పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమ ఆసియా పరిణామాల నేపథ్యంలో కీలక రంగాల తాజా సమాచారం
సాధారణంగా కొనసాగుతున్న గృహ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా.. తగ్గుతున్న ముందస్తు బుకింగ్స్
రాష్ట్రాలకు వాణిజ్య ఎల్‌పీజీ కోటాను పెంచిన ప్రభుత్వం
కీలక రంగాలకు ప్రాధాన్యత.. పీఎన్‌జీ వాడుకను పెంచేందుకు ప్రోత్సాహం
వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపుల్లో విద్యా సంస్థలు, ఆసుపత్రులకు ప్రాధాన్యత
గృహావసర, వాణిజ్య వినియోగదారుల కోసం కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచన
ఎల్‌పీజీ అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న దాడులు
రద్దీ లేకుండా దేశవ్యాప్తంగా సాధారణంగా కొనసాగుతున్న ఒడరేవుల కార్యకలాపాలు
గల్ఫ్, పశ్చిమాసియాలోని పరిణామాలను నిరంతరం నిశితంగా గమనిస్తోన్న ప్రభుత్వం
భారతీయుల భద్రతకే తొలి ప్రాధాన్యతనిస్తోన్న ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
22 MAR 2026 4:12PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కీలక రంగాల్లో సంసిద్ధత, తక్షణ స్పందనను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం క్రియాశీలక చర్యలు చేపడుతోంది. ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందిస్తున్న సహాయక చర్యలకు సంబంధించిన తాజా సమాచారం ఇక్కడ ఉంది.
ఇంధన సరఫరా, లభ్యత
హోర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ నిరంతరం అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉంది:
ముడి చమురు, చమురు శుద్ధి కేంద్రాలు
అన్ని చమురు శుద్ధి కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా సమృద్ధిగా ఉన్నాయి.
చమురు శుద్ధి కేంద్రాల నుంచి దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి గరిష్ఠ స్థాయికి పెరిగింది.
రిటైల్ విక్రయకేంద్రాలు
చమురు మార్కెటింగ్ కంపెనీల ద్వారా అందిన సమాచారం ప్రకారం ఏ రిటైల్ విక్రయకేంద్రంలోనూ ఇంధన కొరత ఉందన్న నివేదక నమోదు కాలేదు. పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని.. సరఫరా క్రమబద్ధంగా కొనసాగుతోందని ప్రభుత్వం పునరుద్ఘాటిస్తోంది. కాబట్టి ప్రజలు భయాందోళనతో ముందస్తు కొనుగోళ్లు చేయొద్దని విజ్ఞప్తి చేస్తోంది.
సహజ వాయువు
గృహావసరాల ఎల్‌పీజీతో పాటు రవాణా రంగ సీఎన్‌జీ విషయంలో సరఫరా 100 శాతం కొనసాగుతోంది. ప్రాధాన్యత కలిగిన రంగాలకు ఈ విషయంలో రక్షణ కల్పించారు. గ్రిడ్ ఆధారిత పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు వారి సగటు వినియోగంలో 80 శాతం మేర సరఫరా అందుతోంది.
వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతపై ఉన్న ఆందోళనలను దూరం చేసేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లు వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్లను ప్రాధాన్యత క్రమంలో అందించాలని కేంద్ర ప్రభుత్వం సీజీడీ సంస్థలను ఆదేశించింది.
ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ సంస్థలు గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్ల కోసం ప్రత్యేక రాయితీలను ప్రకటించాయి.
దరఖాస్తు చేసుకున్న సమయం నుంచి గ్యాస్ సరఫరా ప్రారంభమయ్యే వరకు పట్టే వ్యవధిని తగ్గించాలని పీఎన్‌జీఆర్‌బీ అన్ని సీజీడీ సంస్థలను ఆదేశించింది.
సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన అనుమతులను వేగవంతం చేయాలని కోరుతూ 16.03.2026 తేదీన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.
ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలికంగా మారేందుకు సహకరించే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులను చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం 18.03.2026 నాటి లేఖ ద్వారా ప్రతిపాదించింది.
19.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం అన్ని సంబంధిత కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలను ఈ విధంగా కోరింది:
సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న వాటితో పాటు కొత్త అనుమతులను తక్షణమే వేగవంతం చేసి ఆయా ప్రక్రియలను పూర్తి చేయాలని సంబంధిత శాఖలు, సంస్థలను ఆదేశించింది.
అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కాలనీలు, కార్యాలయాలు, క్యాంటీన్లలో పీఎన్‌జీ సౌకర్యం అందుబాటులో ఉన్న చోట దానికి మారాలని సూచించింది.
వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, శాఖల పరిధిలోని సంస్థల్లో పీఎన్‌జీ కనెక్షన్ల సంభావ్య డిమాండ్‌పై సమగ్రమైన అంచనాలను దయారు చేయాలని.. ఈ ప్రక్రియను సమన్వయం చేయడానికి ప్రతి మంత్రిత్వ శాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమించాలని 20.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం కోరింది.
ప్రభుత్వ ఆదేశాలకు స్పందించిన పీఈఎస్ఓ (పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజీవ్ సేఫ్టీ ఆర్గనైజేషన్).. సీజీడీ దరఖాస్తుల ప్రక్రియను ప్రాధాన్యత క్రమంలో అంటే అందిన 10 రోజులలోపు పూర్తి చేయాలని తన పరిధిలోని అన్ని కార్యాలయాలకు సూచించింది.
ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులు పీఎన్‌జీకి మారాలని విజ్ఞప్తి చేశారు.
ఎల్‌పీజీ
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎల్‌పీజీ సరఫరా ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది.
గృహావసరాల ఎల్‌పీజీ సరఫరా:
-
ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎక్కడా నిల్వలు అయిపోయినట్లు నివేదికలు అందలేదు.
-
మెజారిటీ సిలిండర్ల పంపిణీ 'డెలివరీ అథెంటికేషన్ కోడ్' (డీఏసీ) ద్వారానే జరుగుతోంది.
-
ఆందోళనతో ముందస్తుగా చేసుకునే బుకింగ్‌లు గణనీయంగా తగ్గాయి.
-
గృహావసరాల కోసం ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ సాధారణంగా కొనసాగుతోంది.
వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా
ప్రభుత్వం ఇప్పటికే వినియోగదారులకు పాక్షికంగా (20 శాతం) వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాను పునరుద్ధరించింది. దీనికి అదనంగా పీఎన్‌జీ వినియోగాన్ని పెంచేందుకు సులభతర వాణిజ్య సంస్కరణలు చేపట్టిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరో 10 శాతం వాణిజ్య ఎల్‌పీజీని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం 18.03.2026 నాటి లేఖ ద్వారా ప్రతిపాదించింది.
కేంద్ర ప్రభుత్వం 21.03.2026 నాటి లేఖ ద్వారా రాష్ట్రాలకు మరో 20 శాతం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపునకు అనుమతి ఇచ్చింది. దీనితో మొత్తం కేటాయింపు 50 శాతానికి (పీఎన్‌జీ వినియోగాన్ని పెంచే సంస్కరణల ఆధారంగా ఇచ్చే 10 శాతంతో కలిపి) చేరుకుంటుంది. ఈ అదనపు 20 శాతం కేటాయింపును ప్రాధాన్య రంగాలైన రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ లేదా డైరీ పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల ద్వారా నడిచే సబ్సిడీ క్యాంటీన్లు లేదా అవుట్లెట్లు, సామాజిక వంటశాలలు, వలస కార్మికుల కోసం 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు వంటి వాటికి ప్రాధాన్యత క్రమంలో అందిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గృహేతర ఎల్‌పీజీని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్లను విడుదల చేస్తున్నాయి. గత 8 రోజులలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని వాణిజ్య సంస్థలు మొత్తం సుమారు 15,440 ఎంటీల గ్యాస్‌ను సేకరించాయి.
విద్యా సంస్థలు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులలో సుమారు 50 శాతం ఈ రంగాలకే అందుతోంది.
కిరోసిన్
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపులకు అదనంగా 48,000 కిలో లీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.
జిల్లాల్లో కిరోసిన్ పంపిణీకి తగిన ప్రాంతాలను గుర్తించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు.
ఇప్పటివరకు 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ (ఎస్కేఓ) కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. హిమాచల్ ప్రదేశ్, లడఖ్ తమకు ఎటువంటి కిరోసిన్ అవసరం లేదని తెలియజేశాయి. నేటి వరకు ఇంకా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంది.
రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల పాత్ర
నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వులు-2000 ప్రకారం అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ సహా నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాలి.
భారత ప్రభుత్వం 13.03.2026, 18.03.2026 తేదీల నాటి లేఖల ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కింది విషయాలు అభ్యర్థించింది.
అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, గృహ వినియోగ ఎల్‌పీజీ దుర్వినియోగం, ఇతర అక్రమాలను అరికట్టడానికి కట్టుదిట్టమైన నిఘా ఉంచడం.
