ప్రధాన మంత్రి కార్యాలయం
అస్సాంలోని సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
దేశపు ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి నేడు కేంద్ర బిందువుగా ఈశాన్య ప్రాంతం.. ఇది భారత్‌ను ఆగ్నేయాసియాతో కలిపే వారధిలా మారుతోంది: ప్రధానమంత్రి
అస్సాం అభివృద్ధికి ఎంతో గణనీయమైన సహకారం అందించిన బరాక్ లోయ రైతులు, ఇక్కడి తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు... రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం చర్యలు: ప్రధానమంత్రి
సరిహద్దుల్లోని గ్రామాలను దేశపు మొదటి గ్రామాలుగా మేం పరిగణిస్తాం.. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కోసం ‘వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమం’ తదుపరి దశను కచార్ జిల్లా నుంచే ప్రారంభించాం. ఇది బరాక్ లోయలోని అనేక గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతుంది: ప్రధానమంత్రి.
నాడు పోస్టు చేయడమైనది:
14 MAR 2026 1:28PM by PIB Hyderabad
అస్సాంలోని సిల్చార్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ.. సంస్కృతి, చైతన్యానికి నిలయమైన బరాక్ లోయను సందర్శించడం తనకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుందని పేర్కొన్నారు. సిల్చార్ నగరం ఈ లోయకు ఒక ప్రవేశ ద్వారం వంటిదని.. ఇక్కడ చరిత్ర, భాష ఒక ప్రత్యేకమైన ప్రాంతీయ గుర్తింపును తీసుకొచ్చాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బెంగాలీ, అస్సామీ, గిరిజన సంప్రదాయాలు సామరస్యంతో వర్ధిల్లే ఈ ప్రాంత వైవిధ్యమే దీని అసలైన బలమని శ్రీ మోదీ తెలిపారు. ‘‘బరాక్ లోయ వైవిధ్యమే దాని గొప్ప ఆస్తి. ఇది పౌరుల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
ఈ ప్రాంతంలోని సారవంతమైన మైదానాలు, తేయాకు తోటలు ఎంతో కాలంగా స్థానిక ఆర్థిక వ్యవస్థకు, వాణిజ్య మార్గాలకు వెన్నెముకగా నిలిచాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. నేడు ప్రారంభించిన వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు, బరాక్ లోయను మొత్తం ఈశాన్య భారతానికే ఒక రవాణా కేంద్రంగా మరింత శక్తిమంతం చేస్తాయని పేర్కొన్నారు. రైల్వే, రహదారులు, విద్యా రంగాల్లో చేపట్టిన ఈ కార్యక్రమాలను, స్థానిక యువతకు అపారమైన ఉపాధి అవకాశాలను కల్పించేలా రూపొందించినట్లు శ్రీ మోదీ తెలిపారు. ఈ ప్రాంతం ఇప్పుడు కేవలం రాష్ట్రానికే కాకుండా, పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్, ఈశాన్య ప్రాంతాలను అనుసంధానించేలా రూపుదిద్దుకుంటోందని అన్నారు. ‘‘బరాక్ లో ఈశాన్య భారతదేశానికి ప్రధాన రవాణా, వాణిజ్య కేంద్రంగా మారబోతోంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని దేశపు ’యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి కేంద్ర బిందువుగా మారుస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాంతపు గత పారిశ్రామిక వైభవాన్ని పునరుద్ధరించడానికి ప్రస్తుత ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీ మోదీ తెలిపారు. రూ. 24,000 కోట్ల వ్యయంతో చేపట్టనున్న షిల్లాంగ్-సిల్చార్ హైస్పీడ్ కారిడార్కు నేడు శంకుస్థాపన చేయడం ఒక చారిత్రక మైలురాయిగా ప్రధానమంత్రి అభివర్ణించారు. ఈ యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్.. ఈశాన్య ప్రాంతంలో మొదటిదని, ఇది దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న నిరీక్షణకు ముగింపు పలుకుతుందని ఆయన అన్నారు. ఈ కారిడార్ సిల్చార్‌ను మిజోరాం, మణిపూర్, త్రిపురతో అనుసంధానిస్తుందని, ఆగ్నేయాసియాలోని భారీ మార్కెట్లకు చేరువ చేస్తుందని తెలిపారు. ఈ అనుసంధానం స్థానిక పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటక రంగాలకు అపారమైన ప్రోత్సహాన్ని అందిస్తుందని అన్నారు. ‘‘బరాక్ లోయ ఒక అత్యున్నతమైన భవిష్యత్తుతో అనుసంధానం కాబోతోంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
కొత్తగా నిర్మించిన సిల్చార్ వంతెనతో చాలా కాలంగా నగర ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ మౌలిక సదుపాయం సిల్చార్ మెడికల్ కాలేజ్, నీట్, అస్సాం యూనివర్సిటీ విద్యార్థుల సమయాన్ని ఆదా చేసి, వారికి ఒక గొప్ప వరంగా మారుతుందని ఆయన అన్నారు. అస్సాం రైల్వే వ్యవస్థలో 2,500 కిలోమీటర్లకు పైగా విద్యుదీకరణ పూర్తికావడంతో ప్రయాణాలు మరింత వేగవంతం అవుతాయని శ్రీ మోదీ తెలిపారు. ‘‘అత్యంత వేగవంతమైన, స్వచ్ఛమైన రైలు రవాణా, బరాక్ లోయ సహజ సిద్ధమైన పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది’’ అని పేర్కొన్నారు.
