సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మూడు కొత్త కార్యక్రమాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్.. అందుబాటులో సాంకేతికత, బలమైన డిజిటల్ కంటెంట్ వ్యవస్థ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి
· యూట్యూబ్ భాగస్వామ్యంతో జాతీయ ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం.. 15,000 మంది క్రియేటర్లు, మీడియా నిపుణులకు ఉచిత శిక్షణ
· మైవేవ్స్ వేదికను ప్రారంభించిన కేంద్రం.. కంటెంటును సృజించి, వేవ్స్ ఓటీటీలో షేర్ చేసేలా పౌరులకు అవకాశం
· డీడీ ఉచిత డిష్ చానెళ్లను మరింత సులభంగా అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం.. ఇన్ బిల్ట్ సదుపాయాలు, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ గైడ్ ద్వారా సెట్ టాప్ బాక్సులు లేకున్నా వీక్షించే అవకాశం
నాడు పోస్టు చేయడమైనది:
23 MAR 2026 4:08PM by PIB Hyderabad
భారత మీడియా, ప్రసార, డిజిటల్ రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు సృజనాధార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం లక్ష్యంగా మూడు ప్రధాన కార్యక్రమాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు ప్రారంభించారు. ఆ మూడు కార్యక్రమాలు:- భారత సృజనాత్మక సాంకేతికతల సంస్థ (ఐఐసీటీ) ద్వారా గూగుల్, యూట్యూబ్ భాగస్వామ్యంతో జాతీయ ఏఐ నైపుణ్యాభివృద్ధి, వేవ్స్ ఓటీటీలో పౌర సృజనకారుల వేదికగా మైవేవ్స్, అలాగే డీడీ ఉచిత డిష్ సేవలను మరింత మెరుగ్గా అందుబాటులోకి తెచ్చేందుకు టీవీ సెట్లలో అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్ (ఈపీజీ) - ఇన్‌బిల్ట్ శాటిలైట్ ట్యూనర్లను అమర్చడం. ‘సృజనాధార ఆర్థిక వ్యవస్థ’ను ప్రోత్సహించడం, ప్రభుత్వ ప్రసార వ్యవస్థను బలోపేతం చేయడం, మీడియా - వినోద రంగంలో ఏఐ నిపుణుల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం. మీడియా - వినోద రంగం నుంచి ముఖ్య ప్రతినిధులు, యూట్యూబ్ ఇండియా అధినేత, మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అందరికీ అందుబాటులో సాంకేతికత:
సాంకేతికతను అందరికీ సమానంగా అందుబాటులోకి తేవాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షను ప్రస్తావిస్తూ.. ఈ కొత్త కార్యక్రమాలు సాంకేతికతను మరింత అందుబాటు ధరల్లో, సులభంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తాయని శ్రీ అశ్విని వైష్ణవ్ అన్నారు. టీవీల్లోనే శాటిలైట్ ట్యూనర్లను అమర్చడం, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ గైడ్ ద్వారా.. అదనపు పరికరాలేవీ లేకుండానే ప్రజలకు సులభంగా కంటెంటు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.
రెండో కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. కంటెంట్ సృజనకారులకు ‘మైవేవ్స్’ ఒక శక్తిమంతమైన వేదిక అని, వారు కంటెంటు సృజించి అప్‌లోడ్ చేయడానికీ, షేర్ చేయడానికీ వీలు కల్పిస్తూ.. దేశ డిజిటల్ వ్యవస్థను ఇది బలోపేతం చేస్తుందనీ ఆయన వివరించారు. కేంద్ర బడ్జెట్ ప్రకటనలను ప్రస్తావిస్తూ, సృజనాధార ఆర్థిక వ్యవస్థ (ఆరెంజ్ ఎకానమీ)ను ముందుకు తీసుకెళ్లేందుకు, సృజన రంగానికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
యూట్యూబ్ సహకారంతో అమలు చేస్తున్న జాతీయ ఏఐ నైపుణ్య శిక్షణ కార్యక్రమం కింద, దాదాపు 15,000 మంది యువతకు ఎలాంటి రుసుమూ లేకుండా శిక్షణ ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు.
క్రియేటర్స్ కార్నర్ కార్యక్రమం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇది బాగా ప్రాచుర్యం పొందుతోందని, కొన్ని కంటెంట్లకు ఇప్పటికే 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని పేర్కొన్నారు. మన దేశ సుసంపన్నమైన సంస్కృతీ సంప్రదాయాలనూ, ప్రాంతీయ వైవిధ్యాన్నీ ప్రపంచానికి చాటేలా దూరదర్శన్, మైవేవ్స్ వంటి వేదికలను విరివిగా ఉపయోగించుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న సృజనకారులను ఆయన కోరారు.
ఈ వేదికలను సద్వినియోగం చేసుకోవాలని సృజనకారులకు పిలుపునిస్తూ.. తమతమ ప్రాంతాల కథలను ప్రదర్శించి, మీడియా రంగాన్ని ప్రభావవంతంగా, సమ్మిళితంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు.
సృజనకారుల సాధికారత, విస్తృతంగా ప్రజల్లోకి...
