రూపకర్తలు పాల్గొన్నారు. ప్రయోగశాల స్థాయి ఆవిష్కరణలను భారత రహదారి రంగానికి అవసరమైన క్షేత్రస్థాయి పరిష్కారాలుగా మార్చటంలో ఈ సదస్సు కీలకంగా నిలిచింది.

సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్ రోడ్ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్‌-సీఆర్‌ఆర్‌ఐ), సీఎస్‌ఐఆర్‌-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (సీఎస్‌ఐఆర్‌-ఐఐపీ) సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత పరిజ్ఞాన బదిలీ.. బయో బిటుమెన్‌ తయారీకి సంబంధించింది.

ఏళ్ల తరబడి పరిశోధనలు చేసి అభివృద్ధి చేసిన ఈ బయో-బిటుమెన్‌ సాంకేతికత.. వ్యవసాయ వ్యర్థాలను, పంట అవశేషాలను ముడి పదార్థాలుగా వినియోగిస్తుంది. ఉష్ణరసాయన మార్పిడి ప్రక్రియ ద్వారా వీటిని మార్చటం వల్ల పెట్రోలియం ఆధారిత తారుకు బదులుగా పర్యావరణహిత, పునరుత్పాదక ఇంధన వనరు లభిస్తుంది. ఈ సాంకేతికత సంప్రదాయ తారుకు సమానమైన పనితీరు కనబరచటమే కాక.. పర్యావరణ, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తోంది. రహదారి నిర్మాణంలో.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌టీహెచ్‌) వినియోగించేందుకు దీన్ని అభివృద్ధి చేశారు.

వ్యవసాయ వ్యర్థాల నుంచి బయో-బిటుమెన్‌ ఉత్పత్తిని ఈ ఆవిష్కరణ సాధ్యం చేస్తుంది. సంప్రదాయ బిటుమెన్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత, కర్బన ఉద్గార రహిత పునరుత్పాదక ఇంధనంగా ఇది పనిచేస్తుంది. వ్యవసాయ వ్యర్థాల వల్ల కలిగే కాలుష్యం, బిటుమెన్‌ దిగుమతులపై ఆధారపడటం పెరగటం వంటి రెండు జాతీయ సవాళ్లను ఇది పరిష్కరిస్తుంది. 

***


(రిలీజ్ ఐడి: 2247162) సందర్శకుల సూచీ సంఖ్య : : 72
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Punjabi , Kannada