పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ

ఎల్‌పీజీ సిలిండర్ల కోసం భయాందోళనతో ముందస్తు బుకింగ్‌లు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి

గ్యాస్ ఏజెన్సీల వద్ద రద్దీని నివారించడానికి బుకింగ్ కోసం డిజిటల్ పద్ధతులను ఉపయోగించాలని సూచించిన అధికారులు

గృహ వినియోగ ఎల్‌పీజీ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత

సుమారు 31 శాతం పెరిగిన గృహ వినియోగ ఎల్‌పీజీ ఉత్పత్తి

నిత్యావసరాల అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను నిరోధించడానికి తగిన చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారతీయ ఎల్‌పీజీ నౌకలు

మార్చి 16–17 తేదీలలో ముంద్రా, కాండ్లా రేవులకు చేరుకోనున్న నౌకలు

సముద్రయాన వాణిజ్యంపై ప్రభావం తగ్గించడానికి ఓడరేవులు, సరకు రవాణా మార్గాలు, సరకు రవాణా భాగస్వాములతో కలిసి పనిచేస్తోన్న ప్రభుత్వం

తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, కేవలం అధికారిక ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు సూచన

రాబోయే ఖరీఫ్ 2026 సీజన్ కోసం అందుబాటులో తగినంత ఎరువుల నిల్వలు

పశ్చిమాసియా పరిస్థితులపై ఉమ్మడి వైఖరిని అవలంబించే విషయంపై 'బ్రిక్స్' దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు

నాడు పోస్టు చేయడమైనది: 14 MAR 2026 6:26PM by PIB Hyderabad

ఇటీవలి పశ్చిమాసియా పరిణామాల వల్ల ఉత్పన్నమైన పరిస్థితిపై తాజా సమాచారాన్ని అందించడానికి ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో నాలుగోసారి కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు (ఇంటర్ మినిస్ట్రీయల్) మీడియా సమావేశాన్ని నిర్వహించాయి. ఇటువంటి సమావేశాలను ఇంతకుముందు మార్చి 11, 12, 13 తేదీలలో కూడా నిర్వహించారు. పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఓడరేవులు - నౌకాయాన - జలమార్గాల మంత్రిత్వ శాఖ, సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఇంధన సరఫరా, సముద్ర మార్గ కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయుల సంక్షేమం, సంబంధిత కమ్యూనికేషన్ చర్యలపై తాజా వివరాలను వెల్లడించారు.

 

ఇంధన సరఫరా, ఇంధన లభ్యత

 

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాలు, హార్ముజ్ జలసంధిలోని పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరా స్థితిగతులు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీని నిరంతరం అందుబాటులో ఉండేలా చేసిన ఏర్పాట్ల గురించి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారి మీడియాకు వివరించారు. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం:

 

ముడిచమురు, చమురు శుద్ధి కేంద్రాలు

 

ప్రస్తుతం అన్ని చమురు శుద్ధి కేంద్రాలు అత్యున్నత స్థాయిలో పనిచేస్తున్నాయి. అవి తగినంత ముడిచమురు నిల్వలను కలిగి ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో మన దేశం స్వయంసమృద్ధి సాధించింది. దేశీయ అవసరాలను తీర్చేందుకు పెట్రోల్, డీజిల్‌ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు.

 

రీటైల్ అవుట్‌లెట్లు

 

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నివేదికల ప్రకారం ఏ రీటైల్ అవుట్‌లెట్‌లోనూ (ఆర్ఓ) ఇంధన కొరత నమోదవ్వలేదు. పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నందున సరఫరా క్రమం తప్పకుండా జరుగుతోంది. కాబట్టి ప్రజలు భయాందోళనతో ముందస్తు కొనుగోళ్లు చేయొద్దని ప్రభుత్వం సూచిస్తోంది.

సహజ వాయువు

 

ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాలో ఎటువంటి కోత లేకుండా రక్షణ ఉంది. ఇందులో భాగంగా పీఎన్‍జీ, సీఎన్‌జీ సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా 100 శాతం కొనసాగుతోంది. కాబట్టి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు సరఫరాను 80 శాతం వద్ద నియంత్రించడం జరుగుతోంది.

 

దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, లక్నో, కాన్పూర్, జైపూర్ మొదలైన చోట్ల పనిచేస్తున్న సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) సంస్థలతో గెయిల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఎల్‌పీజీ సరఫరాపై ఒత్తిడిని తగ్గించడానికి హోటళ్లు, రెస్టారెంట్లకు కొత్త వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్‌లను వేగంగా అందించాలని, వాటిని తీసుకోవటాన్ని ప్రోత్సహించాలని ఆదేశించింది.

 

ఎల్‌పీజీ

 

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎల్‌పీజీ సరఫరా అనేది ఇంకా ఆందోళన కలిగించే అంశంగానే ఉంది.

 

ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద గ్యాస్ నిల్వలు పూర్తిగా అయిపోయినదన్న నివేదిక లేదు. 

 

భయాందోళనతో చేస్తున్న ముందస్తు కొనుగోళ్ల కారణంగా ఎల్‌పీజీ బుకింగ్‌ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. సగటున రోజుకు జరిగే 55.7 లక్షల బుకింగ్‌లు నిన్నటి గణాంకాల ప్రకారం ఏకంగా 88.8 లక్షలకు పెరిగాయి.

 

వాణిజ్య సిలిండర్లను ప్రాధాన్యత ప్రాతిపదికన పంపిణీ చేసేందుకు వీలుగా వాటిని రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్‌పీజీ అందుబాటులో ఉంది.

