ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఢిల్లీ, కోల్‌కతాల్లో వ్యవస్థీకృత బంగారం అక్రమ రవాణా, ద్రవీకరణ ముఠాపై ఉక్కుపాదం మోపిన డీఆర్ఐ
రూ. 14.13 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం ఆరుగురు అరెస్టు
నాడు పోస్టు చేయడమైనది:
15 MAR 2026 10:59AM by PIB Hyderabad
విదేశాల నుంచి బంగారాన్ని భారత్‌లోకి అక్రమంగా రవాణా చేయడం... రైలు మార్గం ద్వారా వివిధ ప్రాంతాలకు దానిని తరలించడం... అక్రమంగా వివిధ కేంద్రాల వద్ద దానిని కరిగించడం... ఆకృతిని మార్చడం... దేశీయ మార్కెట్లో రహస్యంగా విక్రయించడం వంటి నేరాలకు పాల్పడుతున్న ఒక వ్యవస్థీకృత ముఠా మోసాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) బయట పెట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా మొత్తం రూ. 14.13 కోట్ల విలువైన బంగారం, వెండి, భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు చెందిన ఆరుగురు వ్యక్తులనూ అరెస్టు చేశారు.
కస్టమ్స్ చట్టం, 1962లోని నిబంధనల ప్రకారం రూ. 13.41 కోట్ల విలువైన 8286.81 గ్రాముల బంగారం, రూ. 19.67 లక్షల విలువైన 7350.4 గ్రాముల వెండి, రూ. 51,74,100 విలువైన భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
నిఘా వర్గాల నుంచి అందిన నిర్దిష్ట సమాచారం మేరకు, కోల్‌కతా నుంచి రైలులో వచ్చిన ఒక ప్రయాణికుడు స్టేషన్ వెలుపల ఉన్న వ్యక్తికి అందించడానికి ఉద్దేశించిన విదేశీ బంగారాన్ని డీఆర్ఐ అధికారులు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద పట్టుకున్నారు. బంగారం రవాణా చేస్తున్న వ్యక్తినీ, తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నారు.
వెల్లడైన వివరాల ఆధారంగా ఢిల్లీలో తదుపరి సోదాలు నిర్వహించగా, నగరంలో అక్రమంగా బంగారం కరిగించే ఒక కేంద్రంలో విదేశీ బంగారాన్ని కరిగించి దాని గుర్తుల్ని మార్చడం, స్థానిక బంగారం మార్కెట్లో విక్రయించడం కోసం ఇవన్నీ చేస్తున్నట్లు గుర్తించారు. ఆ ప్రాంగణం నుంచీ అక్రమంగా నిల్వ చేసిన బంగారం, వెండి, భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత కేంద్రాన్ని నిర్వహిస్తున్న మేనేజర్‌నూ అరెస్టు చేశారు.
తదుపరి దర్యాప్తు కోల్‌కతాలో చేపట్టిన అధికారులు... అక్కడ అక్రమ ముఠా సూత్రధారి వద్ద ఆకృతి మార్చిన బంగారంతో పాటు మరో బంగారాన్ని కరిగించే కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అతనితో పాటు ఇద్దరినీ అరెస్టు చేశారు. భారత్‌లోకి అక్రమంగా రవాణా చేసిన విదేశీ ముద్రలున్న బంగారాన్ని స్వీకరించామని, గుర్తింపు సాధ్యపడే గుర్తులను తొలగించడానికి దానిని కరిగించామని, తదుపరి పంపిణీ కోసం రైలు మార్గం ద్వారా దానిని ఢిల్లీకి రవాణా చేయాల్సి ఉందని విచారణలో నిందితులు అంగీకరించారు.
బంగారం అక్రమ రవాణా, వివిధ ప్రాంతాలకు అక్రమ తరలింపు, కరిగించడం, విక్రయ చేయడంతో సంబంధం ఉన్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి, సంబంధిత కోర్టులో హాజరుపరిచారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2240428)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13