ఈ రోజు ప్రారంభించిన మూడు కార్యక్రమాల గురించి మాట్లాడుతూ.. ఇవన్నీ ఒకే రకమైన విధానపరమైన దిశను ప్రతిబింబిస్తాయని శ్రీ సంజయ్ జాజు స్పష్టం చేశారు. నాణ్యమైన ప్రసారాలను అందరికీ విస్తృతంగా అందుబాటులో తెస్తూ, సృజనకారుల కోసం ఒక బలమైన వ్యవస్థను నిర్మించడం ఈ కార్యక్రమాల ముఖ్య లక్ష్యమన్నారు.
సృజనకారులు తమ సామర్థ్యాలను పెంచుకోవడానికి, మారుతున్న డిజిటల్ ప్రపంచంలో తమ లక్ష్యాలను చేరుకోవడానికి జాతీయ ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం సహాయపడుతుందన్నారు. ఒక శక్తిమంతమైన డిజిటల్ వ్యవస్థను నిర్మిస్తూ, పౌరులు కంటెంటును సృజించడానికి, అప్‌లోడ్ చేయడానికి, షేర్ చేయడానికి ‘మైవేవ్స్’ తోడ్పడుతుందని చెప్పారు. ఇక డీడీ ఉచిత డిష్ ప్రసారాలకు సంబంధించిన మూడో కార్యక్రమం.. సెట్‌టాప్ బాక్స్ అవసరం లేకుండానే ప్రజలు ప్రసారాలను వీక్షించే అవకాశాన్నిస్తూ, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో సమాచార వ్యాప్తిని మెరుగుపరుస్తుందని ఆయన తెలిపారు.
మొత్తంగా, మొదటి కార్యక్రమం ప్రజలను సమర్థులను చేస్తుంది. రెండో కార్యక్రమం అవకాశాల విస్తరణకు దోహదపడుతుంది. మూడో కార్యక్రమం కంటెంటును అందరికీ అందుబాటులోకి తెస్తుంది.
ఏఐ ద్వారా సృజనకారుల సాధికారత
సృజనకారులపై ఈ భాగస్వామ్యం చూపే ప్రభావంపై యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గుంజన్ సోనీ మాట్లాడుతూ.. ‘‘ఉత్తేజభరితమైన భారత సృజనాధార ఆర్థిక వ్యవస్థలో కృత్రిమ మేధ ద్వారా అసాధారణమైన అవకాశాలను సృష్టించవచ్చని మేం నమ్ముతున్నాం. సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ, ఐఐసీటీతో సహకారం ద్వారా.. భవిష్యత్తులో కీలకం కాబోతున్న సాంకేతిక సాధనాలపై పట్టు సాధించేలా, ఏఐని వినియోగించి మరింత ఆసక్తికరమైన కథనాలను ఆవిష్కరించేలా, కొత్త ప్రేక్షకులకు వారు చేరువయ్యేలా, మీడియా భవితను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించేలా సృజనకారులనూ, నిపుణులనూ సన్నద్ధులను చేయడం మా ముఖ్య లక్ష్యం. సాంకేతికత అందరికీ ఒక సాధనంగా ఉపయోగపడే ‘డిజిటల్ ఇండియా’పట్ల మాకున్న ఎనలేని నిబద్ధతకు ఈ కార్యక్రమం నిదర్శనం’’ అన్నారు.
జాతీయ ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం
గూగుల్, యూట్యూబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని.. సృజన, మీడియా రంగాలకు చెందిన 15,000 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం కోసం ‘జాతీయ ఏఐ నైపుణ్యాభివృద్ధి’ కార్యక్రమాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారత సృజనాత్మక సాంకేతికతల సంస్థ (ఐఐసీటీ) ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీసీజీ), మీడియా టెక్నాలజీ వంటి రంగాల్లో ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేయడం దీని ముఖ్య లక్ష్యం.
ఈ ఏఐ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహిస్తారు. 2026 మార్చి 23 నుంచి జూన్ 30 వరకు మొదటి దశ కొనసాగుతుంది. ఇందులో గూగుల్ కెరీర్ సర్టిఫికేట్లు, గూగుల్ క్లౌడ్ జనరేటివ్ ఏఐ లెర్నింగ్ విధానాల ద్వారా.. ఏఐలో పునాది నైపుణ్యాలను నేర్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. అభ్యర్థులు ఏఐ ఎసెన్షియల్స్, ప్రాంప్టింగ్ ఎసెన్షియల్స్, జనరేటివ్ ఏఐ పరిచయం, జనరేటివ్ ఏఐ లీడర్ పాత్ వంటి కోర్సులను అభ్యసిస్తారు. తర్వాతి దశకు వెళ్లాలంటే ఈ మొదటి దశను విజయవంతంగా పూర్తి చేయడం తప్పనిసరి.
