పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ


· చమురు శుద్ధి కేంద్రాల నుంచి సంక్షోభానికి పూర్వం ఉన్న స్థాయి కంటే మెరుగుపడిన గృహ అవసరాల ఎల్‌పీజీ ఉత్పత్తి

· రాష్ట్రాలకు కేటాయించే మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ 50 శాతానికి చేరిక

· వలస కూలీలు, ఇతర ప్రాధాన్యత రంగాలకు ఇందులో ప్రత్యేక కేటాయింపులు

· నిన్న ఒక్కరోజే జారీ అయిన లేదా క్రియాశీలకంగా మారిన 7,500 కంటే ఎక్కువ పీఎన్‌జీ కనెక్షన్లు

· అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలు, గృహ అవసరాల ఎల్‌పీజీ దారి మళ్లింపు, ఇతర అక్రమాలను అరికట్టడానికి కఠినమైన నిఘా ఉంచాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన కేంద్రం

· 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటైన జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు

· 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటైన కంట్రోల్ రూంలు

· పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని తెలిపిన ప్రభుత్వం

· వదంతులను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోన్న ప్రభుత్వం

· హార్ముజ్ జలసంధి దాటి భారత్‌ వైపు వస్తున్న రెండు భారతీయ ఎల్‌పీజీ నౌకలు

· సంక్షోభ ప్రాంతం నుంచి అదనపు విమానాలు నడుపుతుండటంతో నిరంతరం మెరుగుపడుతున్న విమానయాన పరిస్థితులు

· ఆ ప్రాంతం నుంచి ఇప్పటివరకు భారత్‌కు తిరిగి వచ్చిన 4,02,000 మంది ప్రయాణికులు

నాడు పోస్టు చేయడమైనది: 24 MAR 2026 6:24PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలకు క్రమం తప్పకుండా సమాచారం అందించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా జాతీయ మీడియా కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలు (ఇంటర్ మినిస్ట్రీయల్) మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందుతున్న సహాయం, ఆయా రంగాలలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలపై వారు తాజా సమాచారాన్ని పంచుకున్నారు.

ఇంధన సరఫరాలభ్యత 

హోర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉంచేందుకు తీసుకుంటున్న చర్యలు.. ఇంధన సరఫరా స్థితిగతులపై పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ సమావేశంలో తాజా సమాచారాన్ని అందించింది. మంత్రిత్వ శాఖ ఈ విషయాలను వెల్లడించింది:

ముడి చమురుచమురు శుద్ధి కేంద్రాలు

·   అన్ని చమురు శుద్ధి కేంద్రాలు గరిష్ఠ సామర్థ్యంతో నడుస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉండటంతో పాటు పెట్రోల్, డీజిల్ విషయంలో తగినంత నిల్వలు ఉండేలా చూసుకుంటున్నారు.

·   సంక్షోభానికి పూర్వం ఉన్న స్థాయిలతో పోలిస్తే చమురు శుద్ధి కేంద్రాల నుంచి దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి పెరిగింది.

రిటైల్ విక్రయకేంద్రాలు

·   దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ అవుట్‌లెట్‌లు యథావిధిగా పనిచేస్తున్నాయి.

·   కొన్ని వదంతుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనతో కొనుగోళ్లు చేస్తున్నట్లు సమాచారం అందింది. దీని ఫలితంగా రిటైల్ విక్రయకేంద్రాల వద్ద అసాధారణంగా అమ్మకాలు పెరగడంతో పాటు విపరీతమైన రద్దీ ఏర్పడింది. 

·   వదంతులను నమ్మొద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

సహజ వాయువు

·   ప్రాధాన్యత రంగాలకు రక్షిత సరఫరా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గృహ అవసరాల పీఎన్‌జీ, రవాణా రంగ సీఎన్‌జీ విషయంలో 100 శాతం సరఫరా అందుతుండగా.. గ్రిడ్‌కు అనుసంధానమైన పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు వారి సగటు వినియోగంలో సుమారు 80 శాతం సరఫరాను కొనసాగిస్తున్నారు.

·   హోటళ్లు, రెస్టారెంట్లు, కాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్‌లను అందించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) సంస్థలకు సూచించారు. 

·   గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్‌లను ప్రోత్సహించడానికి ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు ప్రత్యేక రాయితీలను అందిస్తున్నాయి.

