ప్రధాన మంత్రి కార్యాలయం
టీవీ9 సమ్మిట్-2026లో ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
23 MAR 2026 9:21PM by PIB Hyderabad
నమస్కారం!
ఇటీవల ఒకటి, రెండు సార్లు టీవీ9 భారత్‌వర్ష్ చూసే అవకాశం వచ్చింది. యుద్ధాలు, క్షిపణి దాడులపై మీరు దృష్టి సారిస్తున్నారు. మీకు కంటెంట్ కూడా విపరీతంగా లభిస్తుంది. టీవీ9కి తగినంత సమాచారాన్ని అందించాలని పెద్ద దేశాలు బలంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం ప్రపంచం, మునుపెన్నడూ లేనివిధంగా ఆందోళనకర, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచనలకు కీలకమైన వేదికను టీవీ9 వ్యవస్థ సృష్టించింది. ఈ సదస్సులో "భారత్, ప్రపంచం" అంశంపై మీరంతా చర్చిస్తున్నారు. ఈ సదస్సును నిర్వహిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా సదస్సుకు విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు నెలకొన్న వేళ, ఆ ప్రభావం అంతర్జాతీయంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమయంలో "భారత్, ప్రపంచం" గురించి మాట్లాడటం సందర్భోచితం. నేడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా దూసుకెళ్తోంది. 2014 కన్నా ముందున్న పరిస్థితులను అధిగమించి సరికొత్త ఆత్మవిశ్వాసంతో భారత్ ముందుకు సాగుతోంది. ఇప్పుడు భారత్ సవాళ్ల నుంచి తప్పుకోవటం లేదు.. ధైర్యంగా ఎదుర్కొంటోంది. గత 5-6 ఏళ్లుగా కరోనా మహమ్మారి తర్వాత ఏటా సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయి. భారత్ సామర్థ్యాన్ని, భారతీయులను పరీక్షించని సంవత్సరం లేదు. 1.4 బిలియన్ పౌరుల సమష్టి కృషితో ప్రతి సంక్షోభాన్ని భారత్ ధీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. చివరకు యుద్ధ సమయాల్లోనూ భారతదేశం అనుసరిస్తున్న విధానం, వ్యూహచతురత, శక్తి సామర్థ్యాలను చూసి ప్రపంచం నివ్వెరపోతోంది. "సత్యం.. అగ్ని పరీక్షను తట్టుకుని నిలబడగలదు" అని ఒక సామెత ఉంది. ఫిబ్రవరి 28 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా.. పురోగతి, అభివృద్ధి, విశ్వాసంతో పట్టుదలగా భారత్ ముందుకు సాగుతూనే ఉంది. గడచిన 23 రోజుల్లో బంధాలను బలోపేతం చేసుకోవటంలో, కీలక నిర్ణయాలను తీసుకోవటంలో, సంక్షోభాల నిర్వహణలో భారత్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
మిత్రులారా,
నేడు ప్రపంచం వర్గాలుగా విడిపోతున్న తరుణంలో మునుపెన్నడూ లేని విధంగా, ఊహించని విధంగా భారత్ స్నేహ వారధులను నిర్మిస్తోంది. గల్ఫ్ నుంచి పాశ్చాత్య దేశాల వరకు, గ్లోబల్ సౌత్ నుంచి పొరుగు దేశాల వరకు ప్రతి ఒక్కరికీ విశ్వసనీయమైన భాగస్వామిగా భారత్ నిలిచింది. "మనం ఎవరి పక్షాన ఉన్నాం?" అని కొందరు అడుగుతున్నారు. వారికి నా సమాధానం ఇదే. మేం భారత్ పక్షాన ఉన్నాం. భారత ప్రయోజనాల పక్షాన ఉన్నాం. శాంతి, చర్చల పక్షాన ఉన్నాం.