2026 జూలై నుంచి డిసెంబరు వరకు రెండవ దశ ఉంటుంది. సృజనాత్మక రంగంలో అత్యాధునిక, ప్రత్యక్ష శిక్షణతోపాటు ప్రత్యేకంగా ప్రాజెక్టు ఆధారిత శిక్షణపైనా ఇందులో దృష్టి సారిస్తారు. కథన కళ, యూట్యూబ్ సంబంధిత ఉత్తమ విధానాలు, జెమినీ 3, నానో బనానా, వియో, వెర్టెక్స్ ఏఐ వంటి ఏఐ టూల్స్‌ను ఉపయోగించి ఇచ్చే అధునాతన శిక్షణ అంశాలు ఈ పాఠ్యప్రణాళికలో ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ఈ శిక్షణ ఉంటుంది.
భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో సృజనకారులు, మీడియా నిపుణులు, విద్యార్థులు, డెవలపర్లకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. అలాగే డిజిటల్ కంటెంట్, ఆవిష్కరణల్లో అంతర్జాతీయ కేంద్రంగా భారత్ ఎదిగేందుకు కూడా ఇది దోహదపడుతుంది.
మైవేవ్స్– వేవ్స్ ఓటీటీ పరిధిలోని పౌర సృజన వేదిక
మైవేవ్స్ వేదికను కూడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వేవ్స్ ఓటీటీలో ఇదొక కొత్త ఫీచర్. ప్రజలు కంటెంటును సృష్టించి ఇందులో అప్‌లోడ్ చేయొచ్చు. షేర్ కూడా చేసుకోవచ్చు. వినియోగదారులు రూపొందించే కంటెంట్ కోసం ఒక క్రమబద్ధమైన వేదికగా మైవేవ్స్‌ను రూపొందించారు. క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ వంటి జాతీయ స్థాయి కార్యక్రమాల్లోనూ పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది.
కంటెంటును వీక్షించడం మాత్రమే కాకుండా క్రియాశీలంగా అందులో భాగస్వాములయ్యే దిశగా మార్పును ఈ వేదిక సూచిస్తుంది. తద్వారా వేవ్స్ ఓటీటీ కేవలం వీక్షణకే కాకుండా, కంటెంట్ సృజనకు కూడా వేదికవుతుంది. లఘు చిత్రాలు, వర్టికల్ వీడియోలు, ఎపిసోడ్లుగా ఉన్న కంటెంట్ వంటి వివిధ రూపాల్లో మైవేవ్స్‌లో కంటెంటు ఉంటుంది. అంతేకాకుండా భారతీయ భాషల్లో బహుభాషా వినిమయ వేదిక కూడా (ఇంటర్‌ఫేస్) ఇందులో ఉంటుంది. దేశవ్యాప్తంగా వర్ధమాన సృజనకారులకూ, కథకులకూ ఒక ముఖ్య వేదికగా మైవేవ్స్ నిలుస్తుందని భావిస్తున్నారు.
అడ్వాన్స్డ్ ఈపీజీ, టెలివిజన్ సెట్లలో ఇన్‌బిల్ట్ శాటిలైట్ ట్యూనర్
టీవీ వీక్షణను మరింత సులభతరం చేయడంతోపాటు అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా.. టీవీల్లోనే అమర్చిన శాటిలైట్ ట్యూనర్లనూ, వినియోగదారులకు సులభంగా అర్థమయ్యే కొత్త ప్రోగ్రామ్ గైడ్‌ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. దీంతో ప్రేక్షకులు ఇకపై విడిగా సెట్‌టాప్ బాక్స్ అవసరం లేకుండానే నేరుగా తమ టీవీల్లో డీడీ ఉచిత డిష్ ఛానెళ్లను నేరుగా చూడొచ్చు. దీనివల్ల అదనపు ఖర్చులు, వైరింగ్, ఎక్కువ సంఖ్యలో రిమోట్లు వాడాల్సిన అవసరం తప్పుతాయి. అలాగే కొత్త అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ గైడ్ ద్వారా వినియోగదారులు ఒకే చోట ఛానెళ్లను, కార్యక్రమ షెడ్యూళ్లను సులభంగా చూసుకోవచ్చు. సరళంగా, అర్థమయ్యేలా ఈ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబాలకు టీవీ వీక్షణ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది.
సృజనాధార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం, ప్రజలకు మరింత సులభంగా అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ప్రసార వ్యవస్థను బలోపేతం చేయడం, మీడియా - వినోద రంగం కోసం భవిష్యత్ సన్నద్ధంగా ఏఐ నైపుణ్యం కలిగిన సిబ్బందిని తీర్చిదిద్దడం వంటి లక్ష్యాలతో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చర్యలను ముందుకు తీసుకెళ్తోంది. ప్రభుత్వ ప్రసార వ్యవస్థను మెరుగుపరచడంలో ప్రసార భారతి కీలక పాత్ర పోషిస్తుండగా.. సృజన రంగంలో ఏఐ శిక్షణా కార్యక్రమాన్ని ఐఐసీటీ నిర్వహిస్తుంది. అలాగే, పౌరులు భాగస్వాములై కంటెంటును సృష్టించేలా ప్రోత్సహించడంతోపాటు.. క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ వంటి కార్యక్రమాలతో వారిని అనుసంధానించేలా వేవ్స్ ఓటీటీ ఓ వేదికను అందిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2244260)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Kannada
,
Malayalam