·   సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన దరఖాస్తుల ఆమోదాన్ని వేగవంతం చేయాలని కోరుతూ 16.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కోరింది.

·   ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలికంగా మారడానికి సహకరించే రాష్ట్రాలకు అదనంగా 10 శాతం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయించనున్నట్లు 18.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తెలియజేసింది. 

·   సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న వాటితో పాటు కొత్త అనుమతులను వేగంగా పరిశీలించి వాటి ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని సంబంధిత కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలను కోరింది.

·   కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు లేదా విభాగాల పరిధిలోని సంస్థలలో పీఎన్‌జీ కనెక్షన్ల సంభావ్య డిమాండ్‌పై సమగ్ర అంచనా వేయాలని.. ఈ ప్రక్రియను సమన్వయం చేయడానికి ప్రతి మంత్రిత్వ శాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమించాలని కోరుతూ 20.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

·   సీజీడీ దరఖాస్తుల ప్రక్రియను ప్రాధాన్యత క్రమంలో 10 రోజులలోపు పూర్తి చేయాలని పీఈఎస్ఓ (పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్) తన పరిధిలోని కార్యాలయాలకు సూచించింది.

·   ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులు పీఎన్‌జీకి మారాలని విజ్ఞప్తి చేశారు. 

·   పైప్‌లైన్లు అందుబాటులో ఉన్న చోట ఆవాస పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, సామాజిక కిచెన్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఐదు రోజులలోపు ప్రాధాన్యత ప్రతిపాదికన పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వాలని 23.03.2026 నాటి ఉత్తర్వు ద్వారా సీజీడీ సంస్థలను పెట్రోలియం- సహజ వాయువు నియంత్రణ సంస్థ (పీఎన్‌జీఆర్‌బీ) ఆదేశించింది.

·   నిన్న ఒక్కరోజే దేశంలోని ప్రధాన 110 భౌగోళిక ప్రాంతాల్లో 7,500 కంటే ఎక్కువ గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్లు జారీ అయ్యాయి లేదా క్రియాశీలకంగా మారాయి. 

ఎల్‌పీజీ

·   ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.

·   పంపిణీ కేంద్రాల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉందన్న నివేదికలు లేవు. 

·   నిన్నటి వరకు ప్రజలు భయాందోళనతో ముందస్తు బుకింగ్‌లు చేయడంలో స్వల్ప పెరుగుదల కనిపించింది. అయితే గృహ అవసరాల ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ మాత్రం యథావిధిగా కొనసాగుతోంది.

·   ఇప్పటికే వినియోగదారులకు పాక్షికంగా (20 శాతం) వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. దీనికి అదనంగా పీఎన్‌జీ విస్తరణకు సంబంధించి ‘సులభతర వాణిజ్య సంస్కరణలు’ అమలు చేసే రాష్ట్రాలకు అదనంగా 10 శాతం వాణిజ్య ఎల్‌పీజీని కేటాయిస్తామని 18.03.2026 నాటి లేఖలో ప్రతిపాదించింది.

·   21.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మరో 20 శాతం వాణిజ్య ఎల్‌పీజీని కేటాయించడానికి అనుమతించింది. దీనితో మొత్తం కేటాయింపు 50 శాతానికి చేరుకుంటుంది. ఈ అదనపు 20 శాతం సరఫరాను రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లు, పారిశ్రామిక కాంటీన్లు, ఆహార శుద్ధి కేంద్రాలు లేదా డైరీ, ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు నడిపే రాయితీ క్యాంటీన్లు, సామాజిక కిచెన్‌లు, వలస కూలీల కోసం 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లకు ప్రాధాన్యత క్రమంలో అందిస్తున్నారు. 

·   కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గృహేతర ఎల్‌పీజీని కేటాయించడానికి 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉత్తర్వులు జారీ చేశాయి. మిగిలిన రాష్ట్రాలలో పీఎస్‌యూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్లను విడుదల చేస్తున్నాయి. 2026 మార్చి 14 నుంచి ఇప్పటివరకు రాష్ట్రాల్లోని వాణిజ్య సంస్థలు మొత్తం 18,784 మెట్రిక్ టన్నుల గ్యాస్‌ వినియోగించుకున్నాయి. 

కిరోసిన్

·   రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 48,000 కిలో లీటర్ల కిరోసిన్ కేటాయించారు. జిల్లా స్థాయి పంపిణీ కేంద్రాలను గుర్తించాలని ఆయా రాష్ట్రాలను కోరారు. 