మిత్రులారా,
ఈ సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో వైవిధ్యం, స్థిరత్వం అనే నూతన నమూనాను భారత్ అనుసరిస్తోంది. ఇంధనం, ఎరువులు, నిత్యావసరాల వంటి వాటి కోసం పౌరులు ఇబ్బందులు పడకుండా చూసేందుకు భారత్ నిరంతరం కృషి చేస్తోంది. ఇవాళ్టికి కూడా ఆ ప్రయత్నాలను కొనసాగిస్తోంది.
మిత్రులారా,
రాజకీయాలకు మూలం.. జాతీయ విధానం అయినప్పుడు దేశ భవిష్యత్తుకు ప్రాధాన్యత ఉంటుంది. రాజకీయాల్లో వ్యక్తిగత ప్రయోజనాలు ఆధిపత్యం చెలాయిస్తే.. ప్రజలు, దేశ భవిష్యత్తు కోసం కాకుండా సొంత ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. 2004 నుంచి 2010 మధ్య కాలంలో ఏం జరిగిందో గుర్తు చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో కాంగ్రెస్ దేశం కోసం కాకుండా, వారి అధికారం గురించి ఆందోళన చెందింది. అప్పుడు వాళ్లు రూ. 1.48 లక్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్లను జారీ చేశారు. భవిష్యత్ తరాలపై అప్పుల భారాన్ని మోపుతున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంగీకరించారు. ఆయిల్ బాండ్ల నిర్ణయం సరైనది కాదని తెలిసినా.. రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వం నడిపిన వారు అధికారాన్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సరైన జవాబుదారీతనం లేదు.. ఆ అప్పుల చెల్లింపు గడువు కూడా 2020 తర్వాతే ఉంది.
మిత్రులారా,
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాన్ని కడిగేసేందుకు మా ప్రభుత్వం 5-6 ఏళ్లు కృషి చేసింది. ఈ ప్రక్షాళనకు భారీగానే ఖర్చు అయింది. ఇలాంటి ప్రక్షాళనను గతంలో ఎప్పుడూ చూసుండరు. రూ. 1.48 కోట్లకు బదులుగా.. వడ్డీతో సహా దేశం రూ.3 లక్షల కోట్లకుపైగా చెల్లించింది. దాదాపు రెట్టింపు మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. ఇటీవల కాంగ్రెస్ నాయకులు ప్రకటనల క్షిపణులను ప్రయోగిస్తున్నారు. ఇవి టీవీ9ని సంతోషపెట్టవచ్చు. కానీ.. విషయంపై చర్చించినప్పుడు, వారు నోరుమెదపటం లేదు.
మిత్రులారా,
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇవాళ లోక్ సభలో నేను ప్రకటన చేశాను. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు జరిగితే, భారతదేశానికి దూరంగా జరగవచ్చు. కానీ, నేటి అనుసంధానత వ్యవస్థ ద్వారా యుద్ధ ప్రభావం అన్ని దేశాలపై ఉంటుంది. ఇప్పటికే చాలా దేశాల్లో పరిస్థితులు ఆందోళకరంగా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లోనూ కొంతమంది వ్యక్తులు, రాజకీయ స్వార్థంతో నడిచే కొన్ని పార్టీలు.. సంక్షోభ సమయంలోనూ రాజకీయ అవకాశాల కోసం వెతుకుతున్నాయి. టీవీ9 వేదిక నుంచి నేను మరోసారి చెబుతున్నాను. సంయమనం పాటించాల్సిన సమయమిది. సున్నితంగా వ్యవహరించాల్సిన సమయమిది. కరోనా సంక్షోభ సమయంలో పౌరులంతా కలిసికట్టుగా సవాలును ఎదుర్కొన్నప్పుడు, సానుకూల ఫలితాలను మనం చూశాం. అదే స్ఫూర్తితో.. ఇప్పుడు యుద్ధం వల్ల తలెత్తిన పరిస్థితులను కూడా మనం ఎదుర్కోవాలి.