వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
హోటళ్లు, రెస్టారెంట్లలో “ఎల్‌పీజీ ఛార్జీలు” సహా అదనపు ఛార్జీల విధింపును నివారించడం లక్ష్యంగా తాజా సూచనలు జారీ చేసిన కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ
హోటళ్లు, రెస్టారెంట్ల డిఫాల్ట్ ఇంధన ఛార్జీల వసూలుపై నిషేధం
వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే
నాడు పోస్టు చేయడమైనది:
25 MAR 2026 4:01PM by PIB Hyderabad
హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుల బిల్లుల్లో “ఎల్‌పీజీ ఛార్జీలు”, “గ్యాస్ సర్‌ఛార్జ్”, “ఇంధన వ్యయ రికవరీ” వంటి అదనపు ఛార్జీలను విధించడాన్ని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) తీవ్రంగా పరిగణించింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం-2019 ప్రకారం ఇది చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. సేవా ఛార్జీలపై ఉన్న ప్రస్తుత మార్గదర్శకాలను తప్పించుకోవడానికి డిఫాల్ట్‌గా ఇటువంటి ఛార్జీలు విధిస్తున్నారని అథారిటీ... వినియోగదారుల పరిరక్షణ చట్టం-2019లోని సెక్షన్ 10 కింద కొత్త సూచనలను జారీ చేసింది. అటువంటి ఛార్జీలను విధించరాదని తాజా సూచనల్లో ఆదేశించింది. దీని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (ఎన్‌సీహెచ్) కు అందిన ఫిర్యాదులు, మీడియా నివేదికల ఆధారంగా కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మెనూలో ప్రదర్శించిన ఆహార, పానీయాల ధరలు, వర్తించే పన్నులకు అదనంగా... వినియోగదారుల బిల్లులో డిఫాల్ట్‌గా అటువంటి అదనపు ఛార్జీలను విధిస్తున్నాయని సీసీపీఏ గుర్తించింది. ఇటువంటి పద్ధతులు పారదర్శకత లోపానికి దారితీయడమే కాకుండా, వినియోగదారులపై అన్యాయంగా అదనపు ఖర్చులను మోపుతాయని తెలిపింది.
“ఎల్‌పీజీ ఛార్జీలు”, అలాంటి ఇతర ఛార్జీలను విధించే ప్రస్తుత పద్ధతిని వేరొక పేరుతో అవలంబించడం ద్వారా పైన పేర్కొన్న మార్గదర్శకాలను తప్పించుకోవడానికి చేసే ప్రయత్నంగా దీనిని పరిగణిస్తోంది. ఇంధనం, ఎల్‌పీజీ, విద్యుత్, ఇతర నిర్వహణ ఖర్చులు సహా ఇన్‌పుట్ ఖర్చులన్నీ వ్యాపారాన్ని నడపడానికి అయ్యే ఖర్చులోనే భాగమని... మెనూ ఐటమ్‌ల ధరల నిర్ణయంలో వాటిని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని సీసీపీఏ స్పష్టం చేసింది. ప్రత్యేక తప్పనిసరి ఛార్జీల ద్వారా అటువంటి ఖర్చులను వసూలు చేయడాన్ని చట్టంలోని సెక్షన్ 2(47) ప్రకారం అన్యాయమైన వాణిజ్య విధానంగా పరిగణించనున్నట్లు పేర్కొంది.
సీసీపీఏ కింది సూచనలను చేసింది:
ఏదైనా హోటల్, రెస్టారెంట్ వారి బిల్లులో డిఫాల్ట్‌గా, ఆటోమేటిక్‌గా “ఎల్‌పీజీ ఛార్జీలు”, “గ్యాస్ ఛార్జీలు”, అలాంటి ఇతర అదనపు ఛార్జీలను విధించరాదు.
వర్తించే పన్నులు మినహాయించి, మెనూలో ప్రదర్శించిన ధర మాత్రమే తుది ధరగా ఉంటుంది.
వినియోగదారులను తప్పుదోవ పట్టించకూడదు. సాధారణంగా వసూలు చేయని ఏ అదనపు ఛార్జీని చెల్లించమని వారిని బలవంతం చేయకూడదు.
పేరుతో సంబంధం లేకుండా అటువంటి అదనపు చార్జీలు... సర్వీస్ ఛార్జ్, అదనపు ఫీజుల స్వభావానికి చెందినవని సూచనల్లో స్పష్టం చేశారు. వాటిని డిఫాల్ట్‌గా విధించడం 04.07.2022 నాటి సీసీపీఏ మార్గదర్శకాల ఉల్లంఘన అవుతుందని, ఇది వినియోగదారుల పరిరక్షణ చట్టం-2019 కింద చర్యలకు దారితీయవచ్చని ఈ సూచనల్లో పునరుద్ఘాటించారు.
వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం
అలాంటి అదనపు చార్జీలను ఎదుర్కొనే వినియోగదారులు ఇలా చేయవచ్చు:
బిల్లు నుంచి ఆ ఛార్జీని తొలగించమని హోటల్, రెస్టారెంట్‌ను అభ్యర్థించండి
1915కు కాల్ చేయడం ద్వారా గానీ, ఎన్‌సీహెచ్ మొబైల్ యాప్ ద్వారా గానీ జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదును నమోదు చేయండి.
ఇ-జాగృతి పోర్టల్ ద్వారా సంబంధిత వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయండి
జిల్లా కలెక్టర్‌కు గానీ, నేరుగా సీసీపీఏకు గానీ ఫిర్యాదును సమర్పించండి.
దేశవ్యాప్తంగా ఇటువంటి పద్ధతులను సీసీపీఏ నిశితంగా పర్యవేక్షిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు అన్యాయమైన, అనధికారిక ఛార్జీలను విధించడం సహా ఏదైనా ఉల్లంఘనకు పాల్పడితే, వారిపై తగిన చర్యలు తీసుకుంటుంది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి చట్టంలోని నిబంధనల ప్రకారం సీసీపీఏ అవసరమైన చర్యలు చేపడుతుంది.
(ఈ సూచనలు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ వెబ్‌సైట్ https://doca.gov.in/ccpa/guidelins.php లో అందుబాటులో ఉంటాయి)
***
(రిలీజ్ ఐడి: 2245348)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14