·  15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే కిరోసిన్ (ఎస్‌కేఓ) కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. అయితే హిమాచల్ ప్రదేశ్, లడఖ్ తమకు కిరోసిన్ అవసరం లేదని తెలియజేశాయి. నేటి వరకు ఇంకా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వాలుకేంద్రపాలిత ప్రాంతాల పాత్ర

·   నిత్యావసర సరకుల చట్టం- 1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటి నిత్యావసరాల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడం, క్రమబద్ధీకరించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రధాన పాత్ర పోషించాలి.

·   13.03.2026, 18.03.2026 నాటి లేఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఈ కింది చర్యలు తీసుకోవాలని కోరింది:

o  అక్రమ నిల్వలు, నల్లబజారుకు తరలించడం, గృహ అవసరాల ఎల్‌పీజీని ఇతర అవసరాలకు మళ్లించడం, ఇతర అక్రమాలను అరికట్టడానికి కఠినమైన నిఘా ఉంచాలి.

o  నిత్యావసర సరకుల చట్టం- 1955, పెట్రోలియం చట్టం- 1934, పెట్రోలియం నిబంధనలు- 2002, మోటార్ స్పిరిట్ - హెచ్‌ఎస్‌డీ ఉత్తర్వు- 2005, ఇతర సంబంధిత చట్టాల నిబంధనల ప్రకారం ఉల్లంఘనదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.

o  స్థానిక ప్రాధాన్యతలు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాణిజ్య ఎల్‌పీజీ కోసం తగిన పంపిణీ పద్ధతులను రూపొందించాలి.

o  భయాందోళనతో చేసే కొనుగోళ్లను నిరోధించడానికి, ఎల్‌పీజీని పొదుపుగా వాడటాన్ని ప్రోత్సహించడానికి, ఖచ్చితమైన సమాచారాన్ని చేరవేయడానికి ప్రజలకు సూచనలను జారీ చేయాలి.

·   ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, ఆహార - పౌర సరఫరాల (ఎఫ్‌సీ-ఎస్) అధికారులను కోరారు. 

·   32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశాయి. అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతిరోజూ మీడియా సమావేశాలను కూడా నిర్వహిస్తున్నాయి.

·   33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.

·   కంట్రోల్ రూంలు, జిల్లా పర్యవేక్షణ కమిటీలను ఇంకా ఏర్పాటు చేయని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు..  యుద్ధ ప్రతిపాదికన ఆ పనులను పూర్తి చేయాలని కోరారు. 

అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు

·   అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో సుమారు 3,400 దాడులు నిర్వహించారు. దాదాపు 1,000 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

·   ఆంధ్రప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం అందింది.

·   పీఎస్‌యూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిన్న రిటైల్ విక్రయకేంద్రాలు, ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల వద్ద 1,500 కంటే ఎక్కువ ఆకస్మిక తనిఖీలను నిర్వహించాయి.

·   ఇప్పటివరకు సుమారు 642 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.. దాదాపు 155 మందిని అరెస్టు చేశారు.

ప్రభుత్వం చేపట్టిన ఇతర చర్యలు

·         ముఖ్యంగా గృహాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి ప్రాధాన్య రంగాలకు నిరంతరాయంగా ఎల్‌పీజీ సరఫరా, పీఎన్‌జీ విస్తరణ కోసం ప్రభుత్వం ప్రాధాన్యం కొనసాగిస్తోంది.

·         శుద్ధి కర్మాగార ఉత్పత్తిని పెంచడం, పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ వ్యవధులను 21 రోజుల నుంచి 25 రోజులకు... గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు సవరించడం, ప్రాధాన్యత ఆధారంగా సరఫరా కేటాయింపుల వంటివి ఈ చర్యల్లో భాగంగా ఉన్నాయి.

·         ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికలను ప్రతిపాదించారు.

·         చిన్న, మధ్య తరహా, ఇతర వినియోగదారులకు బొగ్గును పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు అధిక పరిమాణంలో బొగ్గును కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటికే కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు గనులకు ఆదేశాలు జారీ చేసింది.

·         గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం పీఎన్‌జీ కనెక్షన్‌లను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.

ప్రజలకు సూచనలు

·         పౌరులు భయాందోళనలతో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీలను కొనుగోలు చేయకూడదని, కేవలం అధికారిక సమాచార వనరులపై మాత్రమే ఆధారపడాలని సూచించడమైనది.