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా కల్లోల పరిస్థితుల నేపథ్యంలో అభివృద్ధి వేగాన్ని భారత్ కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గత 23 రోజులుగా గమనిస్తే.. దేశవ్యాప్తంగా తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ మెట్రో రైలు కీలక కారిడార్ల ప్రారంభోత్సవం, సిల్చార్ హై-స్పీడ్ కారిడార్ శంకుస్థాపన, కోటాలో నూతన విమానాశ్రయానికి శంకుస్థాపన, మధురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించటం వంటి పనులు ఈ 23 రోజుల్లో జరిగాయి. కేవలం గత నెలలోనే పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు భారీ పథకాన్ని ఆమోదించాం. దీనిద్వారా దేశవ్యాప్తంగా వినియోగానికి సిద్ధంగా ఉండే 100 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నారు. రాబోయే ఏళ్లలో అదనంగా 1,500 మెగావాట్ల జలవిద్యుత్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో స్మాల్ హైడ్రో పవర్ డెవలప్‌మెంట్ పథకాన్ని ప్రారంభించాం. జల్ జీవన్ మిషన్ గడువును 2028 వరకు పొడిగించాం. వీటితో పాటు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మరెన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. గత నెలలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ.18 వేల కోట్లకు పైగా నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశాం. మన ఎంఎస్ఎంఈలు, ఎగుమతిదారులకు సహాయం చేసేందుకు రూ.500 కోట్ల ప్యాకేజీని ప్రకటించాం. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనకు దేశం వేగంగా ముందుకు వెళ్తుందని చెప్పేందుకు ఇవి నిదర్శనం.
మిత్రులారా,
మేనేజ్మెంట్ రంగంలో ఒక సూత్రం ఉంది: "దేనినైతే కొలవగలమో.. దాన్ని నిర్వహించగలం”. కానీ దీనికి నేను మరో అంశాన్ని జోడించాలనుకుంటున్నా: "దేనినైతే కొలవగలమో.. అది మెరుగుపడుతుంది. రూపాంతరం చెందుతుంది”. ఎందుకంటే అంచనా వేయటం ద్వారా అవగాహన, జవాబుదారీతనం పెరుగుతాయి. ముఖ్యంగా.. అంచనా వేయటం నూతన అవకాశాలకు దారితీస్తుంది.
మిత్రులారా,
2014కు ముందు 10-11 ఏళ్లను, 2014 తర్వాత 10-11 సంవత్సరాలను మీరు గమనిస్తే.. భారత్ ఈ సూత్రాన్ని అనుసరిస్తూ ప్రతి రంగంలో మార్పులు తీసుకువచ్చిన విధానం అర్థమవుతుంది. గతంలో రోజుకు సుమారు 11-12 కిలోమీటర్ల మేర మాత్రమే జాతీయ రహదారుల నిర్మాణం జరిగేది. కానీ నేడు రోజుకు దాదాపు 30 కిలోమీటర్ల వరకు రహదారులను నిర్మించగలుగుతున్నాం. గతంలో ఓడరేవుల వద్ద సరుకు దింపి, ఓడలు వెనుదిరిగేందుకు 5-6 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు అదే పని రెండు రోజుల్లోపే జరుగుతోంది. అంకుర సంస్థల సంస్కృతిపై గతంలో అసలు చర్చలే జరిగేవి కాదు. 2014కు ముందు భారత్ లో కేవలం 400-500 అంకుర సంస్థలు ఉండేవి. ఇవాళ భారత్‌లో 2,00,000లకు పైగా అంకుర సంస్థలు ఉన్నాయి. గతంలో వైద్య విద్య కోసం పరిమితంగా దాదాపు 50-55 వేల ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి.. ఇప్పుడు ఈ సంఖ్య 1,25,000లకు పైగా ఉంది. గతంలో మిలియన్ల కొద్ది ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉండేవారు. దేశవ్యాప్తంగా 250 మిలియన్ బ్యాంకు ఖాతాలు మాత్రమే ఉండేవి. జన్‌ధన్ యోజన ద్వారా 550 మిలియన్ బ్యాంకు ఖాతాలు తెరుచుకున్నాయి. గతంలో దేశంలో 70 కన్నా తక్కువ విమానాశ్రయాలుండేవి. ప్రస్తుతం 160కి పైగా విమాశ్రయాలున్నాయి.