 

ప్రస్తుతం సిలిండర్ల ఆన్‌లైన్ బుకింగ్ శాతం 84 శాతంగా ఉంది.

 

రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సమావేశాలు

 

పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటి నిత్యావసరాల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉన్న పాత్ర అత్యంత కీలకమైనది.

 

సంబంధిత రాష్ట్రాల్లోని ఎల్‌పీజీ డిమాండ్, సరఫరా పరిస్థితిని సమీక్షించడానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారులతో హర్యానా, గోవా ముఖ్యమంత్రులు సమావేశాలు నిర్వహించారు.

 

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ఎల్‌పీజీ నిల్వల స్థితిగతులు, సరఫరా, వినియోగదారులకు పంపిణీ చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.

 

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కమిషనర్‌తో సమావేశమైన ఆయిల్ కంపెనీలు.. ఎల్‌పీజీ, రేషన్ కిరోసిన్ (పీడీఎస్ ఎస్‌కేఓ), వాణిజ్య ఎల్‌పీజీకి సంబంధించిన తాజా పరిణామాలను ఆయనకు వివరించాయి.

 

పరిస్థితిని పర్యవేక్షించడానికి ఇప్పటికే 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశాయి. అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడు మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నాయి.

అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు

 

పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటి నిత్యావసరాల అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

 

మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో ఆహార - పౌర సరఫరాల శాఖ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఉమ్మడి తనిఖీ బృందాలు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు (పీఎస్‌యూ ఓఎంసీ) నిన్న ఒక్కరోజే సుమారు 1,300 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ల వద్ద తనిఖీలు చేపట్టాయి.

 

ఉత్తరప్రదేశ్‌లో ఎన్‌పోర్స్‌మెంట్ బృందాలు 1,483 ప్రాంతాలను తనిఖీ చేశాయి. మొత్తం 24 ఎఫ్ఐఆర్‌లు (ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లపై 4, వ్యక్తులపై 20) నమోదయ్యాయి. ఆరుగురిని అరెస్టు చేయడంతో పాటు 19 మందిపై న్యాయమపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి.

 

ఆంధ్రప్రదేశ్ (తిరుపతి), బీహార్, ఒడిశా, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలను తనిఖీ చేయడానికి దాడులు జరిగాయి. 

 

ఇతర ప్రభుత్వ చర్యలు

 

గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి ప్రాధాన్యత రంగాలకు అంతరాయం లేని ఎల్‌పీజీ సరఫరాను అందించడమే ప్రభుత్వానికి ఉన్న అత్యున్నత ప్రాధాన్యత. చమురు శుద్ధి కేంద్రాల్లో ఎల్‌పీజీ ఉత్పత్తి కూడా సుమారు 31 శాతం పెరిగింది. 

 

13.03.2026 నాటి సీఏక్యూఎం ఉత్తర్వు ప్రకారం జాతీయ రాజధాని ప్రాంతంలోని పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లు సహజ వాయువుకు బదులుగా బయోమాస్, ఆర్‌డీఎఫ్ పెల్లెట్లను ఒక నెల పాటు తాత్కాలికంగా ఉపయోగించడానికి అనుమతి ఉంది. ప్రత్యామ్నాయాలు లేని చోట బొగ్గు లేదా కిరోసిన్‌ను కూడా వాడొచ్చు. ఎల్‌పీజీ బుకింగ్ మధ్య ఉండే సమయాన్ని పెంచడం ద్వారా వినియోగాన్ని క్రమబద్ధీకరించారు. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల విరామం ఉండాలి. అదనంగా 48,000 కేఎల్ కిరోసిన్‌ను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించారు. హోటళ్ల రంగంలో ఎల్‌పీజీపై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గును ప్రత్యామ్నాయ ఇంధనాలుగా ఉపయోగిస్తున్నారు.

 

డిజిటల్ పద్ధతిలో ఎల్‌పీజీ బుకింగ్‌లను ప్రోత్సహించటం, అనవసరమైన ముందస్తు బుకింగ్‌లను నిరుత్సాహపరచటం, గ్యాస్ ఏజెన్సీలకు అనవసరంగా వెళ్లడాన్ని నివారించాలని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలను ఆదేశించారు.

ప్రజా సూచనలు

 

ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. గృహాలు, అత్యవసర విభాగాలకు ఎల్‌పీజీ లభ్యతను నిరంతరం కొనసాగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

 

ఎల్‌పీజీ సిలిండర్లను ఐవీఆర్ఎస్ కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మొబైల్ యాప్‌ల వంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు ఇంటి నుంచే సిలిండర్లను బుక్ చేసుకోవాలని, అనవసరంగా గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లొద్దని సూచించారు. 

 

గ్యాస్ ఏజెన్సీల వద్ద రద్దీని నివారించడానికి, ప్రజలు భయాందోళనతో ముందస్తు బుకింగ్‌లు చేయొద్దని, కేవలం డిజిటల్ పద్ధతులను మాత్రమే ఉపయోగించాలని అభ్యర్థించారు. 

 

అందుబాటులో ఉన్న చోట వినియోగదారులు పీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఎంచుకోవచ్చు. దశాబ్దాలుగా నమ్మకమైన సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను నమ్మాలని అధికారులు కోరారు. 

 

కేవలం సరైన సమాచారాన్ని మాత్రమే ప్రచారం చేయాలని, అధికారిక వనరులను మాత్రమే నమ్మాలని మీడియా సంస్థలను కోరారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎన్‌జీ), ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. 

***


(రిలీజ్ ఐడి: 2240262) సందర్శకుల సూచీ సంఖ్య : : 26
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Khasi , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam