భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

5 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో హింసకూ, కవ్వింపులకూ తావు లేకుండా ఎన్నికల నిర్వహణకు 25 లక్షల మందికి పైగా అధికారులను నియమించిన ఈసీఐ

నాడు పోస్టు చేయడమైనది: 18 MAR 2026 2:39PM by PIB Hyderabad

అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళ నాడు, పశ్చిమ బెంగాల్ విధాన సభలకు సాధారణ ఎన్నికలతో పాటు 6 రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు సంబంధించిన షెడ్యూలును భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) 2026 మార్చి నెల 15న ప్రకటించింది.
5 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ దశల్లో ఎన్నికలను సాఫీగానూ, క్రమపద్ధతిలోనూ నిర్వహించేందుకు 25 లక్షల మందికి పైగా ఎన్నికల అధికారులను నియమించారు. ఈ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులైన ఓటర్లు మొత్తం 17.4 కోట్ల కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఈ లెక్కన దాదాపు ప్రతి 70 మంది ఓటర్లకు ఒక ఎన్నికల అధికారి చొప్పున నియమించినట్లయింది.
విధులను పూర్తి నిష్పాక్షికంగా నిర్వర్తించాలని, ఎన్నికలను హింసకీ, కవ్వింపులకీ తావు లేకుండా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, అలా జరిగినప్పుడే ప్రతి ఒక్క ఓటరూ ఎలాంటి భయానికీ, ఒత్తిడికీ లోను కాకుండా తన ఓటును వేయగలుగుతారని ఎన్నికల ప్రధానాధికారి శ్రీ జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల షెడ్యూలును ప్రకటించిన సందర్భంగా స్పష్టం చేశారు.
ఎన్నికలకు నియమించిన ఉద్యోగుల్లో.. సుమారు 15 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 8.5 లక్షల మంది భద్రతా సిబ్బంది, 40 వేల మంది ఓట్ల లెక్కింపు సిబ్బంది, 49 వేల మంది సూక్ష్మ పరిశీలకులు, 21 వేల మంది సెక్టర్ అధికారులు, 15 వేల మంది ఓట్ల లెక్కింపునకు సంబంధించి సూక్ష్మ పరిశీలకులుగా పనిచేసే వారితో పాటు ఇతర అధికారులు కూడా ఉన్నారు.
ఓటర్లకు ఫోన్ కాల్ మాధ్యమం ద్వారానూ, ఈసీఐనెట్ యాప్ (ECINet App) లో ‘బుక్-ఎ-కాల్ టు బీఎల్ఓ’ సదుపాయం ద్వారానూ 2.18 లక్షల కన్నా ఎక్కువ మంది బూత్ స్థాయి అధికారుల (బీఎల్‌ఓల)తో పాటు క్షేత్ర స్థాయి ఎన్నికల యంత్రాంగం కూడా అందుబాటులో ఉంది. డీఈఓ/ఆర్ఓ స్థాయిలో ఏదైనా ఫిర్యాదును గాని, ప్రశ్నను గాని నమోదు చేయడానికి కాల్ సెంటర్ నంబరు +91 (ఎస్టీడీ కోడ్) 1950 కూడా అందుబాటులో ఉంది.
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 28ఏ నిబంధనల ప్రకారం నియమించిన ఉద్యోగులందరినీ ఎన్నికల సంఘంలో డిప్యుటేషన్లో ఉన్నట్లుగా పరిగణిస్తారు.
సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల కాలంలో ఎన్నికల సంఘం పర్యవేక్షణకు గాను 832 విధానసభ నియోజకవర్గాల్లో 1,111 మంది కేంద్ర పర్యవేక్షకులను నియమించారు. వీరిలో 557 మంది సాధారణ పరిశీలకులు, 188 మంది పోలీసు పరిశీలకులతో పాటు 366 మంది వ్యయ పరిశీలకులు కలిసివున్నారు.  నియమించిన కేంద్ర పరిశీలకులలో చాలా మంది తమకు కేటాయించిన విధాన సభ నియోజకవర్గాలకు ఇప్పటికే చేరుకున్నారు.
పరిశీలకులు తమను సంప్రదించడానికి సంబంధించిన వివరాలను ప్రజలతో పంచుకుంటారు. వారు ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను వినడానికి ప్రతి రోజూ నిర్దిష్ట సమయంలో అభ్యర్థులతో, రాజకీయపక్షాలతో లేదా రాజకీయపక్షాల ప్రతినిధులతో, పౌరులలో ఎవరితోనైనా గాని భేటీ అవుతారు.

 

***


(రిలీజ్ ఐడి: 2241943) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , Assamese , Bengali , English , Gujarati , Urdu , हिन्दी , Tamil