నిత్యావసర వస్తువుల చట్టం-1955, పెట్రోలియం చట్టం-1934, పెట్రోలియం నియమావళి-2002, మోటార్ స్పిరిట్, హెచ్ఎస్డి ఆర్డర్-2005, ఇతర వర్తించే చట్టాల ఉల్లంఘనదారులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం.
స్థానిక ప్రాధాన్యాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాణిజ్య ఎల్‌పీజీ కోసం తగిన పంపిణీ విధానాలను రూపొందించడం.
భయాందోళనలతో కొనుగోళ్లు చేయడాన్ని నివారించడానికి ప్రజలకు సూచనలు జారీ చేయడం, ఎల్‌పీజీని వివేకవంతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం, కచ్చితమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడం.
32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశాయి. అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతిరోజూ పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశాయి.
ఇప్పటివరకు సమాచార కేంద్రాలు, జిల్లా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ అత్యవసర ప్రాతిపదికన వాటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరుతున్నది.
అమలవుతున్న చర్యలు
ఎల్‌పీజీ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. నిన్న బీహార్, హర్యానా, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సుమారు 3,500 దాడులు నిర్వహించి, 1200కు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
బ్లాక్ మార్కెటింగ్, అక్రమంగా నిల్వ చేసే వ్యాపారులను అరెస్టు చేసేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నాం.
సరఫరా సజావుగా జరిగేలా నిర్ధారించడం కోసం ఏవైనా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ కేసులు ఉన్నాయా తనిఖీ చేయడానికి, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల అధికారులు దేశవ్యాప్తంగా 1,800కు పైగా ఆర్ఓ, ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ప్రభుత్వం చేపడుతున్న ఇతర చర్యలు
ఈ సంక్షోభ పరిస్థితిలోనూ ప్రభుత్వం... ఆసుపత్రులు, విద్యా సంస్థలకు అధిక ప్రాధాన్యమివ్వడంతో పాటుగా దేశీయ ఎల్‌పీజీ, పీఎన్‌జీలకు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది.
రిఫైనరీ ఉత్పత్తిని పెంచడం, పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచడం, సరఫరా కోసం కీలక రంగాలకు ప్రాధాన్యమివ్వడం వంటి అనేక హేతుబద్ధీకరణ చర్యలను ఇప్పటికే సరఫరా, డిమాండు- రెండు వైపులా ప్రభుత్వం అమలు చేసింది.
ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రతిపాదించారు. కిరోసిన్, బొగ్గును ప్రత్యామ్నాయ ఇంధనంగా వాడటానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఇప్పటికే ఎమ్ఓఈఎఫ్‌సీసీ సూచించింది.
చిన్న, మధ్య తరహా, ఇతర వినియోగదారులకు బొగ్గును పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు అధిక పరిమాణంలో బొగ్గును కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటికే కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు గనులకు ఆదేశాలు జారీ చేసింది.
గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
ప్రజలకు సూచనలు
అన్ని గృహాలకు ఎల్‌పీజీ సిలిండర్లను సరిపడా అందుబాటులో ఉంచడం, సకాలంలో పంపిణీని నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సమాచారం కోసం పౌరులు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, వదంతులను నివారించాలని సూచించడమైనది.
అక్కడక్కడా క్యూలు కనిపిస్తున్నప్పటికీ... హోమ్ డెలివరీ సజావుగానే కొనసాగుతున్నందున వినియోగదారులు భయాందోళనలతో బుకింగ్‌లు చేయవద్దని, బుకింగ్ కోసం డిజిటల్ విధానాలనే ఉపయోగించాలని, ఎల్‌పీజీ పంపిణీదారుల వద్దకు వెళ్లవద్దని కోరడమైనది.
పీఎన్‌జీ, ఎలక్ట్రిక్-ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ వంట పద్ధతులను ఉపయోగించేలా, రోజువారీ వినియోగంలో ఇంధన పొదుపు పద్ధతులను పాటించేలా పౌరులను ప్రోత్సహిస్తున్నారు.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
ఈ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ నౌకలను, నావికులను కాపాడటానికి అవసరమైన చర్యలు చేపట్టారు. మంత్రిత్వ శాఖ ఇలా తెలిపింది.
నౌకా వాణిజ్యం నిరంతరాయంగా కొనసాగేలా చూస్తూనే.... నౌకా రవాణా, ఓడరేవు కార్యకలాపాలను... భారతీయ నావికుల భద్రతను నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది.
ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి దుర్ఘటనలూ నమోదు కాలేదు.
611 మంది భారతీయ నావికులతో కూడిన 22 భారత జెండా గల నౌకలు పశ్చిమ పర్షియన్ గల్ఫ్‌లోనే ఉండిపోయాయి. నౌకా యజమానులు, ఆర్పీఎస్ఎల్ ఏజెన్సీలు, భారత మిషన్లతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని డీజీ షిప్పింగ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24x7 పనిచేస్తోంది. ఇప్పటివరకు 3,730 ఫోన్ కాల్స్, 7,058 ఈమెయిళ్లకు సమాధానాలు అందించారు. ఇందులో గత 24 గంటల్లో 60 ఫోన్ కాల్స్, 129 ఈమెయిళ్లు వచ్చాయి.
గత 24 గంటల్లో స్వదేశానికి చేరిన 13 మంది సహా, మొత్తం 547 మందికి పైగా భారతీయ నావికులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు.
దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు ఎటువంటి రద్దీ లేకుండా సాధారణంగా కొనసాగుతున్నాయి. కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని రాష్ట్ర మారిటైమ్ బోర్డులు ధ్రువీకరించాయి.
సముద్రయాన సిబ్బంది సంక్షేమం, కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేలా చూసేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత మిషన్లు, నౌకా వాణిజ్య సంబంధిత వాటాదారులతో మంత్రిత్వ శాఖ సన్నిహిత సమన్వయాన్ని కొనసాగిస్తోంది.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
భారత మిషన్లు భారత పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, సహాయం అందిస్తూ, అవసరమైన సూచనలు జారీ చేస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మంత్రిత్వ శాఖ ఈ సమాచారం అందించింది.
భారతీయ పౌరుల భద్రత, రక్షణ, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నిరంతరం సమన్వయంతో ఒక ప్రత్యేక 24x7 ప్రత్యేక సమాచార కేంద్రం పనిచేస్తూనే ఉంది.
ఈ ప్రాంతం అంతటా ఉన్న మిషన్లు , పోస్టులు నిరంతరం పనిచేస్తూ, హెల్ప్లైన్లను నిర్వహిస్తూ, భారతీయ కమ్యూనిటీ సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తూ, అవసరమైన సూచనలు జారీ చేస్తూ, స్థానిక ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూ, సముద్రయాన సిబ్బందికి, విద్యార్థులకు, చిక్కుకుపోయిన భారతీయ పౌరులకు, స్వల్పకాలిక సందర్శకులకు సహాయం అందిస్తున్నాయి.
ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతం నుంచి 3,50,000 మందికి పైగా ప్రయాణికులు భారత్ తిరిగి వచ్చారు.
ఈ రోజు యూఏఈ నుంచి సుమారు 90 విమానాలు వస్తాయని అంచనా. సౌదీ అరేబియా, ఒమన్ దేశాల నుంచి భారత్‌కు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. గగనతలం పాక్షికంగా తిరిగి తెరవడంతో ఖతార్ ఎయిర్‌వేస్ ఈ రోజు సుమారు 9–10 షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను భారత్‌కు నడుపుతుందని భావిస్తున్నారు.
కువైట్ గగనతలం మూసి ఉంది. జజీరా ఎయిర్‌వేస్ సౌదీ అరేబియాలోని అల్ ఖైసుమా విమానాశ్రయం నుంచి భారత్‌లోని వివిధ గమ్యస్థానాలకు విమాన కార్యకలాపాలను ప్రారంభించింది.
బహ్రెయిన్ గగనతలం మూసి ఉంది. గల్ఫ్ ఎయిర్ సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి భారత్‌కు షెడ్యూల్ చేయని ప్రత్యేక వాణిజ్య విమానాలను నడపడం కొనసాగిస్తోంది.
కువైట్, బహ్రెయిన్, ఇరాక్లలో విమాన ప్రయాణ ఆంక్షల దృష్ట్యా భారత పౌరుల ప్రయాణానికి సౌదీ అరేబియా మీదుగా సౌకర్యం కల్పిస్తున్నారు.
ఇప్పటివరకు జరిగిన వివిధ ఘటనల్లో ఆరుగురు భారత పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన భారత పౌరుడి ఆచూకీ కనుగొనడం, మృతుల భౌతిక కాయాలను త్వరగా స్వదేశానికి రప్పించేందుకు సౌదీ అరేబియా, ఒమన్, ఇరాక్, యూఏఈల్లోని రాయబార కార్యాలయాలు సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
****
(రిలీజ్ ఐడి: 2243629)
సందర్శకుల సూచీ సంఖ్య : : 29