·         వినియోగదారులు ఎల్‌పీజీ కోసం డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవాలని, పంపిణీదారుల వద్దకు వెళ్లడం మానుకోవాలని కోరడమైనది.

·         పీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను, ఎలక్ట్రిక్-ఇండక్షన్ కుక్‌టాప్‌లను ఉపయోగించేలా పౌరులను ప్రోత్సహిస్తున్నారు.

·         ప్రస్తుత పరిస్థితుల్లో పౌరులందరూ ఇంధనాన్ని పొదుపుగా వాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

·         నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు

·         పర్షియన్ గల్ఫ్‌లో నెలకొన్న సముద్ర పరిస్థితిపై, భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలపై నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని పంచుకుంది. మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్నితెలియజేసింది:

·         ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి నౌకా ప్రమాదం జరగలేదు.

·         రెండు భారతీయ ఎల్‌పీజీ నౌకలు పైన్ గ్యాస్, జగ్ వసంత్... నిన్న రాత్రి హార్మూజ్ జలసంధిని దాటి, ఎల్‌పీజీ సరుకుతో భారత్ వైపు వస్తున్నాయి. పైన్ గ్యాస్ (సుమారు 45,000 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ) ఈ నెల 27న ఉదయం న్యూ మంగళూరుకు చేరుకోనుండగా, జగ్ వసంత్ (సుమారు 47,612.59 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ) ఈ నెల 26న ఉదయం కాండ్లాకు చేరుకోనుంది.

·         సురక్షిత ప్రయాణానికి అనుగుణంగా, సుమారు 540 మంది భారతీయ నావికులతో కూడిన 20 భారత జెండా గల నౌకలు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే ఉన్నాయి. నౌకా యజమానులు, ఆర్‌పీఎస్‌ఎల్ ఏజెన్సీలు, భారత మిషన్లతో సమన్వయం చేసుకుంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.

·         డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24×7 పనిచేస్తూనే ఉంది. యాక్టివేషన్ అయినప్పటి నుంచి 3,921 కాల్‌లు, 7,447 ఈమెయిళ్లను ఇది నిర్వహించింది. గత 24 గంటల్లో వచ్చిన 146 కాల్‌లు, 226 ఈమెయిళ్లూ దీనిలో భాగంగా ఉన్నాయి.

·         డీజీ షిప్పింగ్ ఇప్పటివరకు విమానాశ్రయాలు, ప్రాంతీయ ప్రదేశాల నుంచి 585 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో సహాయపడింది. వీరిలో గత 24 గంటల్లో 26 మంది, గత 48 గంటల్లో 39 మంది స్వదేశానికి చేరుకున్నారు.

·         గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళం, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరితో సహా రాష్ట్ర మారిటైమ్ బోర్డులు ధ్రువీకరించిన ప్రకారం, ఓడరేవుల అంతటా ఎటువంటి రద్దీ లేకుండా భారత నౌకా వాణిజ్య రంగ కార్యకలాపాలు సజావుగా కొనసాగుతున్నాయి.

·         సులభమైన కార్గో నిర్వహణను నిర్ధారించడం కోసం జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, వి.ఓ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీ, విశాఖపట్నం పోర్ట్, ముంద్రా, దీన్‌దయాల్ పోర్ట్ అథారిటీ, న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ, కొచ్చిన్ పోర్ట్ అథారిటీ, చెన్నై పోర్ట్ అథారిటీ వంటి కీలక పోర్టుల్లో ఇప్పటికే అదనపు స్థలాన్ని ఏర్పాటు చేసిన నౌకాశ్రయాలు... నౌకల రాకపోకలు, కార్గో కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.

·         కామరాజర్ పోర్ట్ లిమిటెడ్‌లో... గల్ఫ్‌కు రవాణా చేయనున్న కార్ల కోసం అదనంగా 20 రోజుల ఉచిత నిల్వ కాలాన్ని (మొత్తం 40 రోజులు) మంజూరు చేయడంతో పాటు, సమర్థమైన కార్గో నిర్వహణను సులభతరం చేయడానికి సుమారు 10 ఎకరాల అదనపు నిల్వ స్థలాన్నీ కేటాయించారు.

·         పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా నౌకా రవాణా, నౌకాశ్రయ కార్యకలాపాలు, నావికుల భద్రత, నౌకా వాణిజ్యం కొనసాగింపును నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంది.

·         సంక్షోభ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత

·         భారత మిషన్ల ద్వారా అందిస్తున్న సహాయం సహా, ఈ ప్రాంతంలోని ఇటీవలి పరిణామాలను బ్రీఫింగ్‌లో వివరించారు. కింది సమాచారాన్ని తెలియజేశారు:

·         పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం గురించి, ముఖ్యంగా ఇంధన భద్రతకు సంబంధించిన ఆందోళనల గురించి అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి చర్చించారు.

·         శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్‌తోనూ భారత విదేశాంగ మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరుపక్షాలు పశ్చిమాసియా ఘర్షణల పరిణామాలను చర్చించారు. 'పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యత' విధానానికి, 'మహాసాగర్ దార్శనికత'కు భారత్ కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.

·         విదేశాంగ మంత్రి న్యూఢిల్లీలో గల్ఫ్ సహకార మండలి దేశాల రాయబారులతో సమావేశమై... పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ ప్రాంతంలోని భారతీయ పౌరులకు వారు అందిస్తున్న నిరంతర మద్దతుకు ఆయన వారికి ధన్యవాదాలు తెలిపారు.

·         భారతీయ పౌరుల భద్రత, క్షేమం, శ్రేయస్సుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూనే... పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.

·         రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయం కొనసాగుతుండగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తూనే ఉంది.

·         ఈ ప్రాంతం అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టులు నిరంతరం పనిచేస్తూ... 24×7 హెల్ప్‌లైన్‌లనూ నిర్వహిస్తూ... భారతీయ కమ్యూనిటీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ... ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తున్నాయి.

·         మిషన్లు స్థానిక అధికారులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే... సముద్రయాన సిబ్బందికి, విద్యార్థులకు, చిక్కుకుపోయిన భారతీయ పౌరులకు, స్వల్పకాలిక సందర్శకులకు వీసా సౌకర్యం, కాన్సులర్ సేవలు, లాజిస్టిక్ సంబంధిత మద్దతుతో సహాయం అందిస్తున్నాయి.

·         ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు విమాన కార్యకలాపాలు మెరుగవడం సహా, ఆ ప్రాంతం నుంచి సుమారు 4,02,000 మంది ప్రయాణికులు భారత్‌కు తిరిగి వచ్చారు.

·         యూఏఈలో పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఈ రోజు సుమారు 85 విమానాలు భారత్‌కు రానున్నాయి.

·         సౌదీ అరేబియా, ఒమన్ దేశాల నుంచి భారత్‌కు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.

·         ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. ఈ రోజు ఖతార్ ఎయిర్‌వేస్ సుమారు 9 షెడ్యూల్ చేయని విమానాలను భారత్‌కు నడపనుంది.

·         కువైట్, బహ్రెయిన్ గగనతలాలు మూసి ఉన్నాయి. కువైట్‌కు చెందిన జజీరా ఎయిర్‌వేస్... సౌదీ అరేబియాలోని అల్ ఖైసుమా విమానాశ్రయం (ఏక్యూఐ) నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది. బహ్రెయిన్‌కు చెందిన గల్ఫ్ ఎయిర్... సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి భారత్‌కు షెడ్యూల్ చేయని ప్రత్యేక వాణిజ్య విమానాలను నడపడం కొనసాగిస్తోంది. ఇది కువైట్, బహ్రెయిన్ నుంచి భారత పౌరులు స్వదేశానికి రావడానికి సౌకర్యం కల్పిస్తోంది.

·         కువైట్, బహ్రెయిన్, ఇరాక్‌లలో ఉన్న భారత పౌరుల ప్రయాణానికి సౌదీ అరేబియా మీదుగా భారత్‌కు రావడానికి సౌకర్యం కల్పిస్తున్నారు.

·         ఇరాన్‌లోని భారత పౌరులు అర్మేనియా, అజర్‌బైజాన్‌ల మీదుగా భారత్‌కు ప్రయాణించేందుకు సహాయం కొనసాగుతోంది.

·         ఇజ్రాయెల్‌లోని భారత పౌరులు జోర్డాన్ మీదుగా భారత్‌కు ప్రయాణించేందుకు సౌకర్యం కల్పిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2244775) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Khasi , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Gujarati , Kannada , Malayalam