అస్సాం అభివృద్ధిలో లోయలోని తేయాకు తోటల కార్మికులు, రైతులు అపారమైన కృషి చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటివరకు అస్సాం రైతులకు రూ. 20,000 కోట్లకు పైగా నిధులు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. నిన్ననే బరాక్ లోయలోని వేలాది మంది రైతులు కూడా తమ బ్యాంకు ఖాతాల్లో నగదును అందుకున్నారని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఈ సహాయం రైతులకు వ్యవసాయానికి సంబంధించి చిన్నపాటి లేదా ముఖ్యమైన అవసరాలను తీర్చుకోవడానికి తోడ్పడుతుందని తెలిపారు. పథర్‌కండీలో తొలి వ్యవసాయ కళాశాల ఏర్పాటుతో లోయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంగా మారబోతుందని శ్రీ మోదీ చెప్పారు. విజయవంతమైన వ్యవసాయ అంకుర సంస్థలను ప్రారంభించడానికి స్థానిక యువతకు అవసరమైన మద్దతును ఈ సంస్థ అందిస్తుందని ప్రధానమంత్రి సూచించారు. ‘‘బరాక్ లోయ ఇకపై వ్యవసాయ అధ్యయనాలు, పరిశోధనలకు ప్రసిద్ధి చెందుతుంది’’ అని తెలిపారు.
అభివృద్ధి పరుగులో వెనుకబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే మంత్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఒకప్పుడు సరిహద్దు గ్రామాలను ‘చివరి’ గ్రామాలుగా పరిగణించేవారని, కానీ తమ ప్రభుత్వం వాటిని దేశంలోని ‘మొట్టమొదటి’ గ్రామాలుగా చూస్తోందని వ్యాఖ్యానించారు. కచార్ జిల్లా నుంచి విస్తరించిన వైబ్రేంట్ విలేజ్ కార్యక్రమం ఇప్పటికే సరిహద్దు నివాస ప్రాంతాల్లో స్పష్టమైన మార్పులను తీసుకువస్తోందని పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతాలపై ఉన్న నిర్లక్ష్యాన్ని వీడి.. ఇప్పుడు క్రియాశీలక అభివృద్ధి, వ్యూహాత్మక దృష్టితో ముందుకు వెళ్తున్నామని ప్రస్తావించారు. ‘‘సరిహద్దు గ్రామాలను దేశంలోని మొదటి గ్రామాలుగా మేం పరిగణిస్తాం’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
వేలాది తేయాకు తోటల కుటుంబాలకు భూమి హక్కులను కల్పించడం ద్వారా అస్సాం ప్రభుత్వం ఒక చారిత్రక బాధ్యతను నెరవేర్చిందని ప్రధానమంత్రి తెలిపారు. గత రెండు శతాబ్దాలుగా సేవలందించిన తరాల భవిష్యత్తును మార్చడంలో ఈ భూమి పట్టాల పంపిణీ ఒక కీలక పరిణామంగా పేర్కొన్నారు. ఈ చట్టపరమైన భద్రత గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తుందని అన్నారు. ‘‘ఈ భూమి హక్కుల ద్వారా ఇప్పుడు ఆయా కుటుంబాలు శాశ్వత ఇళ్లు, విద్యుత్, నీటి సౌకర్యం వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను పొందే అవకాశం కలుగుతుంది’’ అని ప్రధానమంత్రి తెలిపారు.
తేయాకు తోటల యువత కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, స్కాలర్‌షిప్‌లు, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలు బంగారు గతంలో నిర్లక్ష్యానికి గురైన కార్మికుల పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రాంతీయ వ్యూహానికి విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం కీలకంగా మారాయని అన్నారు. ఎయిమ్స్, క్యాన్సర్ ఆసుపత్రుల వ్యవస్థతో ఆరోగ్య కేంద్రంగా అస్సాం వేగంగా ఎదుగుతోందని అన్నారు. ‘‘తేయాకు తోటల యువతకు బంగారు భవిష్యత్తుకు బాటలు పడుతున్నాయి’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
అస్సాం యువతకు ఇప్పుడు సెమీకండక్టర్, సాంకేతిక రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న శాంతి, పురోగతి ఎన్నో త్యాగాల వల్ల లభించాయని, దీనిని తిరోగమన శక్తుల నుంచి కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మళ్ళీ పాత గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టడానికి ప్రయత్నించే ఏ శక్తికైనా తగిన సమాధానం ఇవ్వాలని సూచించారు. ‘‘భారతదేశపు సెమీకండక్టర్ రంగంలో అస్సాం ఇప్పుడు ఒక కీలక ప్రాంతంగా మారుతోంది. తదుపరి తరం సాంకేతికతకు సంబంధించిన వ్యవస్థ, ప్రతిభ ఇక్కడ సిద్ధమవుతోంది.’’ అని శ్రీ మోదీ తెలిపారు.
ప్రపంచ సంక్షోభాలు, యుద్ధాల సమయంలో ప్రస్తుత ప్రభుత్వం దేశ పౌరులపై ప్రభావాన్ని తగ్గించడానికి పూర్తి శక్తితో పనిచేస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గొప్ప భాష, సంస్కృతి మద్దతుతో పురోగతి పథంలో సాగుతున్న ఈ పాంతపు ప్రయాణం ఇప్పుడు ఆపలేనిదని పేర్కొన్నారు. నేడు ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులు బరాక్ లోయకు ఒక కొత్త శకానికి ప్రారంభం మాత్రమేని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. ప్రజల సమష్టి సంకల్పం మొత్తం రాష్ట్రానికి ప్రకాశవంతమైన, సంపన్నమైన భవిష్యత్తును అందిస్తుందని అన్నారు. ‘‘బరాక్ లోయ కొత్త అభివృద్ధి కేంద్రంగా గుర్తింపు పొందే రోజు ఎంతో దూరంలో లేదు’’ అని చెబుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
***
(రిలీజ్ ఐడి: 2240218)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam