రైల్వే మంత్రిత్వ శాఖ
ప్రయాణీకుల సౌకర్యాలు, భద్రతపై అధికారులతో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమీక్ష; యాక్సెస్ కంట్రోల్, ఏఐ ఆధారిత సంస్కరణలను కాలపరిమితిలోగా అమలు చేయాలని ఆదేశం
నిరంతర నిఘా కోసం, సురక్షితమైన ప్రయాణం, స్టేషన్ అనుభవం కోసం ఏఐ ఆధారిత కెమెరా నెట్‌వర్క్
జవాబుదారీతనం, ప్రయాణీకుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు రైల్వే, రైల్వేయేతర సిబ్బంది అందరికీ రంగుల ఫ్లోరోసెంట్ జాకెట్లు, ఐడీ కార్డులు
దీపావళి, ఛఠ్ పర్వదినం రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణీకుల సులభతర ప్రయాణం కోసం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో క్యూఆర్ కోడ్ ఆధారిత యాక్సెస్ కంట్రోల్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న రైల్వే శాఖ
ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, చివరి మైలు వరకు నిరాటంకమైన అనుసంధానం కోసం రైల్‌వన్ యాప్‌ను భారత్ టాక్సీతో అనుసంధానం
నాడు పోస్టు చేయడమైనది:
20 MAR 2026 4:45PM by PIB Hyderabad
కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, నేడు రైల్ భవన్‌లో సీనియర్ రైల్వే అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి రైల్వే స్టేషన్ చేరుకునే సౌకర్యాలు, ప్రయాణీకుల సౌకర్యాల ఉన్నతీకరణ, ఇతర భద్రతా సంబంధిత పటిష్ట చర్యలలో పురోగతి అంచనా తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రవేశ నియంత్రణ, జనసమూహ నిర్వహణ, సాంకేతికత ఆధారిత నిఘా, స్టేషన్ ప్రాంగణంలో సులభతర రాకపోకలు వంటి చర్యలపై దృష్టి సారించారు. ఈ సంస్కరణలను మొదట న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అమలు చేసేందుకు నిర్ణయించారు. తదనంతరం ఇతర స్టేషన్లకు కూడా విస్తరించనున్నారు.
నిరంతర నిఘా కోసం ఏఐ-ఆధారిత కెమెరా నెట్‌వర్క్
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్‌లు, కాన్కోర్స్లు, ప్రవేశ-నిష్క్రమణ ద్వారాలు, అనధికార ప్రవేశానికి ఆస్కారం ఉన్న ఫన్నెల్ ప్రాంతాలతో సహా స్టేషన్ ప్రాంగణంలోని ప్రతి ప్రాంతాన్ని కవర్ చేస్తూ, కెమెరాల ద్వారా సమగ్రమైన ఏఐ-ఆధారిత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
ఇందులో భాగంగా ఒక ఎక్సెప్షన్ ఈవెంట్ డిస్‌ప్లే ఆధారిత కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రత్యక్ష కెమెరా ఫీడ్స్‌పై ఏఐ ప్రాసెసింగ్ ద్వారా అసాధారణ లేదా అసురక్షిత సంఘటనలను రియల్ టైమ్‌లో పర్యవేక్షణ సిబ్బందికి హెచ్చరికలుగా తెలియజేస్తుంది. కెమెరాలను వ్యవస్థ యొక్క "కళ్లుగా", ఏఐను "మెదడుగా" కేంద్ర మంత్రి వర్ణించారు. గరిష్ట పర్యవేక్షణ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి అన్ని కెమెరా కవరేజ్ ప్రాంతాలు తగినంత వెలుతురు పడే స్థానాల్లో ఉండాలని తెలిపారు.
స్టేషన్ ప్రాంగణంలోకి కేవలం టికెట్ ఉన్న ప్రయాణికులే ప్రవేశించేలా నిర్ధారించడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ను అదనంగా మోహరించనున్నారు. అలాగే మాన్యువల్ చెకింగ్ నుండి పర్యవేక్షణ ఆధారిత మానిటరింగ్‌కు మార్పు చేయనున్నారు.
స్టేషన్‌లోని సిబ్బందికి వివిధ రంగులతో యూనిఫార్ములు, ఐడి కార్డులు
పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న సిబ్బందిలో ఏకరీతిని, జవాబుదారితనాన్ని తీసుకురావడానికి, స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బందికి వివిధ రంగుల కోడ్ కలిగిన దుస్తులతో గుర్తింపు విధానాన్ని అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. రైల్వే ఉద్యోగులు ఫ్లోరోసెంట్ జాకెట్లు ధరిస్తారు. అలాగే విక్రేతలు, స్టేషన్ సహాయకులు, కాంట్రాక్ట్ సిబ్బంది ఐఆర్‌సీటీసీ సిబ్బంది వంటి ఉద్యోగేతరులు వేరే రంగుల జాకెట్లు ధరిస్తారు. ఇది స్టేషన్ ప్రాంగణంలో ఉన్న ప్రయాణికులు, ఉద్యోగులు, కూలీలు, విక్రేతల సిబ్బంది, ఆహారం, శుభ్రత, పార్సెల్, నిర్వహణ సిబ్బంది వంటి ఇతర ఉద్యోగేతరులను త్వరగా గుర్తించేందుకు సహాయపడుతుంది. దీని ద్వారా భద్రతా అధికారులు, టికెట్ చెకింగ్ సిబ్బంది తమ విధులు నిర్వహించే సమయంలో వీరితో సులభంగా వ్యవహరించగలుగుతారు.