మిత్రులారా,
గతంలోనూ ప్రణాళికలు రూపొందించారు. కానీ, నేడు ఫలితాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. అప్పట్లో అభివృద్ధి వేగం నత్తనడకన సాగేది.. నేడు శరవేగంగా దూసుకెళ్తోంది. ఒకప్పుడు అవకాశాలు మరుగున పడిపోగా.. నేడు ప్రతి సంకల్పం విజయంగా మారుతోంది. అందువల్ల ఇది నవ భారతం అనే సందేశం ప్రపంచానికి చేరుతోంది. ఈ నవ భారతం అభివృద్ధి కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదలటం లేదు.
మిత్రులారా,
గతంలో జరిగిన అసమాన అభివృద్ధిని అవకాశాలుగా మార్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఉదాహరణకు తూర్పు భారతాన్ని చూసుకుంటే.. తూర్పు భారతదేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ దశాబ్దాల పాటు పాలకులు ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల అభివృద్ధి కుంటుపడింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఒకప్పుడు తుపాకుల మోత వినిపించిన అస్సాంలో ప్రస్తుతం సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటవుతోంది. ఒడిశాలో సెమీ కండక్టర్ల నుంచి పెట్రో కెమికల్స్ వరకు నూతన రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. 6-7 దశాబ్దాల కాలంలో బీహార్ లో గంగానదిపై కేవలం ఒక ప్రధాన వంతెన మాత్రమే నిర్మించగా.. గత పదేళ్లలో అయిదుకుపైగా వంతెనలను నిర్మించాం. ఒకప్పుడు నాటు తుపాకుల కథలకు పేరుగాంచిన ఉత్తరప్రదేశ్.. నేడు మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచస్థాయికి చేరింది.
మిత్రులారా,
తూర్పు భారతదేశంలోని మరో కీలకమైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. భారతదేశ సంస్కృతి, విద్య, పరిశ్రమలు, వాణిజ్యానికి ఒకప్పుడు పశ్చిమబెంగాల్ ప్రధాన కేంద్రంగా ఉండేది. గత 11 ఏళ్లలో పశ్చిమబెంగాల్ అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు వెచ్చించింది. కానీ అక్కడ అభివృద్ధికి అడ్డుకట్ట వేసే నిరంకుశ ప్రభుత్వం ఉంది. బెంగాల్ లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఈ నిరంకుశ ప్రభుత్వం నిలిపివేసిందనే విషయం టీవీ9 బంగ్లా వీక్షకులకు తెలుసు. ఉచిత విద్యుత్ పథకమైన పీఎం సూర్యఘర్ ను నిలిపివేశారు. పీఎం ఆవాస్ యోజనను నిలిపివేశారు. టీ తోటల కార్మికుల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని కూడా అడ్డుకున్నారు. ఈ నిరంకుశ ప్రభుత్వం.. అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చేందుకు బదులుగా రాజకీయ స్వార్థానికే ప్రాధాన్యతనిస్తుంది.
మిత్రులారా,
దేశంలో ఈ తరహా రాజకీయాలకు ఊపిరిపోసిన పార్టీ... కాంగ్రెస్. పాపాల నుంచి తప్పించుకోలేదు. అభివృద్ధిని అడ్డుకోవటమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యంగా మారింది. నేను గుజరాత్ లో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ ఇలానే వ్యవహరిస్తోంది. గుజరాత్ ప్రజలు ఏళ్ల తరబడి మమ్మల్ని ఆదరించినప్పుడు.. ప్రజా తీర్పుని కాంగ్రెస్ అంగీకరించలేదు. గుజరాత్ ప్రతిష్ఠను వారు ప్రశ్నించారు. దాని అభివృద్ధిని బోనులో నిలబెట్టారు. ఈ నమ్మకమే దేశవ్యాప్తంగా కనిపించినప్పుడు ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయికి కాంగ్రెస్ వ్యతిరేకత పెరిగింది.
