సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లో ఐలైన్ స్టూడియోస్ ప్రారంభం.. భారత ఏవీజీసీ వ్యవస్థకు భారీ ఊతం
సృజనాత్మక సాంకేతిక రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు హైదరాబాద్‌లో ఐఐసీటీ క్యాంపస్ ఏర్పాటు
బలమైన సృజనాత్మక, సాంకేతిక ప్రతిభతో అంతర్జాతీయ విజువల్ ఎఫెక్ట్‌లకు కేంద్రంగా భారత్
నాడు పోస్టు చేయడమైనది:
12 MAR 2026 5:41PM by PIB Hyderabad
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగానికి భారీ ఉతమిస్తూ.. నెట్‌ఫ్లిక్స్ సంస్థ తన ప్రపంచ ప్రొడక్షన్, ఆవిష్కరణ స్టూడియో అయిన ఐలైన్ స్టూడియోస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. అంతర్జాతీయ ప్రొడక్షన్ రంగంలో భారత్ కీలక పాత్ర పోషించడానికి, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, తదుపరి తరం ప్రొడక్షన్ సాంకేతికతల విస్తరణకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడనుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి, కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ఐలైన్ స్టూడియోస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ జెఫ్ షాపిరో, ప్రముఖ నటుడు, నిర్మాత శ్రీ రానా దగ్గుబాటి పాల్గొన్నారు.

హైదరాబాద్ లో సుమారు 32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రం..హైబ్రిడ్ క్లౌడ్ మౌలిక సదుపాయాలతో అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, వర్చువల్ ప్రొడక్షన్ సాంకేతికతలను కలిగి ఉంది. ఈ స్టూడియోను ఉన్నత స్థాయి విజువల్ దృశ్య కథనానికి మద్దతు ఇచ్చేలా రూపొందించారు. ఇది లాస్ ఏంజిల్స్, వాంకోవర్, సియోల్, లండన్‌లోని కేంద్రాలను కలిగి ఉన్న ఐలైన్ స్టూడియోస్ అంతర్జాతీయ వ్యవస్థలో భాగంగా పనిచేస్తుంది.
విధానపరమైన మద్దతు, అభివృద్ధి చెందుతున్న మీడియా రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత కారణంగా సృజనాత్మక సాంకేతికత, డిజిటల్ ప్రొడక్షన్ రంగంలో ప్రపంచ కేంద్రంగా భారత్ తన స్థానాన్ని క్రమంగా బలోపేతం చేసుకుంటోంది. హైదరాబాద్‌లో ఐలైన్ స్టూడియోస్ ఏర్పాటుతో ప్రతిభావంతులను తయారు చేయడం, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం, అంతర్జాతీయ ప్రొడక్షన్ వ్యవస్థలతో అనుసంధానం కావడం ద్వారా ఇక్కడి ఏవీజీసీ వ్యవస్థ వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సృజనాత్మకత, సాంకేతికత, అంతర్జాతీయ ప్రతిభ కలిసే ఒక శక్తిమంతమైన కేంద్రంగా హైదరాబాద్ అవతరించిందని అన్నారు. ఐలైన్ స్టూడియోస్ వంటి కార్యక్రమాలు చలనచిత్రం, సాంకేతికత, ఏవీజీసీ రంగాల్లో కీలక కేంద్రంగా ఉన్న నగర స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం అంతర్జాతీయంగా పోటీ పడగలిగే సృజనాత్మక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతుందని, తద్వారా హైదరాబాద్ నుంచి ప్రపంచానికి సరికొత్త కథనాలను అందించేందుకు, స్థానిక ప్రతిభకు కొత్త అవకాశాలు లభిస్తాయని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ.. దేశంలో కథలను చెప్పే సుసంపన్నమైన సంప్రదాయం, పెరుగుతున్న సాంకేతిక సామర్థ్యాలు వినోద రంగ విస్తరణకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు ఏవీజీసీ రంగంలో బలమైన చరిత్ర ఉందని, ఇప్పటికే పలు అంతర్జాతీయ స్టూడియోలు ఇక్కడ పనిచేస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్‌లో త్వరలో ఏర్పాటు కానున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) క్యాంపస్ సృజనాత్మక సాంకేతిక రంగంలో నైపుణ్యాభివృద్ధిని, సామర్థ్య పెంపును మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. గత ఏడాది జరిగిన వేవ్స్ కార్యక్రమంలో భాగంగా ‘ఆరెంజ్ ఎకానమీ’వృద్ధి గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారని పేర్కొన్నారు. ఆ లక్ష్యం ఇప్పుడు ఆచరణాత్మక విధానాలుగా అమల్లోకి వస్తోందని..ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 15,000 కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో సుమారు 20 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ వంటి రంగాల్లో ప్రతిభావంతులను పెంపొందించడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. వేగవంతమైన సాంకేతిక పురోగతి, పెరుగుతున్న పరిశ్రమల భాగస్వామ్యంతో కథ చెప్పడం, సృజనాత్మక సాంకేతికతకు ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదగడానికి హైదరాబాద్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఐలైన్ స్టూడియోస్ సీఈఓ జెఫ్ షాపిరో మాట్లాడుతూ.. దేశంలోని బలమైన సృజనాత్మక, సాంకేతిక ప్రతిభతో ప్రపంచ విజువల్ ఎఫెక్ట్స్ పరిశ్రమలో భారత్ ఎప్పటి నుంచో కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. హైదరాబాద్‌లోని సాంకేతిక వ్యవస్థ, ఇక్కడి సినిమా సంస్కృతి, దీర్ఘకాలిక సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, ప్రపంచ స్థాయి దృశ్య కథనానికి సహకరించడానికి అత్యంత అనువైనవని తెలిపారు.
నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ చలనచిత్ర, సృజనాత్మక రంగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందని చెప్పారు. ఐలైన్ స్టూడియోస్ వంటి కార్యక్రమాలు నగర సృజనాత్మక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని.. కళాకారులు, కథకులకు కొత్త అవకాశాలను కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2239284)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8