ఉద్యోగులు, ఉద్యోగేతరులకు గుర్తింపు కోసం అవసరమైన సమగ్ర వివరాలతో ఐడి కార్డులు జారీ చేయనున్నారు. ఈ ఏకరీతి గుర్తింపు వ్యవస్థను ఉత్తర జోన్‌లోని అన్ని స్టేషన్లలో క్రమంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను నమూనాగా తీసుకుని, తరువాత దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేస్తారు.
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో పైలట్ ప్రాజెక్టుగా క్యూఆర్ కోడ్ ఆధారిత ప్రవేశ నియంత్రణ వ్యవస్థ
దీపావళి, ఛఠ్ పర్వదిన సమయంలో ఉండే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో క్యూఆర్ కోడ్ ఆధారిత ప్రవేశ నిర్వహణ వ్యవస్థను పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. ఈ వ్యవస్థ టికెట్ల ఆధారంగా ప్రవేశాన్ని కల్పించి, రిజర్వేషన్ చేసుకున్నవారిని, నెలవారీ సీజన్ టికెట్ కలిగినవారిని, రిజర్వ్ చేసుకోని ప్రయాణికులను సులభరీతిలో వేరు చేయడానికి సహాయపడుతుంది.
రైల్‌వన్ యాప్‌ను భారత్ ట్యాక్సీతో సమన్వయం- చివరి వరకు సులభమైన అనుసంధానం
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకునే లేదా అక్కడి నుండి బయలుదేరే ప్రయాణికుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి, రైల్‌వన్ యాప్‌ను, భారత్ ట్యాక్సీతో సమన్వయం చేయనున్నారు. రైల్‌టెల్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్న ఈ సమన్వయం స్టేషన్ బయట ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడంతో పాటు, విశ్వసనీయమైన, పారదర్శకమైన రవాణా సేవను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
భారత్ ట్యాక్సీ భారతదేశంలో సహకార వ్యవస్థ ఆధారంగా నడిచే తొలి రైడ్ బుకింగ్ వేదిక. ఇది సహకార రంగాన్ని బలోపేతం చేయడం, ‘సహకార్ సే సమృద్ధి’ దృష్టికి అనుగుణంగా సమగ్ర, పౌర కేంద్రిత ప్రయాణ పరిష్కారాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.
నిరవధిక గుంపు నిర్వహణ కోసం హోల్డింగ్ ప్రాంతాలు
ఈ సమావేశంలో 76 రైల్వే స్టేషన్లలో హోల్డింగ్ ప్రాంతాల అభివృద్ధి స్థితిని కూడా సమీక్షించారు. టికెట్ రిజర్వ్ చేసుకోని ప్రయాణికుల కోసం స్టేషన్ భవనం వెలుపల ప్రత్యేక హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి ప్లాట్‌ఫారమ్‌లకు నియంత్రిత, దశలవారీ ప్రవేశాన్ని నిర్ధారించి, గతంలో అధిక రద్దీ, భద్రతా సమస్యలకు కారణమైన జనసమర్ధతను నియంత్రించడంలో సహాయపడతాయి. హోల్డింగ్ ప్రాంతాల ద్వారా ప్రయాణికులకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు అందుబాటులో ఉంటాయి. తద్వారా సులభమైన ప్రవేశం సాధ్యమవుతుంది.
అన్ని స్టేషన్లలో స్పష్టతతో కూడిన సూచిక బోర్డులను ఏర్పాటు చేసి రిజర్వ్డ్, అన్‌రిజర్వ్డ్ టికెట్ హోల్డర్లకు మార్గదర్శకత్వం ఇవ్వాలని కూడా ఆదేశించారు. హోల్డింగ్ ప్రాంతాలలో వేచి ఉన్నప్పుడు ప్రయాణికులకు మెరుగైన సమాచారాన్ని అందించేందుకు రైలు సమాచార సేవలను కూడా ఆధునీకరించనున్నారు. నెట్‌వర్క్ అంతటా అధిక రద్దీ ఉన్న స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాన్ని నిరంతరం మెరుగుపరచడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యక్ష పర్యవేక్షణ కొనసాగుతుంది.
భారతీయ రైల్వేలు ఈ ప్రయాణికుల అనుకూల చర్యల ఫలితంగా దేశంలోని అత్యంత రద్దీగల స్టేషన్లను సురక్షితమైన, సక్రమంగా నిర్వహించే ప్రదేశాలుగా మార్చాలనే నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. సాంకేతికత అభివృద్ధి, మౌలిక వసతుల ఆధునీకరణతో, ప్రయాణికులకు రైల్వే స్టేషన్ ప్రవేశం నుండి చివరకు చేరుకునే ప్రాంతం వరకు అనుసంధానాన్ని సులభతరం చేయనున్నారు. లక్షలాది ప్రయాణికులకు నిరంతర ప్రయాణ అనుభవాన్ని అందించడాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
***
(రిలీజ్ ఐడి: 2243431)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6