మిత్రులారా,
రాజకీయ ప్రతిపక్షం దేశాభివృద్ధికి వ్యతిరేకంగా మారితే, విమర్శలు.. దేశ విజయాలను ప్రశ్నిస్తే, అది ప్రభుత్వంపై వ్యతిరేకత కాదు.. దేశ పురోగతిని సహించలేని మనస్తత్వం. నేడు కాంగ్రెస్ ఇలాంటి మనస్తత్వానికే బందీ అయింది. దేశ విజయాన్ని ప్రశ్నించటం, ప్రతి ఘనతలోనూ లోపాలు వెతకటం, ప్రతి ప్రయత్నం విఫలం కావాలని కోరుకునే స్థాయికి కాంగ్రెస్ చేరుకుంది. కరోనా సమయంలో స్వదేశీ టీకాపై కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసింది. మేక్ ఇన్ ఇండియా విజయవంతం కాదని.. అదొక కాగితపు పులి అని ఎద్దేవా చేసింది. డిజిటల్ ఇండియా ప్రారంభాన్ని హేళన చేసింది. కాంగ్రెస్ దురదృష్టమో, భారత్ అదృష్టమో.. ప్రతి సవాలును దేశం విజయంగా మార్చుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ కు భారత్ ఉదాహరణగా నిలిచింది. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహిస్తోంది. తయారీ రంగం, అంకుర సంస్థల ఏర్పాటులో భారత్ ఉన్నత స్థాయికి చేరుకుంటోంది.
మిత్రులారా,
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండటం అవసరం. కానీ వ్యతిరేకతకు, ద్వేషానికి మధ్య స్వల్ప తేడా ఉంటుంది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించటం ప్రజాస్వామ్య హక్కు. కానీ, దేశ ప్రతిష్ఠను దిగజార్చటం కాంగ్రెస్ ఉద్దేశాన్ని ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షాల విమర్శలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. దేశ విజయాలను వారు సహించలేకపోతున్నారు. ఇది రాజకీయం కాదు.. వారి ఆలోచనా విధానంలో ఉన్న లోపం. ఇటీవల జరిగిన గ్లోబల్ ఏఐ సమ్మిట్ లో మనం చూశాం. ప్రపంచదేశాలు భారత్‌లో సమావేశమైన సమయంలో.. కాంగ్రెస్ నేతలు అక్కడకు వెళ్లి నిరసనల పేరుతో అగౌరవంగా వ్యవహరించారు. దేశ గౌరవం పట్ల వారికి ఏ మాత్రం పట్టింపు లేదని ఇది నిరూపిస్తుంది. పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముంది. అంతిమంగా.. రాజకీయాల కంటే దేశం, దేశాభివృద్ధే ముఖ్యం.
మిత్రులారా,
ఇవాళ్టి రోజు మనకు ఈ దిశగా స్ఫూర్తినిస్తుంది. సరిగ్గా ఇదే రోజున షహీద్ భగత్ సింగ్, షహీద్ రాజ్‌గురు, షహీద్
సుఖ్‌దేవ్ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. సోషలిస్టు ఉద్యమ అగ్రనేత డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి కూడా ఇవాళే. వీరంతా స్వప్రయోజనాల కంటే దేశాన్ని మిన్నగా భావించిన స్ఫూర్తిమంతులు. జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే ఈ స్ఫూర్తే దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా మారుస్తుంది. ఈ స్ఫూర్తే భారత్ స్వావలంబన సాధించేలా చేస్తుంది. భారతదేశ ఆత్మవిశ్వాసాన్ని, భారత పౌరుల పట్ల ప్రపంచానికున్న నమ్మకాన్ని ఈ టీవీ9 సదస్సు మరింత బలోపేతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ మధ్యకు వచ్చి, మీ అందరినీ కలిసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
నమస్కారం!
***
(రిలీజ్ ఐడి: 2244424)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12